Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 33

                                                 22
   
    "మీరొకసారి బయటికెళతారా?" చౌదరినీ, రమణమూర్తినీ చూస్తూ అన్నాడు డాక్టర్ హేమచంద్ర.
   
    ఇద్దరూ గదిలోనుంచి బయటికొచ్చారు.
   
    లాబ్ లో కూర్చొని వున్న సుధా, విమలా వాళ్ళని చూసి ఆదుర్దాగా లేచి నిల్చున్నారు.
   
    "డాక్టర్ గారేమన్నారు అంకుల్?" రమణమూర్తి ని అడిగింది విమల.
   
    "ఇంకా ఏమీ చెప్పలేదు. కృష్ణతో ఒంటరిగా మాట్లాదాలనుకుంటున్నాడేమో మమ్మలిని  బయటికెళ్ళమన్నాడు."
   
    "ఇంకా ఏమేమి చెప్తాడో డాక్టర్ గారితో?" దిగులుగ అంది విమల.
   
    "ఇంకా ఏం చెబుతాడమ్మా? ఆ బుర్రలో తొలుస్తున్నదేదో మన ముందే చెప్తున్నాడుగా?" అన్నాడు చౌదరి.
   
    "అంకుల్! నాకేమిటో భయంగా వుంది. ఆయనేమైపోతారో?" కళ్ళనీళ్ళపర్యంతమై అంది సుధ.
   
    "డాక్టర్ హేమచంద్ర చాలా సమర్ధుగానే కనిపిస్తున్నాడమ్మా. కృష్ణను త్వరలోనే మామూలు మనిషిని చేస్తాడని నాకు నమ్మకంగ వుంది" చౌదరి సుధ తల నిమురుతూ అన్నాడు.
   
    "చౌదరీ! కృష్ణనిక్కడే ఉంచేద్దామనుకుంటున్నాను. జబ్బు నయమాఎవరకూ డాక్టర్ గారి కేర్ లోనే ఉంచుదామని వుంది" అని చౌదరి అభిప్రాయంకోసం ఎదురుచూశాడు మూర్తి.
   
    "నాకూ అలాగే అన్పిస్తూంది. అదే మంచిదేమో! కృష్ణకు పూర్తిగా నయమయేదాకా విమలకూడా శెలవుపెట్టి సుధకు తోడుగా వుంటుంది. ఆసుపత్రిలో ఎవరో ఒకరు కృష్ణదగ్గిర వుండటం మంచిది. నువ్వూ నేనూ అంకుల్ కు పనికిరాము. మనల్ని చూస్తేనే ఉగ్రుడైపోతున్నాడు!"
   
    "నిజమే! డాక్టర్ తో మాట్లాడి ఇక్కడే అడ్మిట్ చేద్దాం!" రమణ మూర్తి విమలవైపు తిరిగి "విమ్మీ! రాత్రి ఇంటికి చేరగానే శెలవు అడుగుతూ ఫోనోగ్రాం ఇచ్చెయ్యమ్మా!" అన్నాడు.
   
    "అలాగే అంకుల్! ఒక వారం శెలవు పెట్టమంటారా?"
   
    "వారంలో ఏమౌతుందమ్మా? ముందు రెండువారాలు పెట్టు. తర్వాత చూసుకుందాం!" అన్నాడాయన.
   
    "ఓ అర్ధగంటతర్వాత బాయ్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారని రమణ మూర్తితో చెప్పాడు.
   
    లోపలకెళ్ళిన రమణమూర్తి అక్కడ కృష్ణ కనపడకపోవడంతో గాభరాపడ్డాడు.
   
    "కృష్ణ ఎక్కడా?" అంటూ ఆదుర్దాగా అడిగాడు.
   
    "సైకోలాబ్ లో వున్నాడు టెస్ట్ ఎరేంజ్ చేస్తున్నారు" డాక్టర్ చెప్పాడు.
   
    "మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్? అతని కండిషన్ ఎలావుంది?" రమణమూర్తి అడిగాడు.
   
    "కేస్ యీజ్ నాట్ దట్ బాడ్! మీరూహిస్తున్నంత ప్రమాదకరంగ మాత్రంలేదు. రెండుమూడు టెస్టులు చెయ్యాల్సివుంది. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రావాలి."
   
    "మీ ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసి చికిత్సచేస్తే బాగుంటుందనుకుంటున్నాను."
   
    "ఇన్ పేషెంటుగ అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం నాకేమీ కనిపించడంలేదు. ఏం? ఇంటిదగ్గిర వైలెంటుగ ప్రవర్తిస్తున్నాడా?"
   
    "అంత వైలెంటుగ ఏమీలేదుకాని-ఏదేదో వాగుతూ చాలా గొడవ చేస్తున్నాడు. హాస్పటల్లో ఉంచడం మంచిదనుకుంటున్నాను డాక్టర్."
   
    "అలాగే! నాకు అభ్యంతరంలేదు. మీకు ఇబ్బంది అవుతుందేమో నని...."
   
    "ఎవరో ఒకరు కృష్ణను కనిపెట్టుకొనే వుంటారు. స్పెషల్ రూమ్ చూసి ఇవ్వండి."
   
    "నో ప్రోబ్లమ్!"
   
    అంటూ వెంటనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు ఫోన్ చేసి చెప్పాడు  హేమచంద్ర.
   
    ముందున్న ఫైల్ చూసుకొంటూ, మధ్యలో ఆగి డాక్టర్ హేమచంద్ర అడిగాడు.
   
    "రమణమూర్తిగారూ? పెళ్ళయిన మొదట్లో కృష్ణలో ఏదైనా అబ్ నార్మాలిటీ__చిన్న చిన్న విషయాల్లోనైనాసరే ఉన్నట్లు మీకు కనిపించిందా?"
   
    "నో! నో! నథింగ్! చాలా క్వయట్ అండ్ కామ్ గా ఉండేవాడు. మద్రాసునించి తిరిగొచ్చేకే ఇలా మొదలుపెట్టాడు."
   
    "అంటే మద్రాసులో వుండగా ఏదో జరిగి వుంటుందని మనం ఊహించుకోవచ్చును. కృష్ణ గతాన్ని గుర్తుచేసే మనుషులుకానీ, వస్తువులు కానీ, ప్రదేశాలుకానీ తటస్థపడి వుండొచ్చు, లేదా అలాంటి సంఘటనలే ఏవైనా జరిగి వుండొచ్చు."
   
    "అంటే మీ ఉద్దేశ్యం అతను చెబుతున్న జగన్మోహన్ రావు అనే అతను ఒకడున్నాడంటారా?"
   
    "అని నేనన్నానా?" అని బిగ్గరగా నవ్వాడు డాక్టర్.
   
    "ఇంకా డేటా కలెక్షన్ పూర్తికాలేదు. మానసిక రుగ్మతలను గుర్తించడం ఉన్నపాటున సాధ్యంకాదు. ఒక్కొక్క మనిషి మనసు ఒక ప్రపంచం. అందులో కోట్లాది భావ ప్రకంపనాలూ, సంచలనలూ ఉద్బవించి, కరిగిపోతూంటాయి మరుక్షణంలో అందుకని సైకలాజికల్ కేసుల్లో త్వరపడి నిర్ణయాలు తీసుకోలేము. వ్యాధికి మూలం ఫలానా అని వెంటనే చెప్పలేము. పోతే నాకీ విషయం చెప్పండి" అంటూ డాక్టర్ ఫయిల్ మూసి పక్కన పెట్టాడు.
   
    "వివాహానికి ముందు కృష్ణ తెలుసా?"
   
    "తెలియదు డాక్టర్."
   
    "సంబంధమెలా కుదిరింది?"
   
    "మా పినతండ్రి బావమర్ధికి దూరపు బంధువు ఒకాయన ఈ సంబంధం తెచ్చాడు. నేనప్పుడు ఢిల్లీలో వున్నాను. హైదరాబాద్ కు వచ్చి, మా బంధువును తీసుకొని కృష్ణని ఆఫీసులోనే కలుసుకున్నాను, కుర్రాడు నమ్రతగా కన్పించాడు. అందం చందం ఫర్వాలేదు. ఉద్యోగమూ మంచిదే. ఫుల్ వుంటే పైకొచ్చే అవకాశాలున్నాయి. తల్లిదండ్రులు అప్పటికేపోయారు. అతనికి ఓ అన్న ఉన్నాడట. అతను డాక్టర్. అమెరికాలో సెటిల్ అయ్యాడు. పెళ్ళికికూడా రాలేదు."
   
    "ఒక్కనిముషం ఆగండి" అని డాక్టర్ ఫయిల్ తెరిచి ఏదో రాసుకున్నాడు.
   
    "కృష్ణనిగురించి మరి చౌదరిగారిని ఎందుకడగలేదూ?"
   
    "చౌదరి అప్పుడు ఆఫీసులో లేడు. ఇక్కడ ఈ లాబ్ లో చేరి ఆరునెలలుకూడా కాలేదు. చౌదరి ఇక్కడ చేరినట్టుగా నాకు తెలియదు."
   
    "దట్సాల్ రైట్! మరో విషయం మీరిస్తానన్న కట్నం పూర్తిగా ఇచ్చారా?"
   
    "అలాంటిదేమీలేదు. అసలతను కట్నం అడగనేలేదు. ఇప్పుడు వాళ్ళుంటున్న ఇల్లు నేనే కొనిచ్చాను."
   
    "ఎవరి పేరుమీద ఉందా యిల్లు?"
   
    "సుధ పేరుమీదనే వుంది. పిచ్చి నటించి సుధను వదిలించుకొంటే అతనికి వచ్చేదేమీ లేదు."
   
    "నో! నో! నాట్ ఫర్ దట్! జస్ట్ క్యాజువల్ గ అడిగాను. మీరు పోలీసాఫీసారుగా? అందుకే చాలాదూరం ఆలోచించారు. అఫ్ కోర్స్ అలాంటి కేసులు మీ దృష్టికి వచ్చేవుంటాయి."
   
    రమణమూర్తి గుబురు మీసాలు కదిలాయి. సన్నగా నవ్వాడు.
   
    "పోలీసు టార్చర్ ఎప్పుడైనా కృష్ణ చూశాడా?"
   
    "వాడ్డూయూ మీన్ డాక్టర్?" రమణమూర్తి కంఠం కటువుగా ఉంది.
   
    "టేకిట్ ఈజీ సర్! మీరు మీ అల్లుడిని టార్చర్ చేశారనడం లేదు లేక మీరే స్వయంగా ఖైదీలను టార్చర్ చేశారనీ అనడంలేదుసార్. మీ అల్లుడు పోలీసు టార్చరుగురించి పేపర్లలో చదివే వుంటాడు. పోలీసాఫీసారు మామగారు కావడంవల్ల అతనికి స్వయంగా చూసే అవకాశం ఏమన్నా కలిగిందేమోనని అడుగుతున్నాను."
   
    "అలాంటిదేమీ లేదు" తడిపొడిగా అన్నాడు రమణమూర్తి.
   
    "ఈ కేసు విశ్లేషణలో అవసరమైన విషయమనే అడిగాను. మరేమీ అనుకోకండి. మామగారు పోలీసాఫీసరైతే అల్లుడు కాంప్లెక్సుకు గురికావచ్చు. అది కొంతమందిలో సుపీరియారిటీ కాంప్లెక్సుకు గురికావచ్చు. అది కొంతమందిలో సుపీరియారిటీ కాంప్లెక్సుగానూ, మరికొంత మందిలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు గానూ వుండిపోవచ్చు. పోలీసాఫీసరు కూతురికి మొగుడ్ని అనే భావన__లేక పోలీసువాని కూతురనన్న అహంకారం భార్యలో చూసినప్పుడు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సుకు అల్లుడు గురికావచ్చు. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయని చెప్పడంలేదు. జరగడానికి అవకాశాలున్నాయని మాత్రమే చెబుతున్నాను. ప్రాబబుల్స్ మాత్రమే జన్మతహా, బాల్య, కౌమారదశలో, ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సంఘటనల ద్వారా మనసులో నాటుకుపోయే బలహీనతలు, యవ్వన, వృద్దాప్యదశల్లో కొన్ని సందర్భాల్లో__" ఆగి తలెత్తి చూశాడు డాక్టర్ లోపలకు వస్తున్న చౌదరిని చూసి.
   
    "కమాన్ డాక్టర్ చౌదరీ! మీకుకూడా కొద్దిగా ట్రబుల్ యివ్వక తప్పలేదు."

 Previous Page Next Page