Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 32


    "ఒరిజినల్ రైటర్ చంద్రకాంత్ వచ్చాడు సార్! సీతా మేడమ్ తనమీద లవ్ తో మెయిలిచ్చిందనీ, తనతో సీక్రెట్ గా వ్యవహారం జరపడం కోసమే భర్త ఇంట్లో లేనప్పుడు రమ్మందనీ అనుకుంటున్నాడు.
    గోపాల్రావ్ కిందపడబోయి వాష్ బేసిన్ పట్టుకుని నిలదొక్కుకున్నాడు.
    వెంటనే భవానీశంకర్ కి సైగాజేసి తన గదిలోకి నడిచాడు.
    "భజన్ రావ్! మా ఇద్దరికీ కాఫీ తీసుకురా త్వరగా" అన్నాడు మళ్ళీ భజన్ రావ్ కి కన్నుగీటుతూ.
    ముగ్గురూ గోపాల్రావ్ గదిలో సమావేశమయ్యారు.
    "మరేం లేద్సార్! ఇప్పుడు నేను చాలా కీలకమయిన పొజిషన్ లో వున్నాను. బయట విజిటర్స్ రూమ్ లో కూర్చున్నవాడు ఒరిజినల్ రైటర్ చంద్రకాంత్ అని అందరి ఎదురుగా పబ్లిక్ ఎనౌన్స్ మెంట్ చేశాననుకోండి. అప్పుడేం జరుగుతుందో మనం ఒక్క సీన్ అలా గాల్లో వేసుకుని చూసుకోవచ్చండీ. కల్నల్ గారు రివాల్వర్ తీసి భవానీశంకర్ గారి చేతిమీద కాల్చటం, అక్కడితో కదలకుండా పోలీస్ కి అప్పజెప్పటం_ ఆ కథను నిజానికి అంతటితో ఆపేసి ఫుల్ స్టాప్ అని పెట్టుకోవచ్చండీ! కానీ సీతా మేడమ్ గారు అలా ఫుల్ స్టాప్ లు పెట్టే టైప్ కాదండీ (ఇంకా వుంది) అని ప్రింట్ లో చూసుకోడానికి అలవాటుపడ్డ పాఠకురాలండీ. అందుకని గోపాల్రావ్ గారి చెంపలు ఛెళ్ళుమనిపించటమే గాకుండా కల్నల్ గారితోపాటు పుట్టింటికెళ్ళిపోవటం, విడాకులకు కోర్టులో కేసు పడేయటం ఇలా అనంతంగా సాగిపోతుందన్నమాట సార్! అంచేత..."
    "అంచేత?" ఇద్దరూ గాబరాగా అడిగారు.
    "ఎంతో కొంత క్యాష్ సర్దితే, ముగ్గురం కలిసి వాడి పీడా వదిలించుకోడానికి ఉపాయాలు ఆలోచించవచ్చండీ."
    "ఎంత కావాలి?"
    "కనీసం రెండు వేలయినా లేకపోతే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్లవుతుందండీ."
    గోపాల్రావ్ పర్సులోనుంచి కొన్ని నోట్లు తీసి అతని చేతిలో పెట్టాడు.
    "పిచ్చి వేషాలేయకుండా దీంతో ఎడ్జస్ట్ చేసుకో."
    "మరీ తక్కువగా వున్నట్లుంది సార్!"
    "నీ స్టాండర్డ్ కి అది చాలా ఎక్కువ."
    "సరే" డబ్బు జేబులో పెట్టుకున్నాడు.
    "అయితే ఇప్పుడేం చేద్దామంటారు?" అడిగాడు భజన్ రావ్.
    "సీతగారు లేరని వాడిని పంపించివేస్తే?"
    "నమ్మడండీ! పైగా మల్లెపూల చెండు కూడా తెచ్చేసుకున్నాడు."
    "బాస్టర్డ్" పళ్ళు పటపట కొరికాడు గోపాల్రావ్.
    "ఓ.కే. భజన్ రావ్! మన దగ్గరో మాస్టర్ ప్లానుంది."
    "ఏమిటి సార్ అది?"
    "ఇప్పుడు రత్నప్రభగారెక్కడుంటారు?"
    "ఫలహారం అవగానే బెడ్ రూమ్ లోకెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ తో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తుంటారండీ."
    "ఫ్యాషన్ డిజైన్సా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీ.
    "అవునండీ! మీరు గమనించటం లేదేమో! ఆవిడ ఈ మధ్యే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశారండీ. అప్పట్నుంచీ సెల్వార్ కమీజ్ అతి భయంకరమైన డిజైన్స్ తో కుట్టి పూజా మేడమ్ కి తొడిగి ప్రయోగాలు చేస్తున్నారండీ. కనుక మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచీ మధ్యాహ్నం పన్నెండువరకూ కొత్తరకం సెల్వార్ కమీజ్ డిజైన్ వేసి తను వేసుకుని అద్దంముందు నిలబడి చూసి అప్పుడు పూజా మేడమ్ కి వేసి ఫ్యాషన్ షో వాళ్ళ దగ్గరకు పంపుతారండీ. వాళ్ళకి నచ్చితే ఆ డ్రస్ ఫ్యాషన్ పెరేడ్ పోటీల్లో తీసుకుంటారన్న మాటండీ."
    "ఓ ఐ అండర్ స్టాండ్_ అయితే ఇంతకన్నా మంచి ప్లాన్ ఇంకోటి లేదా భజన్ రావ్! ఆ చంద్రకాంత్ గాడిని ఇంకొంచెం టెంప్ట్ చెయ్. సీత వాడికోసం పరితపించి పోతోందనీ, ఇంట్లో ఆమె భర్త గోపాల్రావ్ లేడు గనుక వెంటనే ఆమె గదిలోకెళ్ళి ఆమెను కౌగిట్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తమని సలహా ఇవ్వు."
    "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్! వాడెళ్ళి నా మిసెస్ ని కౌగిలించుకుంటూంటే మనం చూస్తూ "ఊరుకోవాలా?" కోపంగా అన్నాడు గోపాల్రావ్.
    "భయపడకు మిత్రమా! వాడిని పంపించేది సీత గదిలోకి కాదు. రత్నప్రభ అనగా మీ అత్తగారి గదిలోకి. ఆమే సీత అనుకుని వాడు పిచ్చివేషాలేస్తాడు! దాంతో అంతా గగ్గోలు. మేజర్ గన్ తో రావటం, వాడిని కాల్చటం లాంటి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతాయి. వాడు ఆ గాయాలతోనో ఇంటికి పరుగెత్తేస్తాడు. దాంతో వాడి పీడా మనకు శాశ్వతంగా విరగడయిపోతోంది" చెప్పాడు భవానీ.
    "ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే మాస్టర్ ప్లానండీ! ఇంతకంటే గత్యంతరం లేదు" అన్నాడు భజన్ రావ్.
    "అయితే మేమిక్కడే వుంటాం" నువ్వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తిచెయ్ బ్రదర్."
    "అలాగే సార్!" అంటూ విజిటర్స్ రూమ్ లోకి నడిచాడతను.
    చంద్రకాంత్ అతనిని చూడగానే ఆనందంగా నవ్వాడు.
    "సీతగారికి చెప్పావా నేనొచ్చానని?"
    "చెప్పాను సార్!"
    "ఏమన్నారు?"
    "మిమ్మల్ని వెంటనే తన గదిలోకి పంపించమన్నారు సార్! అయ్యగారెలాగూ సాయంత్రం అయిదు గంటలవరకూ రారు కాబట్టి తనను సాయంత్రం వరకూ డిస్టర్బ్ చేయవద్దనీ, ఎవరు వచ్చినా ఇంట్లో ఎవరూ లేరని_ చెప్పమనీ చెప్పారు సార్!"
    చంద్రకాంత్ శరీరమంతా కోరికల తాలూకూ సెగలతో నిండిపోతోంది.
    "ఆమె ఏజ్ ఎంత వుంటుంది?" రహస్యంగా అడిగాడు.
    "అ_ ఎంతోనా? ఇరవై నాలుగు సార్_ రెండు టీవీ సీరియల్స్ హీరోయిన్"
    "హా_ ఇరవై నాలుగా?" ఎగ్జయిట్ మెంటుతో అడిగాడు.
    "అవున్సార్_ ఓన్లీ ట్వంటీ ఫోర్."
    "ఫెంటాస్టిక్ ఏజే కదూ?"
    "బ్రహ్మాండమయిన ఏజ్ సార్."
    "ఆమె రూపం ఎలా వుంటుంది?"
    "చాలా ఎట్రాక్టివ్ గా వుంటుందండీ. భయంకరమయిన టేస్ట్ వున్నవాడికి. అందుకే మీ హెల్ప్ తీసుకుని టీవీ సీరియల్లో నటించాలని తెగ ఆశపడ్తోందండీ"
    "అయితే మరిక ఆలస్యం దేనికీ?"
    "అనవసరం సార్_ పదండి."
    భజన్ రావ్ వెనుకే బయల్దేరాడు చంద్రకాంత్.
    విశాలమయిన ఆ ఇల్లు చాలా ఆధునికమయిన ఫర్నిచర్ తో నిండివుండటం చూసేసరికి చంద్రకాంత్ కి కళ్ళు తిరిగినట్లనిపించింది.
    "సీతాదేవికి బాగా డబ్బుందా?"
    "తెగ డబ్బు సార్! మూలుగుతోంది. మిమ్మల్ని లైక్ చేసిందంటే మీకిక డబ్బే డబ్బు_"
    మేడమీద రత్నప్రభ గదివరకూ వెళ్ళి గది చూపించాడు భజన్ రావ్.
    "గదిలోకెళ్ళగానే తలుపేసుకోండి. సాయంత్రంవరకూ తియ్యనక్కర్లేదు."
    "థాంక్యూ మిస్టర్! నీ పేరేమిటి?"
    "భజన్ రావండీ."
    "చాలా మంచిపేరు_ నీ ఋణం తీర్చుకోలేనోయ్."
    "తీర్చుకోగలరండీ_ ఓ అయిదొందలు కొడితే"

 Previous Page Next Page