Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 34

అతను ఎవరో తనకు తెలియదు. అయినా తను ఆ విషయాల గురించి తెలుసుకోవలసిన అవసరంలేదు. అతను చాలా బీదవాడు అయినా మురికివాడలోని గుడిసెలో వుండేవాడైనా తను అతనితోనే శేషజీవితాన్ని గడపడానికి నిర్ణయించుకున్నది. తనకు అతను కావాలి. అంతే! అతడితో జీవించడమే ఒక థ్రిల్!
"ఏమిటి సీతా! ఆలోచిస్తున్నావ్?"
"నీ గురించే"
"నా గురించా? ఏమిటి?"
"నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. నీతో నరకంలోనయినా జీవించడానికి సిద్ధంగా వున్నాను. నువ్వు నా ప్రక్కన వుండాలి. అంతే! అంతే" ఉద్వేగంతో చెప్పింది సీత.
 "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ?"
"అవును."
"నాకు చెప్పకుండా ఇలా ఎక్కడికీ వెళ్ళకు. నీ అపహరణ గురించి ఎంత గాభరా పడిపోయారో తెలుసా? రెసిడెన్సీలో ఎవరికీ నిన్ను ఎక్కడ బంధించారో తెలియదు. ఎవరూ ఊహించలేరని నాకు తెలుసు."
"రెసిడెన్సీ సిబ్బంది ఏం చేశారు?"
"పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. రెసిడెన్సీ రక్షణ సిబ్బందిని కూడా నిన్ను వెతకడానికి పంపించారు."
"అతని పేరు సిమ్ స్సన్. ఏమన్నాడో తెలుసా? మా బాబాయి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే నన్ను ఆ జైల్లో తిండీ నీళ్ళూ లేకుండా చచ్చిపోవాల్సిందేనన్నాడు" అతను తల పంకించాడు ఆ విషయం తనకు తెలుసునన్నట్టు.
"బాగా ఆకలిగా వుందా?"
"అవును"
"నిన్ను బెరాక్స్ దగ్గర వదిలేస్తాను. వాళ్ళు నిన్ను వెంటనే రెసిడెన్సీకి చేరుస్తారు."
"ఊహు! నేను వెళ్ళను. నీతోనే వుంటాను."    
"తప్పకుండా నాతోనే ఉంటావు. కాని యిప్పుడు కాదు. ఆ సమయం త్వరలోనే వస్తుంది. అంతవరకు నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నన్ను నమ్మాలి."
"మళ్ళీ ఎప్పుడు...."
"వీలైనంత త్వరగా"
"నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదు."
"నాకు మాత్రం వుందా?"
"నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయంగా వుంది. మళ్ళీ మనం కలుసుకోలేకపోతే"
"తప్పక కలుసుకుంటాం. నేను చెప్పానుగా? నువ్వు కర్మను నమ్మాలి."
"ఒక విషయం"
"ఏమిటి?"
"రాత్రి బ్లంట్ నన్ను భయపెట్టాడు. నా ఆలోచనల్ని నీకు అందించడానికి రాత్రంతా ప్రయత్నించాను."
"బ్లంట్ భయపెట్టాడా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును! అతను నన్ను డాన్సు రూం నుంచి బయటికి తీసుకెళ్ళి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఎలాగో తప్పించుకొన్నాను. కానీ భలే భయం వేసింది. అందుకే నిన్ను తల్చుకొన్నాను. మరి నా మెసేజ్ నీకు అందలేదా?"
"నేను వేరే చాలా ముఖ్యమైన సమస్య గురించి ఆలోచనల్లో వున్నాను. నా ఆలోచనల మధ్య ఏదో అడ్డుకొన్నట్టు ఆగిపోయేవి. నువ్వు నన్ను తల్చుకొన్నట్టు లీలగా తోచింది. నా అవసరం నీకు వున్నట్టుగా, నన్ను నీవు పిలుస్తున్నట్టుగా అన్పించింది. కాని నువ్వు భయపడ్డ కారణం తెలియలేదు. టెలిపతీలో అన్ని విషయాలు స్పష్టంగా తెలియవు. కొన్నిసార్లు మరీ వేగంగా తెలుస్తుంది. కొన్నిసార్లు అసలు తెలియకపోవచ్చు కూడా."
"బ్లంట్ ఎలాంటి వాడు?"
"వాడా? వట్టి మోసగాడు. రెసిడెన్సీలలో ఒక పడ్డ న్యూసెన్సుగా తయారయ్యాడు."
"బాబాయి కూడా ఇదేమాట అన్నాడు."
అతను మాట్లాడలేదు.
"ఇప్పుడు నాకు భయం లేదు. కాని నువ్వు వీలైనంత త్వరగా నాకు కన్పించాలి" గోముగా అన్నది సీత.
సీత తలను అతని ఛాతికి ఆనించింది.
ప్రపంచంలో ఏ శక్తీ తనను భయపెట్టలేదని ఆ క్షణంలో ఆమెకు అనిపించింది.
"ఒక ప్రామిస్ చెయ్యాలి?" సీత ఊహా లోకంలో తేలిపోతూ అన్నద"ఏమిటి?"
"నువ్వు ఎంత బీదవాడివయినా ఫర్వాలేదు. నువ్వు ఇండియన్ వి అయినా ఫర్వాలేదు. నాకు నువ్వే కావాలి. మా బాబాయి అందుకు వ్యతిరేకించవచ్చు. ఇంగ్లీషు జాతి వ్యతిరేకించవచ్చు. అయినా నువ్వు మాత్రం నన్ను విడిచి వెళ్ళకూడదు. నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ కావాలి. ఇక నాకేమీ అక్కరలేదు" ఈ మాటలు సీతపైకి అనలేదు. మనసులో అనుకున్నది.
"నీ ఆలోచనలు నాకు తెలుసు. ఎన్ని అడ్డంకులైనా ఎదిరించగలను నీకోసం" అన్నాడతను.
"నీ కోసమే జీవిస్తాను. నీ జీవితం అంతా నాతోనే గడుస్తుంది. సరేనా" మళ్ళీ అతను అన్నాడు.
ఆమె అతనికి మరికొంత దగ్గరగా జరిగింది. గుర్రం చాలా మెల్లగా వెళుతున్నది.
"నన్ను ప్రేమిస్తున్నానన్నావు. ఇప్పుడయినా నీ పేరు తెలియకుండా పిలవడం, తల్చుకోవడం, మెసేజెస్ పంపించడం ఎంత కష్టమో తెలుసా?"
"నాకు తెలుసు. కాని నా పేరు బయటికి వస్తే ప్రమాదం."
"ప్రమాదమా? ఎవరికి?"
"నాకే! చెప్పమంటే చెబుతాను. కాని అందువల్ల నేను సాధించాలనుకొన్న కార్యం సాధించకుండానే పోతానేమోనని భయం...అందుకే..."
"వద్దు!వద్దు! నీకు ప్రమాదం కలిగించేది ఏదీ చెయ్యమని నేను కోరుకోను. నీ పేరు చెప్పవద్దు! నీకు ప్రమాదం జరిగితే నేను బ్రతకను!"
గుర్రం ఆగింది. అతను గుర్రం దిగాడు. సీతను గాజుబొమ్మను దించినట్టు అతి సున్నితంగా రెండు చేతులతో కిందికి దించాడు.

 Previous Page Next Page