Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 33

    "అది కాదురా...ఆడది మగాణ్ణి ఎలా రేప్ చేస్తుందిరా-మగవాడి ప్రమేయం లేకుండా...ఈజిట్ పాజిబుల్....?" అన్నాడు పీటర్.
   
    "ఒరేయ్ ఇడియట్....వాత్సాయనుడి కామసూత్రాలు నువ్వెప్పుడయినా చదివావా-? ఉపరతి అనే ప్రక్రియ... స్త్రీకి మాత్రమే ఉద్దేశించబడినది.
   
    భార్యాభర్తలు కానీ, ప్రీయసీ, ప్రియులు కానీ, జరిపే సున్నితమయిన లైంగిక ప్రక్రియను ఉపరతి అంటారు. అంటే.... ఈ ప్రక్రియలో స్త్రీ తీసుకునే చొరవే ఎక్కువగా వుంటుంది.
   
    మగవాడి ఇష్టం లేకుండా, స్త్రీ జరిపే ఈ ప్రక్రియనే ఆడది జరిపే 'రేప్' అనొచ్చు- ఏమంటావ్..... మనోహర్.... నీ విషయంలో ఇలాగే జరిగిందా?" శాస్త్రులు అనే ఫ్రెండ్ అన్నాడు.
   
    దాదాపు అంతే-" అన్నాడు మనోహర్.
   
    "ఆ మాయాదేవి కోటీశ్వరురాలు. ఆ అమ్మాయి కోరుకుంటే నీలాంటి కుర్రాళ్ళు వందమంది దొరుకుతారు. నిన్ను కాలేజీ రోజుల్నుంచీ ప్రేమించింది, ఇష్టపడింది. నిన్ను సెక్సువల్ డిజైర్ తీర్చమని అడిగింది. తీర్చేసి, రహస్యంగా ఆ కాంట్రాక్టును అలా కొనసాగిస్తే పోలా...ఎంత మందికి లేవు....ఇల్లీగల్ కాంటాక్ట్స్? మా ఆఫీసులో పనిచేసే ఆరుగురు అమ్మాయిల్లో అయిదుగురితో నాకు కాంటాక్ట్స్ వున్నాయి...." అన్నాడు పీటర్.
   
    "అయిదుగురితోనా....! ఆరో అమ్మాయితో ఎందుకు లేదో..." ఆశ్చర్యంగా అడిగాడు రెహమాన్.
   
    "ఆరోది నా పెళ్ళాం కాబట్టి" చెప్పాడు పీటర్.
   
    అందరూ పెద్ద పెట్టున నవ్వారు ఆ మాటలకి.
   
    "ఒరేయ్....మనోహర్...నాకో ధర్మసందేహం. అందరూ రహస్యంగా దాచిపెట్టకుండా కోర్టులో కేసు వేశావు. నువ్వొక 'సినిక్' వని అందరూ అనుకుంటున్నారు తెలుసా?" మందలిస్తున్నట్టుగా అన్నాడు పటేల్.
   
    "నేనొక సినిక్ నని నువ్వనుకోవచ్చు. పేపర్స్ కూడా రాయొచ్చు. అందరూ ఈ విషయంలో నావేపు అనుమానంగా చూడొచ్చు. కానీ మన దేశంలో 'లా'కి ఒక ఆకృతిని ఇచ్చిందెవరు.....బ్రిటిషర్లు...దాదాపు మూడు వందల సంవత్సరాలక్రితం ఇప్పటి చట్టానికి రూపకల్పన జరిగింది. అప్పట్లో చట్ట నిర్మాణ కర్తల అభిప్రాయం ఏమిటి? మీకు తెలుసా?" సీరియస్ గా అడిగాడు మనోహర్.
   
    "తెలీదు" అన్నాడు శాస్త్రులు.
   
    "నేరాలు పురుషులు మాత్రమే చేస్తారనీ....ఒకవేళ స్త్రీ నేరంచేస్తే, జాలి తలచి వదలివేయాలని....స్త్రీ ఏ రకంగా నేరం చేసినా, అది నేరం కాదన్నది అప్పటి చట్ట నిర్మాణ కర్తల అభిప్రాయం...." చెప్పాడు మనోహర్.
   
    "అప్పుడు ఈ గవర్నమెంట్ లు, గందరగోళాలూ వుండేవి కాదు. రాజ్యాలు, రాణులు....ఆ తరువాత దొరలు, దొరసానులు, రాణులు తమకిష్టమైన బానిసలతో అక్రమసంబంధా లేర్పర్చుకుని, తరువాత వాళ్ళని చంపించేవాళ్ళు....అలాగే దొరసానులు....ఇండియాకు ఈస్టిండియా కంపెనీ కొచ్చిన ఇంగ్లీషు దొరలు మన ఇండియన్ లేడీస్ చుట్టూ తిరిగితే, దొరసానులు ఇండియన్ కంట్రీమెన్స్ చుట్టూ తిరిగారన్నదానికి, చరిత్రలోనే చాలా సాక్ష్యాలున్నాయి.
   
    ఇవన్నీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కాదా? మరి ఎవరికి, ఎందుకు శిక్ష పడలేదు?" శాస్త్రులు అడిగాడు.
   
    "చట్టం వాళ్ళ చేతుల్లో వుంది కాబట్టి....పోలీసువాడు చేసే దొంగతనం బయటపడదు కాబట్టి, పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా వున్నప్పుడు దాదాపు ఆరువేలకోట్లు అక్రమార్జన చేశాడని ఆరోపణలు వచ్చాయి. హర్షద్ మెహతా మీద అదే స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వీళ్ళమీదా కేసులు నమోదయ్యాయి. ఎక్కడైనా రుజువైందా? ఆ కేసు లేమయ్యాయో ఎవరికీ తెలీదు.
   
    ఇలాంటి సంఘటనలు కొన్ని వేలున్నాయి.
   
    అలాంటప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో, ఎన్నివేల దుర్మార్గాలు జరిగి వుంటాయో వూహించు. వీటికి ఎవడు జవాబుదారు? ఏది ఇల్లీగల్, ఏది లీగల్? అన్నదానికే సరయిన డెఫినెషన్ ఇచ్చుకోలేని పరిస్థితి మనది" చెప్పాడు మనోహర్.
   
    "ఇంతకీ నువ్వేమంటావ్?" అడిగాడు పీటర్.
   
    "మీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను....వినండి....అలహాబాదులో ఇందిరా ప్రియదర్శిని....అంటే ఇందిరాగాంధీ కాక పూర్వం అన్నమాట...కాలేజీలో చదువుకున్న రోజుల్లో....అప్పుడావిడ అమ్మాయి కదా. ఓ అబ్బాయి ప్రేమించాడు. రోజూ కాలేజీకి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు వెంటపడేవాడు. ధైర్యంచేసి లవ్ లెటర్స్ కూడా రాశాడు" గ్లాసులోని కూల్ డ్రింక్ ను తాగడానికి ఒక్క క్షణం ఆగాడు మనోహర్.
   
    "ఇందిరాగాంధీకి లవ్ లెటర్సా? నేనెప్పుడూ వినలేదే....వెరీ ఇంట్రెస్టింగ్....నీ కేసుకన్నా ఈ కేసు బావుంది" అన్నాడు శాస్త్రులు.
   
    "చూసి-చూసి ఇందిరాగాంధీ ఓ పని చేసింది."
   
    "ఇంటి పిలిచి, పోలీసులతో కొట్టించేసిందా?" అడిగాడు పీటర్ ఆతృతగా.
   
    "ఓ సాయంపూట ఇంటికి పిలిచింది. నేచురల్ గా ఆ కుర్రాడు భయపడిపోయాడు. అయినా సరే ధైర్యంగా వెళ్ళాడు. ఇందిర స్వయంగా అతనికి టీ ఆఫర్ చేసింది.
   
    అప్పుడతడిని ఇలా అడిగింది.
   
    "చూడు మిస్టర్! నువ్వు నన్నెందుకు ప్రేమిస్తున్నావు?"
   
    "తెలీదు."
   
    "దేనికి ప్రేమిస్తున్నావు?"
   
    "తెలీదు."
   
    "ఎందుకు లెటర్ రాశావు?"
   
    "ప్రేమిస్తున్నాను కాబట్టి."
   
    "ప్రేమంటే ఏమిటి?"
   
    "తెలీదు."

 Previous Page Next Page