Previous Page Next Page 
అభయారణ్యం పేజి 32


    అతనికి కాఫీ కప్పు అందించి అభిముఖంగా మరో సోఫాలో కూర్చుని "ఇప్పుడు చెప్పండి" అందామె.

    చాలాసేపటి సంశయం తర్వాత అన్నాడు  "వారం క్రితం ధీర ఇంటి నుంచి బయల్దేరింది. దయాకర్ గారి చెల్లి పెళ్ళని చెప్పింది. రెండు రోజుల్లో తిరిగివస్తానంది ఇంతవరకూ రాలేదు. మీకు తెలిసి వుంటుందేమో అని."

    ఆమెకి ముచ్చెమటలు పోశాయి.

    ధీర నిజానికి రెండు రోజుల్లోనే బయల్దేరి వెళ్ళిపోయిందే......

    ఇంతవరకూ వైజాగ్ ఎందుకు చేరలేదు?

    ఏమైంది?

    ఇప్పుడేం చెప్పాలి?

    "దయాకర్ గారి ఇంటికి వెళ్ళాను...... అడ్రసు ధీర డైరీలో వుంది" తల వంచుకున్నాడు శ్యాం" ఆయన కూడా వూరెళ్లారట."

    ఆమెకి ముచ్చెమటలు పోశాయి.

    "అంటే ధీర, దయాకర్ లు మరేదో వూరెళ్ళి......" అంతకు మించి ఆలోచించలేకపోయింది ఆమె.

    "అసలు ఆ ఇంట్లో పెళ్లయిన వాతావరణం కనిపించలేదు ఆర్తిగారూ! కానీ ధీర వచ్చింది దయాకర్ గారి చెల్లి పెళ్ళికని......."

    "బహుశా......" ఆమె అనేసింది అసంకల్పితంగా "సరళ వాళ్ళూరు వెళ్ళిందేమో..... మీకు తెలుసుగా? మా క్లాస్ మేట్ సరళ ప్రస్తుతం నిజామాబాద్ లో వుంటోంది."

    ధీర మీద అభిమానంతో కాదు, శ్యాం లాంటి అమాయకుడ్ని తాత్కాలికంగానైనా బుజ్జగించాలని అబద్ధం చెప్పింది ఆర్తి.

    "వెళితే మీకు చెప్పేదిగా?"

    "అవును" ఆమె తొట్రుపడింది. "కానీ ధీర సంగతి మీకు తెలుసుగా. క్షణాల్లో అభిప్రాయం మార్చేసుకోగలదు. బహుశా స్టేషన్ కి వెళ్లాక ఎలాగూ ఇంతదూరం వచ్చాం కదా అని సరళ దగ్గరికి బయలుదేరి వుంటుంది."

    "అదే నిజమైతే నేను అదృష్టవంతుడ్ని ఆర్తిగారూ!" శ్యాం గొంతు దీనంగా పలికింది. "కానీ...."

    ఎందుకు ఆగాడు?

    ఏం చెప్పాలని?

    దయాకర్ తో కలిసి వెళ్ళిందని అనుమానిస్తున్నాడా?

    అసలు ఆ ఇద్దరికీ సంబంధం వుందని తెలిస్తే తట్టుకోగలడా?

    "తప్పకుండా ధీర సరళ దగ్గరికి వెళ్ళుంటుంది శ్యాంగారూ! మీరు కంగారుపడకండి."

    అప్పుడు చూసింది ఆర్తి-

    శ్యాం కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

    ఒక మగాడు అంత సులభంగా కంటతడి పెట్టుకోగలడని ఆమెకి తెలీదు.

    మనసు ద్రవించిందేమో ఆందోళనగా అంది ఆమె "అరె..... చిన్న పిల్లాడిలా ఆ కన్నీళ్ళేమిటి? ధీర తప్పకుండా తిరిగి వస్తుంది."

    "మీకు చెప్పిందా?"

    ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

    "ధీరకి నాకన్నా దయాకర్ గారంటే చాలా యిష్టం ఆర్తిగారూ."

    ఆమె గుండె ఝల్లుమంది.

    "ఇష్టం మాత్రమే కాదు, ప్రాణం. అందుకే నన్ను మరో పెళ్ళి చేసుకో బావా అని రెండు మూడుసార్లు అంది. కానీ నాకేమో ధీరంటే......"

    అర్థోక్తిగా అంది ఆమె "మీరు ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారు."

    "లేదు. నిజం తెలిసే మాట్లాడుతున్నాను" తల వంచుకుని అన్నాడు "దయాకర్ గారు ధీరకి రాసిన ఉత్తరాలన్నీ చదివాను. ఇద్దరికీ చాల సంబంధము వుంది."

    ఎండిపోతున్న గుండెల మొక్కల్ని ఇంకా ఏ ఆశలతోనో పండించుకోవాలని ప్రయత్నిస్తూన్న అతన్ని చూస్తూ అవాక్కయిపోయింది ఆమె.

    ఇద్దరికీ సంబంధం ఉందని తెలిసీ యింకా శ్యాం ఆమెతో బంధంకోసం వెంపర్లాడుతున్నాడా?

    ఒక చిన్న అనుమానం మొదలైన దానికే కట్టుకున్న భార్యని పురుషత్వపు గోళ్ళతో రక్కి, నరాలను కాల్చుకుతినే వారసత్వంతో రెచ్చిపోవాల్సిన మగజాతిలోని ఓ భర్త ఇంత సహనాన్ని పాటించి మాట్లాడుతున్నాడా?

    తప్పు చేయని సీతని అగ్ని పునీత కమ్మని శాసించిన రాముడుకన్నా ఉన్నతుడిలా..... అస్తవ్యస్తమైన దాంపత్య జీవితాన్ని యింత జరిగినా ఇంకా చక్కదిద్దుకోవాలన్న మహోన్నతుడిలా యింతటి సంయమనాన్ని పాటిస్తున్నాడేం?

    అసలు యిది సాధ్యమయ్యేదేనా?

    ధీర మీద ప్రేమ ఉండొచ్చు.

    కానీ ఇంతటి క్షమాగుణం ఎలా సాధ్యం?

    "ధీర ఒట్టి అమాయకురాలు ఆర్తిగారూ! తొందరపాటుతో తనకు తాను అన్యాయం చేసుకుంటుందని భయంగా ఉంది."

    ఎంతటి ఋష్యత్వం అడడిలో.....

    దేనికైనా తెగించే సాహసం గల ధీర తప్పుకి కొత్త రంగుల్ని పులిమి ఆమెని అమాయకురాలిగా ఆలోచిస్తున్నాడు. మకిలి చీకట్లో నిలబడి కనిపించని ఏ వెలుగురేఖల మరీచికల కోసమో ఆరాటపడే ధీరలో ఇంకా మంచితనాన్ని దర్శించాలని ప్రయత్నిస్తున్నాడు.

    అన్ని విధాలా అర్హురాలైన ఆడదాని జీవితాన్ని నిరాశల ఉరికొయ్యలకి బిగించి ఆడుకోగల పురుష స్వామ్య వ్యవస్థలో నేనూ ఒకడ్ని కాలేనని, ఒక తల్లి రొమ్ము పాలంత స్వచ్ఛతతో పతితని పుణ్యవతిగా భావించి యింకా ఆదుకోవాలనుకుంటున్నాడు.

    "మీరైనా నచ్చచెప్పండి ఆర్తీ! ధీరకి మీరంటే చాలా యిష్టం. మీ మాట వింటుంది."

    "అయినా......" అసహనంగా అంది ఆర్తి "మీకు తెలిసిందంతా నిజమే అయితే ధీరని మీరెలా క్షమించగలుగుతున్నారు? ఆమెని వదిలి ఇంకో పెళ్ళి చేసుకోవచ్చుగా?"
 

 Previous Page Next Page