Previous Page Next Page 
సీతాచరితం పేజి 32


    "కైకా! తెలివిలేనిదానా! నీకు పెద్ద అపాయం రాబోతున్నది. వేసవిలో నదులు ఎండిపోతాయి. అలా నీ సంపద అంతరించిపోనున్నది." మంధర ఇంకా రొప్పుతూనే ఉంది. ఆమె ముఖం చూస్తే ఏదో ముంచుకొని వచ్చినట్లే ఉంది.


    "ఏమిటే! నీకిప్పుడు వచ్చిన లోటేమి? రానున్న ఆపదఏమి?" కైక ప్రశాంతంగా అడిగింది.


    "మెల్లగా ఆపద అంటావా? తలమీదికి వచ్చేసింది. రాముడు రాజు అవుతున్నాడు. రేపే పట్టాభిషేకం. నీ మొగుడు నంగనాచి నక్క. పైకి మెత్తగా కనిపిస్తాడు. వాస్తవానికి నీకు పరమ శత్రువు. చూచానా భరతుణ్ణి మీ పుట్టింటికి పంపించాడు. గప్ చిప్ గా రామునికి పట్టం కడుతున్నాడు. రాముడు రాజవుతాడు. కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్విలా దాసికింద జమే. నీకు కీడు మూడింది. ముసలివాడు నిన్ను ముంచుతాడు."


    కైక మంధర మాటలు విన్నది. శరత్కాల చంద్రరేఖలా లేచి కూర్చుంది. సంతోషవార్త అందించినందుకు సంతోషించింది. మెడలోంచి తన హారం తీసింది. మంధరకు బహూకరించింది. అన్నది:-


    "మంధరా! ఎంత మంచిమాట చెప్పావే! నాకు రాముడొక్కటీ, భరతుడు ఒకటీనా? ఇద్దరూ ఒక్కటే. రాజు రామునికి పట్టం కడ్తున్నాడన్నావు. అంతకంటె మంచివార్త ఏం కావాలి? ఏం కావాలో కోరుకో. ఇచ్చేస్తా."


    మంధర అరికాలిమంట నెత్తికి ఎక్కింది. కైక ఇచ్చిన హారం నేలక్కొట్టింది. పిచ్చిదానిలా ఉన్నావు. నీ అంత పిచ్చిది నాక్కనిపించలేదు. ఒకవైపు కొంపలంటుకుంటున్నాయి. నువ్వేమో నువ్వుతున్నావు. నిన్ను చూచి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. సవితి కొడుకు రాజవుతుంటే సంతోషించే ఆడది వుంటుందా? రాముడు తెలివైనవాడు. భరతుడు శత్రువని అతనికి తెలుసు. రాముడు రాజవుతే నిన్ను బ్రతకనిస్తాడా? కౌసల్య సకల ఐశ్యర్యాలతో తులతూగుతుంది. నువ్వూ నేను దాసీలం అవుతాం. నీ కొడుకు రామునికి ఊడిగం చేయాలి" అని మొత్తుకున్నది.


    అయినా కైక మనసు మారలేదు. ఆమెను రాముని మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆమె రాముణ్ణి కొనియాడింది. "రాముడు ధర్మజ్ఞుడు. కృతజ్ఞుడు. సత్యవాది. గురువుల వద్ద శిక్షణ పొందినవాడు. దశరథునికి పెద్దకొడుకు. అతడే రాజు కావాలి. రాముడు నూరేండ్లు రాజ్యం పాలిస్తాడు. తరవాత భరతునికి ఇస్తాడు. రాముడు మంచివాడు నాకు తెలుసు" అన్నది.


    కైక రాముని కీర్తిస్తుంటే, మంధరకు దుఃఖం ముంచుకువచ్చింది. "ఒసే పిచ్చిదానా! రాముడు రాజయినాక భరతునికి రాజ్యం ఎలావస్తుందే. రాముని తరువాత రాముని కొడుక్కు రాజ్యం వస్తుంది. రాజు కొడుకులంతా రాజులు కారు. పెద్దవానిదే రాజ్యం. అసలు నువ్వు మొదలే తప్పు చేశావు. భరతుని మేనమామల ఇంట్లో ఉంచుతూ వచ్చావు. తీగలు దగ్గరున్న చెట్టును అలముకుంటాయి. రాముడు దగ్గర ఉన్నాడు. దశరథునికి ప్రియుడైనాడు. రాజ్యం సంపాదిస్తున్నాడు.


    "రాముడు రాజయితే భరతుణ్ణి బతకనిస్తాడనుకున్నావా? చంపేస్తాడు. తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకుంటాడు. రాముడు రాజయితే భరతుడు ఇక్కడికి రానే రావద్దు. అడవికి వెళ్లి ఆకలములు తినడం మేలు. "మరోమాట, కౌసల్యకు నువ్వెన్నడన్నా సహించావా? ఆమె ఊరుకుంటుందా? నీ మీద కసితీర్చుకోదూ? నిన్ను దాసిని చేయదూ? తాను రాజమాత అయి కులకదూ?


    "విన్నావా! ఎన్ని విధాల చూచినా రాముడు రాజు అవుతే నీకు ముప్పు ముంచుకొని వచ్చినట్లే! కాబట్టి భరతుడు జీవించాలంటే రాముడు రాజు కారాదు. నీ బంధువులూ, నీవూ సుఖించాలంటే రాముడు రాజు కారాదు. అంతేకాదు. భరతుడు రాజు కావాలి. కాబట్టి భరతుణ్ణి రక్షించు. నిన్ను రక్షించుకో. నన్ను రక్షించు. అన్నింటికీ భరతుడు రాజు కావటం ప్రధానం. విన్నావా! పిచ్చిదానిలా ప్రవర్తించకు. తనకు మాలిన ధర్మం అంటూ ఉండదు"


    కైకకు మంధర బోధ తలకెక్కింది. అంతకాలంగా రాముని మీద పెంచుకున్న అనురాగం అగ్గిబుగ్గి అయిపోయింది. ఆమెలోని అనురాగం మాయం అయింది. ద్వేషం పడగ విప్పింది. స్వార్ధం పురివిప్పింది. తన కొడుకు రాజుకావాలి. అంతే, తన కొడుకే రాజుకావాలి. రాముడు రాజు కారాదు. రాముడా రాజు. భరతుడే రాజు కావాలి. ఈ నాదం ఆమె సర్వాంగాల్లో ధ్వనించింది.


    "మంధరా! మంధరా! రాముడు రాజు కావడం భరించలేను. భరించలేనే-  భరించలేను. భరతుడు రాజు కావాలి. కావలసిందే. అందుకు ఉపాయం చెప్పు. అది సాధించితీరాలి. సాధనం ఏమిటో చెప్పు" అన్నది. ఆమె కళ్లలో మంటలు కనిపిస్తున్నాయి. ఊపిరిలో వేడిగాలులు అనిపిస్తున్నాయి.


    మంధర ఆనందంతో పొంగిపోయింది. "కైకా! ఇహ చూడు నా ప్రతిభ. విను నా ఎత్తు. పూర్వం నీ భర్త శంబరాసునితో యుద్ధం చేశాడు- గుర్తుంది? అప్పుడు నీవే నీ భర్తకు సారధివి. దశరథుని వంటినిండా గాయాలు తగిలాయి. అతని ఒళ్లు జల్లెడ అయింది. అప్పుడు తెలివిగా రథం తెప్పించావు. దశరథుణ్ణి కాపాడావు. అప్పుడతను నిన్ను రెండు కోరికలు కోరుకోమన్నాడు. అవసరం వచ్చినప్పుడు కోరుకుంటానన్నావు. గుర్తుందా? ఇదంతా నువ్వే నాకు చెప్పింది. ఇప్పుడు అవసరం వచ్చింది. కోరుకో. మొదటి వరానికి రాముణ్ణి అడవులకు పంపమను. పధ్నాలుగు సంవత్సరాలు అడవులకు పంపించాలి. ఎంచేతనంటావా? ఆలోగా ప్రజలు రాముణ్ణి మరచిపోతారు. రెండో వరానికి భరతుణ్ణి పట్టం కట్టమను. పధ్నాలుగేళ్లలో భరతుడు స్థిరపడిపోతాడు.


    "ఇంకా విను. మాసిన బట్టలు కట్టుకో. కోపగృహంలో ప్రవేశించు. కటికనేలమీద పడుకో. నీ భర్త వస్తాడు. నువ్వు అతనిని కన్నెత్తి చూడకు. మాట్లాడకు, గొల్లుమని ఏడుపు సాగించు. నీ భర్తకు నీవంటే ప్రాణం. నీవు అలిగినా అతడు ప్రాణాలనయినా ఇస్తాడు. అసలు కీలకం అది. అతడు నీకినుక చూస్తాడు. రత్నాలిస్తానంటాడు. మణులిస్తానంటాడు. మాణిక్యాలిస్తానంటాడు. ఒప్పుకోవద్దు. గట్టిపట్టు పట్టు. రెండే వరాలు కావాలను. ఒకటి రాముడు పధ్నాలుగేళ్లు అడవులకు వెళ్లాలి. రెండు భరతునికి పట్టంకట్టండ. ఏది ఏమైనా నీవు నీపట్టు వదలరాదు. నేను చెప్పినట్లు చేశావో నీ కొడుకు భరతునికి రాజ్యం దక్కుతుంది. కాస్త సళ్లు విడిచావో భరతుడు నాశనం అవుతాడు. విన్నావా! నేను చెప్పినట్లు చేయి. భరతునికి రాజ్యం సాధించి పెట్టు" అన్నది.


    మంధర మాటలు కైకకు బాగా తలకెక్కాయి. ఆమెకు మంధర దేవతలా కనిపించింది. దాని దగ్గర శంబరాసుని కంటే ఎక్కువ ఉపాయాలున్నాయని కీర్తించింది. గూనిదైన గాలివిసురుకు రాలిపోయిన తామరపూవులా వుందని పొగిడింది. భరతుడు రాజైనప్పుడు బంగారు కంచుకం తొడిగించి దాని గూనికి తొడుగుతానన్నది.


    కైక మాటలు విన్నది. మంధర మురిసిపోయింది. "నాకు ఏమెమో ఇస్తానన్నావు. అవన్ని అలా వుండనివ్వు. రాజు వచ్చే వేళయింది. నేను చెప్పినట్లు చెయ్యి. నీ పట్టు వదలవద్దు - రెండు వరాలు కోరుకో - ఎవ్వరేం చెప్పిన వినవద్దు. ఎందుకంటావా నీ కోర్కెలు తీరకుంటే నీవు బ్రతికినా లాభంలేదు." అని మంధర మరిమరి బోధించింది.


    కైకకు మంధర ఉపదేశం బాగా వంటబట్టింది. ఆమె కోపగృహంలో ప్రవేశించింది. రత్నహారాలు నేలకు కొట్టింది. చతికిల బడ్డది. "మంధరా! ఇక నీవు నా తండ్రికి రాముని వనవాస వార్తను గాని, నా మరణ వార్తనుగాని అందజేస్తావు" నాకు రత్నరాసులు అక్కరలేదు. బంగారుకొండలక్కరలేదు. రాముడు రాజయితే నేను ప్రాణాలొదిలేస్తాను.


    ఇక చూడండి. కుట్రలు. ఒకే రాజమందిరంలో ఎంతమంది ఎన్ని ఉపాయాలు పన్నుతున్నారో ఆలోచించండి. ఒక వైపు దశరథుడు పన్నే పన్నాగం - రెండవ వైపు కౌసల్యా, సుమిత్రల ఎత్తుగడ - మూడవ వైపు రామలక్ష్మణుల ఉపాయం. ఇక్కడ మరో పన్నాగం -

 Previous Page Next Page