డ్రాఫ్టోపాఖ్యానం
నేను ఆఫీసుకి బయల్దేరబోతూండగా వచ్చాడు శాయిరామ్.
"గురూ నీతో పని పడింది?" అన్నాడు తాపీగా.
"ఈ వారం రోజులు నేను కాలనీ మీటింగులకి రాను- అన్నాను నిష్కర్షగా.
"అబ్బే అదికాదు గురూ! నీ ఫ్రెండెవరో మన కాలనీ బయట బాంక్ లో ఉన్నారన్నావ్ కదా! ఆ బాంక్ లో చిన్న పని పడింది."
"ఏమిటది?"
"నేను మా అంకుల్ ఒకాయనకి ఎప్పుడో సంవత్సరం క్రితం రెండు వందల రూపాయలకు డ్రాఫ్ట్ పంపించాను- ఈ మధ్య ఆయన చనిపోయారు గానీ డ్రాఫ్ట్ మాత్రం ఇంకా చేరలేదు-"
"ఎందుకని? పోస్టల్ వాళ్ళతో నీగ్గానీ మీ అంకుల్ కిగానీ ఏమైనా విరోధం ఉందా?"
"అదేం లేదు- పోస్ట్ మెన్ ఎక్కడ కనిపించినా చాయ్ ఆఫర్ చేస్తుండేవాడు"
"ఇంతకూ ఇప్పుడు గొడవేంటి?"
"ఆ డ్రాప్ట్ పోయింది కాబట్టి కాన్సిల్ చేయించి నా డబ్బు నేను తీసుకోవాలి."
"ఓశ్ ఇంతేనా? దీనికి పేద్ద రాద్ధాంతం ఏముంది? పద-" అన్నాను.
ఇద్దరం బాంక్ కెళ్ళాం.
మా ఫ్రెండ్ కూర్చునే స్థలంలో ఓ లావుపాటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు.
"ఇక్కడ రవి అని మా ఫ్రెండ్ ఉండాలి- ఏరండీ?" అడిగానతనిని.
"ట్రాన్స్ ఫరయి వెళ్ళిపోయారు-" అనేసి అక్కడినుంచి లేచి లోపలికెళ్ళిపోయాడు.
"ఏం చేద్దామంటావ్ గురూ?" అడిగాడు శాయిరామ్.
"పద మేనేజర్ తో మాట్లాడదాం- తెలిసినవాళ్ళు లేకపోతేనేం?" అన్నాను- ఇద్దరం మేనేజర్ గదిలోకెళ్ళాం.
అప్పటికే ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు మేనేజర్ ముందు.
వాళ్ళ మధ్యలో టేబుల్ మీద ఓ కాగితంలో ముత్యాలు ఉన్నాయ్.
"ఇవి బాగున్నాయ్- కన్సెషన్ లో ఇస్తావా?" అడిగాడు మేనేజర్ అతనిని- ఆ ముత్యాలు తీసుకుని చూస్తూ.
"మీకంటే ఎక్కువముంది సార్- ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి-"
"థాంక్యూ థాంక్యూ" అని వాటిని తీసుకోబోయి మావేపు చిరాగ్గా చూశాడు.
"యస్? ఏం కావాలి?"
"మావాడికో సమస్య వచ్చింది - మీరేమయినా సహాయం చేయగలరేమోనని" అన్నాడు-
"ష్యూర్, ష్యూర్- ఏమిటది?"
"మావాడు సంవత్సరం క్రితం ఇక్కడే ఒక డ్రాఫ్ట్ తీసుకున్నాడు- అది మిస్ అయినట్లు ఈ మధ్యనే తెలిసింది కనుక మా మొత్తం మాకిప్పిస్తే-"
మా మాట వినిపించుకోకుండా ఫోన్ తీసి ఎక్కడికో డయల్ చేశాడతను.
"హలో" అంది అవతలి గొంతు.
"చూడండి - సెల్వరాజ్ అనీ పెరల్స్ మర్చెంట్. చాలా మేలిరకం ముత్యాలు, డైమండ్స్ వున్నాయ్ అతని దగ్గర. మనకి కన్సెషన్ లో ఇవ్వటానికి వప్పుకున్నాడు. అతనిదేదో మెయిల్ - ట్రాన్స్ ఫర్ ఉందంట- కొంచెం చూడండి"
"మరి మాకూ కన్సెషన్ లో ఇస్తాడా?" అవతలి అధికారి అడిగాడు.
"ఎందుకివ్వడు? బాంక్ స్టాఫ్ అంటే చాలు! చాలా కన్సెషన్ ఇస్తాడు-"
"అయితే ఓకే" అనేసి ఫోన్ పెట్టేశాడు.
"థాంక్యూ సార్- మీరడిగినవన్నీ సాయంత్రానికి తెప్పిస్తాను-" అంటూ వెళ్ళిపోయాడా వ్యక్తి.
మేనేజర్ మళ్ళీ మావేపు చిరాగ్గా చూశాడు.
"యస్?" అన్నాడు ప్రశ్నార్థకంగా,
"అదేనండీ- ఇందాక చెప్పాంకదా?"
"ఏం చెప్పారు?"
"మావాడి డ్రాఫ్ట్ సంగతి-"
"ఏమయింది డ్రాఫ్ట్ కి-"
"ఇక్కడ డ్రాఫ్ట్ తీసుకుని - రెండొందలకి - మా అంకుల్ కి పంపించాం- అది ఆయనకు చేరలేదు-"
"దానికి మేమేం చేస్తాం- పోస్టల్ డిపార్ట్ మెంట్ ని కంటాక్ట్ చేయండి"
"ఆ వ్యవహారమంతా అయిపోయింది లెండి- ఇప్పుడు మాక్కావలసిందేమిటంటే మా డ్రాప్ట్ కాన్సిల్ చేసి మా డబ్బు మాకివ్వటం-"
మళ్ళీ ఫోన్ మోగింది.
"హలో- ఓ- మీరా- ప్రపోజల్ ఇంకా రాలేదు రీజనల్ ఆఫీస్ నుంచి! అక్కడ కెళ్ళి కొంచెం- ఏదయినా చేస్తే త్వరగా వచ్చేస్తుంది... అన్నట్లు మళ్ళీ స్టాకొచ్చిందా? సరే వస్తే రెండు నాకోసం తీసిపెట్టండి-" ఫోన్ పెట్టేశాడు.
"యస్!" అని మా వంక ప్రశ్నార్థకంగా చూశాడు మళ్ళీ.
"మావాడి డ్రాఫ్ట్...."
"ఓహో డ్రాప్ట్ పోయిందన్నారు కదూ?"
"అవునండీ-"
"అయితే అప్లికేషన్ రాసివ్వండి! డూప్లికేట్ డ్రాఫ్ట్ ఇస్తాను-"
"మాకు డూప్లికేట్ అవసరం లేదండీ-"
"మరి?"
"మా డబ్బు మాకిప్పించేయాలి"
"అలాగా అయితే సరే- ఆ సంగతే అప్లికేషన్ రాసివ్వండి-"
మేము బయటికొచ్చి డెస్క్ మీద ఓ అప్లికేషన్ తయారుచేసి మళ్ళీ లోపలికెళ్ళాం-
"యస్?" అన్నాడాయన ప్రశ్నార్థకంగా.
అప్లికేషన్ అతని చేతిలో ఉంచాం. అది చూసి అదిరిపడ్డాడు.