"గడ్డు రోజులు....అననుకూల పరిస్థితులు....పోరాటానికి ఘడియలు దగ్గరపడుతున్నాయేమోనని భయంగా ఉంది కెంపమ్మ" అన్నాడతడు దిక్కుతోచనివాడిలా.
"లేదు....యాజమానరే యుద్ధానికి సిద్ధంగా లేడు_ ఈరోజే చర్చ్ కి వెళ్ళి రావచ్చని తెలిసింది. ఫాదర్ కి ప్రాణం బాగాలేదట...."
"మరెలా....?"
"ఈపాటికి ఏదో పథకం సిద్ధమవుతూ ఉంటుంది_మనం ఆందోళన చెందటం ఎందుకు? వేచి చూద్దాం ఏమవుతుందో? తన అనుచరుల్ని ఎలా పోషించుకోవాలో ఆయనకి బాగా తెలుసు. మనం విడిపోవటం మంచిది. ఈ అటవీ ప్రాంతంలో గోడలకే కాదు_ చీకటికి, చెట్లకు, నీడలకు కూడా చెవులుంటాయి...." అంటూనే కెంపమ్మ చీకటిలో కలిసిపోయింది.
* * * *
"చాలా దూరం నుంచి వచ్చారు. కొత్త ప్రాంతం _ సుఖమయిన ప్రయాణం కాదు. బాగా అలసిపోయుంటారు. నాకూ బహు అలసటగా వుంది. మీ ప్రశ్నలకు సమాధానం రేపు ఉదయం చెబుతాను. పక్కనే మరో గది వుంది. ప్రభువు ఎదురుగా విశాలమయిన హాలుంది. మీకు అనువయిన చోట విశ్రమించండి. భోజన సదుపాయాలూ మరో గంటకు సిద్ధం చేయబడతాయి. గాడ్ బ్లెస్ యూ.... గుడ్ నైట్" గుక్క తిప్పుకోకుండా ఎన్నో ప్రశ్నల్ని గుప్పించిన మహిమ, ఫాదర్ సమాధానం విని ఒక్కసారి ఉద్వేగపు అంచులకు జారిపడింది.
మరో రెండు గంటలకు ఆ ఇద్దరూ భోంచేసి హాలు మధ్య చెరో బెంచ్ మీద పడుకుని నిద్రలోకి జారుకున్నారు. చర్చ్ గంట పదకొండు సార్లు కొట్టి నిశ్శబ్దంలోకి జారుకుంది.
* * * *
గోపీనాధం గ్రామానికి దగ్గరలో వున్న కోటేయూర్ గ్రామంలో, అర్దరాత్రివేళ....పహరా కాస్తున్న ఇద్దరు పోలీసుల మధ్య సంభాషణ నడుస్తోంది.
ఊరంతా గాఢ సుషుప్తావస్థలో వుంది.
అక్కడక్కడా వున్న వీధి దీపాలు ఆ ప్రాంతంపై కప్పుకొన్న చీకటి దుప్పటితో పోరాడుతున్నట్లున్నాయి. చీమ చిటుక్కుమంటే వినిపించేటంతటి నిశ్శబ్దం....దీపాలు ఆరిపోయినా, తలుపులు మూసుకుపోయిన ఆ గ్రామ ప్రజలు గొంగళ్ళ మాటున ముడుచుకు పడుకున్నా నిద్రపోవటం లేదు.
ఏ క్షణాన వీరూ అనుచరులు విరుచుకు పడతారో....వెచ్చాల కోసం పోలీసులపై ఏ తరహా యుద్ధాన్ని ప్రకటిస్తారో అని బిక్కుబిక్కుమంటున్నారు.
"ఏ క్షణాన ఏ గ్రామంపై విరుచుకుపడతారో....? చిరుతపులికి, పులికి చాలా తేడా వుంది. ముఖ్యంగా ఆహారాన్వేషణలో, పోరాట విధానంలో, మెరుపు దాడికి, గొరిల్లా పోరాటానికి, ఆకస్మిక ముట్టడికి చిరుతపులి పెట్టింది పేరు. ఒళ్ళంతా కళ్ళుచేసుకొని చూస్తున్నా లోలోపల బిక్కుబిక్కుమంటోంది. చిరుతపులికి ఆకలి ఎక్కువయిన కొద్దీ అసహనం, ఆగ్రహం పెరిగిపోతాయి. తెలివితేటలు పదును దేరతాయట...." అని ఒకరన్నారు.
"యుద్ధ ప్రాంగణంలోకి ప్రవేశించాక ముందువరకే శత్రువు బలం గురించి ఆలోచించాలి. ప్రవేశించాక శత్రువు బలమెంతటిదయినా తక్కువ చేసే మాట్లాడుకోవాలి. ప్రాణభయం ఎవరికి మాత్రం, ఎప్పుడు మాత్రం లేకుండా వుంటుంది....? అది వారికీ ఉంటుంది. వేటగాడంటే చిరుతపులికి ఎంతో కొంత భయం ఉండనే ఉంటుంది. లేదంటే ఆపరేషన్ పుడ్ స్టప్స్ మొదలయి ముప్ఫైగంటలు దాటుతోంది. అయినా అతని అనుచరులు వచ్చిన జాడలే లేవు" అని మరొకరన్నారు.
"అక్కడే మనం పొరబడుతున్నాం. అతనికి ప్రాణభయం లేదు. చావంటే వెరపు లేదు. మృత్యువుతో నిత్యం ఆటలాడుకొనేవాడికి అదంటే భయముంటుందా....? కానీ మనకుంది. మనం చస్తే మన పెళ్ళాం, బిడ్డలేమయిపోతారోనన్న బెంగ వుంది...."
"అవునూ ఇంతకీ అతనికి పెళ్ళయిందా?"
"తెలీదు....తెలీనివ్వడు"
వారిద్దరికి ఒకింత దూరంలో ఉన్న ఆ బృందం నాయకుడు వైర్ లెస్ లో మిగతా పది బృందాలను, ఆపైన సెంటర్ లో స్క్వాడ్ ని ప్రతి పది నిమిషాల కొకసారి కాంటాక్ట్ చేస్తూనే వున్నాడు.
* * * *
అతని గురించిన రహస్యాలు, ఆనుపానులు, ఏ పోస్ట్ మార్టంలోనూ బయటపడనంతటి లోతుల్లో ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఇంకిపోయాయి సార్" దినేష్ టీని చప్పరిస్తూ అన్నాడు.
"అవునూ...ఇంతకీ నాకొకటి అర్థంకాలేదు. ఆపరేషన్ ఫుడ్ స్టప్స్ చర్య తీసుకోవాలని నీకెందుకనిపించింది? అతనీ ప్రాంతాల్లోనే ఉన్నాడని_అతను సమకూర్చుకున్న వెచ్చాలు నిండుకోబోతున్నాయని ఎలా తెలిసింది?" శర్మ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. పాలార్ రేంజర్ మౌనంగా ఆ సంభాషణలు వింటున్నాడు.
రంజిత్ మరికొంత టీని కప్పులోకి ఒంపుకున్నాడు.
"అదే మనకున్న ఆశాకిరణం_ అతని శత్రువుల వారసులందించిన ఇన్ ఫర్మేషన్ అది. అది నిజమే అనటానికి మనకు పదకొండు గ్రామాల నుంచి అందుతున్న వార్తలు చాలు.
మనం పాలార్ ప్రాంతంలో దెబ్బతిని వట్టి చేతులతో తిరిగిరాగానే, నా గదిలోకి ఒక కాగితం వచ్చిపడింది. దాన్ని ఆధారం చేసుకొనే ఆపరేషన్ ఫుడ్ స్టప్స్ ఆరంభించటం జరిగింది" అని రంజిత్ చెప్పటం ముగిస్తుండగా ఆ గెస్ట్ హౌస్ లో పర్చుకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక వ్యక్తి ఇనుప నాడాల బూట్లతో పరిగెత్తుకొస్తున్న శబ్దం వినిపించి అందరూ అలర్ట్ అయిపోయారు.
ఆ శబ్దం వారున్న గది ముందుకొచ్చి ఆగింది.
"లోపలకు రా" అన్నాడు రంజిత్ గంభీరంగా.
ఎవరా అని ఆశ్చర్యపోతుండగా ఒక ఫారెస్ట్ వాచర్ లోపలకు వచ్చి ముందుగా రేంజర్ కి సెల్యూట్ చేసి, ఆ తరువాత మిగతా ముగ్గురికి సెల్యూట్ చేశాడు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసంతో రొప్పుతున్నాడు. వెంటనే నోరు పెగల్చుకోలేని ఆయాసం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఏదో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నలుగురూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
"చెప్పు....ఎనీ ఇన్ఫర్మేషన్....?" రేంజర్ ఆతృతని అణుచుకోలేక అడిగాడు.
"ఇతనే రేంజ్....?" శర్మ అడిగాడు.
"నాది ఆడిపాలార్ రేంజ్ సార్....మొన్న సాయంత్రం వాచింగ్ కి ఫారెస్ట్ లోపలకు వెళ్ళాను. నా డ్యూటీలో భాగంగా నల్ల మద్ది చెట్టెక్కి చూస్తుండగా ఓ దృశ్యం నా కంటపడింది సార్. కావేరీ నదిలో చెత్తా చెద్దారం, గడ్డి దిబ్బులు కొట్టుకువస్తున్నాయి. వాటిని చూసి పై ఎత్తులో పెద్ద వర్షమే కురిసి ఉంటుంది. అందువలన ఒడ్డు ఇరిగి నదిలో పడ్డాయనుకొన్నాను. దిగి వస్తుండగా ఏవో శబ్దాలు వినిపించాయి. తిరిగి చెట్టు చివర అంచుకు వెళ్ళి చూడగా_ నది మలుపులో సుమారు వందమంది తెప్పలపై నదిమీదకు వెళ్ళి ఆ గడ్డి దిబ్బల్ని ఒడ్డుకు చేర్చటం కనిపించింది" అతను లోపల నుంచి వస్తున్న ఆయాసాన్ని, ఉద్విగ్నత తీవ్రతని తగ్గించుకొనే ప్రయత్నంలో కొద్ది క్షణాలు చెప్పటం ఆపి, గుండెలనిండా ఊపిరి తీసుకున్నాడు.
మిగతావారు ఊపిరి తీసుకోవటం, కనురెప్ప వేయటం మర్చిపోయారు.
"ఒడ్డుకు చేర్చిన గడ్డి దిబ్బుల్ని తొలగించగా గంధం చెక్క దూలాలు బయటపడ్డాయి. వాటిని నది పక్కనే ఆగివున్న లారీల్లోకి లోడ్ చేసి వెంట వెంటనే పంపించేశారు...." చెప్పటం అయిపోయినట్లు ఒకింత రిలాక్స్ అయ్యాడు.
శర్మ కేవలం ఆశ్చర్యపోతే అలాంటి ఎత్తులు వేయటం వీరూకి అలవాటే అన్నట్లు రేంజర్ నిర్లిప్తంగా ఉండిపోతే _ రంజిత్ మాత్రం పెద్ద ఎమోషనల్ షాక్ కే గురయ్యాడు.
కొద్దిక్షణాలు ఆ గది నాలుగు గోడల మధ్య నిశ్శబ్దం పేరుకుంది.