"అరె! ఇప్పటిదాకా బాగానే ఉన్నావ్! ఇంతలోనే ఏమయింది నీకు?" అన్నాడు ఇక్బాల్ ఆశ్చర్యంగా.
"తెలియదు!" అన్నాడు సుందరం, కష్టంగా మాట్లాడుతూ. "నడుం పట్టేసినట్లయింది."
అలా కష్టపడి ఒంగి ఒంగి నడుస్తూనే సీటుని చేరుకున్నాడు ప్రొఫెసర్. ఒక్కసారిగా సీట్లో కూలబడిపోయాడు. ఒంగిపోయే కూర్చున్నాడు సీట్లో కూడా.
అతని ధోరణి అనుమానాస్పదంగా కనబడింది ఇక్బాల్ కి. "షాట్ గన్!" అని పిలిచాడు. "ఈయన్ని చూడు! హఠాత్తుగా ఇలా అయిపోయాడెందుకని?"
తీక్షణంగా సుందరాన్నే చూస్తూ దగ్గరికి వచ్చాడు శతృఘ్న. అతని చూపుడువేలు రివాల్వర్ ట్రిగ్గర్ మీద రెడీగా ఉంది.
"లేచి నిలబడు!" అన్నాడు.
వెంటనే ఒకటోక్లాసు పిల్లాడిలా వినయంగా లేచాడు ప్రొఫెసర్. కానీ ఇంకా ఒంగిపోతూ ఉన్నాడు.
పరిశీలనగా కాసేపు చూశాక, జరిగిందేమిటో అర్థమయింది శతృఘ్నకి.
ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ గారు టాయిలెట్ కి వెళ్ళి తిరిగి వచ్చేముందు, కంగారులో షర్టు బటన్స్ ని పాత ఫేషను ప్యాంటు కాజాలకి పెట్టేసుకున్నాడు. అందుకే పైకి లేవనీయకుండా పట్టేసుకుంటోంది అది.
మనసులోనే నవ్వుకున్నాడు శతృఘ్న. ఈ మేధావులకి వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులలో అపారమైన తెలివితేటలు ఉన్నా, మామూలు రోజువారీ విషయాల్లో వీళ్ళ ప్రవర్తన పసిపాపలకన్నా కష్టంగా ఉంటుందేమో!
శతృఘ్న చెప్పింది విన్న తర్వాత సిగ్గుపడిపోతూ బటన్స్ సరి చేసుకున్నాడు సుందరం. "నాకు చాలా విషయాలు గుర్తుండవు. త్వరగా మర్చిపోతుంటాను. పరధ్యానం ఎక్కువ!" అన్నాడు అపాలజెటిక్ గా. అంటుండగానే ఆయన మొహంలో రంగులు మారాయి. "గుడ్ గాడ్!" అన్నాడు, తెల్ల కాయితంలా పాలిపోయిన మొహంతో.
సీరియస్ గా చూశాడు శతృఘ్న "ఏమయింది?"
వణుకుతున్న గొంతుతో చెప్పాడు ప్రొఫెసర్ సుందరం. "నా లాబొరేటరీ... నా ఎక్స్ పెరిమెంటు..."
"సరిగ్గా చెప్పు?"
"ఈ ప్రయాణం హడావిడిలో నేను లాబొరేటరీలో చేస్తున్న ఎక్స్ పెరిమెంటు అలాగే వదిలేసి వచ్చాను. అది పొటెన్షియల్ టైం బాంబులాంటిది! పెద్ద ప్రేలుడు సంభవించి రెండు మూడు లొకాలిటీలు ధ్వంసమైపోవచ్చు. నేను అర్జెంటుగా హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి. నన్ను పంపెయ్యండి తక్షణం!"
అలర్టుగా అయిపోయాడు శతృఘ్న. ఇతను నిజం చెబుతున్నాడా? తప్పించుకు పారిపోవడానికి అబద్ధాలాడుతున్నాడా?
"ఎక్కడుంది నీ లేబొరేటరీ? అడ్రసు చెప్పు! దాని సంగతి చూడమని హైదరాబాద్ కి మెసేజ్ పంపిస్తాను"
"మా లాబ్ అక్కడే..." అని ఆగిపోయాడు ప్రొఫెసర్. ఆయన మొహంలో ఆందోళన కనబడింది. "లేబ్ ఎక్కడుందంటావా? అడ్రసు గుర్తులేదే నాకు!"
"బుల్ షిట్!" అన్నాడు శతృఘ్న. "నువ్వు అబద్ధాలు చెబుతున్నావ్! అవునా? నీ నాలుక పీకేస్తాను."
ప్రొఫెసర్ సుందరం మొహానికి చెమటలు పట్టాయి. భూతద్దాల వంటి దళసరి కళ్ళద్దాలలో నుంచి ఆయన కళ్ళు మరీ పెద్దవిగా కనబడుతున్నాయి.
"గాడ్ ప్రామిస్! నన్ను నా లేబొరేటరీకి నా మిసెస్ కారులో తీసుకెళుతుంది. మళ్ళీ లాబ్ నుంచి తనే కారులో ఇంటికి తీసుకెళుతుంది. తను రాలేకపోతే ఇంకెవరన్నా డ్రయివర్ ని అరేంజ్ చేస్తుంది. నాకు డ్రయివింగ్ రాదు. అడ్రసులూ గుర్తుండవు."
"రెండు ఉతికితే నిజం కక్కుతాడు." అన్నాడు ఇక్బాల్ కదులుతూ.
చెయ్యి ఎత్తి అతన్ని వారించాడు శతృఘ్న.
మేధావుల మతిమరుపు గురించి అతనికి బాగా తెలుసు. జి.కె.ఛెస్టర్ టన్ అనే పత్రికాధిపతికి తన స్వంత ఆఫీసు అడ్రసే ఎప్పుడూ గుర్తుండేది కాదుట. రోజూ టాక్సీ ఎక్కగానే ఆయన తన పేపరు విప్పి, అందులో ప్రింట్ చేసి ఉన్న తన ఆఫీసు అడ్రసు చూసుకుని, టాక్సీ డ్రైవర్ కి చెప్పేవాడుట. ఒక్కొక్కరోజు మరీ కన్ ఫ్యూజ్ అయిపోయి, తన భార్యకి ఫోన్ చేసి అడిగేవాడుట. "నేను ఇప్పుడు ఫలానచోట వున్నాను. అసలు ఇప్పుడు నేనెక్కడ వుండాలి?" అని, అప్పుడు ఆమె ఎలా చెబితే అలా నడుచుకునేవాడు ఆయన.
ఈ ప్రొఫెసరూ అదే కేటగిరీకి చెందినట్లు వున్నాడు.
"సరే!" అన్నాడు శతృఘ్న. "నేను మీ ఆవిడకి మెసేజ్ అందేలా చూస్తాలే?"
"లాభంలేదు! ఈ పాటికి ఆమె బెర్లిన్ వెళ్ళి వుంటుంది" అన్నాడు ప్రొఫెసర్.
తల పగిలిపోతున్నట్లు అనిపించింది శతృఘ్నకి.
"నేను వెళ్ళిపోవాలి! లేకపోతే డేంజరు!" అన్నాడు సుందరం.
శతృఘ్న సందిగ్ధంలో పడటం చూసి కండువా సవరించుకుంటూ లేచాడు పొలిటీషియన్ వెంకట్రావు. తన వాక్చాతుర్యాన్ని ఉపయోగించుకోగల అవకాశం వచ్చిందని తోచింది అతనికి.
"మాష్టారు చెప్పింది నిజమే!" అన్నాడతను. "ఆయన వెంటనే వెళ్ళకపోతే మన భాగ్యనగరంలో ఒకటి రెండు పేటలు తగలబడిపోతాయి. కానీ నేనో? నేనట్లాంటి ఇట్టాంటి వాణ్ణిగాదే! నే రేపొద్దుటికి ఢిల్లీ చేరకపోతే ఢీలా పడిపోతుంది. ఆంధ్రా అంతా! రేపు రాజధానిలో మంత్రివర్గ విస్తరణ, ప్రమాణస్వీకారాలూ ఉంటై! నా పేరు, ఇన్ క్లుడ్ కావడం ఖాయమని రాజకీయాల్లో తిరిగే ప్రతివోడికీ తెల్సు. రేపుగానీ నేను ప్రమాణ స్వీకారం చెయ్యకపోతే ఆ తరువాత పరిస్థితులు ఎట్లుంటాయో చెప్పుతాం! మన ఆంధ్రాకి మంత్రివర్గంలో వాటా, కోటా తగ్గిపోద్ది!
చూడు తమ్ముడూ! నేను మంత్రిని కాగానే మీ ముగ్గురికీ తలో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి లైసెన్సు లిప్పిత్తాను. బ్యాంకు లోన్లు ఇప్పిత్తాను. మీకు దేశాల్దిరగాలని మోజుంటే ఫారినెల్లే డెలిగేషన్లలో చేర్పిత్తాను. ఈ బాదరబందీ అంతా మనకెందుకనుకుంటే కామధేనువుల్లాంటి ఉజ్జోగాలేయిత్తాను. అయిందేదో అయిపోయింది! ఇదంతా ఆటలో అరటిపండని చెప్పి కేసూ, మన్నూ, మశానమూ ఏవీలేకుండా చూత్తాను. పెద్దోణ్ణి మీ మంచి ఆలోచించి చెబుతున్నా! ఇనాలి మరి!"