Previous Page Next Page 
హైజాక్ పేజి 32

ఇదంతా ఉద్వేగంతో చూస్తోంది సుజాత. ప్రాణాలు తియ్యడానికి అలవాటు పడ్డ చేతులతనివి. వాటితో ప్రాణాలు పొయ్యగలడా! పుట్టబోయే పసిపాప ఇతని పాపపు చేతులను తగిలీ తగలగానే పురిట్లోనే చనిపోతుందా?
అసహనంగా పిడికిళ్ళు గట్టిగా మూసి ఉంచి, కోపాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది సుజాత.
కొద్ది నిమిషాల సేపు, వినేవాళ్ళ హృదయాలు ద్రవించి పోయేటట్లుగా, స్వాతి మూలుగులు. ఎక్కడో పెద్ద హాస్పిటల్లో, ఎక్స్ పర్టు డాక్టర్ల పర్యవేక్షణంలో పురుడు పోసుకోవలసిన ఆ పెద్దింటి కోడలు ఇక్కడ ఈ విమానంలో టాయిలెట్స్ ముందు పొర్లుతూ, దుస్సహమైన ప్రసవ వేదన పడుతోంది.
తల్లి గర్భంలో నుంచి జారి తల బయటికి పెట్టింది శిశువు.
గావుకేక పెట్టింది స్వాతి. వెంటనే భారమంతా తగ్గిపోయి ఒళ్ళు తేలికైపోయిన ఫీలింగ్, ఒక్కక్షణం నిశ్శబ్దం. వెచ్చగా, భద్రంగా ఉన్న తల్లి గర్భంలో నుంచి, కొత్త వాతావరణంలోకి వచ్చిన ఆ పసిపాప "ఉంగా" అని ఏడ్చి, మొదటిసారిగా ఊపిరి పీల్చుకుంది.
అందరి మొహాల్లోనూ టెన్షన్ కాస్త తగ్గింది. రాజేందర్ సంతోషం ఆపుకోలేక సీట్లోనుంచి లేచి, డాన్సు చేస్తున్నట్లు చిటికెలు వేస్తూ రెండు అడుగులు వెయ్యబోయి, అంతలోనే ఇక్బాల్ చూపులు గమనించి కూర్చుండిపోయాడు.
సినీ హీరోయిన్ శాలిని తదేకంగా చూస్తోంది. ఇలాంటి ప్రసవవేదన కెమెరా ముందు ఎన్నోసార్లు అభినయించింది తను. సినిమాల్లో ఉత్తుత్త తాళి కట్టించుకుంది వందసార్లు, ఉత్తుత్తగా తల్లి అయింది. ఎవరో అమ్మ కన్నపాపలను తను పమిట చాటుకి చేర్చుకుని ఉత్తుత్తగా పాలు ఇచ్చింది.
అమోఘమైన నటన అని బ్రహ్మరథం పట్టారు ప్రజలూ, పత్రికలవాళ్ళూ, అంతులేని పేరొచ్చింది, అనంతంగా డబ్బొస్తోంది తనకు, తన నటన వల్ల!
ఈ జీవితంలో నటించే అవకాశం మళ్ళీ వస్తుందా తనకు? ఈ హైజాకర్ల బారినుండి బయటపడి కెమెరా ముందు నిలబడి నటిస్తుందా?
నటన!
చటుక్కున ఏదో స్ఫురించినట్లు ఆమె పెదిమలు అరవిచ్చుకున్నాయి. ప్రొఫైల్ లో తన చిరునవ్వు అత్యద్భుతంగా కనబడుతుందని తెలుసు శాలినికి. అందుకు క్రీగంటి చూపు తోడైతే...
చిరునవ్వుకి క్రీగంటి చూపు జోడించి విక్టర్ వైపు చూసింది శాలిని, అరక్షణం సేపు.
అతను ఆమెనే నిర్నిమేషంగా చూస్తున్నాడు.
మెల్లిగా కుడిభుజం కొద్దిగా ఎత్తింది శాలిని. పమిట అలవోకగా జారిపోవడం మొదలెట్టింది.
ప్రయాణీకులలోని అయోమయం ప్రొఫెసర్ సుందరం బుర్ర గోక్కుంటూ తలెత్తి చూశాడు. దగ్గరలోనే ఉన్న ఇక్బాల్ కనబడ్డాడు ఆయనకి.
"నేనేదో మర్చిపోయాను! ఇప్పుడేం కొంపలంటుకుపోవు! కదలకుండా కూర్చో!" అన్నాడు ఇక్బాల్ కరుస్తున్నట్లు.
అనీజీగా కూర్చున్నాడు ప్రొఫెసర్ సుందరం.
అప్పుడే పుట్టిన పసిపాప ఏడుస్తూనే ఉంది.
"అంకుల్! అమ్మాయా? అబ్బాయా?" అంది స్మిత జిజ్ఞాసని ఆపుకోలేక.
"అబ్బాయే!" అంది మోనిక, కర్టెన్ చాటునుంచి బయటికి వస్తూ.
"అయితే వాడి పేరు విమాన్ కుమార్ అని పెట్టొచ్చు, పవన్ కుమార్ లాగా! అవునా?"
"ఏయ్ బేబీ! మాట్లాడకుండా కూర్చో!" అని గద్దించాడు శతృఘ్న, టాయిలెట్లో చేతులు శుభ్రం చేసుకుని బయటికి వస్తూ.
శతృఘ్న టాయిలెట్ లో నుంచి బయటికి రావడం చూడగానే ప్రొఫెసర్ సుందరం మొహం వికసించింది. గబుక్కున లేచి నిలబడ్డాడు.
"ఇందాకట్నుంచీ ఏమిటా మర్చిపోయాను అనుకుంటున్నాను. గుర్తొచ్చింది! నేను అర్జెంటుగా టాయిలెట్ కి వెళ్ళాలి!"
"ఓర్నీ!" అన్నట్లు వింతగా చూశాడు ఇక్బాల్. మతిమరుపు ప్రొఫెసర్ గురించి అతను కొన్ని జోకులు విని ఉన్నాడు గానీ, అలాంటివాళ్ళని చూడటం ఇదే మొదటిసారి.
"కాసేపాగు!"
"అమ్మో! అర్జెంటు!" అన్నాడు ప్రొఫెసర్, రెండు కాళ్ళు దగ్గరగా పెట్టేసుకుని సతమతమయిపోతూ.
"తీసుకెళ్ళు!" అన్నాడు శతృఘ్న.
స"సరే నడు!" అన్నాడు ఇక్బాల్. "పిచ్చివేషాలేశావా, సిగదరగ! టాపులేపేస్తా జాగ్రత్త!" అని హెచ్చరించి టాయిలెట్ వైపు తీసుకెళ్ళాడు.
లోపలికెళ్ళి తలుపు వేసుకోబోయాడు ప్రొఫెసర్.
వెంటనే తలుపుకి కాలు అడ్డం పెట్టాడు ఇక్బాల్. "తలుపెయ్యకు బాబ్జీ! పని కానివ్వు."
ప్రొఫెసర్ సుందరం మొహం చెక్కుతీసిన బీట్ రూట్ లా ఎర్రబడింది.
"త్వరగా!" అని గద్దించాడు ఇక్బాల్.
హడలిపోతూ రెండు నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు ప్రొఫెసరు. బాగా వంగిపోయి ఉన్నాడు మనిషి. నిటారుగా నిలబడలేకపోతున్నాడు. యమ యాతన పడిపోతున్నట్లు బాధగా పెట్టాడు మొహం.

 Previous Page Next Page