Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 34


    గోపాల్రావ్, భవానీశంకర్ కలిసి అతనిని తమ గదిలోకి ఈడ్చుకొచ్చారు.
    "మనం వీడిని పోలీస్ లకి అప్పజెప్తే అన్ని విషయాలూ బయటపడతాయి ఇప్పుడే ఫోన్ చేస్తాను" అన్నాడు కనకారావ్ ఫోన్ తీసుకుంటూ.
    భవానీ చప్పున అడ్డుపడ్డాడు.
    "నోనో... మేజర్! పోలీస్ వరకూ వెళ్ళటం మంచిది కాదు. సీతాదేవి రమ్మని పిలిచింది అని వాడు పోలీస్ దగ్గర కూడా వాగితే- వాళ్ళా విషయం న్యూస్ పేపరుకిస్తారు. దాంతో మన పరువు రోడ్డున పడిపోతుంది. సమజ్ నేకీ బాత్ హై కల్నల్ జీ?"
    కనకారావ్ ఫోన్ వదిలేశాడు.
    భవానీశంకర్ తన రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేశాడు.
    గోపాల్రావ్ చంద్రకాంత్ ని చొక్కా పట్టుకుని గాల్లోకి లేపాడు.
    "ఎవర్రా నువ్వు?"
    "బై గాడ్ చెప్తున్నా సార్! నేను ఫేమస్ రైటర్ చంద్రకాంత్ ని."
    "ఇక్కడికెందుకొచ్చావ్ నువ్వు?"
    "సీతా గోపాల్రావ్ అనే ఆవిడ సీక్రెట్ గా వచ్చి కలుసుకోమని మెయిలిచ్చింది సార్!"
    డొక్కలో కాలితో తన్నాడు గోపాల్రావ్.
    "రాస్కెల్! అబద్ధం చెప్తున్నావా- నిజం చెప్పు ఎవడివి నువ్వు?"
    "నిజం సార్! నేను రచయిత చంద్రకాంత్ ని."
    మళ్ళీ ఒక్క తన్ను తన్నాడు గోపాల్రావ్. చంద్రకాంత్ వచ్చి భవానీశంకర్ కాళ్ళమీద పడ్డాడు. భవానీశంకర్ మరో కిక్ ఇచ్చాడు.
    "ఓరి దేవుడో! నన్ను వీళ్ళు చంపేస్తున్నార్రోయ్-... నన్ను రక్షించండి బాబోయ్!" అంటూ బిగ్గరగా అరుస్తూంటే నోటి మీద కొట్టాడు గోపాల్రావ్.
    "నోర్మూసుకో ముందు."
    అతను నోరు మూసేశాడు.
    "ఇప్పుడు చెప్పు- ఎవరు నువ్వు?"
    "నిజంగానే చెప్తున్నా సార్! ప్రామిస్- రచయిత చంద్రకాం.."
    "మళ్ళీ తన్నాడు గోపాల్రావ్.
    "మళ్ళీ చెప్పు- ఎవర్నువ్వు?"
    "రచయిత చం..."
    మరో తన్ను.
    "ఇప్పుడు చెప్పు- ఎవర్నువ్వు?"
    "రచయ.. కాద్సార్... నేను చంద్రకాంత్ ని కాదు... రచయితను కాదు."
    "అయితే నీ పేరేమిటి?"
    "ఏమో సార్! తెలీదు."
    "అలా దారికిరా- ఇంకోసారి నీ పేరు రచయిత చంద్రకాంత్ అన్నావంటే నీ అంతు తేలుస్తాను."
    "ఛస్తే అనను సార్! అంటే చంపేయండి."
    "అయితే ఇప్పుడిక్కడికి ఎందుకొచ్చావ్?"
    "సీతాదేవిగారు...."
    మళ్ళీ తన్నాడు గోపాల్రావ్.
    "ఇప్పుడు చెప్పు- ఎందుకొచ్చావ్?"
    "నాకు తెలీదు సార్!"
    "తెలీకుండా ఎలా వుంటుంది?"
    "నిజంగానే చెప్తున్నా సార్! నాకు తెలీకుండానే వచ్చేశాను."
    "అంటే నీకు మతిస్థిరం లేదన్నమాట."
    "ఉంది సార్! అహహ... కొట్టకండి సార్!... మతిస్థిరం లేని వాడిని."
    "ఇంకెప్పుడయినా నువ్వు రచయిత చంద్రకాంత్ నని ఎవరి దగ్గరయినా అంటావా?"
    "ఛస్తే అనను సార్!"
    "ఇంకెప్పుడయినా ఈ ఏరియాలో కనబడతావా?"
    "ఛస్తే కనబడను సార్!"
    "నీ ఇల్లెక్కడ?"
    "ఖమ్మం సార్!"
    "ఇంకో పది రోజులదాకా నువ్వు ఖమ్మం వదిలావంటే నిన్ను చట్నీ చేస్తాం. సరేనా?"
    "సరే సార్! ఇక వదిలెయ్యండి సార్! వళ్ళంతా హునమయిపోయింది."
    "సరే- వెనక్కు తిరిగి చూడకుండా ఫో!"
    తలుపు తెరవగానే కుంటుకుంటూనే శరవేగంతో పరుగెత్తాడు చంద్రకాంత్.
    అప్పుడే ఫోన్ మోగింది.
    "కల్నల్ కనకారావ్ హియర్!"
    "హలో కల్నల్! నేను ఇన్ స్పెక్టర్ రాంబాబుని మాట్లాడుతున్నాను."
    "ఎస్... వాడ్డూయూ వాంట్?"
    "మీరు బ్యాంకు లాకర్లో వుంచిన వజ్రాలు రెండూ బ్యాంకు రాబరర్స్ ఎత్తుకుపోయారు"
    కనకారావ్ అదిరిపడ్డాడు.
    "వాట్! నా డైమండ్స్ ఎత్తుకుపోయారా?"
    "అవును."
    "ఎప్పుడు?"
    "రెండ్రోజుల క్రితం బ్యాంకు రాబరీ జరిగింది. అప్పటినుంచీ మిమ్మల్ని వెతుకుతున్నాం. చివరకు ఇప్పటికి మీ అమ్మాయి ఇంటి ఫోన్ నెంబర్ సంపాదించగలిగాం."
    "మైగాడ్! ఇంతవరకూ ఆ రాబరర్స్ ని పట్టుకోలేదా మీరు?"
    "లేదు. ఆ విషయంలోనే మీ సాయం కావాలి. మీరు అర్జంటుగా పోలీస్ స్టేషన్ కి రావాలి."
    "ఎందుకు?"  
    "ఆరోజు దోపిడీ చేసినవాళ్ళు మీ ఇంటి రోడ్డుమీద నుంచే పారిపోతూంటే మీరు ఆ జీప్ మీద కాల్పులు జరిపారని మీ చుట్టుపక్కలవాళ్ళు చెప్పారు."
    "వాట్! ఆ రోజు మా కుక్కపిల్లను చంపబోయింది ఆ డెకాయిట్సేనా?"
    "ఎస్!"
    "అయితే మరి అప్పుడే నాకెందుకు చెప్పలేదా విషయం?"
    "అప్పటికింకా వాళ్ళే దొంగలని తెలీదు."
    "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ స్పెక్టర్? వాళ్ళే డెకాయిట్స్ అంటున్నారు- వాళ్ళు దొంగలని తెలీదంటున్నారు. మీరు మందుకొట్టి మాట్లాడుతున్నారా?"
    "కల్నల్! మీరు వెంటనే పోలీస్ స్టేషన్ కి రండి. ఎక్కువ మాట్లాటం మంచిది కాదు. లేకపోతే మేమే రావాల్సి వస్తుంది."
    "ఓకే! అయామ్ కమింగ్."
    ఫోన్ పెట్టేశాడు.
    "ఏమయింది డాడీ?" అడిగింది సీత.
    "మన ఫ్యామిలీ డైమండ్స్ బ్యాంకు లాకర్లో నుంచి దొంగలు కాజేశారట."
    "మైగాడ్! చాలా కాస్ట్ లీ డైమండ్స్ కదు డాడీ?"
    "అవును- పాతిక్కోట్లుంటుంది."
    "నేను ముందే చెప్పాను- అంత ఖరీదయినవి మన దగ్గరెందుకు- అమ్మిపారేసి క్యాష్ బ్యాంకులో వేయండీ అని. విన్నారా?" రత్నప్రభ మండిపడుతూ అంది.
    "డోంటాక్! వాటినెలా అమ్ముతామే- పది తరాల్నుంచీ వస్తున్నాయి. మా పూర్వీకులు ఒకప్పుడు రాజుల దగ్గర సేనాపతిగా యుద్ధాలు గెలిచినందుకు రాజుగారే స్వయంగా బహుమతిగా ఇచ్చారంట. అలాంటివాటిని మనం అమ్మిపారేయటమా? నో!"

 Previous Page Next Page