Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 33

తను మొదటిసారిగా ఒక పురుషుడి కౌగిలిలో బంధించబడింది. ఇంతకాలం తను వేచి వున్నది ఈ క్షణం కోసమే అన్నట్టుగా ఆమెకు అన్పించింది. ఆమె కరిగిపోతున్నది. కరిగి, అతనిలో కలిసిపోతున్నది. రెండు అస్తితాలు ఏకం అయినట్లుగా అన్పించింది. అతను ఆమెను ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టాడు. తను కూర్చున్నాడు. ఒక చెయ్యి ఆమె నడుం చుట్టూ వున్నది. రెండో చేత్తో కళ్ళెం లాగాడు. గుర్రం దౌడు తీస్తున్నది.
సీత మనసు కూడా ఉద్వేగంతో ఎగిరెగిరి పడుతోంది గుర్రంతోపాటు. ఆమెకు మాట్లాడాలనిపించడం లేదు. అంతకుముందు అనుభవించిన ఆ మధురానుభూతిని మననం చేసుకుంటూ కూర్చుంది. ఆ అనుభూతిని శాశ్వతం చేసుకోవాలనివుంది. నిముషాల్లో నరకం నుంచి రక్షించి స్వర్గం చూపించాడు తన నేస్తం!
"ఇంకా అనుమానమేనా?" అతని కంఠం మృదువుగా వున్నది.
"నేను ఎక్కడున్నానో ఎలా తెలుసుకున్నావ్?" ఆమె కలలో మాట్లాడినట్లుగా అడిగింది.
"అదిసరే! నిన్ను వంటరిగా టూంబ్స్ లోకి వెళ్లొద్దని చెప్పాను. ఎందుకు వెళ్ళావు?"
"అవును చెప్పావు!"
నిన్ను చూడాలనే ఆత్రంలో నీ హెచ్చరికను మర్చిపోయాను. ఆ ముందు రాత్రంతా ఆలోచనల్ని నీకు పంపిస్తూనే వున్నాను. అవి నీకు అందలేదా?" అతడు సమాధానం ఇవ్వలేదు.
సీత అతని ముఖంలోకి చూసింది. అతని ముఖం గంభీరంగా వుంది.
"నామీద కోపం వచ్చిందా?" బెంగగా అడిగింది సీత.
"అవును కోపంగానే వుంది. నీమీద కాదు. రెసిడెన్సీ లో వున్న సెక్యూరిటీ సిబ్బంది మీద!"
"పాపం వాళ్ళ తప్పేమీ లేదు. నన్ను కిడ్నాప్ చేస్తారని బెర్నెస్ అనుకొని వుండరు."
అతను మాట్లాడలేదు.
"ఎవరు, ఎందుకు నన్ను అపహరించారో నీకు తెలుసా?"
"మీబాబాయిని బెదిరిస్తూ ఉత్తరం వచ్చింది."
ఆమె ప్రశ్నకు అతను సమాధానం ఇవ్వలేదు.
"నీకు ఆ విషయం ఎలా తెలిసింది?"
అతను సమాధానం ఇవ్వలేదు.
"నేను తెల్లవారుఝామున సమాధుల దగ్గరకు వెళుతున్నానని ఎవరికి తెలుసు? అదీ నిన్ను చూడటానికే వెళుతున్నట్టు కూడా తెలుసా?"
అతని చెయ్యి ఆమె నడుంమీద బిగిసింది.
"ఇండియాలో అన్నీ అందరికీ తెలుస్తూనే ఉంటాయి. గాలిలో, ఆకాశంలో, భూమిమీద -ఏది జరిగినా అందరికీ ఇట్టే తెలిసిపోగలదు."
 "అంటే నన్ను ఇంగ్లీషు వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు నీకు వెంటనే తెలిసిపోయిందన్నమాట!"
"అకస్మాత్తుగా నువ్వు నా సహాయం కొరకు నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది."
"అవును! రాత్రంతా నిన్ను తల్చుకున్నాను. ఆ కారణం వేరు. అసలు నేను బంధించబడినట్లు ఎలా తెలిసింది?" అతను చిరునవ్వు నవ్వాడు. అతని నవ్వులో ఆమెకు ఎన్నో విషయాలు బోధపడినట్టే అన్పించి ఏమీ అడగలేదు. "నిన్ను అపహరించారని తెలిసింది. అలా టూంబ్స్ దగ్గర అపహరించి నిన్ను ఎక్కడ బంధిస్తారో ఊహించగలను. నా ఊహ నిజమే అయింది. నేను ఊహించిన చోటునే నిన్ను బంధించారు."
"రెసిడెన్సీలో వారికి ఇలా జరిగిందని చెప్పారా?"
"లేదు. వెదుక్కుంటూ వచ్చాను."
అతని మాటల వల్ల సీత, అతనికి ఈ విషయం రెసిడెన్సీలో చెప్పడం ఇష్టంలేదని అర్థం చేసుకొన్నది. అతను రెసిడెన్సీకి దూరంగా వుంటాడని కూడా అర్థం అయింది. అతను మారువేషంలో వున్నాడని మొదటిరోజే ఆమెకు తెలిసిపోయింది. ఆమెకు ఎన్నో అడగాలని వుంది.
నిన్న రాత్రి బజార్లో అల్లర్లు జరిగాయనీ కొందరు చచ్చిపోయారనీ విన్నాను. అప్పుడు నువ్వే గుర్తొచ్చావు. ఒకవేళ నువ్వు చచ్చిపోయావేమోనని హడలిపోయాను. ఎంత భయపడ్డానో తెలుసా? అందుకే రాత్రంతా నిన్ను పిలుస్తూనే వున్నాను. ఉదయం టూంబ్స్ దగ్గర కలుసుకోవలసిందిగా మెసేజ్ పంపిస్తూనే ఉన్నాను. పసిపిల్లలా చెప్పుకుపోతున్నది.  
"నేను చచ్చిపోతే నీకు తెలుస్తుంది. రాత్రి నువ్వు పిలిచావు నీ పిలుపు నాకు అందింది."
"నేను సమాధుల దగ్గరకు వస్తున్నానని కూడా తెలుసుకున్నావా?"
"తెలుసుకొన్నా."
"మరెందుకు రాలేదు?" టీజింగ్ గా అడిగింది.
"వచ్చాను కొంచెం ఆలస్యంగా వచ్చాను. నేను వచ్చేసరికే అంతా జరిగిపోయింది."
"ఆలస్యం  ఎందుకు అయింది?" అడగాలనుకొన్నది, కాని అడగలేకపోయింది.
అడిగినా సరైన సమాధానం తనకు రాదని ఆమెకు తెలుసు. తను ఎన్ని ప్రశ్నలు వేసినా అతను చెప్పదల్చుకున్నంతవరకే చెబుతాడని ఆమెకు తెలుసు. ఇప్పుడవన్నీ అనవసరం. తను ఇప్పుడు అతని రక్షణలో ఉన్నది. తనను రక్షించాడు. తనను గుండెలకు మరీ హత్తుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. అంటే అతను తనను ప్రేమిస్తున్నాడు. ఆ భావం మనసులోకి వచ్చీరాకముందే బుగ్గల్లో వెచ్చటి రక్తం పారాడింది. ఆమె తలెత్తి అతని ముఖంలోకి చూసింది. "నేను..."
"ఊ! నువ్వు...."
"నేను...నిన్ను ప్రేమిస్తున్నాను." గబుక్కున అని తల వంచుకున్నది సీత. గుర్రాన్ని ఆపాడు. తలవంచి ఆమె కళ్ళల్లోకి చూశాడు. సీతకు అతను కళ్ళల్లో నుంచి తన మనసులోకి చూస్తున్నట్టుగా అన్పించింది. ఆ చూపులు ఎంతో తీవ్రంగా, మనిషి గుండెల్ని అవలీలగా కొలవగల శక్తి ఆ చూపులకు వున్నది.
"ఆ మాట బాగా ఆలోచించే అన్నావా?"
"ప్రేమించానని చెప్పడానికి కూడా బాగా ఆలోచించాలా?"
"అది ప్రేమా లేక వయసులో సహజంగా ఏర్పడే ఆకర్షణా...."
"కాదు...నేను నిన్ను ప్రేమిస్తున్నాను" మధ్యలో అందుకొని అన్నది.
"నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానంటే నమ్ముతావా?" అతను గుర్రాన్ని నడిపిస్తూ అన్నాడు. ఆమె మనసులో వెన్నెల పరచుకొన్నది. మల్లెలు గుబాళించాయి. అవును తను అతన్ని ప్రేమిస్తున్నది.

 Previous Page Next Page