Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 33


    "నిన్ను ఇంత తక్కువ కాలంలో అనూహ్యంగా మార్చివేయగలిగిన మహానుభావులెవరు? నీలో ఈ పట్టుదలనీ, దీక్షనీ పురికొల్పిందెవరు?" ఆమె కళ్ళు చెమర్చాయి.

    చెట్టంత కొడుకు ఎందుకూ పనికిరాకుండా పోయాడే అని ఇంత కాలం ఆమె పడిన బాధ ఆ క్షణాన చేత్తో తీసేసినట్టు అదృశ్యమైపోయింది.

    త్రినాధ్ చిరునవ్వుతో "చెబుతానమ్మా, టైమ్ వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతాను. నామీద నమ్మకం పోవటంతో నువ్వు నిస్పృహతో వదిలేసిన తీగను నేను వెతికి తెచ్చి నీ కాళ్ళకు తగిలిస్తాను. అప్పుడు తీగలాగు. డొంకంతా కదిలివస్తుంది నీ కాళ్ళ దగ్గరికి..." అంటూ ఇక వెళదామా అన్నట్లు చూశాడు.

    కొడుకులో వచ్చిన అద్భుతమైన మార్పుని తలుస్తూ ఆమె లేచింది.


                                                *    *    *    *


    ఈ మధ్య కాలంలో మాలిని జీప్ ఎప్పుడూ త్రినాధ్ వద్దే వుంటోంది.

    ఎప్పటిలా త్రినాధ్ తెల్లవారుఝాము నాలుగు గంటలకే లేచి జీప్ ఎక్కాడు. అది సరాసరి మాలిని ఇంటివైపు శరవేగంతో దూసుకుపోతోంది.

    అతని కళ్ళు రోడ్ మీద, ఆలోచనలు మాత్రం ఇంజనీర్ చెప్పిన విషయాలపైనే వున్నాయి.

    మరలా అంతలోనే ఆ ఆలోచనలు సెలెక్టు చేసిన అభ్యర్ధులవైపు వారి డిపాజిట్ల వైపు మరలాయి.

    నలుగురు మేనేజర్స్ - 4x50,000

    నలుగురు క్యాషియర్స్ - 4x50,000

    నలుగురు ఎకౌంటెంట్స్ -  4x40,000

    నలుగురు టైపిస్ట్ లు - 4x25,000

    ఇద్దరు లైజన్ ఆఫీసర్స్ - 3x20,000

    ఇద్దర ఆఫీసు బాయ్స్ - 2x10,000

    2,00,000 - 2,00,000 - 1,60,000

    1,00,000 - 60,000 - 20,000

    వెరసి 7,40,000 రూపాయలు. ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళంతా డిపాజిట్స్ నిజంగానే చెల్లిస్తారా? చెల్లించినా మొత్తం చెల్లిస్తారా? కొంత తగ్గించమని అడుగుతారా?

    ఆలోచనలు ఓ దారికి రాకముందే జీప్ మాలిని ఇంటి ముందు ఆగింది.

    అప్పటికే రెడీగా వున్న మాలిని జీప్ ఆగిన శబ్దం విని ఇంటికి తాళం వేసి త్రినాధ్ కి ఎదురొచ్చింది.

    ఒకరినొకరు కళ్ళతోనే పరామర్శించుకొని జీప్ ఎక్కారు.

    త్రినాధ్ జీప్ ని స్టార్ట్ చేస్తుండగా... "ఈరోజు ఎప్పటిలా శివాలయానికి వెళ్ళటం లేదు" అంది.

    త్రినాధ్ ఒకింత ఆశ్చర్యపోయి చూశాడు ఆమె వైపు.

    "నీ ఆఫీసుకి వెళుతున్నాం" అని సీట్లో సర్దుకు కూర్చుంది.

    త్రినాధ్ ఆ మార్పుకు ఓ క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే సర్దుకొని జీప్ ని తన ఆఫీసువైపు మరలించాడు.

    ఆఫీస్ ముందు జీప్ ఆగేవరకూ ఇద్దరూ మౌనంగా వున్నారు.

    జీప్ దిగి ఆఫీస్ లోకి వెళ్ళారు. ఖాళీగా కనిపిస్తున్న హాల్ వేపు ఓసారి చూసింది మాలిని.

    ఇద్దరూ త్రినాధ్ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఒకింతసేపు తర్వాత మాలిని అంది-

    "నిన్నొ వజ్రాయుధాన్ని చేస్తానని ఒక దుష్టుడిమీద సవాల్ చేశాను. ఇప్పటికి నీమీద నాకు నమ్మకం కుదిరింది. అయితే ఇప్పటివరకు నీకెలాంటి ఇబ్బందులు రాలేదు. కాని ఎప్పుడైతే ఈ పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టావో అప్పటినుంచి ఎందరి దృష్టో నీమీద పడుతుంది. ప్రతి అడుగూ తూచి, తూచి వేయాలి."

    ఆమె కొద్దిక్షణాలు ఏదో ఆలోచిస్తున్నట్టు ఆగిపోయింది.

    త్రినాధ్ ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. అతనికి అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తూ వుంటుంది ఈమెకు తెలియని విషయం లేదా అని. ఆమెనుంచి ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తృష్ణ అతనిలో నానాటికి పెరుగుతోందే తప్ప సంతృప్తి మాత్రం కలగడంలేదు.

    "ఈరోజు ఒక వ్యాపారవేత్తగా నీలో ఆత్మవిశ్వాసం, స్థయిర్యం ప్రోది చేసుకునేందుకు కొన్ని సక్సెస్ ఫుల్ స్టోరీస్ చెబుతాను. మనిషికి బుర్ర ఇచ్చింది ఆలోచించడానికే. ఆ ఆలోచించడంలో నూతనత్వం వుండాలి- అన్వేషణ వుండాలి. హేతువాదం, తార్కిక జ్ఞానం కూడా వుండాలి."

    సమయం ఉదయం ఆరు కావస్తోంది. ఆఫీసంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుంది.

    "నీలో దృఢ సంకల్పం, పట్టుదల, దీక్షా అంకురించడానికే ఇప్పటివరకు ఆ పాడుబడిన శిధిలాలయాన్ని ఎన్నుకున్నాను. నీ గత జీవితం కూడా గుడితో పోల్చదగ్గదే. నీలో పట్టుదల ప్రాతఃకాలానికి ఎలా కట్టుబడుతుందో? శరీరాన్ని గడ్డ కట్టించే కోనేటి నీటితో నీ శారీరక నిగ్రహాన్ని కూడా పరీక్షించాను. ఇంకా గుడి దగ్గరకు ప్రతిరోజూ వెళ్ళనక్కరలేదు."

    అప్పటికే త్రినాధ్ ఆ గుడి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు.

    "నీ గురించే ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విజయం సాధించిన వ్యక్తుల ప్రారంభ జీవితాల అన్వేషణల్ని శోధించి తెచ్చాను. భవిష్యత్తులో నా మాటను దక్కిస్తావని నా ఆశాభావం. ఇకపోతే నేను నీకు గురువుగా ఆఖరి అక్షరాల- ఱ- పాఠాన్ని చెబుతాను. కనుక గురుదక్షిణ చెల్లించే విషయంలో నీ వద్ద నుండి మాట తీసుకోవాలనుకుంటున్నాను..."

    "చెప్పండి... మీలో అంతర్గతంగా సాధించవల్సిన విషయమొకటి కుతకుతలాడిపోతోందని నాకు తెలుసు. అదెంతటి కష్టసాధ్యమైందైనా, అనితర సాధ్యమైందైనా నేను సాధించిపెడతాను."

    "గురుదక్షిణగా నీవు సాధించి పెట్టవలసింది త్వరలోనే తెలియచేస్తాను. ఇప్పుడు మాత్రం కాదు..."

    ఆమె వెంటనే చెప్పనందుకు అతని మొహంలో రవ్వంత అసంతృప్తి చోటు చేసుకుంది.

    "పరిగెత్తే గుర్రాన్ని పక్కదారుల్ని తొక్కించడం నాకిష్టం లేదు. మరో విషయం. నేను స్వార్ధపరురాల్ని. ఆ విషయం ముందే చెబుతున్నాను."

    ఆమె కళ్ళు అరుణిమను పులుముకున్నట్లున్నాయి. త్రినాధ్ కు ఆమెని తరచి ప్రశ్నించాలని అనిపించలేదు.

    క్షణాల్లో ఆమెంతట ఆమె సర్దుకుంది.

    "ఇప్పుడు నేను చెప్పే ప్రతి వాస్తవ ఉదాహరణ, నీ జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమైపోవాలి.

    చాలా సంవత్సరాల క్రిందటి విషయం. అప్పట్లో బట్టలు కొని కుట్టించుకున్నాక రెండు, మూడు ఉతుకులకు ష్రింక్ అయిపోయేవి. ఇప్పటికీ కొన్ని కంపెనీల బట్టలు ష్రింక్ అవుతుంటాయి. దానిమూలంగా వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు.

    "సాన్ ఫోర్డ్ క్రెట్" అనే వ్యక్తి ప్రపంచంలో తొలిసారిగా బట్టలు ష్రింక్ అయ్యే సమస్య గురించి ఆలోచించాడు. హి ఫైండ్స్ ఎ నీడ్. ష్రింక్ కాకుండా వుండే ప్రాసెస్ కోసం అతని అన్వేషణ మొదలైంది. బట్టల్ని వేడి చేయడం ద్వారా దాన్ని అరికట్టవచ్చని" కంప్రెసివ్ ష్రింకింగ్ ప్రాసెస్ కనుగొన్నాడు. దాన్నే 'సాన్ ఫో రైజ్ డ్' అంటారు.

    అది అతను కనిపెట్టింది కనుకే అతని పేరుమీదుగా ఆ ప్రాసెస్ ని 'సాన్ ఫోరైజ్ డ్' అని గుర్తించడం జరిగింది.

    ఆ ప్రాసెస్ ద్వారా అతను కోట్లకు కోట్లు సంపాదించాడు.

    "ఛార్లెస్ స్ట్రెయిన్ అనే వ్యక్తి తను ఎదుర్కొన్న ఇబ్బందిలోంచి ఒక కొత్త వస్తువును కనుగొన్నాడు. ఛార్లెస్ ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుండేవాడు. ఫ్యాక్టరీలో వున్న లంచ్ రూమ్ లోనే ఛార్లెస్ బ్రెడ్ తీసుకుంటుండేవాడు. ఒక్కోరోజు బాగా కాలిన బ్రెడ్, మరొకరోజు కాలీకాలని బ్రెడ్ ని లంచ్ రూమ్ లో సప్లయ్ చేస్తుండేవారు.

    వాటిని తినలేక ఛార్లెస్ చాలా ఇబ్బంది పడుతుండేవాడు. అప్పుడు ఓ సాధారణమైన వ్యక్తి అయితే అక్కడ లంచ్ తీసుకోవడం అన్నా మానేస్తాడు, లేదా బ్రెడ్ బదులు మరేదన్నా తీసుకుంటాడు.

    కాని ఛార్లెస్ కామన్ సెన్స్ వున్నవాడు. అందుకే ఆలోచించాడు. ఒక మనిషి ఎంత శ్రద్ధగా బ్రెడ్ కాలుస్తూ దగ్గరే వున్నా ఒక్కోసారి మాడిపోవడం, మరోసారి కాలకపోవడం జరుగుతుంటుంది. ఇలా జరగడం అన్నది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వుంది.

    మనిషి చేతిలో పాడయ్యే బ్రెడ్ ని కాల్చడం అన్న ప్రక్రియను ఏదైనా యంత్రానికి అప్పగిస్తే? దానికో టైమ్ నిర్ణయిస్తే ఎలా వుంటుంది? ఛార్లెస్ కి ఐడియా అయితే వచ్చింది కాని ఎలా? అప్పటినుంచి బ్రెడ్ ని సరిగ్గా కాల్చే పరికరం కోసం కొన్ని నెలలపాటు అహర్నిశలు శ్రమించాడు. చాలా డబ్బు ఖర్చయింది. కాని ఫలితం కనిపించలేదు. చెప్పానుగా ఒక సాధారణమైన వాడైతే నిస్పృహతో దాన్ని వదిలేసేవాడు. ఛార్లెస్ పట్టుదల వున్నవాడు. అతనికి తెలుసు ఆ పరికరాన్ని అంటూ కనుక్కోగలిగితే అదే తనకు మిలియన్స్ సంపాదించి పెడుతుందని. అందుకే పట్టు విడవకుండా కొన్నాళ్ళకు ఎలాగైతేనేం ఆ పరికరాన్ని కనుగొనగలిగాడు.

    అదే 'ఆటోమేటిక్ టోస్టర్' ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో అనూహ్యంగా క్లిక్ అయింది. దాంతో భారీ ఎత్తున ఆటోమేటిక్ టోస్టర్స్ తయారుచేసి కోట్లు సంపాదించగలిగాడు..."

    ఆమె చెప్పడం ఆపి చూపులువేలితో నుదుటిని రాసుకుంటూ వుండిపోయింది.

    ఒక్కొక్క ఇన్సిడెంట్ త్రినాధ్ లో సరికొత్త ఉత్సాహాన్ని, పట్టుదలను ఇనుమ డింప చేస్తోంది.

    తిరిగి ఆమె చెప్పడం కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. 

    "అమెరికాలో వేల్ యూనివర్శిటీలో హెన్రీటాన్, బ్రిటన్ హెడ్డెన్ అనే ఇద్దరు విద్యార్ధులు సామాజిక స్పృహ బాగా వున్నవాళ్ళు. వారికి ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమయిన సంఘటనల్ని తెలుసుకోవాలని ఉత్సాహంగా వుండేది. కాని ఎలా? దినపత్రికలు సాధారణంగా ఆయా దేశాలకే పరిమితమైన వార్తలు ఇస్తుంటాయి. బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్స్ కూడా అంతంత మాత్రంగానే విదేశీ వార్తలు అందిస్తుంటాయి.

    అలా మొదలైన వారి ఆలోచనలు పదునుతేలాయి. ఇద్దరూ కాస్తో కూస్తో వున్నవాళ్ళే. బ్రీఫ్ గా, క్లియర్ గా ఏ వారానికావారం ప్రపంచ వ్యాప్తంగా వార్తల్ని అందించగలిగితే ఆ బిజినెస్ క్లిక్ అవుతుంది. బహుశా మనలాగే ఇతర దేశాల్లో కూడా వార్తలు తెలుసుకునేందుకు తహతహలాడుతుంటారు అని యోచించి విద్యార్ధులుగా వుండగానే తమ తల్లిదండ్రుల్ని ఒప్పించి ఒక పత్రికను ప్రారంభించారు.

    To keep a person constantly well inforamed.

    ఇదే వారి మోటివ్.

    వారు ప్రారంభించిన పత్రిక పేరు 'టైమ్' (TIME) దాన్నివాళ్ళు 1898లో ప్రారంభించారు. అదీనాడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ న్యూస్ మేగజైన్. ప్రస్తుతం ఎనిమిది లక్షలకు పైగా సర్క్యులేషన్ తో అది దిగ్విజయంగా నడుస్తోంది. దాదాపు 120 దేశాలలో ఇది అమ్ముడుపోతోంది.

    పచ్చళ్ళ వ్యాపారం ఎలా ప్రారంభించబడిందో తెలుసా?

    ఢిల్లీలో ఓ పోష్ లొకాలిటీ వెనుక ప్రాంతంలో ఒక గృహిణి పచ్చళ్ళు పెట్టడంలో గొప్ప ప్రావీణ్యత సాధించింది. ఒకరోజు కొత్తగా పెళ్ళి చేసుకున్న ఒక యువతి ఈమె ఇంటికి అతిధిగా వచ్చింది. ఆ సందర్భంలో ఆమె తను తయారుచేసిన పచ్చళ్ళను వడ్డించింది. ఆ యువతి వాటి రుచికి తన్మయురాలై మరీ మరీ వడ్డించుకుని తింది.

    ఆ యువతి వెళుతూ వెళుతూ 'నాకు సరిగ్గా కూరలు వండడమే రాదు. ఇలా అతి రుచిగా పచ్చళ్ళు తయారుచేయడం అసలు నాకే కాదు, నా జనరేషన్ కి సంబంధించిన ఏ యువతికీ వచ్చి వుండదు' అని అంది.

    ఆ యువతి మరుసటి రోజే మరలా వచ్చి కొంచెం పచ్చళ్ళు పెట్టమని బిడియపడుతూ అడిగింది- కొంత డబ్బు కూడా తీసుకోమంది. అప్పుడా గృహిణికి ఫ్లాష్ లా వచ్చింది ఓ ఐడియా.

    చాలామంది ఆడ, మగ ఉద్యోగాల్లో చేరడంతో వంట వండేందుకు వారికి టైమ్ సరిపోవడం లేదు. రెడీగా పచ్చళ్ళు వుంటే వారికి టైమ్ కలిసి వస్తుంది. పైగా తాజా కూరగాయలు సంవత్సర కాలంపాటు సమృద్ధిగా దొరికే అవకాశం కూడా లేదు.

 Previous Page Next Page