"తరువాత ఏమైంది సార్?" అతను ప్రశ్నించాడు.
"నువ్వెప్పుడొచ్చావ్ దామూ?" అడిగాను.
"కథ మధ్యలో వొచ్చాను సార్. రాత్రి నాకు నిద్ర పట్టలేదు. వూరకనే ఇంటి దగ్గర పడుకోవడం ఎందుకని కాఫీచేసి తీసుకొచ్చాను సార్. చలి కాలం కదా. రాత్రికూడా అమ్మకం బాగానే వుంటుంది సార్. అందుకని వచ్చాను. మీరు మేల్కొని వుంటే కాఫీ ఇచ్చి పోదామనుకున్నాను. అయితే మీరు కథలోపడి నన్ను గమనించలేదు. మిమ్మల్ని కదపడం ఎందుకని కూర్చుండిపోయాను. నేను రావడం అమ్మగారు గుర్తించారు."
"అయితే మరి కాఫీ ఇవ్వు."
కాఫీ ఇచ్చాడు దాము. తిరుమల కాటేజ్ వరండాలో ప్రియురాలితో కలిసి అక్టోబర్ చలిలో కాఫీ తాగడం నిజంగా విశిష్టమైన అనుభవం.
నా మనసు గంతులేస్తోంది.
9
కాఫీ గ్లాస్ దామూకు అమ్దిమ్చి, సిగరెట్ వెలిగించుకున్నాను.
ఎదురుగ్గా జబ్బు పడ్డ ఫ్లోరోసెంట్ దీపం వెలిగినప్పుడు దామూ ముఖం కనిపిస్తోంది.
కీర్తి టెన్షన్ తో సీరియస్ గా వుంది.
"తరువాత మదన్"
నేను మళ్ళీ కథ చెప్పడం ప్రారంభించాను.
నిముషాలు గడుస్తున్నాయి. అయినా పెరుమాళ్ జాడలేదు. జనం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొందరు నిల్చోలేక కూర్చుండిపోయారు. చంటి పిల్లల తల్లులు రొమ్ము అందించారు. యువకులు దొంగచాటుగా సిగరెట్లు కాల్చుకోవడానికి మర్రిచెట్టు వెనక్కు చేరారు.
టైమ మూడయింది.
పెరుమాళ్ రాలేదు.
సత్యనారాయణరెడ్డికి విసుగ్గా వుంది. ఆయన ప్రతి అయిదు నిముషాలకోమారు వాచ్ చూసుకుంటున్నాడు.
మూడున్నరయింది.
అందర్లోనూ ఏదో అనుమానం సన్నగా మొదలైంది.
అందర్లోనూ ఒకటే ప్రశ్న- మంత్రగాడు ఎక్కడ?
మెల్లగా గుసగుసలు ప్రారంభమయ్యాయి.
"పెరుమాళ్ ఎక్కడికెళ్లాడు?"
"ఏటి దగ్గరకు వెళ్ళుంటాడేమో. ఈ సరికి వచ్చేస్తుంటాడు"
"మంత్రగాదు రాలేదెందుకు?"
"ఆ అన్న ఇంకా వూర్లోనే దండుకుంటున్నాడేమో!"
"భోంచేస్తున్నాడేమో!"
సత్యనారాయణరెడ్డి ముఖంలో అసహనం మర్రి చెట్టంత విస్తరించింది.
"రేయ్ ఏటికెళ్ళి చూడండి- పెరుమాళ్ అక్కడున్నాడేమో" ఆయన తన పాలేర్లను పురమాయించాడు.
కొందరు ఏటివైపు వెళ్ళారు. మరికొందరు వూర్లో వెదకడానికి పరుగు తీశారు. మరి కొందరు రోడ్డువైపుకు నడిచారు.
మరో అరగంటకు వెతకడానికి వెళ్ళిన అందరూ వచ్చారు. వాళ్ళ ముఖాలు చూడగానే అందరికీ అర్థమైంది పెరుమాళ్ కనపడలేదని.
"ఎక్కడి కెళ్లాడు?" అందర్నీ కుమ్మరి పురుగులా తొలిచేస్తున్న అనుమానమిది.
"ఇంతకీ జయ ఏమైంది?" ఎవరో బిగ్గరగానే అన్నారు.
అంతే ఆ క్షణంలో అరుపులు, కేకలు ఒక్కసారి పైకెగిశాయి.
సత్యనారాయణరెడ్డి గాభరాతో పైకిలేచి "జయకి ఏమైంది?" అని అరిచాడు.
ఆయన అరుపులకు అందరూ నోరు మూశారు నిశ్శబ్దం దట్టంగా అలుముకుంది.
స్త్రీలు అప్పటికే ఏడ్వడం ప్రారంభించారు.
యువకులలో కొందరు పెరుమాళ్ కోసం తలో దిక్కుకు పరుగెత్తారు. ముసలీ ముతకా వణికిపోతున్నారు. కొందరు రైతులు ఇళ్ళకు వెళ్ళి కర్రలు తెచ్చారు. చిన్న బిడ్డల తల్లులు ఇళ్ళకు వెళ్ళిపోయారు. కొందరు మగవాళ్ళు తమ పిల్లల్ని బలవంతంగా ఇళ్ళకు లాక్కుపోతున్నారు.
సత్యనారాయణరెడ్డి చుట్టూ పెద్ద గుంపు చేరింది.
"బుట్ట ఎత్తి చూద్దాం బాబూ."
"అయ్యో అది కూడదు. మంత్రగాడి బుట్టను మనం తాకకూడదు."
"ఈ చాదస్తం వల్లనే జయను వాడికి అప్పజెప్పాం."
"వాడు ఇప్పుడు కనిపిస్తేనే ఎముకలు విరిచేద్దును."
"వాడు మంత్రగాడేమిటి, అడుక్కునే వెధవ."
"పెరుమాళ్ ఎక్కడికీ వెళ్ళడు. మరో అరగంటకు తిరిగొస్తాడు. మనం అనవసరంగా కంగారు పడుతున్నాం"
"ఇంకెక్కడి పెరుమాళ్? ఈ పాటికి ఏభైమైళ్ళు దాటేసి వుంటాడు."
ఇలా ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు.
సత్యనారాయణరెడ్డి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆయన నొసలు గీతలుపడి, ఆ సందుల్లో ఎండపడి, బంగారం చారల్లా వున్నాయి. ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయి, చెమ్మతో మెరుస్తున్నాయి. ఆయన పెదవులు కోపంతో వంకర్లు తిరుగుతున్నాయి.
ఎంత మోసం చేశాడు? వాడ్ని వూరికే వదలకూడదు. ఆయన పళ్ళు కొరికాడు. ఆయనకు అంత కోపం వచ్చింది అంతకు ముందు ఎప్పుడూ జనం చూడలేదు.
ఎర్రగా, ఎండలో కమిలిపోతూ, జరిగిన దానికి కుమిలిపోతూ, కోపంతో వుడికిపోతున్న ఆయనను చూసి చాలా మంది జడుసుకున్నారు.
"ఇప్పుడు నాలుగు దాటింది. ఇంతవరకు పెరుమాళ్ రాలేదు. ఫరవాలేదు బుట్ట పైకి లేపండి" అన్నాడు సత్యనారాయణరెడ్డి.
ఆ ఆజ్ఞకోసం ఎదురు చూస్తున్న పాలేర్లు ముందుకు వురికారు.
జనం బుట్టచుట్టూ దడి కట్టారు.
తొక్కిసలాట ప్రారంభమైంది. అందరి గుండెలూ వేగంగా కొట్టుకుంటున్నాయి. కొందరకైతే అక్కడ నుంచి పారిపోవాలనుంది. మిగిలిన ఒకరూ, ఇద్దరూ ఆడవాళ్ళు గట్టిగా కళ్ళు మూసుకున్నారు.
చిన్న పిల్లలు పెద్దవాళ్ళ కాళ్ళ సందుల్లోంచి దూరి ముందుకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.
జయ క్షేమంగా వుండాలని కొందరు చేతులెత్తి దేవుడికి నమస్కరించారు.
ఒక పాలేరు తన దగ్గరున్న కర్రను పక్కవాడికి అందించి, బుట్ట దగ్గరికెళ్లాడు.
అందరూ కళ్ళను ఆర్పడం మానేశారు. వాళ్ళ గుండెల శబ్ధం వాళ్లకే విన్పిస్తోంది.
పాలేరు భయం భయంగా బుట్టను పైకి లేపుతున్నాడు.
బుట్ట ఓ పక్క బరువుతో వాలిపోతూ వుండడంతో పాలేరు తన బలాన్నంతా వుపయోగించి బుట్ట తీశాడు.
జయ దబుక్కున కింద పడింది.