Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 33


    ఆశ తలయెత్తి అక్కముఖంలోకి చూసింది. అందమైన, అమాయకమైన ఆ ముఖంమీద శీర్షిరేఖలు, జీర్ణరేఖలు, ఆవేదనల నివేదనలు, అంతులేని కన్నీటి చారికల చిహ్నాలు.

 

    ఆశ ఆమెవంక అలాగే కళ్ళు నిల్పి చూస్తోంది.


                                                                 *  *  *


    సుభద్రకి పెళ్ళయి నాలుగేళ్ళయింది.

 

    ఆమె భర్త అనంతరావు మూడువందల రూపాయల ఉద్యోగస్థుడు. అతను భార్యని గాఢంగా ప్రేమించాడు. ఆమెను అమితానురాగంతో చూశాడు. ప్రాణప్రదంగా చూసుకున్నాడు. వాళ్ళిద్దరిదీ అనుకూల దాంపత్యమని ముచ్చట పడేవారంతా.

 

    కొన్నాళ్ళకి ఆ దంపతులకు పుత్రుడు కలిగాడు. వాడిని ఒక్కక్షణం క్రిందకి దింపకుండా వాళ్ళు అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

 

    ఆ శిశువు కలిగాక అనంతరావుకు ప్రమోషన్ కూడా వచ్చింది. జీవితం మరీ నందనవనంగా గోచరించింది.

 

    ఇలా రెండేండ్లు గడిచిపోయాయి.

 

    సుభద్రకి మళ్లీ నెలతప్పింది.

 

    ఈసారికూడా కుమారుడే కలిగాడు.

 

    రెండోకొడుకు మరీ అందంగా వుండేవాడు. వాడు ఎప్పుడూ ఇరుగు పొరుగు ఇళ్ళలోనే పెరిగేవాడు. వాళ్ళంతా వాడిని ఒక్కక్షణం క్రిందికి దింపే వారుకాదు.

 

    ఇలా ఆరునెలలు హాయిగా గడిచాక చిన్నపిల్లవాడికి వున్నట్లుండి జబ్బు చేసింది. కడుపులో విపరీతమైన నెప్పి వచ్చి గిలగిల కొట్టుకుపోయేవాడు. కృశింపసాగాడు. దిష్టి తగిలిందనుకొని దిష్టి తీశారు. డాక్టర్ కి చూపించారు. ఏమి చేసినా తగ్గలేదు. ఇహ అనంతరావుకి భయంవేసి భార్యను పిల్లలతో పుట్టింటికి తీసుకువచ్చాడు.

 

    విశ్వనాథరావుగారు పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి చూపించారు. వారు ప్రయత్నిస్తున్నారు.

 

    ఆపరేషన్!

 

    ఎనిమిది నెలల కసుగందుకు ఆపరేషన్.

 

    సుభద్ర ఎంతకూ ఒప్పుకొనటంలేదు. "ఏమయినా సరే నా బిడ్డకు ఆపరేషన్ చెయ్యటానికి వీల్లే"దని మొండికెత్తి కూచుంది.

 

    పరిస్థితి ఇలా వుండగా పెద్ద పిల్లవాడికి జ్వరం రాసాగింది. తర్వాత వంటిమీద పొంగు కనిపించనారంభించింది. డాక్టరు చూసి మశూచికమని తేల్చాడు. ఒక్కసారిగా అందరూ హడలిపోయారు. దద్దరిల్లిపోయారు.

 

    ఎంత పెద్ద కష్టమయినాగానీ అది వచ్చేదాకానే భయం, వచ్చాక అనుభవింపక చేసేదేముంది? ఆ క్షణంలో ప్రపంచం చీకటిమయంగా కనిపించినా, శూన్యంగా వున్నా, భయంకరంగా తోచినా అనుక్షణం వణికిపోతున్నా భగవంతుడిపై భారంవేసి తమ ఆరోగ్యం చూసుకోకుండా వాళ్ళకి శుశ్రూషలు చేస్తూ విధితో పోరాడసాగారు.  

 

    తమకోసం ప్రత్యేకంగా వుంచుకున్న క్రిందగదిలో అలా నిద్రాహారాలు లేకుండా పిల్లలిద్దర్నీ వొళ్ళో వేసుకుని కూర్చునేవాళ్ళు. పెద్దపిల్లవానికి వళ్లంతా పుళ్లమయమైపోయింది. మంటలు, ఏడుపు, అహర్నిశలూ వాటినిరాస్తూ మందులు వేస్తూ కూర్చోవాలి. ఎవరో కల్లువాడితే తగ్గుతుందని చెప్పారు. రోజూ కల్లు తెప్పించి వాడుతూ వుండేవారు.

 

    రోజులు గడిచినకొద్దీ పిల్లలిద్దరికీ తగ్గుముఖం పట్టకపోగా పరిస్థితి మరీ విషమించసాగింది. దంపతులిద్దరికీ పిచ్చిపట్టినట్లు తయారయ్యారు. శుష్కించి పోతున్నారు.

 

    విశ్వనాథంగారు గొప్పగొప్ప డాక్టర్లని పిల్చుకు వచ్చి తాను చేయగలిగినదంతా శాయశక్తులా చేశాడు. కాని ప్రయత్నాలన్నీ విఫలమై పిల్లలిద్దరి ముఖాలమీదా మృత్యుచిహ్నాలు స్పష్టంగా కనిపించసాగినాయి.

 

    రెండోవాడినైనా దక్కేటట్లు చేసుకోవాలని ఆయనకు అనిపించింది. ఓరోజు కూతురూ, అల్లుడూ వున్న గదిలోకి వెళ్లి బలవంతంగా వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు.

 

    "వద్దు నాన్నగారు! నేనివ్వను. ఆ కసాయివాళ్ళు నా బుజ్జితండ్రిని పరపర కొయ్యటం నేను సహించలేను. వాడినిక్కడే వుండనివ్వండి నాన్నగారూ! మా కర్మ ఎట్లావుంటే అట్లానే జరుగుతుంది" అని బిగ్గరగా ఏడవసాగింది.

 

    తండ్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "వద్దమ్మా. అలా మొండితనం చేయకు. పెద్దవాడ్ని నామాట విను. ప్రయత్నించి చూద్దాం తల్లీ. అదృష్టాన్ని పరీక్ష చేసుకుందాం" ఆయన కంఠం గడగడ వొణికింది.

 

    "అయితే హాస్పిటల్ కి నేనుకూడా వస్తాను. వాడ్నక్కడికి పంపించి నేనిక్కడ ఎలా వుండేది? నన్ను కాదనకండి నాన్నగారూ!"

 

    ఆయన కూతురి తలపైన చేయివేసి నిమురుతూ "పెద్దవాడి భారం యిలాంటి పరిస్థితిలో వుంటే వాడిని వొదిలి ఎలా వస్తావమ్మా? వీడిని నామీద వేసెయ్యి తల్లీ" అని బలవంతంగా యివతలికి వచ్చేశాడు.

 

    సుభద్ర రెండుచేతుల్తో ముఖాన్ని కప్పుకుని ఏడవసాగింది. "ఏమి శిక్ష యిది ప్రభూ" అంటోంది.

 

    అనంతరావు తన బలహీనమైన హస్తాన్ని ఆమెపైన వుంచి "ఊరుకో సుభద్రా. ఊరుకో" అంటున్నాడు.


                                                               *  *  *


    హాస్పిటల్ కి విశ్వనాథంగారితో గురువులుకూడా వెళ్ళాడు. ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు గురువులికి కాకితో కబురు పంపితే చాలు పరుగెత్తుకు వచ్చేస్తాడు. అండగా నిలబడతాడు.

 

    మధ్యాహ్నం నాలుగుగంటల వేళకి ఆపరేషన్ జరిగింది. బిడ్డకు వొంటిమీద స్మృతిలేదు. ఏ విషయమూ రూఢిలేదని ముందుగా చెప్పే తమ పని నిర్వర్తించారు డాక్టర్లు. అంతా అయినాక మరో రెండు మూడుగంటలు గడిస్తేనే గాని తమ ప్రయత్నం ఫలించిందీ లేనిదీ తేల్చమని చెప్పారు. విశ్వనాథంగారు ఆపరేషన్ సక్రమంగా జరిగిందనీ, పిల్లవాడికి ప్రమాదస్థితి ఏమీ లేదనీ, కాసేపటికిగాని ఏ సంగతి నిర్ధారణంగా తేలదనీ, సుభద్రకి ధైర్యం చెప్పమని చెప్పి యింటికి భార్యకు ఫోన్ చేశాడు.

 Previous Page Next Page