Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 32


    "డాక్టర్ గార్ని ఇప్పుడు లేపితే మండిపడతారు. ప్రస్తుతం గాయాల్ని క్లీన్ చేసి మందు రాస్తాను. మార్నింగ్ డాక్టర్ చూస్తారు" డ్రెస్సింగ్ రూమ్ లోకెళ్తూ అందావిడ.

 

    "మీరు నర్సా?" వెంటనే అడిగాడు ఆదిత్య.

 

    "అవును... రాత్రి బాగా వర్షం పడింది కదా... ఇంటికి వెళ్ళడానికి వీల్లేకపోయింది. డాక్టర్ గారితోపాటు నేనూ యిక్కడే వుండిపోవాల్సి వచ్చింది.

 

    ఆదిత్య ఏమీ అడక్కుండానే చెప్పింది నర్స్... చెపుతూ గాయాల్ని శుభ్రం చేస్తోంది.

 

    "కారు పూర్తిగా బోల్తాపడిందా? ఎక్కడ్నుంచి వస్తున్నావు?"

 

    జవాబు కోసం తడువుకున్నాడు ఆదిత్య.

 

    "బొంబాయి"

 

    "ప్రోపర్ బొంబాయేనా?"

 

    "కాదు... హైదరాబాద్... బిజినెస్ పనిమీద"

 

    "హైదరాబాద్ లో ఎక్కడుంటారు?"

 

    "ముషీరాబాద్"

 

    "అంటే... జైలుంది... అక్కడా?"

 

    "అవును. ఎలాగూ రెండు గంటల్లో తెల్లారిపోతుంది. కాసేపు పడుకోవచ్చా?"

 

    "వెనక వరండాలో పడుకోండి... కానీ... బెంచీ తప్ప ఏంలేదు."

 

    "ఫర్వాలేదు" అన్నాడు ఆదిత్య.

 

    ఇరవై నిమిషాల తర్వాత...

 

    వెనక వరండా బెంచీ మీద పడుకున్నాడు ఆదిత్య.

 

    తను వేసుకున్న జైలు డ్రెస్ ను చూడగానే ఎవరయినా సులభంగా గుర్తుపట్టేస్తారు. నర్స్ ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఆ డ్రెస్ పూర్తిగా మారిపోవడం వల్ల కావచ్చు.

 

    రేపుదయం ముందు అర్జెంటుగా ఈ డ్రెస్ మార్చేయాలి! నిర్ణయంచుకున్నాడు ఆదిత్య.

 

    అతనికి వెంటనే గాఢంగా నిద్రపట్టేసింది.


                                               *    *    *    *    *


    చటుక్కున మెలుకువొచ్చింది ఆదిత్యకు. కళ్ళకు వెలుతురు గుండు సూదుల్లా తగిలింది.

 

    బుల్ డోజర్ కింద నలిగినట్టుగా వళ్ళంతా నొప్పులు...

 

    'ఇక్కడ ఎక్కువసేపుంటే ప్రమాదం' మెదడు హెచ్చరించడంతో చటుక్కున లేచి గదిలోకొచ్చాడు.

 

    "ఉదయాన్నే లేచి డాక్టరుగారు ఇంటికెళ్ళారు... ఒక గంటలో వస్తారు... మీరేమయినా మొహం కడుక్కోవాలనుకుంటే అదుగో ఎదురుగానే వుంది బావి... ఇక్కడకు మా ఇల్లు దగ్గిర... నేనెళుతున్నాను... అరగంటలో వస్తాను... అంతవరకూ దవాఖానకు మీరే కాపలా." చెప్పింది నర్స్.
    


    ప్రొఫెషన లోకి కొత్తగా అడుగు పెట్టినట్టుంది... నర్స్ ముఖంలో ఏదో తెలీని అమాయకత్వం.

 

    ఆమె పేరు తెల్సుకోవాలనుంది ఆదిత్యకు.

 

    తన పేరు చెప్పి ఆమె పేరు అడిగితే?

 

    తన పేరు చెప్పడం మంచిదికాదు మరి...

 

    "నా పేరు ధరణి... మీ పేరు?"

 

    "శివరాణి" తన పేరును చెపుతూ అందంగా నవ్విందామె.

 

    "మీకు బోర్ కొట్టకుండా ఈనాడు పేపరిస్తున్నాను చదువుకోండి" అని పది నిమిషాల క్రితం వచ్చిన పేపర్ని అతని చేతుల్లో పెట్టి... మెట్లు దిగి బయటికెళ్ళిపోయింది శివరాణి.

 

    ఒక గది... డాక్టర్ రూమ్... ఒక పక్క మందుల సొరుగులు... మరొకపక్క టేబుల్... డాక్టర్... టేబుల్... ఆ టేబుల్ వెనక కుషన్ ఛెయిర్.

 

    ఆ కుషన్  ఛెయిర్ కి వెనక మేకువైపు చూశాడు ఆదిత్య. లైట్ బ్లూ కలర్ షర్టూ, ఫ్యాంటూ వేలాడుతున్నాయి.

 

    డాక్టర్స్ స్పేర్ డ్రెస్... చేతిలోని పేపర్ని టేబుల్ మీదపెట్టి గోడవైపు నడిచాడు ఆదిత్య.

 

    ఆ డ్రెస్ ను తను వేసుకుని పారిపోతే?

 

    మరి ట్రీట్ మెంట్?

 

    ఆలోచిస్తూ వెనక్కొచ్చి బావివైపు నడిచాడు.


                             *    *    *    *    *


    డ్రస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకుంటూ పోర్టబుల్ టి.వి. వైపు చూస్తోంది నర్స్ శివరాణి.

 

    సడన్ గా నేషనల్ నెట్ వర్క్ ప్రోగ్రాం మారిపోయి... స్టేట్ ప్రోగ్రాం ప్రారంభమైంది వెంటనే.

 

    ఎనౌన్సర్ తెరమీద ప్రత్యక్షమై అర్జెంటు ప్రకటన చదవ ప్రారంభించింది.

 

    "నిన్న సాయంత్రం... నగర శివార్లనుంచి సిటీకి తీసుకొస్తున్న ఖైదీల వ్యానుపై కొంతమంది రాడికల్స్ గా భావిస్తున్న వ్యక్తులు కాల్పులు జరపగా ముగ్గురు ఖైదీలు అక్కడికక్కడే మృతి చెందారు... ఏడుగురు ఖైదీలు తీవ్రంగా గాయపడి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

 

    కాగా....

 

    నెలరోజుల క్రితం నిజాం కాలేజీలో అధికార పార్టీ సభ జరుగుతున్న సమయంలో...

 

    చీఫ్ మినిస్టర్ ని దారుణంగా చంపిన లా స్టూడెంట్ ఆదిత్యకుమార్ ఆ ఖైదీల వ్యాన్ నుంచి తప్పించుకున్నాడని... అతని ఆచూకీ తెల్సినవారెవరయినా వెంటనే హైద్రాబాద్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాల్సిందిగా హోంమినిస్టర్ ఒక ప్రకటనలో కోరుతున్నారు.

 

    ప్రకటన పూర్తయిన వెంటనే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో తెరమీద ప్రత్యక్షమయ్యింది.

 

    ఆ ఫోటో ఆదిత్యది....

 

    ఆ ఫోటోని చూడగానే శివరాణి మెదడు రెండుగా విచ్చిపోయినట్లై పోయింది.

 

    మరోసారి గుచ్చిగుచ్చి చూసింది.

 

    "అతను ఖైదీయా? మర్డరరా?" నిలువెల్లా చెమటలు. గబుక్కున ఆ గదిలోంచి బయటకు పరుగుదీసింది శివరాణి.


                                                 *    *    *    *    *


    తనిక్కడనుంచి తప్పించుకోవాలంటే తనని, తన డ్రెస్ నూ ఎవరూ గుర్తు పట్టకుండా వుండాలంటే తనీ డాక్టర్ డ్రెస్ తీసుకోక తప్పదు.

 

    మరే మాత్రం ఆలోచించలేదు ఆదిత్య.

 

    నీలంరంగు షర్టూ, ఫ్యాంటుని వేసుకుని తను విప్పేసిన డ్రెస్ ను డాక్టర్ గదికి ఆనుకుని వున్న చిన్న స్టోర్ రూంలోకి విసిరేసి రోడ్డువైపు చూశాడు.

 

    డాక్టర్ గాని, నర్స్ గానీ రావడంలేదు. డాక్టరు, నర్స్ వచ్చేలోపుగానే తనిక్కడ నుంచి బయటపడాలి.

 

    నిర్ణయించుకుని....

 Previous Page Next Page