Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 33


    "అయిదొందలా?"
    "అవున్సార్! ఈ రోజుల్లో అయిదొందలకి వాల్యూ ఏముంటుంది?"
    "నిజమే గానీ_ ఈ రెండొందలు తీసుకో - ఈసారి వచ్చినప్పుడు అయిదు వందలిస్తా."
    భజన్ రావు రెండొందలు తీసుకుని వెళ్ళిపోయాడు.
    చంద్రకాంత్ రత్నప్రభ గదిలోకి నడిచేసరికి రత్నప్రభ అద్దం ముందు నిలబడి తను అప్పుడే రడీ చేసిన సిల్వర్ కమీజ్ ఎలా వుందా అని మీద వేసుకుని చూసుకుంటోంది.
    చంద్రకాంత్ గది తలుపులు మూసివేస్తూంటే ఆమె పూజ వచ్చిందనుకుని "ఇంకా రడీ అవలేదు. ఇంకో అయిదు నిమిషాలుండు" అంది వెనక్కు తిరక్కుండానే.
    చంద్రకాంత్ వెనుక నుంచి వెళ్ళి అమాంతం ఆమెను కౌగలించుకుని ఆమె మెడంతా ముద్దులతో నింపేస్తూ ఆమె కళ్ళు మూసేశాడు ఓ చేత్తో.
    "ఎవరో చెప్పుకో" అన్నాడు చిలిపిగా ఆమె చెవిలో.
    రత్నప్రభ అదిరిపడింది.
    "బ్లడీఫూల్ హు ఆర్ యూ?" అంది కోపంగా గింజుకుంటూ.
    "ఉహు- నేనెవరో చెప్పుకునేవరకూ వదలను."
    ఆమెకింక తిక్కరేగిపోయింది.
    అమాంతం తన ఛాతీని చుట్టిన చేతిని అందుకుని బలంగా కొరికింది.
    దాంతో గావుకేక వేసి ఆమెను వదిలి వెనక్కు ఒక్క గెంతు గెంతాడు చంద్రకాంత్.
    అతనిని చూసి రత్నప్రభ కెవ్వున కేక వేసింది.
    అప్పుడే రివాల్వర్ క్లీన్ చేస్తున్న కనకారావుకి వినిపించిందా కేక. కాపురానికి వచ్చిన ఇన్నేళ్ళలో రత్నప్రభ భయంతో గావుకేక పెట్టటం అదే ప్రప్రథమం.  ఆ కేకే అతనికెంతో ఆనందం కలిగించింది. ఆమెతో అలాంటి కేక పెట్టించిన సందర్భం ఏమిటో ప్రత్యక్షంగా చూడాలని కోరిక కలిగింది. వెంటనే ఆ రివాల్వర్ అక్కడ పడేసి పరుగుతో తమ బెడ్ రూమ్ కి చేరుకున్నాడు. లోపల్నుంచి రత్నప్రభ "దొంగ-దొంగ" అని సైరన్ లా అరుస్తోంది.
    అప్పటికే అక్కడ గోపాల్రావు, భవానీశంకర్ నిలబడి "అత్తాజీ! ముందు డోరు ఓపెన్ చేయి - ఏం ఫర్లేదు- భయపడకు- మేమున్నాం" అని అరుస్తున్నారు.
    ఆ గొడవకు భజన్ రావు, సీతా, పూజా కూడా అక్కడికి చేరుకున్నారు.
    చంద్రకాంత్ కి పై ప్రాణాలు పైనే పోయాయి.
    "సీతాదేవిగారూ! ప్లీజ్ గొడవ చేయకండి. మీ కోరిక మీదేగా వచ్చాను" అంటున్నాడు రత్నప్రభకు దణ్ణం పెడుతూ.
    రత్నప్రభ పరుగుతో వెళ్ళి తలుపు తెరచింది.
    అదే అదనని చంద్రకాంత్ బులెట్ లాగా బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించారు. కానీ మేజర్ అతనికంటే వేగంగా పరుగెత్తి అతని కాలరు పట్టుకుని ఆపేశాడు.
    "రాస్కెల్ వదలకండి. వీడెవడో మెంటల్ గాడు. నామీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు" అంది రత్నప్రభ ఆయాసంతో రొప్పుతూ.
    "వాట్? నీమీదా?" ఆశ్చర్యపోతూ అడిగాడు కనకారావ్.
    "అవును."
    "అయితే తప్పకుండా మెంటల్ కేసే."
    "నోనోనో... యూ ఆర్ మిస్టేకెన్ ఫ్రెండ్స్! వీడు మామూలు మెంటల్ కాదు కల్నల్- సైకో డెకాయిట్."
    "సైకో డెకాయిట్టా?"
    "అవును."
    "అంటే ఏమిటి?" అనుమానంగా అడిగాడు కల్నల్.
    "అంటే దోపిడీ చేయటమే కాకుండా అత్యాచారం చేసి చంపేసే వాళ్ళన్నమాట."
    "మైగాడ్! అయితే వెంటనే పోలీస్ లకి ఫోన్ చేయాలి" అన్నాడు కల్నల్ ఫోన్ దగ్గరకెళుతూ.
    చంద్రకాంత్ కెవ్వున కేక వేసి కల్నల్ కాళ్ళు పట్టుకున్నాడు.
    "నేను సైకో డెకాయిట్ ని కాద్సార్! పోలీస్ ని పిలవకండి" అన్నాడు ఏడ్చేస్తూ.
    "కాదా? కాకపోతే మరెవరు?"
    "రచయితను సార్."
    "కల్నల్ కనకారావ్ వులిక్కిపడ్డాడు.
    "రచయితవా?"
    "అవున్సార్!"
    "చూశావా బేబీ! రచయితలంతా పరమకిరాతకులూ,దొంగలూ, లోఫర్లూ, స్కౌండ్రల్స్ అంటే నువ్వు విన్నావా? కాదు డాడీ! వాళ్ళు హీరోలన్నావు. అన్నావా?"
    పూజ చంద్రకాంత్ చొక్కా పట్టుకుని పైకి లేపింది.
    "రాస్కెల్! నువ్వు రచయితనని అబద్ధం చెప్తున్నావా? అలా చెప్తే వదిలేస్తామని అనుకుంటున్నావా?" కోపంగా అంది.
    "నేను నిజమే చెప్తున్నాను మేడమ్! నేను ధరూ జెంటిల్మన్ ని- ఫేమస్ రైటర్ని."
    "జెంటిల్మన్ అయితే నామీద ఎందుకు అత్యాచారం చేయబోయావురా బద్మాష్" బిగ్గరగా అరిచింది రత్నప్రభ.
    "మీరే కదండీ_ నన్ను సీక్రెట్ గా రమ్మన్నారు?" ఏడుపు ఆపుకుంటూ అన్నాడు చంద్రకాంత్.
    "రాస్కెల్! నేను నిన్ను రమ్మన్నానా? చెప్పుతీసుక్కొడతాను" చెప్పు తీయడానికి ప్రయత్నిస్తూ అంది రత్నప్రభ.
    "మీ ఆయన లేనప్పుడు వచ్చి కలుసుకోమంది మీరేకదా మేడమ్?"
    రత్నప్రభ చెప్పు చంద్రకాంత్ చెంప మీద ఛెళ్ళుమనేసరికి బాబోయ్ అంటూ భోరుమని ఏడ్చాడు చంద్రకాంత్.
    "నిజం చెప్పరా_ ఎవర్నువ్వు?" అడిగాడు కల్నల్.
    "నిజమే చెప్తున్నాన్సార్! నేను ఫేమస్ రైటర్ చంద్రకాంత్ ని. సీతాదేవి రమ్మందని వచ్చాను."
    ఆ మాటతో సీత వులిక్కిపడింది.
    "వాట్?" నేను రమ్మన్నానా?" అడిగిందామె.
    "మీరు కాదు సీతాదేవి" అంటూ రత్నప్రభను చూపించాడతను.
    "సీతాదేవి అంటూ నన్ను చూపిస్తావేంరా బ్రూట్" అంటూ చెప్పుతో మళ్ళీ కొట్టింది రత్నప్రభ.
    భవానీశంకర్ వాడి చొక్కా పట్టుకుని గాలిలోకి లేపాడు.
    "ఏంట్రా? నువ్వు రచయిత చంద్రకాంత్ వా?"
    "అవును."
    "నువ్వు రచయిత చంద్రకాంత్ అయితే నేనెవర్రా మరి?"
    "నాకు తెలీదు సార్!"
    "నేనూ రచయిత చంద్రకాంత్ నేరా! నీకు వేషం వేసుకోడానికి దొరక్క దొరక్క నా వేషమే దొరికిందా? రాస్కెల్- నిజం చెప్పు- ఎందుకు జొరబడ్డావు?"
    "సీతాదేవి కోసం."
    సీతాదేవి అతని చెంప పగలగొట్టింది.
    "రాస్కెల్! ఇందాకట్నుంచీ చూస్తున్నాను- మాట్లాడితే నా పేరు చెప్తున్నావు- నిన్నింతవరకూ జన్మలో చూడలేదు. నేను నిన్ను రమ్మన్నానా?"
    "సిస్టరిన్లా! మీరూరికే ఎగ్జయిట్ అవకండి. వీడెవడో సైకోడెకాయిట్ అయుంటాడని ముందే చెప్పాను కదా. వీడి సంగతేమిటో మేము తేల్చుకుంటాం- కమాన్ గోపాల్రావ్! వీడిని ముందు మన రూమ్ కి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేద్దాం" అన్నాడు భవానీ.

 Previous Page Next Page