పదకొండు బృందాలు పదకొండు గ్రామాలకు చేరుకొని రెప్పవాల్చకుండా, పటిష్టంగా నిఘాకాయనారంభించాయి.
ప్రతి బృందం దగ్గర ఒక వైర్ లెస్ సెట్ ఉంది.
తలచుకొనే ఏ క్షణంలోనయినా సెంట్రల్ స్క్వాడ్ ని కాంటాక్ట్ చేయవచ్చు. అవసరమయ్యే అదనపు బలగాలు అరగంటలోపే అందే ఏర్పాట్లు.
సెంట్రల్ స్క్వాడ్ అధినేత రంజిత్_ అతనికింద ఉన్న శర్మ, ఎస్.ఐ.దినేష్, పాలార్ రేంజర్ అవసరమయ్యే ఏ సహాయాన్నయినా అందించేందుకు సంసిద్ధులై ఉన్నారు.
ప్రతి గ్రామం గంభీరత ముసుగులో ఉద్రిక్తత అంచుకు చేరుకుంది.
అప్పటివరకు అలాంటి చర్య వీరూకి వ్యతిరేకంగా ఎవరూ తీసుకోలేదు_ ఎప్పుడూ తీసుకోలేదు.
పచారీకొట్లు మౌనాన్ని ఆశ్రయించాయి. నిత్యావసర వస్తువుల కోసం మామూలుగా వచ్చే ప్రజలు ఇళ్ళు కదలటంలేదు. ఆ విజిలెన్స్ వారిని భయభ్రాంతుల్ని చేసింది.
రెండు శాఖల సిబ్బంది బూట్ల నాడాలు శబ్దం పరిసర ప్రాంతాల గ్రామాల్లో అనూహ్యమయిన ఉద్విగ్నతకి కారణమయింది.
కంటిమీద కునుకు లేదు.
కాపలాకి విశ్రాంతి లేదు.
ఆ అనూహ్య పరిణామాన్ని ఎవ్వరూ వూహించలేదు. ఆ గ్రామాల ప్రజలకు తెలుసు_ వీరూ తన అనుచరులతో ఆ చుట్టుపక్కల అడవుల్లోనే మకాం చేస్తున్నాడని.
అందుకే వారి కళ్ళలో భయోద్వేగాలు చోటుచేసుకున్నాయి.
వీరూకి పచారి సామాన్లు కావాలి_అందులో సందేహం లేదు_ అవి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే వెళ్ళాలి_ అందులోనూ డౌట్ లేదు. ఇప్పుడెలా?
ఈ ఆలోచనలే ప్రతి ఒక్కరిలో చోటుచేసుకున్నాయి.
నిశ్శబ్దాన్ని ఆశ్రయించిన పదకొండు గ్రామాలు_
మౌనాన్ని కప్పుకొన్న పచారీ కొట్లు_
వాటి పరిసరాల్లో పొంచివున్న పహరా_
వీరూ హైడవుట్ లో అతని అనుచరులు.
వారిముందు తరిగిపోతున్న పచారీ సామాన్ల నిల్వలు_
మాటువేసి పొంచివున్న ఎస్.పి_
ఆ మాటుని మాయచేసో మభ్యపెట్టో ఆకలి తీర్చుకోవలసిన చిరుతపులి అనుచరులు_
అదెలా పరిణమిస్తుందోనని బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.... అభద్రతాభావపు భయాందోళనలతో పహరాకాస్తున్న సిబ్బంది_
చల్లటి అటవీ ప్రాంతం_
వేడెక్కిన మస్తిష్కాలు_ పదునుదేలిన మాటు_ క్షణాలు_నిమిషాలు_గంటలు_భారంగా నడుస్తూ ఒక రోజుని మింగేశాయి.
వీరూ ఆటని కట్టించే అసాధారణ చర్య!
అనూహ్యమయిన పథక రచన_
ఎవరు దీని వెనుక ఉన్నది? ఎవరు దీనికి రూపకల్పన చేసింది అనే ఆసక్తి, ఆశ్చర్యం, ఆందోళనల్లోంచీ రంజిత్ పేరు క్రమంగా బయటకు రాసాగింది. దాంతో అతని ప్రాణాలకు ముప్పు కూడా పెరగ నారంభిమ్చింది.
సరీగ్గా అదే సమయంలో ఎమ్.ఎమ్.హిల్స్ లో టీ పాక వెనుక_ చీకటిమాటున కెంపమ్మ ఓ వ్యక్తితో లోస్థాయిలో సంభాషిస్తోంది. ఆమె కంఠంలో ఆందోళన స్పష్టంగా తొంగిచూస్తోంది.
ఆ రాత్రి ఎనిమిది గంటలకు ప్రకాశ్ పాలాయం చర్చ్ ఫాదర్ జోసెఫ్ మహిమ, విజయ్ లని కలిసేందుకు అంగీకరించాడు.
అంతకుముందు తమని అడ్డుకున్న వ్యక్తే వచ్చి ఆ ఇద్దర్నీ లోపలకు తీసుకెళ్ళాడు.
చిన్న హాలు_అటూ, అటూ వరుసగా బెంచీలు_
ఎదురుగా శిలువ వేయబడిన క్రీస్తు శిల్పం....
ముందున్న రాతి కట్టడంపై సగం వెలిగి ఆరిపోయిన వందలాది కొవ్వొత్తులు.... పవిత్రత.... ప్రశాంతత.... నిశ్శబ్దం.... అక్కడి వాతావరణంలో ఇమిడిపోయున్నాయి.
ఆ వ్యక్తి ఇద్దర్నీ హాలుకి చివర ఎడంవైపున్న మరో ద్వారం ద్వారా వేరే గదిలోకి తీసుకువెళ్ళాడు.
చిన్న గది....ఓ మూల చెక్కలతో చేసిన మంచం....
దానిపై పల్చటి పరుపు.... దానిమీద కూర్చునున్నాడు ఒక పండు ముసలి.... జుత్తంతా వెండి రంగులోకి మారి, నుదురు ముడతలుపడి.... బుగ్గలు లోతుకుపోయి ఉన్నాయి.
మహిమని, విజయ్ ని ఒక్కసారి తలెత్తి చూశాడాయన.
నిశితమయిన చూపులు....
వాటిలో కరుణ.... ప్రశాంతత.... నిశ్చలత.... ఆత్మస్థయిర్యం.... సత్యాన్వేషణ....
ఆయన్ని చూస్తూనే చిరు గగుర్పాటు కలిగింది ఇద్దరిలో_ నిద్రలేమి, అలసట_ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా చురుగ్గా ఉన్నాయి చూపులు.
కొద్ది నిమిషాల ముందే మూడు రాష్ట్రాల పోలీసులు నిద్రాహారాలు మానేసి ఏ వ్యక్తికోసం అయితే గాలిస్తున్నారో, ఆ వ్యక్తి వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు కానీ, ఆపైన తాము వచ్చినందుకుగానీ ఆయనేమీ రియాక్ట్ అయినట్లుగా కనిపించలేదు.
అనెమోషనల్....భావోద్వేగాలకు చలించని అలౌకిక పరిపూర్ణత_ ఆవేదనాభరిత అనుభవాల్ని వేదాంతభరితమయిన నిర్లిప్తత అంచులకు తరిమేసిన పరిపూర్ణత్వం....
అసంకల్పితంగా ఇద్దరూ ఆయనకి నమస్కరించి, నించునే ఉండిపోయారు.
ఇద్దర్నీ కూర్చోమన్నట్లుగా సంజ్ఞ చేశారాయన. మంచితనానికి, మానవత్వానికి, దైవత్వానికి ప్రతిరూపం ఈయన. చట్టపరమైన నిబద్ధత, న్యాయపరమయిన పంథాలేని నేరస్తుడు అతను. ఇద్దరూ కలుస్తుంటారు, సంభాషించుకుంటుంటారు. ఎవరేమిటో ఆ ఇద్దరికీ తెలుసు. ఈ భిన్న ధృవాల సంధిలో ఏర్పడ్డది అవగాహనో....అనుబంధమో.... ఆత్మీయతో ప్రపంచానికి అందనిది. అర్థంకానిది కొన్ని క్షణాల్లోనే ఎన్నో సందేహ మహిమని వరద ప్రవాహంలా ముంచెత్తాయి. ఈ ఇద్దరూ మాట్లాడటాన్ని అవకాశం ఇచ్చేందుకే అన్నట్లు, ఆయన మౌనాన్ని ఆశ్రయించారు.
వారి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం పేరుకుంది.
మానసిక సమాయత్త ప్రయత్నాలు....
కాలం భారంగా దొర్లిపోతోంది.
* * * *
"యజమానరే ఈ ప్రాంతంలోనే తన అనుచరులతో మకాం వేస్తున్నారు. మూడు రోజుల క్రితం కొనుక్కెళ్ళిన వెచ్చాలు తరిగిపోవస్తున్నాయి. యాభైమందికి పైగా ఉన్నారు. అన్ని గ్రామాల వెచ్చాల సంతపై పోలీసు నిఘా ఉంది. ఎలాగో....ఏమో?" కెంపమ్మ ఆందోళనగా అంది.
"ఈ ప్రాంతం నుంచి మకాం మార్చి వేరే ప్రాంతానికి వెళితే ఆ వ్యక్తి అన్నాడు.
"బాగానే ఉంటుంది. కాని మరో సురక్షితమయిన ప్రాంతానికి వెళ్ళటానికి మూడు రోజులు పడుతుంది. అడవిలో వాతావరణ పరిస్థితులు బాగాలేవు. జోరున వర్షం....ఈదురు గాలులు.... కొండ చరియలు ఇరిగి పడుతున్నాయి.... పెద్ద పెద్ద మానులు కూకటివేళ్ళతో కూలిపోతున్నాయి. అడవంతా భీభత్సంగా వుంది.
అనుచరులు నాలుగు రోజులుగా, రాత్రింబవళ్ళు ఆ అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనే పనిచేసి సరుకును తరలించారు. చాలామంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. కదిలే పరిస్థితుల్లో లేరు. వర్షానికి చలికి తల దాచుకొనే మరో మకాం దగ్గర్లో లేదు. అదే నా ఆందోళన...." అంది కెంపమ్మ బాధను వ్యక్తం చేస్తూ.