"బ్రహ్మానందాన్ని, రాజారావునీ పోల్చుకున్నాడు. రాజారావులో ఓ గొప్ప ఉదాత్తత వుంది. బ్రహ్మానందంలో అది లేదు. కొన్ని జీవితసత్యాలను గురించి అతనూ తెలిసినట్లుగా మాట్లాడతాడు కాని మనస్ఫూర్తిగా అన్నట్లుగా వుండడు. తెలిసే అన్నీ చేస్తున్నట్లుగా వుంటాడు. ఓనాడు యవ్వనమదం గురించి చెప్పాడు, తనే మళ్ళీ దారిమళ్ళించాడు.
చక్రపాణి నిట్టూర్చాడు. తన ఆలోచనల్లో రైలు హైదరాబాద్ చేరుకుంది.
9
మంజువాణిని విడిచిపెట్టి వచ్చాక హోటల్లో తాత్కాలికంగా దిగి, మరో గదికోసం వెదుకుతూండగా వాళ్ళ ఊరినుంచి రైతువచ్చి అక్కడి ఇబ్బందులు వర్ణించి ఉన్నపళంగా తీసుకుపోయాడు రాజారావును. తన జీవితమే అంత. అన్నీ ఆకస్మికంగా జరిగిపోతూంటాయి. ఫలితాలు మాత్రం జీవితాంతం వెన్నాడతాయనుకో. మొదట అయిదారు రోజులు సెలవుపెట్టి వెళ్ళాడు. ఇంతలో పండుగకూడా వచ్చేసింది. ఇంకా ఇబ్బందులు తీరక తర్వాతకూడా రావటం పడలేదు. ఇంకా కొన్నిరోజులు అనివార్య కారణాలవల్ల సెలవు కావాలని కోరుతూ ప్రిన్సిపాల్ గారికి ఉత్తరం రాశాడు. అందులో అతను ప్రెసిడెంటుకూడా ఏమో - మిగతా విద్యార్ధులకన్న అక్కడ ఉండవల్సిన బాధ్యత ఎక్కువ ఉంది.
సంక్రాంతికి చక్రపాణి విజయవాడ వస్తాడని తెలుసు. అతన్ని కల్సుకుని చాలాకబుర్లు చెప్పాలనే వుంది. అతనితో ఇవన్నీ చెబితే మనసులోని వ్యధ కొంత తగ్గుతుందని మిణుకుమిణుకుమని ఓ ఆశ. కాని తాను ఇక్కడ వుండిపోవాల్సి వచ్చిందయ్యె. రెండురోజులు కులాసాగా గడపొచ్చని అతన్నే ఇక్కడకు రమ్మని రాశాడు. లాభంలేకపోయింది.
ఇది ఇల్లు అనటంకంటే నరకం అంటే బాగుంటుంది. 'నా' అన్నవాళ్ళందరికీ విరోధినైపోయానని అన్నాడతను. మంజువాణితో చెప్పిన జోస్యం నిజమయింది. ఇంట్లో ఎవరూ అతన్తో సరిగ్గా మాట్లాడటం మానేశారు. తనక్కడ వుండటమే వాళ్ళకోబాధా అన్న సందేహం పీడిస్తూండేది.
అతనికి ఒకరి దయాభిక్ష అవసరంలేదు. స్వతంత్రజీవి. చిన్నవాడుగా వున్నప్పుడు వాటిల్లిన తండ్రి మరణం గుర్తువుంది. ఓ కారుచీకటి రాత్రి ఉరుములు, మెరుపుల్తో ప్రళయంగావున్న సమయంలో తనను అన్నగార్ల చేతికివప్పగించి వెళ్ళిపోయాడాయన.
ఆ తరువాత చాలారోజులపాటు అతను అనుభవించినన్ని బాధలు ఓ దిక్కుమాలినవాడుకూడా అనుభవించడు. వదినలకు ఆప్యాయతే, అభిమానమే. పెద్దవదినకు చాలా. కాని, వాళ్ళు అన్నల చేతుల్లోని కీలుబొమ్మలు, ఆడవాళ్ళుకదా మరి! ఎవరో వాళ్ళ పంచనుచేరితే ఆశ్రయమిచ్చినట్లుగా వుండేది అతని స్థితి. వీపంతా కారణంలేని అన్నగారి కోపప్రదర్శనకు చిట్లిపోయి బండబారి పోయింది. ఒక్కోసారి చీకటితో నిద్రలేచి నాలుగయిదు మైళ్ళు ఏవో పనులమీద నడవ్వలసి వస్తూండేది. ఓసారి అన్నగారు ఎక్కడికో వెళ్ళిరమ్మని చెప్పారు. అప్పుడే తను ఎక్కడినుంచో వచ్చాడు అలసిపోయి. ఒళ్ళంతా నలిగివుండటంచేత వెళ్దామనుకుంటూనే ఓమూల చేరి గోడకు ఆనుకుని నిద్రలో పడిపోయాడు. ఎప్పటికో వంటిమీద 'ఛర్' మని దెబ్బపడేసరికి తృళ్ళిపడి లేచికూర్చున్నాడు. ఏమి జరుగుతుందో పాలుపోకముందే శరీరమంతా దబ్ దబ్ మని దెబ్బలతో నిండిపోయింది. అడ్డుకుందామని వచ్చిన పెద్దవదినగారు అవతలకు త్రోసివేయబడింది. మిగతా వాళ్ళంతా గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డారేగాని ముందుకువచ్చి అడ్డుకునే సాహసం ఎవరికీ కలగలేదు. చండశాసనుడైన అన్నగారి అధికారం అలాంటిది. అలాంటి దుష్టపరిపాలనలో, కఠినశాసనంలో పెరిగిన రాజారావు గృహసంబంధమైన విషయాల్లో మొరటుదేరిపొయ్యాడు. అన్నగారి మితిమీరిన స్వంతఖర్చు, దుబారా, జల్సా అంతా ఒకకంట కనిపెడుతూనే వున్నాడు. చివరకు ఓరోజున ఇంట్లోనివారంతా చుట్టూ పరివేష్టించి వుండగా నిలదీసి అడిగేశాడు.
వెంటనే ఈ చిన్నవాని విప్లవాత్మకమైన భావాలు ఆయనకు అర్థంకాలేదు. "ఏమిట్రా పేల్తున్నావ్? నా వ్యవహారాల గురించీ, వ్యాపకాల గురించీ అడిగేంతటి మొనగాడివైనావా నువ్వు?" అంటూ తారామండలానికి లేచాడు.
రాజారావు చలించలేదు. "నీ సౌఖ్యాలు, వ్యాపకాలు ఎలాగైనా తగలడనియ్యి. వాటితో నాకు సంబంధం లేదు. కాని నీ స్వార్ధసుఖాలకోసం ఇతరులు మాత్రం నష్టపెట్టుకోరు" అనేశాడు సూటిగా.
ఆయన నిర్ఘాంతపోయాడు. ఓనాటికి ఇలాంటి కఠినమైన మాట ఈ అస్వతంత్రుని నోటినుంచి వస్తుందని కలలోకూడా తలపోయలేదు. వెంటనే ఒళ్ళు మండింది. కోపంతో కళ్ళు ఎర్రగా, పెద్దవిచేశాడు. లేచి నిల్చున్నాడు. "చూడు నిన్ను" అని మీదికి వస్తూ చేయెత్తాడు.
రాజారావు నిటారుగా నిలబడి "అక్కడే ఆగు" అని గర్జించాడు.
అంతటి పౌరుషంగల మనిషి ఒక్కసారిగా ఉలిక్కిపడి, నిరుత్తరుడై నిలబడిపోయాడు.
"ఇంకా ఒక్క అడుగు ముందుకువచ్చి... ఏమయినా అత్యాచారానికి ప్రయత్నించావంటే నీ చేతుల్తో నీ మర్యాద తీసుకున్నవాడివి అవుతావు. నా జబ్బపుష్టిని గురించి కనీసం వినివుంటావు."
కొంచెంఆగి తనే "చాలాసార్లు చాలా సందర్భాలలో నీ అరాచకత్వాన్ని సహించాను. పెద్దరికం పేరిట నువ్వు చేసిన హింసాకాండను ఓపిగ్గా భరించాను. మైడియర్ బ్రదర్! నాకెప్పుడో మైనారిటీ తీరిపోయింది. నా ఆస్థిలో ఒక్క చిల్లిగవ్వ ముట్టుకున్నా ఒప్పుకోను."
"అయితే నీ ఆస్థిని నేను తాకానంటావా?"
"అబ్బే, తాకలేదు. రూపాయల్ని మంచినీళ్ళుగా మార్చి తాగావు. కళ్ళప్పగించి చూస్తూవూరుకుని, తర్వాత చిప్పపట్టుకుని దేశంమీద పడేటంత త్యాగం నాకులేదు. నేను నిశ్చయించుకున్నాను. అవునది. నేను నిశ్చయించుకున్నాను. నా భాగం నేను పంచుకోక తప్పదు."
ఇల్లంతా హాహాకారాలతో నిండిపోయింది. తల్లి బిగ్గరగా శోకాలు తీసింది. "కనీసం నాకళ్ళు మూతలుపడేదాకానన్నా..." అంటూ.
కాని రాజారావు మొండిరాయిలా నిలిచాడు. చివరకు అతని ఆశయం నెరవేరింది. ఇలాంటిది జరగకపోయినా తాత్కాలికంగా జనించే విరక్తి. 'అయ్యో' అనే బాధకూడా లేవు అతన్లో.
ఇహ అప్పట్నుంచీ అతన్నో పెద్దవాడికింద గుర్తించి, ఓ స్థానం ఇవ్వక తప్పలేదు ఇంట్లో. ఓ మాదిరి భయసంకోచాలుకూడా కలిగాయి అతనిపట్ల. అన్నలు అహంకార ప్రదర్శన విడిచిపెట్టి లోపాయికారితనం మొదలుపెట్టి అతనంటే ఆప్యాయత ఒలకపోయటం, తమపనులు సానుకూలం అయ్యేటట్లు చూసుకోవటం పరిపాటి అయింది. రాజారావు కొంత అహంభావి అనేమాట నిజమైతే కావచ్చుగాని, అతడు నీచుడు కాదు. స్వార్థపరుడుకాదు. విడిపోయినా, ఎన్నోమార్లు విపరీతంగా అన్నల కుటుంబానికి ధనసహాయం చేశాడు. అటువంటి సమయాలలో "మా తమ్ముడు" అని భుజాలెగురవేశారు వాళ్ళు. ఓసారి కాలేజీఫీజు కట్టటానికి సమయానికి చేతిలో డబ్బులేక నోరువిడిచి అడిగితే "అబ్బే, నాదగ్గిర ఎక్కడుందిరా" అని ముఖాలు చాటేశారు.