"మిస్ అరాన్! మేము నువ్వు తప్పించుకొని పోకుండా వుండేందుకు కాపలా కాస్తున్నాం. వంటరిగా బోర్ కొడ్తుందా? మేము లోపలకు రావచ్చా" అర్కీ బయట నుంచి అడిగాడు.
"నో!నో! నేను నిద్రపోతున్నాను" దాదాపుగా అరిచినట్టే అన్నది సీత.
"ఓ కె! స్వీట్ డ్రీమ్స్!" అర్కీ కంఠం.
"థ్యాంక్యూ!" అన్నది సీత. సీత దుప్పటి మీద కూర్చుంది. తలుపు సందులోంచి వెలుగుపడుతోంది. కాపలావాళ్ళు హరికేన్ లాంపు తెచ్చారని అర్థం చేసుకొంది. చెప్పులు వదిలి మెల్లగా తలుపు దగ్గరకు వచ్చింది."
చిన్న కన్నం వుంది. తలుపు కన్నంలోంచి ఒక కన్ను మూసి బయటికి చూసింది. అర్కీ, మరొకడు కాళ్ళు చాపుకొని కొండరాతికి చేరబడి కూర్చుని వున్నారు. అర్కీ నల్లగా వున్నా అందంగా వున్నాడనుకొన్నది సీత. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సీత చెవులు తలుపుకు ఆనించి వినడానికి ప్రయత్నించసాగింది.
"ఇదో న్యూసెన్సు వచ్చి పడింది చలికాలంలో. ఆ లాయరు ఒక పట్టాన అంగీకరించడు." ఒక కంఠం.
"అతను అంగీకరించి తీర్మానిస్తారని సిమ్ సన్ నమ్మకం. రెండో గొంతు అది. అర్కీ గొంతు.
"హాయిగా ఇంటిదగ్గర మెత్తటి పరుపు మీద పడుకుని వుండేవాడికి ఈ గతి పట్టింది! ఎందుకొచ్చిన బాధ!" విసుకున్నాడు ఒకడు.
"బొత్తిగా సరసం లేదు. నేను ఆ పిల్లను గురించి ఆలోచిస్తున్నాను. చాలా అందంగా వుందికదూ?" అన్నాడు అర్కీ.
"అందువల్ల వచ్చేదేముంది. ఊరికే తల్చుకొంటూ లొట్టలు వెయ్యడం నాకు నచ్చదు సుమా!" అన్నాడు రెండోవాడు.
"పరిచయం చేసుకోవాలనే నా తాపత్రయం!"
"అది చాలా అపాయకరం!"
"సిమ్ సన్ ఏదో చేస్తాడనేగా నీ భయం!" ఆర్కీ అన్నాడు నిర్లక్ష్యంగా.
రెండో అతనితో నేను బ్రాందీ తెస్తాను. నువ్వు జాగ్రత్తగా వుండు" అన్నాడు ఆర్కీ.
బ్రాందీ పేరు వినగానే రెండోవాడు మెత్తబడిపోయాడు. "సరే వెళ్ళు! త్వరగా రావాలి సుమా!"
"రెండు పెగ్గులు ఆ పిల్లకు కూడా ఇస్తే సరి!" "పిచ్చిగా మాట్లాడకు." చూస్తుండు ఏం చేస్తానో! డ్యూటీ టైం అంతా ఈ ఆరుబయట బండలమీద దోమల్ని తోలుకుంటూ గడుపుతాననుకొంటున్నావా? నో! అలా గడపను. అది నావల్ల కాదు. పక్కన అంత అందమైన ఆడపిల్ల వుండగా..."ఒరేయ్ బాబూ! ఊరుకోరా! ఆ పిల్ల అరిచి గోలచేస్తే నీ ప్రాణానికే ముప్పు!"
ఆర్కీ తేలిగ్గా నవ్వేశాడు.
"ఆమె అరవదు. ఇలాంటప్పుడు ఏ ఆడపిల్ల కూడా అరవదు. వెచ్చటి కౌగిట్లో కరిగిపోవడానికి సిద్ధంగా వుంటుంది.
"ఆ వుంటుంది! వుంటుంది!" ఒరేయ్ పిరికిపందా! నువ్వు చూస్తూ వుండు. ఊరికే వాగకు. నేను పోయి డ్రింక్ తెస్తాను."
"నేనూ వస్తాను."
"అయితే పద! లాంతరు పట్టుకెళ్దాం!"
"ఒరే ఫూల్! లాంతరు ఇక్కడే వుంచు. ఇది ఇక్కడ వుంటేనే మనం కూడా వున్నట్టుగా అనుకొంటారు. ఎంతసేపు, త్వరగా వచ్చేద్దాం! పద!" అంటూ ఆర్కీ బయలుదేరాడు.
సీతకు వెన్నెముకలో ఏదో జరజర పాకినట్టుగా వుంది. చలి కుదుపు వచ్చినట్టు వణికిపోసాగింది. వాళ్ళు కొద్దిసేపటిలో వస్తారు. బ్రాందీ బాటిల్స్ తో వస్తారు. తప్పతాగి తన గదిలోకి వస్తారు. తను వాళ్ళ బారినుంచి తప్పించుకోగలదా? వాళ్ళు...వాళ్ళ స్పర్శ...తనను నో! అలా జరక్కూడదు! సీత కింద కూలబడింది. రెండు చేతులతో ముఖం కప్పుకుని వెక్కివెక్కి ఏడవసాగింది. వాళ్ళు తనను ముట్టుకోకూడదు.
"హే భగవాన్! నన్ను రక్షించు! ఓ నేస్తం నువ్వే కాపాడాలి. నా శరీరాన్ని కాపాడు. నా ఈ శరీరం ఆ దుర్మార్గుల వశం కాకుండా చూడు. వెంటనే నీ పేరు తెలియదు! ఊరు తెలియదు! దేశం తెలియదు! ఇండియన్ వి అనుకొంటున్నాను. అవచ్చును! కాకపోవచ్చును కూడా! అయినా నువ్వే నన్ను రక్షిస్తావనే నమ్మకం నాకుంది ప్లీజ్! మైడియర్ ఫ్రెండ్ కం ఎట్ వన్స్! ప్లీజ్ వెక్కిళ్ళ మధ్య అంటున్నది సీత హిస్టీరియా పేషెంటు మాదిరి.
తలుపు గడియ కదిలిన శబ్దం, గడియ పూర్తిగా తీసిన శబ్దం.
సీత తృళ్ళిపడి తలుపుకేసి చూసింది. తలుపు చిన్నగా శబ్దం చేస్తూ కదులుతోంది. అది పాతకాలపు బరువైన తలుపు. ఆమె భయం భయంగా చూడసాగింది. వాళ్ళు ఇంత త్వరగా వచ్చేశారా? సీత లేవాలనుకొన్నది. శరీరంలోని శక్తినంతా భూమి లాగేసినట్టుగా లేవలేక అలాగే చతికిలబడి కూర్చుండిపోయింది. తలుపు తెరుచుకొంటున్నది. వాళ్ళు కాదు!
అతను వచ్చాడు! తన ఫ్రెండ్ వచ్చాడు! తన మెసేజ్ అందుకొని వచ్చాడు! తలుపు పూర్తిగా తెరుచుకున్నది. ఆమె చివ్వున లేచింది. ఒక్కసారిగా అతని దగ్గరకు పరుగు తీసింది.
"నువ్వు వచ్చావా! వస్తావని తెలుసు! వచ్చావు - ఇక నాకు భయంలేదు. నువ్వు...నువ్వేనా...ఆ అవును నువ్వే. పిచ్చిదానిలా మాట్లాడుతుంది ఆమె. అతను ఆమెను తన రెండు చేతులతో పొదివిపట్టుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. తల్లి నుండి విడిపోయిన బిడ్డ ఒక్కసారిగా తల్లిని చూసి, ఆమె గుండెలకు హత్తుకు పోయినట్లుగా అతని గుండెలకు హత్తుకుపోయింది. ఆమెకు ఆనందంగా వున్నది. ఏడుపు వస్తోంది. అది కల అన్పిస్తోంది, వాస్తవం అని కూడా అన్పిస్తోంది.
"నువ్వు నిజంగా వచ్చావా? ఇది వాస్తవమా? ఐతే మరి మాట్లాడవేం? ప్లీజ్ మాట్లాడు" సీత పసిబిడ్డలా అంటున్నది, ఏడుస్తోంది.
ఆమె తలను అతని గుండెలమీద అశాంతిగా కదిలిస్తోంది.
"నేను వచ్చాను సీతా! ఇది కల కాదు. పద! త్వరగా వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చేస్తే కష్టం!"
"వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకొంటారట. నాతో స్నేహం చేస్తారట. నన్ను...నన్ను..."
"పిచ్చి పిల్లా! ఇంకా ఎందుకు భయం? నేను వచ్చాగా" అంటూ సీతను బయటికి లాక్కొచ్చాడు.
తలుపు గడియ వేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా లాంతరు ఆర్పేశాడు. ఆమె చెయ్యి పట్టుకుని గబగబా మెట్లు దిగసాగాడు. ఆమె ఏదో అనబోయింది. అతను మాట్లాడవద్దని వారించాడు. అతికష్టంమీద అతని చెయ్యి పట్టుకొని ఆ కొండ రాళ్ళ మెట్లు దిగుతోంది సీత. పరుగులాంటి నడకతో ఇద్దరూ మైదానం చేరారు. అప్పుడు సీత ముఖం ఎత్తి అతని ముఖంలోకి చూసింది. అప్పుడే వెన్నెల వస్తోంది.
"నువ్వు వచ్చావు. వస్తావని తెలుసు. అబ్బ ఎన్నిసార్లు నిన్ను పిలిచానో? నీకు నా పిలుపు విన్పించింది కదూ?" అన్నది సీత. అతను చిరునవ్వు నవ్వాడు. సమాధానం ఇవ్వలేదు. ఆమె కళ్ళలో నీరు తిరిగింది. అతను ఆమె కన్నీరు తుడిచాడు. ఒక్కసారి ఉద్రేకంతో ఆమెను రెండు చేతులతో బిగి కౌగిలిలో బంధించాడు. మరుక్షణం అతని పెదవులు ఆమె పెదవులను తాకాయి. ఆమెకు నక్షత్రాలు నవ్వినట్లు, చంద్రుడు ఈర్ష్య పడినట్టూ, సమస్త సృష్టి ఆగి దిగ్భ్రాంతితో తననే చూస్తున్నట్టు అనిపించింది.