"చూడు మిస్టర్! ముందు ప్రేమకు డెఫినెషన్ తెలుసుకో! తరువాత నన్ను ప్రేమించు" అన్నదట ఇందిర.
ఆ కుర్రాడు నిరాశగా వెళ్ళిపోయాడు చెప్పాడు మనోహర్.
"తరువాతేం జరిగింది?" ఆసక్తిగా అడిగాడు రెహమాన్.
మిగతా వాళ్ళలో కూడా అదే ఉత్సుకత.
"ఇందిరా, ఫిరోజ్ ల పెళ్ళప్పుడు అతగాడు ఓ 'గిఫ్ట్' ను తెచ్చి ఇందిరాగాంధి చేతిలో పెట్టాడు. అప్పుడు ఇందిరాగాంధీ-
"ప్రేమంటే ఏమిటో ఇన్నేళ్ళకయినా తెలిసిందా?" అని మళ్ళీ అడిగింది నవ్వుతూ.
"తెలిసింది" అన్నాడతను.
"ఏమిటి తెలుసుకున్నావ్?" అడిగింది ఇందిర.
"ప్రేమంటే....ఆకర్షణ...వ్యామోహం కాదని...." జవాబిచ్చాడతను.
అప్పుడు ఇందిరా నవ్వేసి వూరుకుందట" చెప్పి కూల్ డ్రింక్ బాటిల్ ని అందుకున్నాడు మనోహర్.
"మరి ప్రేమంటే ఏమిటట?" అడిగాడు పీటర్.
అలనాటి కాళిదాసు దగ్గరనుంచీ, నేటి ఆధునిక కవి వరకూ ప్రేమగురించి అందంగా వర్ణించి చెప్పారు తప్ప, దానిని శాస్త్రీయంగా చెప్పటానికి వాళ్ళు ప్రయత్నం చెయ్యలేదు.
ఎందుకంటే వూహలతోను, ఊహాగానాలతోను మన సాహిత్యం నిండి వుంది కనుక. ఏ సాహిత్యానికయినా, సైంటిఫిక్ అవుట్ లుక్ వుండాలి. సీరియస్ లిటరేచర్ కు గానీ, కమర్షియల్ లిటరేచర్ కు గానీ శాస్త్రీయ అవగాహనే పునాది.
ఎన్నో పరిశోధనల అనంతరం విదేశీ సైంటిస్టులుగానీ, సైకాలజిస్టులు చెప్పిన విషయం ఏంటంటే-
'లవ్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్' అని.
వయోభేదం దృష్ట్యా ఆ కెమికల్ రియాక్షన్ మారే స్థాయి బట్టి బాల్యప్రేమ, యవ్వన ప్రేమ, వృద్దాప్యపు ప్రేమ, దంపతుల ప్రేమ, ప్రేమికుల ప్రేమ....ఇలా రకరకాలుగా ప్రేమలుంటాయి" సైంటిఫిక్ గా లవ్ ని నిర్వచించాడు మనోహర్.
"ఒరేయ్....మనోహర్! నువ్వు సైంటిఫిక్ గా చెప్పినా, ఫిలాసఫి కల్ గా చెప్పినా, కామన్ మెన్ దృష్టిలో ప్రేమంటే సెక్సే! మేటర్ ఆఫ్ సెవెన్ మినిట్స్....అయిపోయిందేదో అయిపోయింది. తప్పు ఎవరిదో ఒకరిది.....వదిలెయ్....ఇద్దరూ కాంప్రమైజ్ అయిపోండి.
ఆ మాయాదేవిని పెళ్ళి చేసుకో! ఏ అమెరికానో వెళ్ళిపోయి, హాయిగా వుండు....ఇదీ నా సలహా" శాస్త్రులు అభిమానంగా అన్నాడు.
"ఈ విషయంలో నేనెవరి మాటా వినదలుచుకోలేదు. బాటిల్ పూర్తయింది. పదండి పోదాం" అన్నాడు మనోహర్.
'ఆడదాని విషయంలో మగవాడికింత పట్టుదల ఏమిటి?
మూర్ఖత్వమా? లేక తెలియనితనమా?
రెండూ కాదు....రెండూ కాదు' హీరో హోండా ఎక్కేముందు, తనలో తనే గొణుక్కున్నాడు మనోహర్.
* * * *
సాయంత్రం నాలుగున్నర దాటింది.
కాలేజీలోంచి బయటికొచ్చింది సరోజ.
ఆమె రాకకోసం అప్పటికి గంటనుంచి ఎదురుచూస్తున్నాడు మనోహర్. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఆమెను కలవడం కోసమే, రెండున్నర గంటల బస్సు ప్రయాణం చేసి ఆ వూరొచ్చాడతను.
ఏ పండగకో, పబ్బానికో అలావచ్చి, ఇలా వెళ్ళిపోయే బావ, తన కోసం కాలీజీకి రావడం చాలా ఆశ్చర్యంగా వుంది సరోజకు.
పక్కనున్న స్నేహితురాలితో పాటు మనోహర్ కు ఎదురుగా వచ్చి నిల్చుంది సరోజ.
"మా బావ" అని స్నేహితురాలికి పరిచయం చేసింది సరోజ మనోహర్ ని.
"అంటే....ఆ మాయాదేవి కేసు...." నవ్వుతూ అందామె.
ఆ నవ్వులో వ్యంగ్యం వుంది. ఆ వ్యంగ్యానికి అసహనంగా వుంది మనోహర్ కి.
"నీతో మాట్లాడటానికి వచ్చాను" సీరియస్ గా అన్నాడతను.
"సీ.యూ...." పక్కనున్న ఫ్రెండ్ కి చెప్పేసి "ఇంటికి వెళ్దాం" అందామె. అక్కడ నుంచి మేనమామ ఇంటికెళ్ళాలంటే అరగంట బస్సుప్రయాణం. అంత ఓపిక లేదు మనోహర్ కి
దూరంగా గుడి కనిపిస్తోంది.
"ఆ గుడికెళ్ళి మాట్లాడుకుందాం....పావుగంట తరువాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను" అన్నాడతను.
"నీ ఇష్టం" అందామె.
* * * *
ఊరి శివార్ల లోనున్న గుడి అది. ప్రతి సోమవారంనాడు మాత్రమే అక్కడ సందడిగా వుంటుంది.
గర్భ గుడిలోంచి పూజారి చదువుతున్న మంత్రాలు వినిపిస్తున్నాయి. వాటికి దూరంగా, పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్నారిద్దరూ.
చాలామందికి చిన్నప్పుడు, బాల్యంలో జరిగే చిన్న విషయాలపట్ల ఆసక్తి వుండదు. జ్ఞాపకమూ వుండదు. ఆ చిన్న విషయాలే, ఈనాటి పెద్ద విషయాలకు, జీవితంలోని కొన్ని ముఖ్యమయిన సంఘటనలకు దారి తీస్తాయన్న స్పృహ కూడా వుండదు.
బాల్యాన్ని మరచిపోతే, మన జీవితాన్ని మనం మరిచిపోయినట్లే!
మనోహర్ బాల్యంలో తీపిగుర్తులేం లేవు.
అతనికి ఏడేళ్ళ వయసులో పెద్ద తుఫాను రావడం....ఊళ్ళోని జనంలో ఎక్కువమంది బంధువులు, సన్నిహితులు దారుణంగా చనిపోవడము...పంట చేలగట్ల మీద, చెరువుల్లోనూ, బావుల్లోనూ వాళ్ళ శవాలను దయనీయంగా చూడటం- చనిపోయిన వాళ్ళని తలుచుకుని బతికున్న వాళ్ళు ఏడవటం....ఎందుకో తెలియని ఆ ఏడుపు వెనుక ఆర్ద్రత గురించి కొంచెం తెలిసి అతని కళ్ళు కూడా చెమ్మగిల్లడం....
పండిన పంట, పంట పొలాలు మొత్తం తుఫాను తాకిడికి మాయమైపోతే, ఉన్న ఒక్క ఇల్లూ సగం కూలిపోతే, ఇంట్లో నగలూ, నగదు వరదలో కొట్టుకుపోతే....


