Previous Page Next Page 
సీతాచరితం పేజి 33


    రాణులలో కైకకేదో ప్రత్యేకతవుంది. ఆమె రాజుబిడ్డ. తన బిడ్డలు సవతి బిడ్డలతో కల్సితిరగడం యిష్టం లేనట్టుంది. అందుకే భరతుణ్ణి మొదటినుంచి తల్లిగారింట్లోనే పెంచుతుంది.


    కైక స్వతహాగా అమాయకురాలుగా కనిపిస్తుంది. కుడుం చేతికిస్తే పండుగ అనుకొనేరకం - ఐతే ఆమె వీరనారిగా కనిపిస్తుంది - దశరథుని సారధ్యం చేసిన సామర్థ్యురాలు. ఆమెకు రాముని విషయంలో ఈర్ష్య, ద్వేషాలున్నట్లు కనిపించదు. రాముడంటే ఆమెకు అపారమైన ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. కైక ముక్కు సూటిగా పోయే మనిషి.


    కైక అమాయకురాలు అనే విషయం ఆమె పుట్టింటివారికి తెల్సు. అందుకోసమే ఈమె విషయంలో సకల జాగ్రత్తలు వాళ్లే పడ్తున్నట్టు అనిపిస్తుంది. మంధర కైకకు పుట్టింటివాళ్లు అరణం ఇచ్చిన దాసి. ఆమె ఒట్టి దాసిగా కనిపించదు. కైక విషయంలో సకల జాగ్రత్తలూ తీసుకుంటున్న ప్రౌఢలా కనిపిస్తుంది. కైక పుట్టింటివారికి తెలియకుండా రామునికి పట్టం కడ్దామనుకున్నాడు దశరథుడు. ఇలా జరుగుతుందని ముందే కనిపెట్టినట్లున్నారు కేకేయిరాజు. అందుకు జాగ్రత్తగా మంధరను నియమించారు.


    మంధర కైకకు తన మతం సాంతం నూరిపోసింది. కైకను మార్చగల్గింది. రామాయణంలో ఒక ముఖ్యమైన మలుపుకు కారకురాలైంది.    


    మంధరను గురించి మరొకరకంగా ఆలోచించే అవకాశం వున్నది. మంధర చెడు తలంపులాంటిది. మంధరను చెడుతలంపుకు సంకేతంలాగ వాడినాడు వాల్మీకి. సంకేతాలు వాడటం బాగా తెల్సు వాల్మీకికి. దేనికైనా ఒక మానవాకారం ఇవ్వడం మన ఆచారం. మంధరను చెడు తలంపుకు సాకార రూపంగా సృష్టించినట్లున్నాడు.


    మంధరను గురించి "యతో జాతా" అంటాడు. ఆమె ఎక్కడ పుట్టిందో తెలియదు. అలాగే ఆలోచనలు అమాంతం ఎక్కడనుంచి వస్తాయో తెలియదు. కాని అవి పనిజేసి ఒక పరిణామానికి వచ్చినప్పుడు ఫలితం మాత్రం తెలుస్తుంది. అని మళ్లీ కనిపించవు. మంథర గూడ రామాయణంలో ఎక్కడా కనిపించదు. మళ్లీ ఒకసారి తప్ప.


    కైక అమాయకురాలు నిజమే, కాని ఆమె పట్టుబడితే ఉడుము పట్టు. ఇది తనకు తన తల్లివల్ల సంక్రమించింది. ఇది తల్లివల్ల వచ్చిన జీవకణాల ప్రభావం. ఒకప్పుడు కైకతల్లి తన భర్తను ఒక రహస్య మడుగుతుంది. ఆ రహస్యం చెప్పితే తన తల పగిలి చస్తానంటాడు భర్త. ఐనా పట్టు వదలదు. ఈ పట్టుదల ఆమెకు తన తల్లివల్ల వచ్చింది.


    ఆ కాలంలో స్త్రీలు కూడ పుఋషునితో బాటు యుద్దంలో పాల్గొనేవారని కైక వృత్తాంతం వల్ల తెలుస్తుంది.


    కైక భవనం ప్రధాన రాజమందిరానికి దూరం వున్నట్లు కనిపిస్తుంది. సవతులకు దూరంగా వుండాలని ఆమె అలా కట్టించుకొని వుండవచ్చు. లేదా ఇక్కడి రహస్యాలు పొక్కకుండా దశరథుడే ఆమెకు దూరంగా ఒక భవనం ఏర్పాటు చేశాడేమో!


    పిడుగుపాటు:


    ఇక్కడ దశరథుడు పట్టాభిషేక ప్రయత్నాలన్ని చేశాడు. ఇంకా ఈ వార్త కైకకు తెలిసి వుండదు. ఆ సంతోషవార్త తాను స్వయంగా తెలియజేయడానికి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ చిలుకలు పలుకుతున్నాయి. నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. హంసలు విలాసంగా తిరుగుతున్నాయి. అతడు అంతఃపురంలో ప్రవేశించగానే కైక వచ్చి తనను కావలించుకుంటుందని అనుకున్నాడు. కైక ఎదురురాలేదు. అతను వెదికినా కనిపించలేదు. ద్వారపాలకను అడిగాడు. ఆమె గడగడ వణుకుతూ చేతులు జోడించింది. మహారాజా! రాణి కోపం వహించింది. కోపగృహంలో వుంది. అని విన్నవించింది. రాజు ఆ మాటలు విన్నాడు. కలవరపడ్డాడు. కోపగృహం వైపు నడిచాడు. అక్కడ దృశ్యం చూచి దశరథుని ప్రాణాలు పైపైనే లేచాయి. కైక నేలమీద పడివుంది. ఆమె తెగిపడ్డ తీగలావుంది. పుణ్యం అయిపోతే నేలమీద పడ్డ దేవతలా వుంది. మాయతో కట్టివేసిన లేడిలా వుంది. గదినిండా ఆభరణాలు చిందరవందరగా పడివున్నాయి. కైకను చూడగానే దశరథునికి మన్మద వికారం కల్గింది. అతడు ఆమెను రెండు చేతులతో తడిమాడు. ఇలా అన్నాడు.


    "కైకా! ఏమిటి నీ కోపానికి కారణం? నిన్నెవరైనా నిందించారా? అవమానించారా? చెప్పు. వాళ్ల ప్రాణాలు తీస్తాను. జబ్బు చేసిందా చెప్పు. రాజవైద్యులను పిలిపిస్తాను. ఎవ్వరికైనా ఉపకారం చేయమంటావా? చెప్పు. వాణ్ణి సంపన్నుని చేస్తాను. అవధ్యున్ని వధించమంటావా? వధ్యున్ని విడిచిపుచ్చమంటావా? దరిద్రుణ్ణి సంపన్నుని చేయమంటావా? సంపన్నుని దరిద్రుణ్ణి చేయమంటావా? నీ కోర్కె తీర్చడానికి నా ప్రాణాలునైన బలి ఇస్తాను. ఇదే నా పున్నెంమీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. నీకు దేనివల్ల భయం కల్గిందో చెప్పు. సూర్యుడు మంచును పోగొట్టినట్లు దాన్ని పోగొడ్తాను."


    కైక చాల సంతోషించింది. రాజును మరింత ఏడిపించాలనుకుంది. అతనితో అనేక ఒట్లు వేయించాలనుకుంది. "నన్నెవరూ అవమాన పరచలేదు. నాకేరోగ్యం లేదు. నాకు ఒకే  ఒక కోరిక వుంది. దానిని నీవు తీర్చాలి. తీరుస్తానని గట్టి ప్రతిజ్ఞ చెయ్యాలి." అన్నది - చిరునవ్వు నవ్వింది.


    దశరథుడు చిరునవ్వుకు కరిగిపోయాడు. ఆ చిరునవ్వు సమ్మోహనాస్త్రంలా పనిచేసింది.


    "పిచ్చిదానా! స్త్రీలలో నిన్ను మించి ప్రియతమమైందిలేదు. అలాగే పుఋషులలో రామునికున్న ప్రియతమమైనవారు లేరు. రాముని మీద ఒట్టువేసి చెబుతున్నాను. వెంటనే చెప్పు. నన్ను చంపకు. నేను బతికుండాలంటే నీ కోర్కె వ్యక్తపరచు. వెంటనే తీరుస్తాను." అన్నాడు. కైక సంతోషపడ్డది. దశరథుడు మాట యిచ్చాడు. ఆడి తప్పడని ఆమెకు తెల్సు. ఐనా దాన్ని మరింత గట్టిపరచాలనుకుంది.  ఇలా అంది.


    "నీవు రాముని మీద ఒట్టు పెట్టుకున్నావు. నీవు చేసిన పున్నెంమీద ఒట్టుపెట్టుకున్నావు. నా కోర్కె తీరుస్తానన్నావు. శపథం చేశావు. నీ శపథం అగ్ని మున్నగు ముప్పైకోట్ల దేవతలు విన్నారు. సూర్య చంద్రులు, గ్రహాలు, రేయింబవళ్లూ, జగత్తు, గంధర్వులు, రాక్షసులు, గృహదేవతలు, ఇంకా అనేక సమస్త భూతాలు నీ వాగ్దానాన్ని విన్నాయి. అవన్నీ నీ వాగ్దానానికి సాక్షీభూతాలు - గుర్తుందా? నీవు ఒకసారి శంబరాసురునితో యుద్ధం చేశావు. అప్పుడు నేను నీకు సారధ్యం చేశాను. నిన్ను రథం తప్పించి, కాపాడాను. నీవు నాకు రెండు వరాలనిస్తానన్నావు. ఇప్పుడు నాకా రెండు వరాలతో అవసరం ఏర్పడింది. నీవు వాటిని తీర్చాలి. తీర్చకుంటే అవమానంతో చచ్చిపోతాను. ఆడి తప్పినందుకు నీవు అపఖ్యాతి పాలవుతావు. ఇంతకు ఏంలేదు. నేనడిగేది - రామునికి పట్టం కట్టడానికి అన్ని సమకూర్చావుగదా - ఆ పదార్ధాలతోనే భరతునికి పట్టం కట్టు. ఇది నా మొదటి వరం. నీరచీరలు కట్టించు. పదునాల్గు సంవత్సరాలు రాముణ్ణి అడవికి పంపు. ఇది నా రెండవ వరం."


    కైక చాల చల్లగా చెప్పింది. ఆ మాటలు దశరథునికి పిడుగుపాటయినవి. వెంటనే మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చింది. అప్పుడతను కోపంతో పిచ్చివాడయినాడు. "ఒసే మూర్ఖురాలా! కైకా! నీకు ఏం పొయ్యేకాలం వచ్చిందే! రాముడు నీకేం అన్యాయం చేశాడు. నిన్ను తల్లికంటే మిన్నగా చూశాడే! అలాంటి రాముని విషయంలో నీకిలాంటి దుర్భుద్ధి ఎందుకు పుట్టింది? నేను రాజ్యాన్ని విడువగలను. ప్రాణాలు విడువగలను. రాముణ్ణి విడువలేను. సూర్యుడు లేక లోకం నిలువవచ్చు. వాన లేక పంటలు పండొచ్చు. కాని రాముడు లేకుంటే నేను బతకలేను."

 Previous Page Next Page