Previous Page Next Page 
చెక్ పేజి 32


    జయను మోడీలోకి లాగడం సత్యనారాయణరెడ్డికి చాలా సరదాగా వుంది.

 

    "పెరుమాళ్! మా జయను నీ విద్యకు ఉపయోగించుకుంటున్నావ్. నీ కొచ్చిన దాంట్లో మా జయకు సగం వాటా ఇవ్వాలి" అన్నాడు ఆయన నవ్వుతూ.

 

    "అలానే సత్యనారాయణ బాబూ! నాకు రైతుల నుంచి రెట్టింపు ధాన్యం ఇప్పించండి. వచ్చిందాంట్లో సగం వాటా ఆయమ్మకిస్తాను." అన్నాడు పెరుమాళ్.

 

    జయ ప్రవేశంతో మోడికే కొత్తకళ వచ్చింది.

 

    పెరుమాళ్ తన సామాను సర్ది ఢమరకం అందుకున్నాడు. దానిని కొంతసేపు మోగించి ఆపాడు.

 

    "ఇప్పుడు మీకు నా విద్య ఏమిటో చూపిస్తాను. జుట్టు పోలుగాడు ఎంతటి శక్తివంతుడో నిరూపిస్తాను. జుట్టుపోలుగాడికి పూజచేసి తయారుచేసిన తాయెత్తులను తరువాత అమ్ముతాను. దాని వెల లక్షలు కాదు, వేలు, నూర్లూ కాదు, పదులు కాదు, కేవలం ఇరవై ఐదు పైసలు. దానిని మీచేతికి కట్టుకుంటే పిశాచి పదిమైళ్ళ దూరం పరుగెత్తాలి. దెయ్యం ఆమడ దూరం వుండాల. భూతం మీ ఛాయలకు రాదు. పాము పక్కకు జరిగి పోవాలి. తేలుకొండి ముడిచి పరుగెత్తాల"

 

    పెరుమాళ్ గొంతు కంచులా మోగుతోంది.

 

    "ఈ అమ్మ పేరేమిటో నాకు తెలీదు ..."

 

    "జయ" సత్యనారాయణరెడ్డి చెప్పాడు.

 

    "బాబు లాంటి వ్యక్తి తనకు తానే పేరు చెప్పాడంటే ఈమె చాలా మంచిపిల్ల అయివుండాలి. ఈమె నల్ల బంగారం బొమ్మలా వుంది. ఈమె కళ్ళలో తళుకుంది. ఈమెలో లక్ష్మీ కళ వుంది. ఈమె వున్నా చోట సిరులు పొంగుతాయి. ఈమె కాలు మోపినచోట ధాన్యం నిండుకుంటుంది. ఈమె చూపులు చల్లనివి. ఈమె మనసు మెత్తనిది. ఈమె పలుకు బంగారం"

 

    సత్యనారాయణరెడ్డి మళ్ళీ అడ్డు తగిలాడు. "అందుకే గదయ్యా మాఇంటి దగ్గర ఆమెను తల మనిషిగా పెట్టుకుంది" అన్నాడు.

 

    పెరుమాళ్ ఆయన చెప్పినదాన్ని విమ్రతతో విన్నాడు. తిరిగి చెప్పడం ప్రారంభించాడు. "సత్యనారాయణబాబు తల మనిషి అయిన ఈ మహాతల్లిని ఈ బుట్టలో మూసి పెడతాను. పై నుంచి కత్తితో పొడుస్తాను" అని కత్తి తీశాడు.

 

    రెండు మూరల కత్తి ఎండకు మెరిసింది. కత్తిని చూస్తూనే ప్రాణం పోయేటట్టుంది.

 

    "కత్తితో పొడుస్తాను. రక్తం పైకి చిమ్ముతుంది. మీరు జడుసుకోకండి. పోయిన సంవత్సరం నాభార్యను బుట్టలో మూశాను. ఆతరువాత కత్తితో పొడిచాను. మరో గంటకు ఆమె నవ్వుతూ బుట్టలోంచి లేచి వచ్చిన విషయం మీకు గుర్తుండే వుంటుంది. ఈ సంవత్సరం నాభార్య రాలేదు. అందుకే జయను ఎన్నుకున్నాను" అని చప్పట్లు చరచమన్నట్లు తను మొదట చప్పట్లు చరిచాడు.

 

    జనం అందుకున్నారు.

 

    "ఈమెను బుట్టలో మూసి కత్తితో పొడుస్తాను. ఆ తరువాత మీ ఇళ్లకు వస్తాను. ధాన్యం పెట్టండి. ఇంటికెళ్ళగానే ఈ పేదవాడ్ని మరచిపోకండి. నన్ను నిండుగా ఈ వూరి నుంచి పంపండి. మధ్యాహ్నం వచ్చాక మిగిలింది పూర్తి చేస్తాను. అంతవరకు ఈ అమ్మ ప్రాణాలు పోకుండా మా జుట్టుపోలుగాడ్ని కాపలా పెడతాను. మీరు త్వరగా నన్ను పంపిస్తే మధ్యాహ్నం త్వరగా మోడీ ప్రారంభించవచ్చు. చీకటైపోతే పక్క వూళ్ళో వాళ్ళు ఇళ్ళకు వెళ్ళడం కష్టం"

 

    పెరుమాళ్ చెప్పడం ఆపి, ఢమరుకం మోగించాడు.

 

    "ఇప్పుడు నేను జయమ్మకు మంత్రోపదేశం చేస్తాను" అని పెరుమాళ్ జయ చెవిలో ఏదో చెప్పాడు.

 

    జనం ఉత్కంఠతో చూస్తున్నారు.

 

    "ఇది మంత్రించిన గంగాజలం" అని జయతో గ్లాస్ నీళ్ళు తాగించాడు.

 

    ఏమీ కాదని తెలిసినా జయకు కంగారుగానే వుంది. తల తిరుగుతున్నట్టుకూడా అనిపిస్తోంది. ఎండ కళ్లల్లో గుచ్చుతుండడం వల్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి ఆమెకు.

 

    పెరుమాళ్ సైగ చేయడంతో జనం చప్పట్లు చరిచారు. హరికథలో మధ్య మధ్య జనం గోవిందా అని అరిచినట్టు జనం చప్పట్లు కొట్టకపోతే మంత్రగాడికి ఉత్సాహం రాదు.

 

    బుట్ట దగ్గరికి వెళ్ళి, బుట్టకు పైకి లేపాడు పెరుమాళ్. జయ నవ్వుతూ, సిగ్గుపడుతూ బుట్ట దగ్గరికెళ్లింది.

 

    ఆమె నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చోగానే బుట్టను ఆమెపై బోర్లించాడు. ఇప్పుడు బుట్ట తప్ప జయ కనిపించడం లేదు.

 

    అందరూ ఊపిరిబిగపట్టారు. సూది కిందపడితే వినిపించేంత నిశ్శబ్దం.

 

    పిడిని రెండు చేతులతోనూ అదిమి పట్టుకున్నాడు పెరుమాళ్.

 

    గురిచూసి, బుట్ట మధ్యలో కత్తిని దించాడు.

 

    ఎర్రటి ద్రవం పైకి చిమ్మింది. ఆ రక్తాన్ని చూడగానే చాలా మంది స్త్రీలకు కళ్ళు తిరిగాయి. చంటిపిల్లలైతే ఏడుపు లంకించుకున్నారు.

 

    యువకులు మాత్రం నవ్వుతున్నారు. మగవాళ్లు అంతా కనికట్టు అనుకున్నారు.

 

    పెరుమాళ్ మరో మారు కత్తిని దించాడు. మళ్ళీ రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది. అందరి కళ్ళలోనూ ఆ ఎరుపు క్షణకాలం ప్రతిఫలించింది.

 

    మరోపోటు- మరోపోటు- మొత్తం పన్నెండు సార్లు నిలువుకీ అడ్డానికీ బుట్టలో పొడిచాడు పెరుమాళ్.

 

    ఎర్రగా రక్తంతో చేసినట్లు బుట్ట. మెరుస్తున్న కత్తిని కింద పెట్టాడు.

 

    "ఇది జయ రక్తం. మనిషి రక్తం. ఇంత రక్తం కారితే ఏ మనిషైనా బతకడం కలలోని మాట. అయితే జయ మరో గంటకు లేచి కూర్చుంటుంది. అంతా ఆ జుట్టుపోలుగాడి మహిమ... మీరు త్వరగా భోంచేసి వస్తే మళ్ళీ జయమ్మను మీరు చూడచ్చు. ఈ హడావుడిలో నన్ను మాత్రం మరిచిపోకండి" అని అందరికీ రెండుచేతులూ ఎత్తి నమస్కరించాడు.

 

    జనంలో కలకలం బయల్దేరింది. అందరూ ఇళ్లకు కదిలారు. సత్యనారాయణరెడ్డి కూడా తన పాలేరులతో బయల్దేరాడు.

 

    మరి కొంతసేపటికి అక్కడ చిన్న పిల్లలు తప్ప మరెవరూ లేరు.

 

    గోనిసంచి తీసుకుని ధాన్యం కోసం ఊర్లోకి నడిచాడు పెరుమాళ్.

 

    ప్రతి ఇంటి గుమ్మం ఎక్కాడు. వాళ్ళు ఇచ్చింది తీసుకుని సంచిలో పోసుకున్నాడు.

 

    ఒక వీధి పూర్తయ్యేసరికి గోనె సంచి నిండిపోయింది. రెండు చొక్కాలు ఒక పంచె కూడా వచ్చాయి. ధాన్యాన్ని మోడి దగ్గర పోసి, తిరిగి గోనె సంచి తీసుకుని రెండో వీధిలోకి పోయాడు.

 

    జనం త్వరత్వరగా భోజనాలు ముగించారు. చిన్న పిల్లలయితే మొదట వడ్డించిన అన్నానికే లేచేశారు.

 

    జట్లు, జట్టుగా మర్రి చెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. అంతా గుమిగూడేసరికి రెండైంది. సత్యనారాయణరెడ్డి కూడా వచ్చి, తన మంచం మీద కూర్చుని, సిగరెట్ వెలిగించాడు.

 

    స్త్రీలు వంటిల్లు సర్ది చంటి బిడ్డల్ని చంకన వేసుకుని బయల్దేరారు.

 

    రెండున్నర అయింది. ఊర్లోని ప్రతిఒక్కరూ అక్కడకు చేరుకున్నారు.

 

    "వాట్" కీర్తి వునిక్కిపడింది.

 

    నేను కథ చెప్పడం ఆపాను.

 

    ఎప్పుడొచ్చాడో ఏమో దాము మెట్లమీద కూర్చుని శ్రద్ధగా వింటున్నాడు.

 Previous Page Next Page