Previous Page Next Page 
కొత్తనీరు పేజి 32


                                       11
    
    "పూర్ణా!.....పూర్ణా!" హడావిడిగా లోపలికి వచ్చాడు సుందర్రావు.
    "ఏమిటండీ?.....ఏమిటి.....అలా వున్నారు!"
    "పూర్ణా.....ఇంకో గంటలో ప్లేన్ ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాదు వెళ్ళాలి......నేను, సుజాత తరవాత రైల్లో వస్తాము....."
    "ఎందుకండీ?....ఏమయింది? .... చెప్పండీ త్వరగా....." దాదాపు ఏడుపుగొంతుతో అంది పూర్ణ. సుందర్రావు నెమ్మదిగా జేబులోంచి టెలిగ్రాం తీసి అందించాడు పూర్ణకి.
    "అయ్యో!.....అయ్యో!......శంకర్....శంకర్......!" పూర్ణ ముఖం చేతులతో కప్పుకుని కూలిపోయింది. చూస్తుండగానే ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
    "ఏం కర్మ వచ్చింది! వాడి కప్పుడే ఆయుర్దాయం తీరిపోయిందా? వేళాకోళంగా అనే మాటలే నిజం చేసి పోయాడు .....శంకర్!....."ఏడుపుమధ్య అంది పూర్ణ...."ఈ యుద్ధం వీడి చావు కోసమే వచ్చినట్టుంది.....భయపడినంతా జరిగిపోయింది.....అమ్మకి, నాన్నకి యీ వయసులో ఎలాంటి కష్టం వచ్చింది.....విజయ ఆపని చేసింది, వీడిలా అయిపోయాడు-దెబ్బమీద దెబ్బ! వద్దురా యీ పని నీకు అని ఎంతమంది చెప్పినా విన్నాడా అప్పుడు?"
    ఏడుస్తున్న అన్నపూర్ణ భుజంమీద చెయ్యివేశాడు, ఓదార్పుగా, సుందర్రావు.
    "ఊరుకో పూర్ణా! నువ్వు యిలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? పాపం, వాళ్ళిద్దరూ ఒంటరిగా వున్నారు. అక్కడ యేం చేస్తున్నారో?..... ఎలా వున్నారో? నువ్వు వెంటనే బయలుదేరు పూర్ణా!" భార్యను తొందరపెట్టాడు సుందర్రావు.
    "నాకే ఇలా వుంది.....ఈ కబురు విని అమ్మ యేమయి పోయిందో! చీకూ చింతా లేకుండా ఉండవలసిన వయసులో వాళ్ళ కీ కష్టం యేమిటి? పదిరోజుల బట్టి అదేపనిగా కుడికన్ను అదురుతోంది. భయపడుతూనే ఉన్నాను, ఏం జరుగుతుందో అని......అనుకున్నంతా అయింది.... ....." తమ్ముణ్ణి తలుచుకుని తలుచుకుని ఏడవసాగింది పూర్ణ.
    "సుజా.....అమ్మ బట్టలు ఓ చిన్న సూట్ కేస్ లో సర్దు......ఏవో ఒకటి సర్దేయి త్వరగా.....టైములేదు" కళ్ళనీళ్ళతో పక్కనే నిలుచున్నా సుజాతతో అని, సుందర్రావు మళ్ళీ పూర్ణని హెచ్చరించాడు.
    "లే, పూర్ణా! లేచి కాస్త ముఖం కడుక్కుని చీర మార్చుకో .....వెడదాం. నువ్వయినా కాస్త ముందు వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. ఇలా యేడుస్తూ కూర్చుంటే ఎలా?"
    ఎర్రబడిన కళ్ళతో లేచింది పూర్ణ. "మీరు బయలుదేరండి!" అంది, దిగులుగా.
    "నేను, సుజాత తరవాత రైల్లో వస్తాంలే.....అందరూ ప్లేనులో వెళ్ళాలంటే మాటలా?" ముఖ్యమైనదానివి నువ్వు ముందుచేరాలి!"
    పూర్ణని ప్లే నెక్కించి వచ్చాడు సుందర్రావు.
    
                                   *    *    *
    
    అన్నపూర్ణ ప్లేను దిగి సామానుకోసం కాచుకుని ఉండగానే, మరో పావుగంటలో వచ్చిన విమానంనుంచి రామం దిగాడు. అన్న గారిని చూడగానే కాస్త బలం వచ్చింది పూర్ణకి. ఎర్రబడ్డ కళ్ళతో నిలుచున్న చెల్లెల్ని చూడగానే రామం ముఖం గంభీరం అయింది. "అన్నయ్యా!......ఎంత పని అయిందో చూశావా?" గద్గదస్వరంతో అంది పూర్ణ. చెల్లెలి భుజం నిమిరాడు.
    "అమ్మా, నాన్నా ఎలావున్నారో?.....ఒంటరిగా ఉన్నారని వెంటనే బయల్దేరి వచ్చాను. నువ్వూ రావడం మంచిపని చేశావు అమ్మను కనిపెట్టుకుని ఉండవచ్చు."
    "నాకు అమ్మని చూడడం ఎలాగా అని భయంగా వుంది!"
    "మనకే యిలా ఉంది.....ఇంక వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో?.....ఏమిటో, ఆఖరికి అమ్మ భయపడినంతా జరిగింది.....అసలే విజయ కోసం బెంగపెట్టుకున్నారు వాళ్ళు. ఇది యిలా జరిగింది!....దీనికి తట్టుకోగల రంటావా?" ముఖం పక్కకి తిప్పుకున్నాడు రామం కళ్ళలో నీళ్ళు తిరిగి పూర్ణ రుమాలుతో కళ్ళు తుడుచుకుంది.
    ఇంటికి చేరాక, టాక్సీ దిగి లోపలికి వెళ్ళడానికి జంకారిద్దరూ.
    వీధి వరండాలో వాలుకుర్చీలో కళ్ళుమూసుకుని పడుకున్నారు జగన్నాథంగారు. చుట్టూ ముగ్గురు నలుగురు పెద్దమనుష్యులున్నారు.
    "అరుగో, మీ పెద్దబ్బాయి వచ్చేశారు...." తమ తల మీది బరువు తీరిందన్నట్లు అన్నారు అంతా ఒక్కసారిగా. జగన్నాథం గారు కళ్ళు తెరిచారు.
    "నాన్నా!...." అంటూ రామం ముందుకువెళ్ళి, లేచి తూలిపడబోతున్న తండ్రిని పట్టుకున్నాడు.
    "రామం.....వచ్చావా.....బాబూ.....చూశావా మన శంకర్.......ఎంతపనిచేశాడో" యింక దుఃఖంతో ఆయన నోట మాట రాలేదు. కొడుకు భుజంమీద తలపెట్టి కుళ్ళి కుళ్ళి ఇదయాడు అంత మనిషీను. రామం కళ్ళనుంచి నీళ్ళుజారాయి. ఎలా ఓదార్చాలో అంతు బట్టలేదు రామానికి.
    "ఆయనకి కాస్త ధైర్యం చెప్పండి, బాబూ...." అన్నాడు పక్కింటి శంకరనారాయణ. ఏడుస్తూ నిలుచున్న పూర్ణతో "అమ్మ దగ్గిరకి వెళ్ళమ్మా!" అన్నాడు.
    అటు చూసిన జగన్నాథంగారు "పూర్ణా.....తల్లీ! వచ్చావా!...." అని ఆమె చేతిని పట్టుకున్నాడు. "వెళ్ళి అమ్మనిచూడమ్మా.....నిన్నటి నుంచి అది స్పృహలేకుండా పడివుంది...." అన్నారు. పూర్ణ లోపలికి నడిచింది.
    "అమ్మా.....అమ్మా...." అంటూ తల్లి దగ్గిర చతికిలబడింది.

 Previous Page Next Page