Previous Page Next Page 
జయ - విజయ పేజి 32


    అతన్ని కాదనాలనిపించలేదు జయకు. వారంరోజులపాటు శెలవు పెట్టింది. ఆమె వూహించినట్లే వంటరితనం ఆమె జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. అనుక్షణం విపరీతమయిన ఆలోచనలు పిచ్చెక్కించేస్తున్నాయ్.
    విజయ ఏం చేస్తోందో? తనలాగానే ఆలోచనలతో సతమతమయిపోతోందేమో! ఎంత పిచ్చిపని చేసింది? తనను 'విజయ'గా చంద్రకాంత్ కి పరిచయం చేయకపోతే ఈనాడీ పరిస్థితి ఏర్పడేది కాదుగదా! ఆమె చంద్రకాంత్ ని ఎంత ప్రేమించిందో, అతనెవరో చూడకుండానే ఎంతటి అనుబంధం యేర్పరచుకుందో తనకు తెలుసు. అలాంటి చంద్రకాంత్ ని ఆమె చేతులారా, అవివేకంతో తన భర్తగా చేసింది. అటు ఆమె జీవితమూ, ఇటు తన జీవితము కూడా శృతి తప్పినయ్. తనకూ, ఆమెకూ ఇద్దరికీ మానసిక వేదనే మిగిలింది. ఎవరికీ ఆనందం లేదు. సుఖం లేదు. చంద్రకాంత్ ని నిర్లక్ష్యం చేయడమూ సాధ్యం కావడంలేదు. అతనికి భార్యగా అన్నివిధాలా అతనిలో ఐక్యం కావడమూ సాధ్యంకావడం లేదు. అనుక్షణం మానసిక సంఘర్షణ. నిజం చంద్రకాంత్ కి చెప్పలేకపోతోందన్న బాధ.
    "విజయా! విజయా! ఎంతపని చేశావ్ విజయా! నా బ్రతుకు ఎలానూ నాశనమయింది. నాతోపాటు నువ్వూ, చంద్రకాంత్ కూడా ఎందుకు మీ జీవితాల్ని దుఃఖమయం చేసుకున్నారు?"
    చిన్నపిల్లలా విలపించసాగిందామె.
    ఆమె ప్రవర్తనంతా గమనిస్తోన్న చంద్రకాంత్ కి ఏమీ అర్థంకావడం లేదు.
    ఒకవేళ ఆమెకు తనను వివాహం చేసుకోవడం ఇష్టంలేదా? తనేమీ ఆమెను బలవంతం చేయలేదే? ప్రాధేయపడ్డాడు. అంతే! ఒకవేళ ఆమె తనను మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతే ఆ విషయం ముందే చెప్పాల్సింది. తను వేరే నిర్ణయం తీసుకునేవాడు. అతనికి నవ్వు వచ్చింది.
    తను ఎన్ని కథలు, నవలలు రాశాడు. ఎన్నో పాత్రలు మలిచాడు. ఎన్నో మనస్తత్వాలు చిత్రీకరించాడు. అయితే ఇలాంటి మనస్తత్వం గల స్త్రీ ఉంటుందని కూడా వూహించలేకపోయాడు.
    ఓరోజు ఆమెను అడిగేశాడు చంద్రకాంత్.
    "విజయా! నాకు నిజం చెప్పు! నువ్వెందుకలా వుంటున్నావ్?"
    "ఎలా?" చిరునవ్వుతో అడిగిందామె.
    "ఎలా వుంటున్నావో నీకు తెలీదా విజయా!"
    "నేను మామూలుగానే ఉంటున్నానండీ"
    "అంటే నీ ప్రవర్తనలో ఏమీ తేడాలేదంటావ్!"
    "ఊహు! ప్రెగ్నెంట్ అయ్యాక కొంచెం డల్ నెస్ వస్తుంది కదా!"
    చంద్రకాంత్ ఆమె మాటలు నమ్మాడు.
    ఒకవేళ ఆమెలోని మార్పుకి గర్భవతి కావడమే కారణమయితే తనకేమీ ఫర్వాలేదు.
    తన స్నేహితుల భార్యలు కొంతమంది గర్భవతులైనా ఎంతో చలాకీగా, సరదాగా ఉండటం గమనించినప్పుడు తిరిగి అనుమానం తలెత్తిందతన్లో.
    "నన్ను వివాహం చేసుకోవడం నీకు యిష్టమేనా విజయా?"
    "అదేమిటి?" కలవరపాటుతో అడిగిందామె.
    "ఒకవేళ నేను ప్రాధేయపడడం వల్ల యిష్టం లేకపోయినా చేసుకున్నావేమోనని..."
    "అన్నీ మీరే ఆలోచించుకోండి!"
    "నా ఆలోచనలు అబద్దాలయితే, నాకంతకంటే కావలసిందేమీ లేదు విజయా!" ఆనందంగా అన్నాడతను.
    తనలా మాట్లాడినప్పుడు ఒకటి రెండురోజులు చనువుగా ఉండడానికి ప్రయత్నించేదామె.
    ఆ తరువాత మళ్ళీ మామూలే! ఒకవేళ ఆమె ఇంకెవరినయినా ప్రేమించిందా? తన అనుమానానికి తనకే నవ్వు వచ్చిందతనికి.
    మరి ఆమెలోని నిర్లిప్తతకు కారణమేమిటి? ఏమీ వూహించడానికి వీల్లేకపోతోంది.
    "విజయా!" ఆప్యాయంగా పిలిచాడతను.
    "ఊ!"
    "ఇంట్లో నీకు ఏమీ తోచడంలేదు కదూ?"
    "ఎందుకు?" అడిగిందామె.
    "పోనీ కొన్నాళ్ళు ఆఫీస్ కెళ్ళు!"
    "సరే..." అతని మాట ఎంతో రిలీఫ్ కలిగించిందామెకి. కనీసం మరికొద్ది రోజులైనా తనీ ఆలోచనల నుండి తప్పించుకోవచ్చు.
    మర్నాటినుంచీ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళడం ప్రారంభించిందామె.
    ఓరోజు ఆఫీస్ చేరుకునేసరికి ఆమె టేబుల్ దగ్గర కిషోర్ నిలబడి కనిపించాడు.
    అతన్ని చూస్తూనే తృళ్ళిపడింది జయ.
    కొద్దిక్షణాలు ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మనస్సంతా ఆందోళనతో నిండిపోయింది.
    "బాగున్నావా జయా?" చిరునవ్వుతో అడిగాడతను.
    "ఊ!" కూర్చోమని కూడా అనడం నీకిష్టం లేదా?" అడిగాడతను.

 Previous Page Next Page