అసలు అతను చెప్తున్నదాంట్లో నిజం లేదు. కాంతారావ్ ప్రస్తుతం మరో అమ్మాయిని పట్టాడు. అందుకని సుశీలను వదుల్చుకోవాలని అతని ప్రయత్నం.
కాంతారావు మాటలు విన్న సుశీల ఘోల్లుమని ఏడ్చింది. రెండు నిముషాల తర్వాత కళ్లు తుడ్చుకుంది.
"పోనీలే కాంతా... ఏనిధంగానూ నిన్ను బలవంతపెట్టి నీకు ఇబ్బంది కలిగించను... నీ ఇష్టం... నువ్వెలా చేద్దామంటే అలా చేద్దాం..." అంది.
"మనం ఇంక విడిపోదాం సుశ్శీ... నీ దారి నీది నా దారి నాది"
"అలాగే..." భారంగా అంది సుశీల.
కాంతారావు బాధని నటిస్తూ లోపల్లోపల సంతోషిస్తూ అక్కడి నుండి పరుగున వెళ్లి వేరే పార్కులో తన కోసం ఎదురుచూస్తున్న సుజాత దగ్గరికి వెళ్ళాడు.
మాటల సందర్భంలో సుజాతతో కాంతారావ్ అన్నాడు.
"సుజ్జా...ఇదివరకు నాకో ఫ్రెండు ఉండేదిలే... సుశీల అనీ... పరమ కోతిలా ఉంటుందనుకో... నా మీద ఆశలు పెట్టుకుంది పాపం... నా మనసు నీదని పాపం డానికి తెలీదు... హిహి..."
"కాంత..." సుజాత కాంతారావ్ గుండెల మీద ఒరిగిపోయింది.
అక్కడ
సుశీల కూడా ఇంటికి గంతులేస్కుంటూ వెళ్ళింది.
కారణం - వారం క్రితం ఆమెకి పెళ్ళిచూపులు జరిగాయ్. అబ్బాయ్ కి సుశీల బాగా నచ్చింది. అతనికి లక్షల కొద్దీ ఆస్తి వుంది. చాలా బాగుంటాడు కూడా.
అమెరికాలో డాక్టరు. పెళ్లయ్యాక సుశీలను తన కూడా అమెరికా తీస్కెళ్ళిపోతాడు. మంచి అవకాశం!
కానీ కాంతారావుని వదుల్చుకోడం ఎలా అని సతమతమైపోతున్న టైంలో అతనే వచ్చి విడిపోదామని అన్నాడు.
ఆ విధంగా సుశీల సమస్య కూడా పరిష్కారం అయ్యింది.
* * *
లేడీ విలన్స్
ఉదయం...
రామారావుకి మెలుకువ వచ్చింది... మెల్లగా కళ్లు తెరిచి గోడ గడియారం వంక చూశాడు.
టైము ఎనిమిది అయ్యింది.
రామారావ్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అరె!... ఏంటబ్బ ఇంత ఒళ్లు తెలీకుండా నిద్రపోయాను? అనుకున్నాడు.
అమ్మో!... త్వరగా తెమలాలి... ఆఫీసుకి టైమైపోతుంది!!...
రామారావ్ ఈ ప్రక్కకి తిరిగి చూశాడు...
మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. కారణం అతని భార్య కమల అతనికంటే ఎక్కువగా ఒళ్లు మరిచి నిద్రపోతూ ఉంది.
"కమలా..."పిలిచాడు రామారావ్.
ఆమెలో చలనం లేదు.
"ఏయ్ కమలా..." ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు.
ఉహు!... అయినా కమలలో చలనం లేదు.
"కమ్ మ్ మ్ లా..." ఆమె భుజం మీద తడ్తూపిలిచాడు.
"రే.......య్"
గట్టిగా అరుస్తూ... రెండు పిడికిళ్లు బిగిస్తూ మంచం మీద లేచి కూర్చుంది కమల.
రామారావ్ బిత్తరపోయి కమల వంక చూశాడు. ఆమె మోహంలో పట్టలేసంత కోపం.
'ఏ.... ఏ.... ఏమైంది కమలా?"
భయం భయంగా చూస్తూ అడిగాడు రామారావ్.
కమల ఓసారి రెప్పలు టపటపా అల్లాడించి రామారావ్ వంక తేరిపార చూసి కిలకిలా నవ్వేసింది.
"ఏంటి?... పిడకలేమైన వచ్చిందా?"
ఆమె నవ్వుని చూసి కాస్త తేరుకుంటూ అడిగాడు రామారావ్.
"అబ్బే... ఏం లేదు..... ఏం లేదు... మీరు మొహం కడుక్కుని న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి... నేను మీకు కాఫీ కలుపుకుని వస్తాను..." అంటూ బెడ్ రూమ్ లోంచి వెళ్లిపోయింది కమల.
* * *
రామారావ్ హాల్లో సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ మధ్య మధ్యలో అసహనంగా వంటింటి గుమ్మంవైపు చూడసాగాడు.
కాఫీ తీసుకొస్తానని ఇందాకనగా చెప్పిన కమల ఇంకా రాదేంటబ్బా?!... వంట గదిలో ఇంతసేపు ఏంచేస్తుంది?...
న్యూస్ పేపర్ పక్కనపెట్టి రామారావ్ వంటగదివైపు అడుగులు వేశాడు.
వంటగది గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసిన రామారావ్ కంటికి ఓ దృశ్యం కనిపించింది.
కమల కాఫీ కప్పులోకి చేతిలోని కాగితంలోంచి ఏదో పొడి వేస్తూంది.
"ఏంటిది?... కాఫీలో ఏం కలుపుతున్నావ్?" అంటూ లోపలికి అడుగుపెడ్తూ కమలని అడిగాడు రామారావ్.
"విషం అని తాపీగా చెప్పింది కమల.
ఆ సమాధానానికి రామారావ్ ఉలిక్కిపడి నేలమీద పడిపోయాడు.
"అయ్యయ్యో... ఏంటి అలా పడిపోయారు?" కంగారుగా అడిగింది కమల.
"ఉలిక్కిపడి పడ్డాను"
"ఏంటో... ఈ మధ్య మీరు ఊర్కూర్కే ఉలిక్కిపడ్టున్నారు... అయినా ఎవరైన మామూలుగా ఉలిక్కిపడ్తారు... మీరేంటి నేలమీద దభేల్ మని పడేంతగా ఉలిక్కిపడ్తున్నారు?... ఊర్కే అతికాకపోతే..." అంటూ రామారావ్ నెత్తిన జల్లకాయ్ కొట్టి జబ్బపట్టి నేలమీంచి లేవదీసింది కమల.
"మరి కాఫీలో ఏదో కలిపితే ఉలిక్కిపడరా?... నేను కాబట్టి ఇలా ఉలిక్కిపడ్డాను... అదే వేరే ఎవరైన అయితే వెల్లకితలా... బొక్క బొర్లా... తలక్రిందులుగా ఇలా రకరకాలుగా ఉలిక్కిపడ్తారు తెల్సా?" బుర్రకాయ్ తడుముకుంటూ అన్నాడు రామారావ్.
"ఆ?!... నేను కాఫీలో కలుపుతున్నావా?..." అయోమయంగా చూస్తూ రామారావ్ ని అడిగింది కమల...
"కాదా మరి?... అదిగో వంటింటి గట్టు మీద మిగిలిన పొడిపెట్టావ్ నువ్వేచూడు..."
"హయ్యో!... సారీనండీ..."
"ఏంటి సారీ... నేను సమయానికి వచ్చి చూడకపోతే నువ్వు దండేసిన నా ఫోటోకి సారీ చెప్పాల్సి "ఉండేది" చిరాకుగా అన్నాడు రామారావ్.
"సర్లెండి... ఇప్పుడే ఒక్క నిముషంలో మళ్లీ వేరే కాఫీ పెట్టి తెస్తా... మీరు వెళ్లి హాల్లో కూర్చుండి."
"వద్దులే... కాఫీ నేనే కలుపుకుంటాను" అంటూ స్టవ్ దగ్గరికి వెళ్లాడు రామారావ్.
* * *
ఆఫీసుకెళ్లడానికి తయారైన రామారావ్ హాల్లో సోఫాలో వంగి కూర్చుని షూ లేసుల్ని కట్టుకోసాగాడు...
నేలమీద... ఏదో నీడ కదలాడింది. అనుమానంగా తలెత్తి చూసిన రామారావ్ ఠారెత్తిపోయాడు.
కమల చేతిలో కత్తి పీట పట్టుకుని అపర కళిలా రౌద్రంగా చూస్తూ రామారావ్ పీక తెగ్గొయ్యడానికి సర్రున పైకెత్తింది!
ఆమె చెయ్యి వేగంగా క్రిందికి దిగే టైములో రామారావ్ "కెవ్ వ్ వ్...." మని అరుస్తూ సోఫాలోంచి నేల మీదికి మూడు పల్టీలు కొట్టాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కత్తిపీట వేటు నుండి తప్పించుకున్నాడు.
"కెవ్వున ఆ కేకలేంటీ ... నేలమీద ఆ పల్టీలేంటీ... ఏం... ప్యాంటులో బొద్దింకేమైన దూరిందా?..." పకపకా నవ్వుతూ అడిగింది కమల.
రామారావ్ నేలమీద మీంచి లేచి పళ్లు కొరుకుతూ కమల వంక చూశాడు.
"బొద్దింక ప్యాంటులో దూరిందా?....ఏం?.... వేళాకోళంగా ఉందా?..." అన్నాడు ఆవేశంతో రొప్పుతూ.
కమల రామారావ్ వంక బిత్తరపోయి చూసింది.
"అదేంటదీ... ఉట్టి పుణ్యానికే అలా కోప్పడతారు?... పోనీ బొద్దింక కాకపోతే ఎలక! ఆ విషయం చెప్పాలి గానీ... అలా కోప్పడితే ఎలా?" అంది బాధగా.
"బొద్దింకా కాదూ... ఎలక కాదు!... నన్ను పిచ్చిమాటల్లో పెట్టి ఏమార్చకు... నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావ్ కదూ?..." జట్టు పీక్కుని అరుస్తూ అన్నాడు రామారావ్.
"అయ్యో రామా... నేను మీమ్మల్ని చంపడం ఏంటండీ పాడూ..." మంగళసూత్రం కళ్లకి అద్దుకుంటూ అంది కమల.
"మరి లేకపోతే చేతిలో ఆ కత్తిపీట ఏంటి?..."
"వంట గదిలో కూరలు తరుగుతూ మీరాఫీసుకి వెళ్తున్నారని బయటికి వచ్చాను!"
"అదే... కత్తిపీట్టతో సహా బయటికి రావల్సిన అవసరం ఏమిటి?" రెట్టించి అడిగాడు రామారావ్.
"అయ్యో రామా... మీకన్నీ లేనిపోని అనుమానాలే..."
"లేనిపోని అనుమానలేంటి... నువ్వు నా పీక తెగ్గొయ్యడానికి సర్రున కత్తిపీట ఎత్తి?... అందుకే కదా నేను కెవ్వున అరిచి పల్టీలు కొట్టింది?" నెత్తికొట్టుకుంటూ చెప్పాడు రామారావ్.