Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 33

ఆ పెద్దపులి కాలికి ఉన్న ముళ్ళను లెక్కపెట్టాడు సందీప్. దాదాపు ముప్పై ముళ్ళు ఉన్నాయి. గాయాలు సెప్టిక్ అయి బాగా చీము పట్టాయి.
అందువలననే అది జంతువులని వేటాడలేక మనుషులని తినడం మొదలు పెట్టిందని గ్రహించాడు సందీప్.
రెండోపులి దాని జంట అయి వుండవచ్చు. ఋతువులను అనుసరించి, ప్రకృతి వాటిని ప్రేరేపించినప్పుడు మాత్రమే ఆడపులీ, మొగపులీ కొద్దికాలంపాటు జంటగా వుంటాయి. ఆ తర్వాత దేనిదారి దానిదే.
రెండు పులులనూ చంపగలిగినందుకు సందీప్ మొహంలో సంతోషం కనిపించకపోగా, కొద్దిగా విషాదపు ఛాయలు మెదలడం గమనించింది స్వప్న.
"సందీప్! ఎందుకలా వున్నావు?" అంది మొదటిసారిగా అతన్ని పేరుపెట్టి పిలుస్తూ.
"సకారణంగానే అయినా, పులులని చంపాల్సి వచ్చినందుకు విచారంగా ఉంది స్వప్నా! పెద్దపులి చాలా అందమైన, అపురూపమైన జంతువు! అయిదు మిలియన్ల సంవత్సరాల క్రితం ఆసియాలో ఉద్భవించిన ఈ జంతువును మనిషి వేటాడి వేటాడి, 1940వ సంవత్సరానికి వీటి సంఖ్యను అరవై వేలకు తగ్గించేశాడు. 1940వ సంవత్సరం వచ్చేసరికి ప్రపంచం మొత్తం మీద ఐదువేల కంటే ఎక్కువ పులులు మిగలలేదు. ఇండియాలో 1,827 పులులు మాత్రమే మిగిలాయని అంచనా!"
అతని ధోరణి తనకు అంతు పట్టనట్లు చూసింది స్వప్న. "మా క్రూర జంతువు అయిన పెద్దపులి ఈ భూమిమీద అవతరించడం అంత సంతోషకరమైన సంగతి కాదు. అది అంతరించడం అంత సంతాపకర సంగతీ కాదు, ఏదో కొంప మునిగిపోయినట్లు చెబుతావేమిటి ?"
"పొరబాటు పడుతున్నావు స్వప్నా! చాలా మంది దురభిప్రాయం పడే విధంగా పులి క్రూరజంతువు కాదు. అనవసరంగా ప్రాణాలు తీయదు అది. అంతే కాదు సృష్టిలో ప్రతి జంతువుకి నియమితమైన ప్రయోజనం వుంటుంది."
"నాన్సెన్స్! పులి వల్లకూడా ప్రయోజనం ఉంటుందా?"
"పులి వల్ల కూడా! పులికి సహజమైన ఆహారం జింకలూ, దుప్పులూ, అడవి పందులూ తదితరమైనవి. వీటిలో వయసు మళ్ళినవి, జబ్బు పడినవీ మాత్రమే పులి వాత పడుతుంటాయి. ఆ విధంగా అనారోగ్యంగా ఉన్న జంతువులను చంపి ఆరోగ్యంగా ఉన్నవాటిని మాత్రమే మిగిల్చి ప్రకృతిని బాలెన్స్ చేస్తూ వుంటుందన్న మాట పులి!"
"మరి పులులు అంత మహోపకారం చేస్తున్నప్పుడు జనం వాటిని పిచ్చి వాళ్ళయి చంపుతున్నారంటావా?"
విచారంగా తల తాటించాడు సందీప్. "పులిని చంపడానికి చాలా కారణాలు వున్నాయి స్వప్నా! వాటిలో మొదటిది మనిషికి సహజమైన దురాశ! ఒక్కొక్క పులి చర్మానికి విదేశాల్లో యాభైవేల రూపాయలదాకా ధర పలుకుతోంది. దీనికితోడు ఇదివరకు ప్రభుత్వం ఆంక్షలు లేకుండా వేటలూ, షికార్లూ విశృంఖలంగా జరిగిన రోజుల్లో పులులను చంపి వాటి చర్మాలనీ, తలలనూ ఇంట్లో ట్రోఫీలుగా పెట్టుకోవడం ఘనకార్యంగా వుండేది. కొంతమంది రాజులూ, జమిందార్లూ ఒక్కొక్కరూ పదిహేను వందల పులులని చంపిన దాఖలాలు కూడా వున్నాయి."
స్వప్న మాట్లాడలేదు.
"దీనికితోడు, నాగరికత వ్యాపించడంవల్ల, పరిశ్రమలు పెరిగి జన స్థావరాలు ఎక్కువ కావడంవల్ల, వ్యవసాయం విస్తృతం కావడంవల్ల అడవులను నాశనం చేయడం జరిగింది. అడవులలో వుండే జింకలూ మొదలైన జంతువులూ పొలాల్లో పడ్డాయి. అడవిలో తమకు సహజమైన ఆహారం దొరకని పులులు మనుషులు పెంచుకునే ఎద్దులమీదా, గేదెల మీదా పడతాయి. రైతులు విషంపెట్టి పులులను చంపుతారు."
స్వప్న మొహంలో ఇప్పుడు అవహేళన కనబడడం లేదు. శ్రద్ధగా వింటోంది.
"అందుకని పన్నెండేళ్ళ క్రితం పెద్దపులులను చంపడం నిషేధించింది ప్రభుత్వం. దట్టమైన అడవుల్లో కొంతభాగం పెద్ద పులులకు రిజర్వ్ చేసి 'ప్రొటెక్టు టైగర్' అనే పేరుతో రక్షిత ప్రాంతాలు ఏర్పరచింది. ఈ చర్యలవల్ల ఈ పదేళ్ళలో పులుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యినవి. అలాంటి అపురూపమైన జంతువులను చంపానే అని బాధగా వుంది స్వప్నా!"

 Previous Page Next Page