Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 32


    ఎవరో ఉద్యోగం ఇస్తే తప్ప బ్రతకలేమనే నిరాశ, నిస్పృహలు ఈ దేశపు యువతలో బలంగా పాతుకుపోయాయి.

    ఓ చెట్టుకింద దుకాణం పెట్టుకుని చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఏ చదువూ లేదు. పెద్దగా పెట్టుబడి లేదు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం లేదు. కాని ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి వుంటాడు. ఇతరులకు వుపయోగపడుతూ తను బ్రతికేస్తుంటాడు. కాని కాలేజీలో అయిదేళ్ళు చదివి డిగ్రీ తెచ్చుకుని, యూనివర్శిటీలో మరో రెండేళ్ళు చదివి మాస్టర్ అనిపించుకుని, ఇంకొంచెం ఓపికుంటే పిహెచ్ డి. చేసి బ్రతుకుదెరువు కోసం రోడ్డెక్కగానే అతనిలో నిరాశ, నిస్పృహలు అలుముకుంటాయి.

    బి.ఎ., బి.ఎస్.సి., బి.కాం, ఎం.ఎస్.సి., పి.హెచ్.డి.లు చదివి తల్లిదండ్రుల్ని అప్పులపాలు చేసి, ఆ తరువాత కూడా తల్లిదండ్రులకు భారమై, చివరకు తమకు తామే భారమై, ఆఖరకు దేశానికి భారమై దేశాన్ని తిట్టుకుంటూ రాజకీయ నాయకుల్ని, వ్యవస్థను తిట్టుకుంటూ కాలాన్ని దాటేస్తారు.

    విద్యావ్యవస్థ ఒక పెద్ద పరిశ్రమ.

    విద్యార్ధులు ముడిపదార్ధాలు

    క్లాస్ రూమ్స్ పనిముట్లు.

    అధ్యాపకులు శ్రామికులు.

    ప్రొడక్షన్ షెడ్యూల్స్- అడ్మిషన్స్, గ్రాడ్యుయేషన్ ఎండ్ ప్రోడక్ట్స్... పూర్తి చేసిన చదువులతో నిరర్ధకమైన కన్వేయర్ బెల్ట్ మీంచి జారిపడే డిప్లామా హోల్డర్స్- డిగ్రీ హోల్డర్స్.

    తిరిగి వీళ్ళంతా బ్రతుకు భద్రత కోసం వీధులవెంట, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజెస్ ముందూ నీరుకారిపోయి, నీరసపడిపోయి కనిపిస్తారు.

    చెప్పానుగా- ఉద్యోగం ఇస్తానంటే యాభై వేలయినా ఖర్చుచేసే యువత ఈ దేశంలో వుందని. వారికి నేను ఉద్యోగాలిస్తాను. వారిచ్చే డిపాజిట్స్ మీద వచ్చే వడ్డీనే వారికి జీతాలుగా ఇస్తాను. వారి డిపాజిట్స్ అన్నీ కలిపి వ్యాపారం ప్రారంభిస్తాను. నాకింత నమ్మకం ఏమిటని నీ సందేహం...? వారు రిస్క్ తీసుకోడానికి సిద్ధపడకపోవడమే నా నమ్మకం. రాబోయే ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని కట్నం గుంజటమనే వారి బలహీనతే నా పెట్టుబడి. ఇంకో విషయం చెప్పనా...? లంచాలిచ్చినా, ఇలా నాకివ్వబోతున్నట్టు డిపాజిట్స్ ఇచ్చినా ఆ విషయాన్ని బయటకు చెప్పుకోరు పరువు పోతుందని. మా తెలివితేటల మూలంగా, చదువుల మూలంగానే ఉద్యోగాలొచ్చాయనే బయటకు చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పు, నా ఎనాలసిస్ కరెక్టంటావా...? లేక కొట్టి పారేస్తావా...?"

    త్రినాధ్ చెప్పడం ఆపి సెలక్టు చేసిన అప్లికేషన్స్ హిందూకి అందించాడు.

    కాని ఆమె అప్పటికే శిలాప్రతిమలా అయిపోయింది. ఆమె కళ్ళల్లో ఒక అద్భుతమైన సంఘటన చూసిన భావన కనిపిస్తోంది. తను చూస్తుండగానే అనామకుడిలా ఉన్న ఒక వ్యక్తి అంచెలంచెలుగా, అనూహ్యంగా ఎదిగిపోతున్నాడు. తను తొలిసారి చూసినప్పుడు త్రినాధ్ ఒకింత తెలివి గలవాడనుకుందే కాని ఇంతటి ప్రతిభగలవాడని ఊహించలేదు.

    విస్మయం నుంచి తేరుకుని త్రినాధ్ వేపు చూసింది.

    అతను మామూలుగానే వున్నాడు.

    హిందూ త్రినాధ్ అందించిన అప్లికేషన్స్ అందుకుంది.

    "వారికే ఇంటర్వ్యూ కార్డ్స్ పంపించు..." అంటూ సీట్లోంచి లేచాడు త్రినాధ్.

    ఓ టైప్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళి త్రినాధ్ ఎంపిక చేసిన అభ్యర్ధలకు ఇంటర్వ్యూకి రమ్మనే కార్డ్స్ టైప్ చేసి సంతకం కోసం త్రినాధ్ కి అందించింది హిందూ.

    అతను అప్లికేషన్స్ ని ఓసారి జాగ్రత్తగా పరిశీలించి ఏ రోజు ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిందీ తనే చేత్తో రాసి వాటిని మడిచి కవర్స్ లో పెట్టాడు.


                                                *    *    *    *


    సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఉదయం వెళ్ళిన ఇంజనీర్ రూమ్ కి వచ్చేసరికి రాత్రి పదిగంటలయింది.

    హిందూ అతనికోసమే ఎదురుచూస్తూ కూర్చుంది. అప్పటికే సైంటిస్ట్ భోంచేసి పడుకున్నాడు.

    సైంటిస్ట్ అలా చేయటం ఇద్దరికీ బాధనిపించినా బయటపడలేదు.

    ఇద్దరూ భోంచేస్తూ మాట్లాడుకుంటున్నారు.

    "ఇంటర్వ్యూలు ఎప్పుడు...? ఎక్కడ...?" ఇంజనీ అడిగాడు.

    సమాధానం కోసం ఎదురుచూస్తున్నది ఇంజనీర్ ఒక్కడే కాదు- నిద్రపోతున్నట్లు నటిస్తున్న సైంటిస్ట్ కూడా.

    "తెలియదు. ఆ కాలమ్స్ ని త్రినాధ్ పూర్తిచేసి అప్లికేషన్స్ కవర్లలో పెట్టి నాకిచ్చాడు.

    త్రినాధ్ ముందు జాగ్రత్త చర్యకు ఇంజనీర్ ఆనందిస్తే, సైంటిస్ట్ చికాకు పడ్డాడు. రేపు ప్రియాంక త్రినాధ్ గురించి మరిన్ని వివరాలు అడిగితే ఎలా...? సైంటిస్ట్ కి నిద్రపట్టడం లేదు.

    వాళ్ళిద్దరూ ఇంకేమన్నా మాట్లాడుకుంటారేమోనని చెవులు రిక్కించి వింటున్నాడు.

    హిందూ మౌనంగా పడకమీదకు చేరింది. ఆమెకు ఈ మధ్య అప్పుడప్పుడు బోస్ గుర్తుకొస్తున్నాడు. ఇంజనీర్ ఆ రోజు పగలు ఇంగ్లండ్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ చదివాడు... దాని గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు.


                    *    *    *    *


    "ఏమన్నా తెలిసిందా?" ప్రియాంక ఆసక్తిగా అడిగింది.

    "అప్లికేషన్స్ వచ్చాయట. అందులో కొందర్ని త్రినాధ్ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని లెటర్స్ పంపించాడట..." సైంటిస్ట్ నిరాసక్తంగా అన్నాడు.

    "చూసావా...? వాడేం చేస్తాడు? ఆరువేలతో ఏం వ్యాపారం చేయగలడని తీసిపారేసావ్...? ఇప్పుడేమో కొందర్ని సెలక్ట్ చేసి ఇంటర్వ్యూకి కార్డ్స్ పంపాడంటున్నావ్ అంటే ఎక్కువమంది ఉద్యోగాలకి అప్లై చేస్తేనే గదా సెలక్షన్ ప్రసక్తి వచ్చేది...?"

    అతను మౌనంగా వున్నాడు.

    "ఆరువేలతో నీకు కిళ్ళీకొట్టు జ్ఞప్తికి వచ్చింది. పి.హెచ్.డి. చేసిన నీకు ఉద్యోగం తెచ్చుకోవటం కష్టమేమోకాని పట్టుదల ఉన్నవాడికి తెలివితేటలు తోడైతే ఆ ముష్టి ఆరువేలతోనే అరవై లక్షలు సంపాదించగలడు."

    "నిన్ను గెలవటానికి అరవైలక్షలు చాలవుగా?" తెలివిగా ప్రశ్నించాననుకున్నాడు అతను.

    ప్రియాంకకు చిర్రెత్తుకొచ్చింది....

    "అవన్నీ ఇప్పుడనవసరంగాని- అతనేం చేయబోతున్నదీ త్వరలోనే నాకు చెప్పాలి..." అంది ఆన జారీ చేస్తున్నట్లుగా.


                                               *    *    *    *


    కొడుకు తన పేరుమీద ప్రారంభించిన సంస్థను చూసేందుకు ఆ రోజు కొడుకుతోపాటు ఆఫీసుకి వచ్చింది వసుంధరాదేవి.

    త్రినాధ్ తల్లిని గదిలోకి తీసుకెళ్ళి తన కుర్చీ చూపించాడు.

    తల్లి చిరునవ్వుతో మృదువుగా తిరస్కరించింది.

    "మనిషికైనా, సంస్థకైనా డిసిప్లిన్ అవసరం. నేను నీ తల్లిని కనుక గౌరవించాలని నువ్వు కూర్చునే కుర్చీని చూపించావ్. చాలా సంతోషము. కాని అది ఒక సంస్థ చైర్మన్ కూర్చునేది. దాన్లో కూర్చునే అర్హత నాకు లేదు. నాకే కాదు. మరెవరికీ లేదు. మీ నాన్నగారు అలా చేసే చాలా నష్టపోయారు..." అని చటుక్కున నాలిక కరుచుకుంది.

    కాని తల్లి అప్రయత్నంగా జారిన మాటను త్రినాధ్ గుర్తుపెట్టుకున్నాడు. అంతలో ఇంజనీర్ లోపలకు వచ్చాడు.

    "ఇండియాలో అలాంటి వ్యాపారం ఇంతవరకూ ఎవరూ ప్రారంభించలేదు. ఉపయోగించిన లూబ్రికేంట్ ఆయిల్స్ ని శుద్ధిచేసే యంత్రం కూడా లేదు. కాని అలాంటి యంత్రాలు చెకోస్లావేకియాలో వున్నట్లు ఒక ఆర్టికల్ చదివాను. వ్యర్ధ పదార్ధాల నుంచి వస్తువుల్ని తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు ఆ దేశంలోనే ఎక్కువని ఆ ఆర్టికల్ లో రాసి వుంది" అంటూ ఓ ఫైల్ అందించాడు ఇంజనీర్.

    త్రినాధ్ ఓసారి ఆ ఫైల్ ని ఓపెన్ చేసి తిరిగి మూసేస్తూ అన్నాడు. "మేం ఇంతింత చదివాం... అంతంత చదివాం... అన్ని మార్కులొచ్చాయ్... గోల్డ్ మెడల్ వచ్చిందంటూ ఈ దేశం ఉద్యోగాలివ్వలేని దరిద్రపు దేశం అని తిడుతుంటారు నీలా చదువుకున్నవాళ్ళు. ఏమిటి మీరు చదివింది? ఎందుకు పనికొస్తుంది? పుస్తకాల్లోని మేటర్ ని బట్టీ బట్టడం- అది పరీక్షల్లో వ్రాయటం, మార్క్సు తెచ్చుకోవటం అంతేనా? ప్రాక్టికాలిటీకి మీ చదువు పనికొస్తుందా? H2O అంటే వాటర్ అని O2 అంటే ఆక్సిజన్ అని ఆల్ రెడీ ఎవరో మేధావులు కనిపెట్టిన సూత్రాన్ని వల్లెవేయటమేనా? అంతంత చదువులు చదివి చివరగా దాన్ని ఉపయోగించుకొనేందుకు ట్రైనింగ్ లో చేరి ఆల్ రెడీ నడుస్తున్న ప్రాసెస్ ని రొటీన్ గా అమలుపర్చటమేగా మీరు చేసేది? ఒక కొత్త వస్తువుగాని, పరికరాన్నిగాని, ఒక సూత్రాన్ని గాని కనిపెత్తగల సృజనాత్మకత వుందా మీలో...

    ఆర్ యూ గెటింగ్ ఏ డిగ్రీ...? ఆర్ యూ గెటింగ్ కాంపీటెన్స్ అండ్ కాన్ఫిడెన్స్-?"

    అప్పటికే వసుంధరాదేవి కొడుకులోని అనితరసాధ్యమైన మార్పును చూసి శిలాప్రతిమయిపోయింది. ఇంజనీర్ కి సిగ్గుగా వుంది.

    నిజమే... త్రినాధ్ విమర్శ ముమ్మాటికి నిజమే... నాకు ఉద్యోగం రాలేదు, ఈ దేశం ఇవ్వలేదనటమే తప్ప నా దగ్గర మార్క్స్ సర్టిఫికెట్స్ తప్ప మరేమీ లేవని ఎప్పుడూ అనుకోడు.

    "నన్ను ఉపయోగించుకోకపోతే ఈ దేశం బాగుపడదని కోతలు కోయటం తప్ప మరేం వచ్చు? శాస్త్ర విజ్ఞాన రంగాలలో హరగోవింద ఖురానా, సర్ సి.వి.రామన్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తప్ప ఇండియన్స్ ఎవరికైనా నోబుల్ ఫ్రైజ్ లు వచ్చాయా...? పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం వుండే రామన్, 'రామన్ ఎఫెక్ట్' కనిపెట్టాడా?

    నిన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాననుకోకు. ఏ చాడువుకైనా సృజనాత్మకత లేకపోతే అది వ్యర్ధం. సద్విమర్శ నుంచి పట్టుదలను, నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. తమని తాము సమర్ధించుకొంటే ఆత్మవంచన.

    రేపటినుంచి నువ్వు వేరే పని చేయాలి. టెక్నికల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్చేంజ్ కి వెళ్ళు. ఎక్కువ కాలంగా ఉద్యోగాలు రాని అభ్యర్ధుల అడ్రస్సులు నోట్ చేసుకురా. ఒక రెండు నెలలు గడువుపెట్టి వసుంధరా ఇండస్ట్రీస్ అన్ ఎంప్లాయిడ్ టెక్నికల్ కేండిడేట్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చెయ్..." అంటూ సీట్లోంచి లేచాడు త్రినాధ్.

    ఇంజనీర్ బయటకు నడిచాడు.

    "ఎవరు నాన్నా-?" అంది వసుంధరాదేవి షాక్ నుంచి తేరుకుంటూ.

    త్రినాధ్ అర్ధంకానట్లు చూశాడు.

 Previous Page Next Page