Previous Page Next Page 
నయనతార పేజి 32

 

    ఆహా! క్రొత్తగా నా మీద ఎంత జాలి పుట్టుకొచ్చింది ఇవాళ!"
    "నువ్వాశ్చర్య పోతావు! నిజమే. నేనిన్నాళ్ళూ నీ కష్టం సుఖం ఆలోచించకుండా ఉత్తి స్వర్ధపరుడిలా ప్రవర్తించి నిన్ను నానా ఇబ్బందీ పెట్టాను. ఇలా కట్టుకున్న పెళ్ళాం సుఖం ఆలోచించకుండా ఇన్నాళ్ళూ ఇంత ఇదిగా ఎలా వున్నావో తలచుకుంటే నాకే బాధనిపిస్తుంది!"
    "ఒక్కసారిగా ఇంత జ్ఞానోదయం ఎలాగైందో?"
    "జ్ఞానోదయం అన్నది సరైన మాటే! ఈ జ్ఞానం లేకనే ఇన్నాళ్ళూ ఇలా ప్రవర్తించాను. భార్యని మనవాళ్ళు ఏమన్నారు? అర్ధాంగి అన్నారు. అంటే ఉత్త శరీరంలోనే కాదు, అన్నింటిలోనూ సగభాగం అన్నారు. దాంట్లో ఆలోచిస్తే ఎంత అర్ధం వుంది. ఆ ఆలోచన లేక ఇన్నాళ్ళూ ..... ఛా ఆ సంగతి తలచుకుంటే సిగ్గేస్తుంది! నీ కీయ వలసిన హక్కులు నీ కీయకుండా ఇన్నాళ్ళూ ఉత్త మూర్ఖుడిలా ....... స్వర్ధపరుడిలా ప్రవర్తించాను...."
    "ఎమిటయింది , మీకు ఇవాళ ప్రొద్దున్నే? ఇంకా నిద్రమత్తు వదల లేనట్టుంది! వెళ్ళి పడుకోండి, ఆ పీడకల ఏదో వదిలేదాకా! నేను వచ్చి మామూలుగా ఎనిమిది గంటలకి లేపుతాను!" హాస్యంగా అని వెళ్ళిపోయింది ప్రియంవద , అదంతా తమాషా క్రింద జమకట్టి.
    కాని అది ఉత్తి నటన, తమాషా కాదన్న సంగతి ఆ సాయంత్రం లోపల అనేక సందర్భాలలో రుజువయింది. కృష్ణమూర్తి స్వయంగా టూత్ పేస్టు అంటించుకుని పళ్ళు తోముకున్నాడు. స్వయంగా బాయిలర్ లో నీళ్ళు తెచ్చుకుని గడ్డం గీసుకొని షేవింగ్ సెట్ బుద్దిగా కడిగేసుకున్నాడు. వేడినీళ్ళు తోడుకుని స్నానం చేశాడు. స్వయంగా తువ్వాలు అరేసుకున్నాడు. కట్టుకోవలసిన బట్టలు తనే స్వయంగా ఎంచుకుని బయట పెట్టుకున్నాడు. జోళ్ళు పాలిష్ చేసుకున్నాడు. టిఫిన్ , కాఫీలకి వేళకి పిలిపించుకోకుండా తనే బుద్దిగా వచ్చి కూర్చుని తిన్నాడు.
    ఆ పనులన్నీ తనతో చెప్పకుండా స్వయంగా చేసుకుంటుంటే ......... అంతకు ముందు తాము చేసుకున్న నిర్ణయాల మాట మరచిన ప్రియంవద మనసు చివుక్కుమంది. పెళ్ళయిన క్షణం నుంచి అన్నింటికి తన మీద ఆధారపడి చేయించుకునే భర్త , తన ఉనికే మరచినట్లు తను చేసే పనులన్నీ స్వయంగా చేసుకోడం చూస్తె కాస్త ఎందుకో బాధ అనిపించింది. తను చేయకూడదని నిశ్చయించుకున్న పనులని కృష్ణమూర్తి చెయ్యమని అడిగితే, చెయ్యకుండా , తన విలువ గుర్తుంచేట్టు చేయాలనుకున్న ప్రియంవదకి ఆశాభంగంతో పాటు, భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఊహతో అహం దెబ్బతింది.
    అలా అని కృష్ణమూర్తికి కోపం వచ్చిందేమో అనుకోడానికి ఆధారం కనపడలేదు. మాములుగా నవ్వుతూ విట్టు వేస్తూ, ప్రియంవద వెంట వెంట తిరుగుతూనే వున్నాడు.
    ఆ సాయంత్రం క్లబ్బు కూడా మానేసి ఇంటి పట్టున కూర్చున్న కృష్ణమూర్తిని చూసి నిజంగా ఆశ్చర్యపోయి అనుమానంగా చూసి అడిగింది ప్రియంవద.
    "పోనిద్దూ..... వెధవ క్లబ్బు ! నీకంటే ఎక్కువా నాకు. నాకోసం ఒక్కదానివి ఇంట్లో కూర్చుని, ఎదురు చూస్తుంటావన్న జ్ఞానం లేక ......ఇన్నాళ్ళూ మూర్ఖుడిలా ప్రవర్తించాను గదూ!"
    "ఏమిటి వేషం! దీని భావం ఏమి తిరుమలేశా! నా మనసు పరిభ్రమిస్తుందా? నా కళ్ళు మాయ చేస్తున్నాయా? కలా నిజమా? ------- హటాత్తుగా ఇంత బుద్ది మంతులు ఎలా అయిపోయారు చెప్మా!"
    "లేదు ప్రియా ! ----- నిజంగానే ఇన్నాళ్ళూ నీ విలువ గుర్తించలేకపోయాను . హాయిగా నీతో కబుర్లాడుకుంటూ కూర్చోకుండా ఆ వెధవ క్లబ్బుకి ఎందుకు? డబ్బు దండగ , నిద్ర దండగ? ఏమంటావు? అలా చూస్తావేమిటి? అలా షై రెళ్ళీ వద్దామా పోనీ సినిమాకి వెడదామా? ఏదీ లేకపోతే ఇద్దరం చక్కగా ఇలా ఎదురెదురుగా కూర్చుందాం! ఏం?"
    తెల్లబోయి చూస్తూ వూరుకుండి పోయింది ప్రియంవద. ఇదేమిటి ప్లేటు ఇలా ఫిరాయించాడు? ఆదిలోనే తన నిర్ణయాలకి హంసపాదు పడిందేమిటి? ఏ పని చెప్పని మనిషిని చెయ్యనని ఎలా చెప్పడం? క్లబ్బుకే వెళ్ళని మనిషికి భోజనం ఎలా పెట్టక పోవడం? తలుపులు ఎలా తీయక పోవడం..... ప్రియంవదకి ఏం చెయ్యాలో అంతుబట్టలేదు.
    "ప్రియా , అలా చక్కగా ఎటైనా మీ ఫ్రెండ్స్ ఇంటికి తిరిగిరాకూడదూ! పాపం యింట్లో అస్తమానూ కూర్చుంటే ఏం ఊసుపోతుంది .... వెళ్ళు . అలా తిరిగిరా , ఆలస్యం అయినా ఫరవాలేదు..... నే వున్నానుగా ఇంట్లో ..... కావల్సిస్తే అన్నం నేను దింపేస్తాలే ఉడికాక...."
    ప్రియంవదకి మతిపోయినట్లయింది . వెళ్ళమని, ఆలస్యం అయినా పరవాలేదన్న మనిషికి తను ఇష్టం వచ్చినట్లు తిరిగి వచ్చి బుద్ది చెప్పడం ఎలాగ?.......
    ఆ ......ఏదో గాలికి తిరిగి ఓరోజు ఇలా పెద్ద కబుర్లు చెపుతున్నారు గాని ....... రేపటికి మళ్ళీ మాములు అయిపోరూ ..... అప్పుడే అమలులో పెట్టచ్చు తన నిర్ణయాలని .... సమాధానపడింది ప్రియంవద.
    ఆ మర్నాడు , ఆ మూడో రోజు, నాలుగోరోజు కూడా కృష్ణమూర్తిలో, అతని ప్రవర్తనలో మార్పు లేదు.
    తనపనులు తను చేసుకోవడమే గాక, ప్రియంవద పనులలో కూడా సాయం చేస్తున్నాడు. ప్రియంవద ఏమంటాడో చూద్దాం అన్నట్టు మాములుగా అతని పనులు చెయ్యబోతే కొంప మునిగినట్లు గాభారగా వారించాడు. "నీకెందుకు ప్రియా, ఈ పనులన్నీ కూడా, నీ వంట అదీ చాలదా? నా పనులు నేను చేసుకుంటాను ...... ఈ పనులన్నీ యిన్నాళ్ళు నీచేత చేయించి దుర్మార్గుడిగా, దుష్టుడిగా ప్రవర్తించింది చాలదా? ఇంకా నన్ను అలాగే చెలామణి ఆవమన్నావా?" అమాయకంగా , నిజాయితీ చూపిస్తూ అన్నాడు.

 Previous Page Next Page