హాస్పిటల్ వసారాలో గురువులితో మాట్లాడుతూ కూర్చున్నారు విశ్వనాథంగారు అప్పటిదాకా.
"గురువులూ! పెద్దవాళ్ళమైపోతున్నామోయ్. ఈ మానసిక జంఝాటాలు ఒకటి. తీర్థయాత్రలకి పోయివద్దామనిపిస్తోంది. ఏమంటావ్" అన్నాడాయన.
గురువులికి ఆయనపైన ఎనలేని సానుభూతి కలిగింది. ఈ విశ్వనాథంగారి జీవితంలోని అనేకదశల్లో తను ఆయనకు సన్నిహితంగా వున్నాడు. వస్తున్న మానసిక పరిణామాల్ని గుర్తిస్తున్నాడు.
"తప్పకుండా వెళ్ళండి బాబూ! ఒకసారి అలా తిరిగివస్తేనేగాని మనసు కుదుటపడదు. అమ్మగార్కికూడా ఎప్పటినుంచో కోరిక. వెళ్లిరండి బాబూ!" అన్నాడు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విచిత్రంగా వుంటుంది. గతజీవితానుభవాలు, మానసికావేదనలు చెప్పుకుంటూ వుంటారు. ప్రపంచానికి అర్థంకాని సన్నిహితత్వం వుంది వారిద్దరిమధ్య. ఒకరినొకరు ఓదార్చుకుంటూ వుంటారు. గురువులు ఆయన కోసం ఎంతపనయినా చేస్తాడు. ఇద్దర్నీ ఓ రకం పశ్చాత్తాపం ఎప్పుడూ ఆవహించి వుంటుంది.
అలా మాట్లాడుకుంటూ సాయంత్రం గడిచిపోయేదాకా గడిపారు.
డాక్టరు బయటికి వచ్చాడు. "ఐయామ్ సారీ సార్. మేము చెయ్యగలిగిందంతా చేశాం. ఏమీ ప్రయోజనం లేకపోయింది. మరో గంటకంటే ఎక్కువ బ్రతకడు. తీసుకు వెళ్లిపోండి" అన్నాడు.
విశ్వనాథంగారి ముఖం నల్లబడిపోయింది. "సరే" అన్నట్లు విషాదంగా ఆయన పెదవులు కదిలినయ్.
కారులో పిల్లవానిని గురువులు వొళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా వున్నారు.
ఎలా చెబుతాడు కూతురికి ఈ విషయం? పసివాడు చివరిదశలో వున్నాడు. పెద్ద పిల్లవాడి స్థితీ అలానే వుంది. తట్టుకుంటుందా ఆ వెర్రిపిల్ల ఈ విషమ ఘడియల్ని? బ్రతకగలదా!
కారులోంచి దిగి పాలిపోయిన ముఖంతో లోపలకు వస్తున్న భర్తను చూడగానే లలితమ్మగారు సర్వం గ్రహించింది. ఇహ కూతురిముందు దాచి ప్రయోజనం లేదనుకున్నారు వాళ్ళు.
సుభద్ర కెవ్వున కేకవేయలేదు. తనకుముందే తెలుసునన్నట్లుగా అచలనంగా శూన్యంలోకి ఎటో చూస్తోంది. బిడ్డని నిశ్శబ్దంగా చేతులలోకి తీసుకుంది. ఎవరితో మాట్లాడటంలేదు. గదంతా విషాదాన్ని అలుముకున్నట్లు గంభీరంగా వున్నది.
అనంతరావు పెద్దకొడుకుని వొడిలో పడుకోబెట్టుకుని తలవంచుకుని కూర్చున్నాడు. నిస్పృహ, నిర్లిప్తత వీటితో నిండిపోయి విధితో కలసిపోయినట్లుగా వున్నాడు. అతని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. గెడ్డం పెరిగి యోగిలా వున్నాడు.
ఇంట్లోని మనుషులంతా చుట్టూ చేరారు.
ఉన్నట్టుండి ఓ చిత్రమైన ధ్వని వెలువడింది.
ఆ ధ్వని చిన్నవాడి గొంతునుండే వెలువడిందని సుభద్ర అనుకుంది. కాని కాదు. అనంతరావు గజగజ వొణుకుతూ "సుభద్రా, ఇదేమిటి పెదబాబు చూడు" అంటున్నాడు.
సుభద్ర త్రుళ్ళిపడి అటుకేసి చూసింది. పెద్దపిల్లవాడి నోటినుండి ఆ హీనమయిన ధ్వని వెలువడుతోంది. వాడు గిజగిజ కొట్టుకుంటున్నాడు. ముఖమంతా నల్లని ఛాయలు అలుముకుంటున్నాయి.
సుభద్ర యీ హృదయవిదారక దృశ్యం చూసి ఇహ తట్టుకోలేక "అమ్మా!" అని గట్టిగా అరిచేసింది.
లలితమ్మగారు గభాలున వెళ్లి పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుని వెంటనే అరుస్తూ "ఏమండీ! త్వరగా వెళ్లి డాక్టరుకి ఫోన్ చెయ్యండి. వెంటనే రమ్మని చెప్పండి" అంది తొందరగా.
విశ్వనాథంగారు ఒక్కఉదుటున ఫోన్ దగ్గరకి వెళ్ళారు.
ఇల్లంతా ఇప్పుడు మరీ భయంకరంగా వుంది. అనంతరావు కళ్ళనుంచి కన్నీరు కాలువలు కడుతోంది. సుభద్ర నిశ్చలత్వాన్ని వొదిలి తల్లిని పట్టుకొని విలపిస్తోంది.
బయట కారాగింది. డాక్టరు వచ్చి పెద్ద పిల్లవాడిని పరీక్షచేసి పెదవి విరిచాడు. అంతా అయిపోవచ్చిందని ఇంకా నిముషాల్లో వుందని చేయగలిగింది ఏమీలేదనీ చెప్పి వెళ్లిపోయాడు.
సుభద్ర, అనంతరావు ఒకరిప్రక్కన ఒకరు కూర్చున్నారు. ఆమె వొడిలో పసివాడూ, అతడి వొడిలో పెద్ద పిల్లవాడూ వున్నారు. ఇద్దరూ కొట్టుకుంటున్నారు. ఇద్దరూ యమయాతన ననుభవిస్తున్నారు. ఇద్దరి ముఖాలూ నల్లబడుతూ, జీవకళ కోల్పోతూ హృదయ విదారకంగా వున్నాయి.
దంపతులిద్దరూ తమలో తాము ఏడుస్తున్నారు. బిడ్డలని హృదయానికి అదుముకుంటున్నారు. వాళ్ళ ముఖాలకేసి పరీక్షగా కళ్ళార్పకుండా చూస్తున్నారు.
ఉన్నట్లుండి పసివాడిలో కదలిక ఆగిపోయింది. సుభద్ర శరీరమంతా తడిమి చూసింది. ఈ స్పర్శ కొత్తగా, దారుణంగా తోచింది. చల్లగా వుంది. ఏమిటోగా వుంది. అందులో ఏమీలేదు. ముఖం ఓ ప్రక్కకి వాలిపోయి, ఒకప్పటి ఆ అందమైన కన్నులు... ఆమెకి అర్థమైంది. "అమ్మా! బాబు పోయాడమ్మా" అని ఒక్క గావుకేక పెట్టి గుండె బద్దలయేటట్లు ఏడవసాగింది. అంతా గొల్లుమన్నారు. ఒక క్రూరమైన విధివిలయతాండవం ఆ అమాయకపు గుండెల్ని కోసిపారేస్తోంది. అట్లా కొన్నినిముషాలన్నా గడవకముందే క్రమంగా అందరి హదయాల్లోనూ ఒకే అనుమానం ఉత్పన్నమయింది. అనంతరావుకేసి తిరిగారు.
అతను నిశ్చలంగా కూర్చొని వున్నారు. ముఖం పీక్కుపోయి, ఒక్క నిముషంలో అమిత జరాగ్రస్తుడైనట్లు వున్నాడు. చివరకు అన్నాడు "పెదబాబు పోయి చాలాసేపయింది" అని.
* * *
ఏడుపులు, మొత్తుకోళ్ళు... రాత్రి పన్నెండు కూడా అయింది. మశూచికాపు పిల్లవాడి శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎంతసేపని వుంటారు? ఇంకా ఎంతసేపటికి తెల్లవారుతుంది.
గురువులు అక్కడే వున్నాడు.