Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 32


                                             ప్రేమకి నిర్వచనం

    "యువర్ ఆనర్!" పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు ఖంగున వినిపించి త్రుళ్ళిపడి తలెత్తి చూసింది సుజాత. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనని వేలుపెట్టి కోర్టు కంతటికీ చూపిస్తున్నాడు. లోకానికంతకీ దోషిగా చూపిస్తున్న అతన్ని చూసి అదో రకంగా నిర్లిప్తంగా నవ్వింది సుజాత.
    "యువర్ ఆనర్! ముద్దాయి సుజాత యింత చిన్నవయసులో వుండి, యింత అమాయకంగా కనిపిస్తున్న ఈమె-తను ఒక స్త్రీ అయివుండి సాటి స్త్రీని పసుపు కుంకాలకి, నోరెరుగని యిద్దరు పసిబిడ్డలకి తండ్రిని దూరం చేసిన హంతకురాలు అంటే మీలో ఎంతమంది నమ్మగలరు? కాని ఇది అక్షరాల నిజం. ముద్దాయి సుజాత ప్రఖ్యాత రచయిత అయిన ఆనందరావుని అమానుషంగా హత్యచేసింది. అదిగో అటుచూడండి. భర్తని కోల్పోయిన అభాగ్యురాలు ఎలా కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూందో చూడండి."
    కోర్టులో అందరికళ్ళు హతుని భార్య మీదకి తిరిగి సానుభూతి కురిపించాయి. సుజాతని తిరస్కారంగా, ఏహ్యంగా చూశారు. కోర్టులో కలకలం బయలుదేరింది. 'ఆర్డర్, ఆర్డర్' జడ్జిగారు హెచ్చరించాక కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. సుజాత తలవంచుకుంది. తను హంతకి. హంతకా! అవును. హంతకనే అంటారుగామోసు. ఆనందరావుని తన ఆనంద్ ని....తను హత్య చేసింది. ఆ మాట తల్చుకుంటే ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది.
    'యువర్ ఆనర్!' పబ్లిక్ ప్రాసిక్యూటర్ కధనం మొదలయింది.
    "ఈ ముద్దాయి సుజాత అయినింటి పిల్ల. చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఇరవై నాలుగేళ్ళ అవివాహిత యువతీ, ఆనందరావు కవితలు, రచనలు చదివి అతని రచనల మీద గౌరవాన్ని, ఆరాధనని పెంచుకుంది. కవిగా రచయితగా అతనిపట్ల ఆమెకి ఆరాధన వుండేది. ఆ ఆరాధన అతనితో పరిచయం పెంపొందించుకోవాలన్న కోర్కెగా మారటంతో అతనికి ఒక ఉత్తరం వ్రాసింది. అతనితో కలం స్నేహం పెంపొందించుకుందనడానికి హతుని దగ్గిర దొరికిన ఉత్తారాల వల్ల తెలుస్తుంది. ఇరువురి మధ్య కలం స్నేహంగా ఆరంభమయిన ఆ స్నేహం తరువాత వంచి స్నేహంగా మారిందనడానికి యీ ఉత్తరాలే సాక్ష్యం. ఇదిగో కోర్టువారి పరిశీలనార్థం ఎగ్జిబిట్ నంబర్ వన్ గా యీ ఉత్తరాలు కోర్టువారికి దాఖలు పరుస్తున్నాను." ఒక ఉత్తరాల కట్ట కోర్టు గుమాస్తాకి అందించాడు ప్రాసిక్యూటర్.
    __ నీలిరంగు కవర్లు, ఆ ఉత్తరాలు. అవేగా తమని యింత దగ్గిర చేశాయి. నీలిరంగు కాగితం మీద నీలాలు జల్లినట్టుంటాయి మీ అక్షరాలు అన్నాడు ఆనంద్. ఆనంద్ మొదటి ఉత్తరం - ఇప్పటికీ ప్రతి అక్షరం గుర్తుంది. మొదటి ఉత్తరం అన్నమాటేమిటి ప్రతీ ఉత్తరం తన గుండెలలో పదిలపరుచుకుంది. ఆ మొదటి ఉత్తరం చూసుకుని ఎంత గర్వించింది! ప్రఖ్యాత రచయిత తనకి జవాబిచ్చినందుకు ఎంత పొంగి పోయింది. అభిమానులనుంచి ఉత్తరాలు అందుకోడం మొదటిసారి కాకపోయినా మొదటిసారిలా ఫీలయ్యాను మీ ఉత్తరం చదివి! ముత్యాల లాంటి అక్షరాలూ మురిపించాయి నన్ను. అక్షరాలే కాదు అర్ధమూనూ, మండుటెండ తర్వాత జల్లు కురిస్తే ఆ హాయి అసువాసనలలా అన్పించింది. మీ ఉత్తరం! యింత చక్కని ఉత్తరం రాయగల్గిన మీరు రచనలెందుకు చెయ్యరు?___ అంత చిన్న ఉత్తరంలో ఎంత భావం! ఎంత ఆనందం.
    __ ఉప్పొంగి పదిలంగా దాచుకుంది. దానికి జవాబు రాసింది. మళ్ళీ ఉత్తరం వచ్చింది. అలా మొదలైన ఆ ఉత్తరాలు ఆరు నెలల్లో ఎన్ని అయ్యయ్యో! ప్రతి ఉత్తరం ఓ మధుర కావ్యం లాంటిది! ఆ భావాలు, ఆ అనుభూతులు, ఒకరిని ఒకరు మెప్పించాలన్నట్టు పోటీపడి రాసినట్లు ఎంత భావస్ఫూర్తితో వుండేవి! కోట్ల విలువ చేసే ఆ ఉత్తరాలు అందించిన ఆ వ్యక్తి అంతకంటే ప్రాణం అయ్యాడు. తన ఆరాధన తనకి తెలియకుండానే అనురాగంగా మారిపోయింది.
    __ "ముద్దాయి సుజాత, హతుడు ఆనందరావుల మధ్య కలం స్నేహంగా ఆరంభమయిన పరిచయం ఆరునెలలు తిరిగేసరికి ప్రేమగా మారినట్లు యీ ఉత్తరాలే చెపుతున్నాయి. పరిచయం ఆరంభమయిన ఆరు నెలల తరువాత మొదటిసారి ముద్దాయిని చూడడానికి వచ్చి ఓ హోటల్లో కలిశాడు." ప్రాసిక్యూటర్ మాటలు సుజాత ఆలోచనల మధ్యనుంచి వినిపిస్తున్నాయి.
    __అవును, ఆరోజు, తన జీవితంలో మరుపురాని మధురాతి మధురమైన భోజనం! "సుజా, మైడియర్! ఊహలలో యింతగా మురిపిస్తున్న నీవు ప్రత్యక్షంగా ఇంకెంతలా అలరిస్తావోనన్న ఊహ, నిన్ను చూడాలన్న కోరికను రోజురోజుకీ పెంచుతూంది. నీ ఉత్తరాలలో నీ ఊహంత నాజుగ్గా, అందంగా నీ భావాలు కురిపించే సువాసనల జాజిమొగ్గలా ముట్టుకుంటే కందిపోతావో చూడాలని వుంది. చూడకుండా వుండగలగడం యింక నా వశంలోలేదు. వస్తున్నా నా ఊహల ప్రేయసిని చూడడానికి!" ఆ ఉత్తరం చదివి ఆనందం, ఆరాటం, ఆందోళన, ఉత్సుకత, ఉత్సాహం, భయం అన్నీ కలిసి కంగారు పెట్టేశాయి. ఆనంద్ వస్తున్నాడు. వస్తాడు. తనని చూస్తాడు. చూశాక ఏమనుకుంటాడో! ఊహా ప్రేయసి ఆ ఊహా ప్రేయసితో తను పోటీకి నిలబడగలదా? నెగ్గగలదా! ఆనంద్ ఎలా వుంటాడో! ఎలా వుంటేనేం? తనకి కావల్సింది అతని మనసు! ఆ మనసు ఎంత ఆనందంగా వుంటుందో, ఆ మనసు వినిపించిన రాగాలు ఎంత మధురమో తనకి తెలుసు! ఆనంద్ వస్తాడు. వచ్చి.... తరువాత జరగబోయేది తన ఊహల కందనిది. ఆనంద్ కోసం ఎదురుచూసిన ఆ వారం ఎన్నటికీ కదలనట్లనిపించింది. ఆఖరికి అనుకున్న క్షణం రానేవచ్చింది. ఆరోజు ఆ క్షణాలు చాలు ఎంత ఎండిపోయిన బ్రతుకునైనా చిగిరింప చెయ్యడానికి! ఏదో అపురూప దృశ్యం చూస్తున్నట్టు కొన్ని క్షణాలు అచేతనులయి నిలబడిపోయారు! ఆశించినదాని కన్న మిన్నగా కన్పించితే ఆనంద్ ను చూస్తూ మైమరిచింది. ఆనంద్ కళ్ళలో ముందు ఆశ్చర్యం, ఆ తర్వాత సంతృప్తి, ఆ తరవాత ఆరాధన అనురాగం_ యింతలో అప్పుడు తనకళ్ళు వాలిపోయాయి! సుజా!' ఆ పిలుపులో అనురాగానికి ప్రేమకి కంపించిపోయింది. మళ్లీ తను తెలివితెచ్చుకునేసరికి ఆనంద్ చేతుల్లో వుంది. ఆనంద్ గుండెల మీద తన తల! ఆనంద్ చేతులు తన చుట్టూ. ఆనంద్ పెదవులు తన పెదవుల మీద 'సుజా!' 'ఆనంద్' అంతకి తప్ప మరోమాట లేదు. ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయారు.
    "ముద్దాయి సుజాత ఆరోజునించి ఆనంద్ తో అక్రమసంబంధం కలిగి వుంది. వారిద్దరూ తరచు ఆ హోటల్లో కలుసుకుంటుండేవారు" ప్రాసిక్యూటర్ గొంతు ఖంగుమంటూంది. కోర్టంతా నిశ్శబ్దంగా వుంది అంతా ఆసక్తిగా వింటున్నారు కథనం.
    హు! అక్రమసంబంధం! తమిద్దరి మధ్యవున్న బంధాన్ని అక్రమ సంబంధం! తమిద్దరి మధ్య వున్న బంధాన్ని అక్రమసంబంధంగా అంటారని తరువాత తెలిసిందిగాని అప్పుడు తనకేం తెలుసు! తమ ఇద్దరిది పవిత్ర ప్రేమ! తన దృష్టిలో పవిత్ర ప్రేమకి లోకం అక్రమసంబంధం మాత్రమే గుర్తిస్తారన్న నిజం తనకి తెలియదు! నిజమే, పెళ్ళి అంత తొందరపడకుండా వుండవలసింది! కాని....కాని ఆనంద్ ని చూస్తే మిగతా లోకం గుర్తురాలేదు. ఆనంద్ మాటలు వింటుంటే సంఘం, చుట్టూ మనుష్యులూ వుంటారన్నదే గుర్తురాలేదు. ఆనంద్ చేతుల్లో కరిగిపోయే అప్పుడు నీతి నియమం అన్న పదాలే మరచిపోయింది. ఆనంద్ తో అనుభవం తర్వాత తనేమయిపోతే మాత్రం ఏం అన్పించిన క్షణాలు అవి. క్షణాలు కాదు, రోజులు, నెలలు!

 Previous Page Next Page