Previous Page Next Page 
గోరింటాకు పేజి 32


    అదీ తల్లిని చూస్తే ఆ సంఘటన గుర్తుకొచ్చింది. రాత్రికి తాతయ్య మెల్లగా "ఇహ వీడికి పెళ్ళిచేసేయాల్సిందే" అంటున్నాడు.

 

    కొంచెం ఆగి "ఇలా రారా" అని పిలిచాడు.

 

    చక్రపాణి వెళ్ళి తలవంచుకు నిలబడ్డాడు నిశ్శబ్దంగా.

 

    ఆయన చుట్ట కాలుస్తూ "రోజుకో పెట్టె కాలుస్తావా?" అన్నాడు తాపీగా.

 

    అతను బదులు చెప్పలేదు.

 

    "ఎవర్రా అబ్బీ నీకు అలవాటు చేసింది?"

 

    అతనింకా పలకలేదు.

 

    "పోనీలే... ఒరేయ్ చూడూ! అలవాటయినాక ఎంతవాడికైనా మానటం కష్టం. కాఫీ తాగాక, భోజనమైనాక మరీ అవసరమనుకుంటా. ఆ ప్రకారం నాలిగింటితో సరిపెట్టుకోలేవూ? ఎక్కువ తాగితే ఆరోగ్యం పాడవుతుందిరా వెధవాయ్" కొంచెం మెల్లగా మంద్రస్వరంతో "పోనీ చుట్ట అలవాటు చేసుకోకూడదూ ? అది మంచిదిరా ఒంటికి."

 

    "తాతయ్యా!" అన్నాడు వణుకుతూన్న గొంతుకతో చక్రపాణి. "నేను చెడిపోలేదు తాతయ్యా! నేనెప్పటి అబ్బిగాణ్నే, ఎప్పటి నీ మనుమణ్నే."

 

    అతని ఆవేశం చూసి ఆయన చిరునవ్వు నవ్వి మెల్లగా వీపు నిమిరాడు. "పిచ్చివాడా! పోయి చదువుకో. అమ్మ ఏదయినా అంటే వూరుకో" అన్నాడు.

 

    ఆ రాత్రి చక్రపాణి చదువుతోన్న పుస్తకం ఏడ్చింది.

 

                                                           * * *

 

    అందులో వ్రాతలు కనిపించడంకాదు మాటలు వినిపించటం. అది అతని ప్రతిధ్వని.

 

    "పాణీ!" అన్నది తల్లి.

 

    గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. మరుసటిరోజు, తాను బయల్దేరి వెళ్ళిపోతానన్న రోజున రాత్రి పదిగంటలకి-

 

    అతను పుస్తకం మూసి, లేచి నిలబడి "అమ్మా" అన్నాడు.

 

    తల్లి కన్నీరు కారుస్తోంది. అతణ్ణి సమీపించి నిల్చుంది. పాణికి హృదయం ద్రవీభూతమైంది. "ఎందుకు కన్నీరు?" అన్నాడు.

 

    "పాణీ! నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి. నా జీవితకథ నీకు తెలుసుకదూ? నీవు కొడుకువన్నమాట కూడా మరచి, నీ చిన్నతనాన దగ్గర కూర్చోపెట్టుకుని ఎన్నో స్వంతవిషయాలు చెబుతూవుండేదాన్ని. మరచిపోయావా?"

 

    "లేదమ్మా! లేదు. మరచిపోలేదు నేను" అన్నాడు ఆవేశంగా పాణి.

 

    "మరి ఏమిటిరా ఇది? గుర్తించలేవా నా క్షోభ."

 

    ప్రపంచంలో స్త్రీకి బయటికి కనిపించే కష్టాలకన్నా కనిపించనివే ఎక్కువ ఉంటాయి.

 

    అలాంటి జీవి తల్లి. చాలామంది స్త్రీలలాగానే పురుషుణ్ణి క్షమిస్తోంది ఆమె. కుటుంబానికి ఇతర వ్యవహారాల్లో ఏమీ అన్యాయం చేయని తండ్రి, భార్యాబిడ్డలను ప్రాణసమానంగా చూసుకునే తండ్రి - తనలోవున్న బలహీనత కారణంగా ఆమెజీవితాన్ని అశాంతిపూరితం చేశాడు. గుండెలో మంటని రేకెత్తించాడు. ఏడ్చేది ఆమె. భరించేది ఆమె. వేడుకునేది హద్దుల్లో. ఒక్క లోపం! ఒక్క లోపం చాలు మనిషిని అసహ్యమయజీవిగా తయారుచేయటానికి. చెయ్యిచేసుకునేవాడు - తప్పనిసరి పరిస్థితులో ఆ సమయాల్లో పాణికి ఆయన్ని తన్నేద్డామన్నంత కోపం వచ్చేది. కనీసం పెద్దయినాకన్నా తన కసి తీర్చుకుందామనుకునేవాడు. తండ్రిని విరోధి క్రింద, ఆగర్భ శత్రువుక్రింద చూస్తుండేవాడు. కొన్నిరోజులపాటు అలా చెయ్యిచేసుకున్న రోజున మళ్ళీ సిగ్గుపడి అమ్మని అతిదీనంగా క్షమాపణ కోరుకోవటం చాలాసార్లు చూశాడు పాణి చాటుగా.

 

    "నాయనా నీమీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నిన్ను చూచి గర్వపడ్డానికే నేను అలవాటుపడ్డాను. నా అశాంతిపూరితమైన జీవితంలో అవమానాలకు లొంగిపోయి, తపనతో కొట్టుకుపోయే నా మనస్సు ఒక్క నిన్ను గురించి పవిత్రమయిన వూహతోనే ఒకింత వూరట చెందుతోంది. అది భగ్నం చేయకు. ఈసారి నిన్ను గురించి ఒక్కమాట వింటే బావిలో దూకి చచ్చిపోతాను" అని కౌగలించుకుంది.

 

    చక్రపాణి కన్నీళ్ళు జవాబుని పాడాయి.

 

    "నీలో ఒక్క దుర్గుణాన్నీ నేను సహించలేను. నువ్వు బుద్ధిమంతుడుగానే ఉండాలి. బుద్ధిమంతుడుగానే మిగిలిపోవాలి.

 

    సెలవులు పూర్తిఅయి హైదరాబాద్ బయల్దేరేటప్పుడు అందరూ ప్రమాణాలు చేయించుకున్నారు.

 

    "పాణీ!" అన్నాడు తండ్రి స్టేషన్లో...

 

    "ఏం నాన్నా!"

 

    "నా గురించి నీకు తెలియనిదేమీ లేదు. నీ తండ్రి నిన్ను గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగా నా తండ్రి నా గురించి తీసుకోలేదు. నేను ఇలా అయినానంటే పరిస్థితీ, నువ్వు ఏమయినా అయితే తెలివితక్కువ. నాలాగా నువ్వు ఎప్పుడూ కాకూడదనే భగవంతుణ్ని సర్వదా ప్రార్థించి ఆశీర్వాదం పొందుతూ వుంటాను. నన్ను స్థిమితంగా చచ్చిపోయేటట్లు చెయ్యి."

 

    పాణి ప్రేమగా తండ్రిచేతిని నొక్కాడు.

 

    సిగరెట్ పెట్టె ఎంత పనిచేసింది!

 

    రైల్లో కూర్చుని విస్మయంతో నిండిపోయాడు. తండ్రి అదేమిటి అలా అంటాడు? ప్రపంచంలో తనలా ఆలోచించటం తనకు ఒక్కడికే చాతనవునా? ఈ విషయంలో తనకున్న బ్రహ్మాండమైన సంతృప్తి ఆయనకెందుచేత లేదు?

 

    రాజారావు! ఇక్కడ కొన్నిరోజులు వుండికూడా అతన్ని కలుసుకోనందుకు బాధగా వుంది. తాను ఉత్తరం వ్రాశాడు అతని వూరుకు. జవాబు కూడా వచ్చింది. ఏదో చాలా కష్టాలలో వున్నాడట. కన్నీళ్ళతో వ్రాశాడు లేఖ. యువకులకు ఏమిటీకష్టాలు? అసలు యువకులకేనా కష్టాలు? తాము కష్టాలు కొనితెచ్చుకుంటున్నారా? నాగరికతలో ఇది ఒక లోపమేనా? అసలు అనుభూతులు, ఆలోచనలులేని జీవితం ఎలా వుంటుంది? ప్రయత్నిస్తే లభిస్తుందా? అతని మేనరికం ఏమయిందో? ఆఫీసరుగారి భార్యసంగతి...! ఈసారి జాబులో అడగాలి. అక్కడ వున్నంతకాలం లేదుగాని ఇప్పుడు వచ్చేస్తోంటే అతన్ని కల్సుకోలేకపోయినందుకు చాలా ఆరాటంగా వుంది. అతన్ని ఒకసారి కావలించుకోవాలని వుంది.

 Previous Page Next Page