Previous Page Next Page 
రక్తచందనం పేజి 34


    "ఇతని డిజిగ్నేషన్ ఏమిటి?" అవమానభారంతో తలెత్తకుండానే అడిగాడు రంజిత్.
    "రిజర్వ్ వాచర్ సార్" రేంజర్ అన్నాడు నెమ్మదిగా.
    "ఇతని డ్యూటీ ఏమిటి?" తిరిగి ప్రశ్నించాడు రంజిత్.
    "అడవిలో అప్పుడప్పుడూ దావాలనం రగులుకుంటుంది. రిజర్వ్ వాచర్లు తరుచూ అడవి లోతట్టు ప్రాంతాలకు సయితం వెళ్ళి అలాంటి వేమన్నా సంభవిస్తుందేమో పసిగట్టాలి. అడవిలోని ఎండిపోయిన చెట్లు రాపిడికి గురయినా, అడవిలో తిరిగేవాళ్ళు సిగరెట్స్ లాంటివి వెలిగించుకొని నిర్లక్ష్యంగా పారేసినా అలాంటి ప్రమాదం సంభవిస్తుంది.
    మరో దారుణం కూడా వుంది. జింకల కొమ్ములకు మంచి డిమాండ్ వుంది. జింకల్ని వేటాడి పట్టుకోవటం చాలా కష్టం. అవి గడ్డి దుబ్బులతో నిండిన మైదానాల్లో జీవనం సాగిస్తుంటాయి.
    అవి రాత్రిళ్ళు వందలకొలది ఒకచోట చేరి విశ్రమిస్తుంటాయి. సరీగ్గా అలాంటి అవకాశం కోసం కూచున్నచోట స్మగ్లర్స్ ఆ మైదానానికి చుట్టూ ఒకసారి నిప్పు పెడతారు. జింకలు తేరుకొనే లోపే మంటలు పెద్దవై అవి చచ్చిపోతాయి. మంట తగ్గాక స్మగ్లర్స్ వెళ్ళి వాటి కొమ్ముల్ని కలెక్ట్ చేసుకెళ్ళిపోతుంటారు. జింక కొమ్ములు పైర్ ప్రూఫ్ గుణాన్ని కలిగి వుంటాయి.
    ఈ రిజర్వ్ వాచర్లు అడవిలో ఎక్కడయినా మంటని చూస్తే వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసుకి ఇన్ ఫామ్ చేస్తే, ఆ దావానలాన్ని ఆపే ప్రయత్నాన్ని మిగతా సిబ్బంది తీసుకుంటుంది...." రేంజర్ వివరంగా చెప్పాడు.
    అడవికి సంబంధించి తను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయనుకున్నాడు రంజిత్.
    "ఇతనికి ప్రమోషన్ ఇవ్వండి" అన్నాడు రంజిత్ రేంజర్, శర్మలకేసి చూస్తూ.
    వాళ్ళు అంగీకార సూచకంగా తలూపుతుండగానే ఆ రిజర్వ్ వాచర్ కంగారుపడిపోయాడు.
    "వద్దు సార్.... దయచేసి నా ప్రాణాలకు ముప్పు తేకండి" అన్నాడు ఏడుపు ముఖంతో.
    మిగతా నలుగురు విస్తుపోయారు అతని అభ్యర్ధనకి.
    "సీనియారిటీ ప్రకారం కాక, హఠాత్తుగా నాకు ప్రమోషన్ వస్తే వీరూ అనుచరుల చేతుల్లో నాకు చావు తప్పదు సార్. సడన్ ప్రమోషన్ వచ్చిన సంగతి దాగదు సార్. మా డిపార్ట్ మెంట్ లో అతనికి సహకరించేవాళ్ళు చాలా మందున్నారు సార్. నేనేదో వృత్తిపరమైన మంచిపని చేస్తేనే ప్రమోషన్ ఇస్తారు. ఈ ప్రాంతంలో అలాంటి పనంటే తమకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే అని వాళ్ళు గ్రహిస్తారు సార్. అందుకే...." రిజర్వ్ వాచర్ ఆగిపోయాడు.
    ఆ నలుగురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
    "నేను తీసుకుంటున్న జీతానికి న్యాయం చేశానన్న తృప్తి చాలు సార్. వస్తాను సార్...." అంటూ వాచర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
    "ఎంత తెలివిగా మనల్ని దెబ్బకొట్టాడు....? నదివైపు ఒక్కసారి చూసుంటే అతని ఎత్తును భగ్నం చేయగలిగేవాళ్ళం. మన ఆపరేషన్ పాలార్ వార్త రాత్రికి రాత్రే అతనికి చేరిపోయింది. అంటే....? ఎంత నెట్ వర్క్ ఉందతనికి.... ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలీటంలేదు...." శర్మ నిట్టూరుస్తూ అన్నాడు.
    రంజిత్ పైకి కనిపించకపోయినా, అవమానంతో, ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ఏ క్షణానైనా బద్దలయ్యే డైనమేట్ లా ఉన్నాడు.
    "వెచ్చాల కోసం ఏ ఎత్తు వేస్తాడో....?" రేంజర్ అనుమానంగా అన్నాడు.
    ఆ మాటలకు రంజిత్ ఉలిక్కిపడ్డాడు.
    "నిజమే....మన బృందాలు వెళ్ళిన గ్రామాల్లోని ప్రజల ముఖాల్లో ఆందోళన, భయం, అనుమానం స్పష్టంగా కనిపిస్తుండటాన్ని బట్టి వీరు నిజంగానే వెచ్చాల అవసరంలో పడ్డట్టేననిపిస్తోంది.
    అతని దగ్గర సరిపడా వెచ్చాలే ఉంటే ప్రజలు ఆందోళన చెందవలసిన పనేలేదు. ఏదో ఎత్తు ఖచ్చితంగా వేసే తీరతాడు" శర్మ అన్నాడు.
    ఆపరేషన్ పాలార్ నిర్వహించిన రాత్రి రేంజర్ అన్నమాటలే రంజిత్ ని ఉన్మత్తుడ్ని చేస్తున్నాయి.
    ఈ ప్రాంతంలో ఎక్కడ గంధం చెక్క సేకరించినా, ఇటునుంచే వెళ్ళాలి. ఈ నదిని దాటందే వెళ్ళటం కష్టం _ ఈ నదిని దాటటానికి పాలార్ బ్రిడ్జి ఒక్కటే మార్గం.
    ఎవరు దాటటానికి....?" వీరూ కాదుగా? వీరూ సరుకు....ఆ సరుకులు నీళ్ళమీద తేలే గుణమున్నప్పుడు బ్రిడ్జి మీదుగానే దాటాలనేముంది? తనకెందుకు ఈ ఆలోచన రాలేదు....?
    కోటేయూర్ మాదయ్య వారసులిచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఒకసారి ఫలానా దారిగుండా తన సరుకు వెళ్ళాలని వీరూ నిశ్చయించుకుంటే దారి మార్చడు సార్ అని ఆ రాత్రి రేంజర్ తన చెవిలో గుసగుసలాడినప్పుడయినా అనుమానం రాలేదు....ఛా....రంజిత్ పిడికిళ్ళతో నుదుటిని కొట్టుకున్నాడు.
    నేర పరిశోధనలో సూక్ష్మపరిశీలనా, విచక్షణా, కామన్ సెన్స్, ఫోర్ కేస్ట్ చాలా అవసరం అనే ప్రాధమిక సూత్రాన్ని తను అమలుపరచలేకపోయాడు. ఫలితం....?
    తల విదిలించి సీట్లోంచి లేచి కిటికీ వద్దకు వెళ్ళి అద్దాల్లోంచి పల్చటి వెన్నెల్లో కనిపిస్తున్న అడవిని చూడసాగాడు రంజిత్.
    అతనిలో జరుగుతున్న మానసిక సంఘర్షణని, అప్పటికప్పుడు అతను ఢీకొన్న డీప్ డిప్రెషన్ ని తత్పలితంగా రగిలే ఆగ్రహావేశాల్ని, మిగతా ముగ్గురూ ఊహించగలిగారు.
    "మన సిబ్బందిలో ప్రమోషన్ కూడా వద్దనేంత భయాన్ని కలిగించిన వీరూ సామాన్యుడు కాదు. అందర్నీ అనుక్షణం అభద్రతాభావపు భయోత్పాతానికి గురిచేసి అతను నిశ్చింతగా తన కార్యకలాపాల్ని కొనసాగించుకుంటున్నాడు.
    సాధారణంగా ఏ అడవినయినా ఆవహించి ఉండే నిశ్శబ్దం, క్రూరమృగాల భీభత్సం, దావానలం, నీరవం, చీకటికన్నా వీరూ కలిగించిన భయోత్పాతమే ఈ అడవుల్ని ప్రధానంగా ఆవహించుకొనివుంది. క్రమంగా మనం దాని సాంద్రతని తగ్గిస్తూ పోవాలి. మన సిబ్బందిలో ప్రభుత్వం వారికోసం ఏమయినా చేస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి. ముక్కుసూటి పధక రచనలకు మంగళం పాడేయాలి. విభజించి పాలించే స్త్రేటజీని ప్లే చేయాలి. తప్పదు.
    అతని తెలివితేటల స్థాయిని, పోరాట శక్తిని, ఎత్తుగడల విధానాల్ని మనం రుచి చూడాలి. ఓడిపోయినా ఫర్వాలేదు. మనకిప్పుడు అతనితో తలపడే అనుభవాలు కావాలి.
    ఇప్పటికే మనం అతనిలో ఎంతో కొంత అభద్రతా భావాన్ని కలిగించాం. అతని ఏకాగ్రతని కొంత మనం పక్కకు లాగాం. అతని తెలివితేటలు, ఆలోచనలు కొంతయినా ఇకపై మనకు కేటాయించక తప్పదు. సో.... డోంట్ వర్రీ...." రంజిత్ క్షణాల్లో తనని తాను ధైర్యపర్చుకొని, శాంతపర్చుకొని అన్నాడు.
    మిగతా ముగ్గురి నరాల ఉద్రిక్తత కొంత తగ్గింది.
    అంతలో దినేష్ చేతిలో వున్న వైర్ లెస్ సెట్ గరగరమంది.
    దినేష్ క్షణాల్లో దాన్ని ఆన్ చేశాడు.
    "ఆత్తూర్ స్క్వాడ్ కాలింగ్....ఓవర్" అని వినిపించింది వైర్ లెస్ సెట్ నుంచి.
    "ఎసేస్....సెంటర్ స్క్వాడ్ రెస్పాండింగ్....దినేష్ దిస్ సైడ్ ఓవర్...."
    "నలుగురు వ్యక్తులు_ఆత్తూర్ కి చెందినవాళ్ళే రైస్, వెజిటబుల్స్ ఎడిబుల్ ఆయిల్, మసాలా దినుసులు రహస్యంగా తీసుకెళ్తుండగా రెడ్ హేండెడ్ గా పట్టుకున్నాం. ఏం చేయమంటారు....? ఓవర్"
    ఆ మాటలు రంజిత్ కి కూడా వినిపించాయి.
    "యూజ్ లెస్ ఫెలోస్....వార్ని పట్టుకొనే బదులు ఫాలో అయ్యి వాళ్ళ హైడౌట్ ని పసిగట్టవచ్చుగా...." రంజిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనిలోని ఆగ్రహావేశాలు, అసహనం అంతకంతకు పెరిగిపోతున్నాయి. "వాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే వీరూ హైడౌట్ ఎక్కడుందో చెప్పే అవకాశం ఉందా....? ఓవర్...." దినేష్ ఆత్రుతని అణుచుకుంటూ రెస్పాండ్ చేశాడు. 

 Previous Page Next Page