Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 32

"నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చేసరికి నువ్వు స్పృహ తప్పిపడి ఉన్నావు స్వప్నా. నీ పక్కనే ఉంది ఒక యెతి."
"కోతా ?" అంది స్వప్న మొహం చిట్లిస్తూ.
"కోతి కాదు ! యెతి! నరవానరం! మిస్సింగ్ లింక్ అంటాడు చూడూ - కోతులకీ, మనుషులకీ మధ్య ఒక జీవి ఉండేదే - అది!"
ఎదుటివ్యక్తి కల్తీలేని అబద్ధాలు చెబుతున్నట్లు తెలిసిపోతే, ఎంత అసహనంగా చూస్తారో,అంత అసహనంగా చూసింది స్వప్న.
"నన్ను చూసి ఆ నరవానరం వెళ్ళిపోయింది. సమయానికి నేను కనుక రాకపోతే ఆ యెతి నిన్ను ఎత్తుకువెళ్ళిపోయి, సరదా తీరేదాకా తన గుహలో ఉంచేసుకునేదేమో! హిమాలయాల దగ్గర ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని చెప్పుకుంటారు. యెతి వెళ్ళీవెళ్ళగానే వచ్చింది ఒక పెద్దపులి. కాల్చాను తగల్లేదు, పారిపోయింది"
"చిన్నపిల్లలు పిట్టలని కొట్టే కేటపుల్ట్ పెట్టి కొట్టావా? ఇంత దగ్గరనుంచీ తుపాకీతో కాలిస్తే తగలలేదంటే ఎవరు నమ్ముతారు? ఈ కాకమ్మ కథలు..."
"నమ్మితే నమ్ము! లేకపోతే లేదు! కానీ నిజం అదే. ఈలోగా ఆ పులి మళ్ళీ వెనకనుంచీ వచ్చి నామీద దూకింది. మళ్ళీ కాల్చాను."
"మళ్ళీ పారిపోయిందా?" అంది స్వప్న వెక్కిరింపుగా.
బ్బందిగా కదిలాడు సందీప్. "యా...! నిజంగానే మళ్ళీ పారిపోయింది."
బోర్ గా చూసింది స్వప్న. "ఐ పిటీ యూ ! నీకు తుపాకీ కాల్చడమే కాదు, కట్టు కథలు చెప్పడం కూడా చేతకానట్లుంది" అని ఆగి, "జీసస్! అదేం పాము ? కట్ల పామా ?" అంది అతనికి దగ్గరగా జరుగుతూ.
పొదలలో నుంచీ పసుపు రంగు పాము ఒకటి కనబడుతోంది, నల్లటి మచ్చలున్నాయి దానిమీద.
దగ్గరగా వెళ్ళి చూశాడు సందీప్. పాము కాదు అది, పులి తోక! ఆ తోక కదలడం లేదు.
బహుశా మరణించి ఉండాలి పెద్దపులి.
ముందు జాగ్రత్తగల వేటగాడు, పులిలాంటి జంతువుని కాల్చిన తర్వాత, అది చనిపోయినదని రూఢీ చేసుకున్నదాకా దాన్ని సమీపించడు. దెబ్బతిన్న పులి రెచ్చిపోయి, అతి ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంది.
చిన్న గులకరాళ్ళు కొన్ని ఏరి, ఆ పొదమీదా, పులి తోకమీదా వేశాడు సందీప్. అతని రెండో చేతిలో తుపాకీ రెడీగా వుంది.
పులిలో చలనం లేదు.
ధైర్యం చేసి, పొదచాటుకి వెళ్ళాడు. అక్కడ అచేతనంగా పడి ఉంది పెద్దపులి. సరిగ్గా దాని గుండెకి తగిలింది తుపాకీ దెబ్బ.
స్వప్న ఒక్కసారిగా శ్వాస తీసుకున్న శబ్దం వినబడింది.
"ఇప్పుడన్నా నమ్ముతావా ?" అన్నాడు సందీప్.
స్వప్న సమాధానం చెప్పకుండా కళ్ళప్పగించి మరోవైపు చూస్తోంది. తనుకూడా అటు చూశాడు. ఇంకో పది గజాల దూరంలో మరో పులి చచ్చి పడి వుంది.
జరిగిందేమిటో అర్థమయింది సందీప్ కి. తను చూసింది ఒక పులిని కాదు, రెండు పులులను. మొదట ఒక పులిని కాల్చాడు. అది పొదల్లోకి వెళ్ళి చచ్చిపోయింది. రెండోవైపు నుంచీ మరో పులి వచ్చింది. దాన్నీ కాల్చాడు. అదీ కొంతదూరం పరిగెత్తి చచ్చి పడిపోయింది.
మొదటి పులికి మరింత దగ్గరగా వెళ్ళి చూశాడు. తను ఊహించినట్లే ముందు కాలికి గాయాలు ఉన్నాయి. చీము పట్టి ఉంది. ఆ గాయాలలో నుంచీ ముళ్ళ పంది ముళ్ళు కనబడుతున్నాయి.
చాలా విషయాల్లో తెలివిగా ప్రవర్తించే పెద్దపులి ముళ్ళపంది విషయంలో మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. పోరాటం సమయంలో ముళ్ళపంది ముళ్ళు (నిజానికి అవి రూపాంతరం చెందిన వెంట్రుకలే) దాని శరీరం నుంచీ వదులై విడివడి, శత్రువు శరీరంలో గుచ్చుకుంటాయి. దాని ముళ్ళకు బేస్ కి అభిముఖంగా చిన్న చిన్న కొక్కేలవంటివి ఉంటాయి. ఈ కొక్కాలు ముల్లుని శత్రువు శరీరంలో నుంచీ బయటకు రానివ్వవు. పైగా శత్రువు కండరాలు బాధతో ముడుచుకున్నప్పుడల్లా, ముల్లు శరీరంలో ముందుకు ప్రయాణం చేస్తూ పోతుంది. లోపల ఏ ఎముకకో తగిలి, అర్ధచంద్రాకారంగా ఒంపు తిరిగి, స్థిరంగా ఆ శరీరంలోనే ఉండిపోయి సెప్టిక్ అయ్యేలా చేస్తుంది.

 Previous Page Next Page