"అదే పనిలో ఉన్నాం సార్....అయితే అది మాకు తెలీదు. మమ్మల్ని వెచ్చాలు తీసుకొని రాకాసిదిబ్బ దగ్గరకు రమ్మన్నారు. అక్కడికి వీరూ అనుచరులు ఆ తరువాతెప్పుడో వచ్చి తీసుకెళ్తారని చెబుతున్నారు. అంతకుమించేం చెప్పటంలేదు సార్....ఓవర్...."
దినేష్ ఏం చేద్దామన్నట్లు రంజిత్ వైపు చూశాడు.
"మనం బయలుదేరి అక్కడకు వస్తున్నట్లు చెప్పు...." అంటూ రంజిత్ స్ప్రింగ్ గా సీట్లోంచి లేచాడు.
మరో ఐదు నిమిషాలకు ఒక జీప్, ఒక వ్యాన్ అత్తూర్ కేసి ఆ అర్ధరాత్రివేళ దూసుకుపోయాయి.
* * * *
మహిమ పడుకున్నదన్నమాటే కాని నిద్ర పట్టటంలేదు.
తను అడిగిన ప్రశ్నలన్నిటికి ఫాదర్ సమాధానం చెబుతారా? వీరూ గతాన్ని తన ముందుంచుతారా? ఉంచినంతమాత్రాన వచ్చే నష్టం లేదుగా....? అతని ఆనుపానులు, అడవిలో అతను సాగించే జీవనవిధానం, అతని రహస్య స్థావరాలు, అతని బలహీనతలు, అతని పథక రచనా విభాగం, ఎత్తుగడలు, అంతర్ రాష్ట్ర అటవీ ప్రపంచాన్ని భయభ్రాంతికి గురిచేసే విధానం చెప్పకపోవచ్చు.
గతాన్ని చెప్పవచ్చు_ అసలతని బాల్యం ఎలా గడిచింది? ఫారెస్ట్ స్మగ్లర్ గా ఎలా మారాడు? కన్ ఫెస్ అయ్యే ఉద్దేశం ఉందా....? లేదంటే ఎన్నాళ్ళు అటవీశాఖ సిబ్బందితో, పోలీసులతో పోరాడతాడు....! అటవీ ప్రాంతాల్లో శిక్షణ పొందిన స్పెషల్ టాస్ ఫోర్స్ గాని, కమెండోస్ గాని, మిలటరీగాని రంగంలోకి దిగితే....? అసలతని జీవిత లక్ష్యం ఏమిటి?
ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండే అవకాశంలేని, ప్రమాద భూయిష్టమైన అడవులో ఎంతకాలం జీవనం సాగిస్తాడు....? సాగించినా ఏం సుఖపడగలడు....?
మహిమ బెంచ్ మీంచి లేచింది.
విజయ్ గాఢ నిద్రలో ఉన్నాడు.
ఆ హాలు మొత్తంమీదే ఒకే ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. వృతిపరమయిన ఇన్ స్టింక్ట్ ఆమె అంతరంగాన్ని ప్రశాంతతకు దూరం చేస్తుండగా ఆమె పచార్లు చేయనారంభించింది.
చర్చ్ గంట పదకొండుసార్లు కొట్టి అక్కడ పర్చుకున్న నిశ్శబ్దాన్ని చెదరగొట్టింది. ప్రజా సంక్షేమం కోసం తన రక్తాన్ని చిందించి, తనను తాను ఆత్మార్పణ చేసుకున్న క్రీస్తు విగ్రహంవైపే తదేకంగా చూస్తోంది మహిమ.
* * * *
అడవి మధ్యగుండా కొల్లెగాళ్, ఎమ్.ఎమ్.హిల్స్ కి సాగిపోయే తారు రోడ్డుకి ఎడంవైపు దిగువునున్న కొండకి ఆవలివైపు భాగంలో కొన్ని దివిటీలు భగభగమని మండుతున్నాయి.
అప్పుడు సమయం తెల్లవారుజాము మూడుగంటలు.
ఆ కొండకున్న సహజసిద్ధమైన గుహ లోపలి భాగంలో ఒక రాతి మీద వీరూ నిద్రిస్తున్నాడు.
భైరవీ నాలుక చూస్తూ పహరా కాస్తోంది.
గుహ గోడలకు కట్టిన దేవదారు దివిటీలు ఆ ప్రాంతాన్ని కాంతితో నింపుతున్నాయి.
వీరూకి వందగజాల ఇవతల దాదాపు యాభైమంది అనుచరులు గాఢనిద్రలో వున్నారు. అందులో కొందరు జ్వర తీవ్రతతో మూలుగుతున్నారు.
వారికి మరికొంచెం ఈవల _ వేలాయుధం, కరియా సంభాషించుకుంటున్నారు.
"మరో మూడురోజులదాకా కదిలే పరిస్థితి లేదు. వెచ్చాలు రేపు ఉదయం వరకే సరిపోతాయి. వెచ్చాలే కాదు_ మందులు కూడా కావాలి. మనవాళ్ళకు స్వస్థత చిక్కేవరకు మకాం మార్చే ప్రసక్తి లేదని యజమానరే ఆదేశం. ఏమిటి చేయటం...." కరియా ప్రశ్నించాడు.
వేలాయుధం ఆలోచిస్తున్నాడు.
గుహ బయట గాఢాంధకారం....
జోరున వర్షం.... ఈదురు గాలులు.... పెద్ద పెద్ద వృక్షాలు సయితం కూకటివేళ్ళతో కూలిపోయేంత బలమయిన ఈదురుగాలులు....టెంపరేచర్ పూర్తిగా దిగిపోయి దాదాపు వాటర్ ఫ్రీజింగ్ స్థాయికి వచ్చిందేమో నన్నంత చలి.... వారికి కొద్ది దూరంలో ఆ గుహని వెచ్చదనంతో నింపెందుకు మండుతున్న నెగడు.... ఆ ఎర్రటి కాంతి కరియా ముఖంమీద పడుతుండటంతో అతని ముఖం రక్తాన్ని చిమ్ముతున్నట్లుగా వుంది.
గుహకి ముందు భాగంలో ముత్తప్ప ఆధ్వర్యంలో పదిమంది సాయుధులు కంటిమీద కునుకులేకుండా పహరా కాస్తున్నారు.
"దాడికి సిద్ధంకానా....? కసినీ, ఉక్రోషాన్నీ వ్యక్తం చేస్తూ అన్నాడు కరియా.
కరియా కసితో కదిలితే మారణహోమమే....
అది ఎల్లవేళలా క్షేమం కాదని వీరూతోపాటు వేలాయుధమూ భావిస్తాడు.
"నన్ను కాస్త ఆలోచించనివ్వు కరియా...." వేలాయుధం కరియాలోని ఆగ్రహాన్ని నియంత్రిస్తున్నట్లుగా అన్నాడు.
వారి సంభాషణ ముత్తప్పకు వినిపించింది.
వడివడిగా వారి దగ్గరకు వచ్చాడు.
"పదకొండు గ్రామాలు పోలీసుల ముట్టడిలోకి వెళ్ళిపోయాయి. వెచ్చాల కొట్లపైనే కాదు_ ఇళ్ళపై కూడా నిఘా వేశారు. మన పరిస్థితి తెలిసినా ఆ గ్రామాల ప్రజలు మనకు సహాయమందించే అవకాశం లేదు. అవకాశమే ఉంటే ముప్పై ఆరు గంటలు దాటినా వెచ్చాలు, మందులు రాకుండా ఉండవు. యజమానరే ఎలాగూ అవకాశం ఇచ్చాడు. మీరిద్దరూ ఊఁ....అంటే మెరుపుదాడి చేసి మనకు అవసరమయినవి తెచ్చిపడేస్తాను. ఏమంటారు....?" ముత్తప్ప ఆగ్రహావేశాలతో అన్నాడు.
వేలాయుధం కళ్ళలో ఒకింత కోపం కనిపించటంతో ముత్తప్ప బుద్దిగా తిరిగి గుహ ముందుకి వెళ్ళి పహరాలో మునిగిపోయాడు.
* * * *
"వెచ్చాలు తెమ్మని మీకెవరు చెప్పారు?" దినేష్ ప్రశ్నించాడు.
ఆత్తూర్ లో పట్టుబడ్డ నలుగురు, సెంటర్ స్క్వాడ్ వ్యాన్ డ్రైవర్ బంధించబడ్డారు. వారిముందు దినేష్ స్టిక్ తో నించుని ఇంటరాగేట్ చేస్తున్నాడు. వ్యాన్ డ్రైవర్ కేబిన్ లో రంజిత్, శర్మ, పాలార్ రేంజర్ ఉన్నారు.
వారి మధ్య ఐరన్ జాలీ మాత్రమే ఉంది.
"తెలీదు...." ఒకరన్నారు.
అంతే దినేష్ అతని ముక్కుమీద బలంగా గుద్దాడు.
ఆ మరుక్షణం అతని ముక్కువెంట, నోటివెంట రక్తం....
"రాకాసి దిబ్బ దగ్గరకు వెచ్చాలు ఎన్ని గంటలకు తెమ్మని చెప్పారు?"
"టైమ్ చెప్పలేదు_తెమ్మన్నారంతే" పట్టుబడ్డ నలుగురిలో ఒక వ్యక్తి అన్నాడు.
"రాకాసి దిబ్బకు వాళ్ళు మకాం చేసిన స్థలం ఏ దిశలో.... ఎంత దూరంలో ఉంది?" దినేష్ తిరిగి ప్రశ్నించాడు.
"తెలీదు. పచారీ సామాన్లు, మందులు రాకాసి దిబ్బ మీదున్న చిరిమాను చెట్టు కింద పెట్టి వెళ్ళిపొమ్మన్నారు. అంతే మాకు తెలిసింది. మీరేం చేసినా అంతకుమించి చెప్పేది లేదన్నట్లు, పోలీసులకు మరేం చెప్పకండని తన తోటివారికి పరోక్షంగా తెలియజేశాడతను.
మందులు అన్న పదం రంజిత్ ని ఆకర్షించింది.
వాళ్ళనుంచి స్వాధీనపర్చుకున్న మందుల్ని తెమ్మని డ్రైవర్ చెవిలో చెప్పాడు రంజిత్. అతను వ్యాన్ దిగి కొంచెం దూరంలో ఆగి ఉన్న మరో వ్యాన్ దగ్గరకు వెళ్ళాడు.
"ఇప్పుడు మీరు ఆ సామాన్లతో రాకాసి దిబ్బకు వెళ్ళి చిరిమాను చెట్టుకింద వాటినుంచి తిరిగిరండి" అన్నాడు దినేష్ ఏదో ఎత్తుకు సిద్ధమవుతూ.
"లాభంలేదు దినేష్....వీళ్ళు వెళ్ళటం ఆలస్యమయింది కనుక వాళ్ళు అనుమానించి జాగ్రత్తపడతారు. వాళ్ళని వదిలేయ్" అన్నాడు రంజిత్.