Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 34

"వాటిని చంపినందుకు శిక్ష కూడా పడుతుందా ఏమిటి అంది స్వప్న గాభరాగా.
"నిక్షేపంగా! కానీ నేను చంపినది మాన్ ఈటర్స్. ఆ సంగతి అధికారులకు సహేతుకంగా రుజువు చేయగలగాలి."
"లేకపోతే?"
"శ్రీకృష్ణ జన్మస్థానమే!"
"జైలుకు పోవడమంటే నీకు భయం లేదా ?"
"రైలెక్కినంత సరదా! అదలా వుంచు! భూతాలరాజు ఏం చేశాడు నిన్ను ?"
"ఏం చెయ్యలేదు. ఏదో చెయ్యబోతూ వుండగా ఒక వింత జరిగింది. నేను చెప్పినా నువ్వు నమ్మవు, నవ్వుతావు."
"నాది ఓపెన్ మైండ్! అన్నీ చాలా తార్కికంగా ఆలోచిస్తాను. చెప్పు" అన్నాడు సందీప్.
"నువ్వు ఈతకొట్టడానికి ఆ కొలనులోకి దిగగానే భూతాలరాజు నా నోరు మూసేసి, భుజాన వేసుకొని పొదలచాటుకి వచ్చి బలాత్కారం చేయబోయాడు. అప్పుడు ఒక తొండ వచ్చి రక్షించింది."
నవ్వాడు సందీప్. "వెరీ ఇంటరెస్టింగ్ !"
"అదిగో నవ్వుతున్నావు ?"
"లేదు, చెప్పు ?"
"హఠాత్తుగా ఒక తొండ వచ్చింది. నిప్పులు చెరుగుతున్నాయి దాని కళ్ళు. దాన్ని అదిలించాడు భూతాలరాజు. అప్పుడు....."
"అప్పుడు ?"
"దాని కళ్ళు మరింత ఎర్రగా మారాయి. ఉన్నట్టుండి పౌంటెన్ లా దాని కళ్ళలో నుంచీ రక్తం వచ్చి, భూతాలరాజు కళ్ళల్లో పడింది. బాధతో అరుస్తూ పారిపోయాడు అతను.
"ఓహ్ అదా?" దాన్ని హాల్న్ డ్ టోడ్ అంటారు. తొండలాగే ఉంటుంది. అది బెదిరితే గుడ్లు ఎర్రబడతాయి. ఇంకా బెదిరిస్తే రక్తం స్ప్రే చేస్తుంది గుడ్లలోనుంచీ. మనిషిని చూసి భయపడి అలా చేసి ఉంటుంది. ఆ టోడ్ అది రక్తం చిమ్మితే పెద్దపులే బెదురుతుంది. భూతాలరాజు హడలి పోవడంలో ఆశ్చర్యం లేదు."
ఇద్దరూ టెంటు దగ్గరికి వచ్చారు.
చుట్ట కాలుస్తూ కూర్చుని ఉన్నాడు భూతాలరాజు. సందీప్ ఏమీ అనకముందే, బింకంగా "నాకు నీతిబోధ చెయ్యాలని చూడకు ? పదేళ్ళపాటు ఆడవాసన తగలకుండా జైల్లో ఉంటే నువ్వూ నాలాగే ప్రవర్తించి ఉండేవాడివి" అన్నాడు.
పళ్ళు గిట్టకరిచి కోపాన్ని ఆపుకున్నాడు సందీప్. తను తలుచుకుంటే ఈ నీచుణ్ణి ఏ కీలుకి ఆ కీలు విరిచి, చిత్రవధ చెయ్యగలడు. కానీ మమ్మీని చేరుకోవాలంటే వీడు దారి చూపించాలి. మరో మార్గంలేదు.
"జాగ్రత్తగా విను ?" అన్నాడు సందీప్ తీవ్రంగా. "ఈసారి ఈ అమ్మాయివైపు కన్నెత్తి చూసినా, పన్నెత్తి మాట్లాడినా నీ పేగులు తీసి మెళ్ళో వేసుకుంటాను" అన్నాడు.
నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు భూతాలరాజు. తనతో సందీప్ కి ఎంత అవసరం వుందో అతనికి బాగా తెలుసు.
టెంటుకి ఎదురుగా కట్టెలు నెగడులో మండుతున్నాయి.
దానిచుట్టూ పడుకున్నారు ముగ్గురూ. పడుకోగానే దుంగలా కదలకుండా నిద్రలోకి జారిపోయాడు భూతాలరాజు.
కలతనిద్రలో అటూ ఇటూ దొర్లుతున్నాడు సందీప్. సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలకి ఉలిక్కిపడి లేచాడు అతను.
ఎందుకు మెలకువ వచ్చింది తనకు ?
ఎందుకు మెలకువ వచ్చిందో కొద్ది క్షణాల తర్వాత అర్థమయింది. అందమైన ఆడపిల్ల చూపులు చురుగ్గా గుచ్చుకుంటున్నాయి తనకు. స్వప్న బోర్లా పడుకుని, మోచేతులు నేలకి ఆనించి, అరచేతుల్లో చుబుకం ఉంచి కళ్ళార్పకుండా తననే చూస్తోంది.
అతను తనని గమనించగానే గాభరాగా పక్కకు తిరిగి పడుకుంది.
నవ్వుకున్నాడు సందీప్.

 Previous Page Next Page