"తెలుసు!"
"ఎప్పటినుంచీ?"
"నేను ఇక్కడకు వచ్చినప్పటినుంచీ!" కృష్ణ కంఠం కటువుగా వుంది.
మామకేసి కసిగా చూశాడు.
"అంటే నువ్వు ఆయన దగ్గిర...." ఆ తర్వాత మాటలు మింగేసి తడబడ్డాడాయన.
"ఇంకా నాకా అవసరం రాలేదు బాస్!" కృష్ణ కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది.
ఆయన అదిరిపోయాడు.
"కృష్ణా! నా ఉద్దేశ్యం నీకు ఆయనతో పరిచయం ఉందా అని!"
"లేదు!"
"ఇంతకుముందే తెలుసునన్నారుగా బావగారూ?" రాగాలు తీస్తూ పాయింటు లాగుతున్నట్టు అంది.
"తెలుసు మా పరిచయానికి ఉన్నతేడా తెలియదా మరదలుపిల్లా నీకు? ఆఫీసుకు వచ్చేపోయేదారిలో ఆయన క్లినిక్ ఉంది. బోర్డు చూస్తూ ఉంటాను. అదే తెలియడం అంటే?"
"అంతేగదా? ఆయన మీ ఫామిలీ ఫ్రెండ్...." ఏదో గొప్ప జోక్ వెయ్యబోయినట్టు చెప్పబోయింది.
"మీ ఫామిలీ డాక్టర్ కూడానేమో?"
విమల బిత్తరచూపులు చూసింది.
చౌదరి రమణమూర్తి కేసి చూశాడు.
రమణమూర్తి పళ్ళు బిగబట్టి కూర్చున్నాడు.
"మాలో ఎవరికీ సైకియాట్రిస్టు అవసరంలేదు" ఉక్రోషంగా అంది విమల.
"విమలా! నువ్వాగు!" ఆయన కూతురిని మందలించాడు.
"ఎందుకామెను ఆపుతారూ? మాట్లాడనివ్వండి. అసలు విషయం ఏదో బయటపడుతుందిగా?"
ఆయనకు వీపుమీద కొరడాతో కొట్టినట్టు అయింది.
"మిస్టర్ చౌదరీ! ఈరోజునుంచే నా ఉద్యోగానికి రాజీమానా చేస్తున్నాను. యూ ఆర్ నో మోర్ బాస్ టు మి!"
"కృష్ణా! ప్లీజ్! కూల్ డౌన్! నేను చెప్పేది...."
"స్టాపిట్ మిస్టర్ చౌదరీ! ఇక ముసుగులో గుద్దులాట మానెయ్యండి మీ ఎత్తుగడ ఏమిటో నాకు తెలుసు. నాకు మతిభ్రమణం కలిగిందనీ, పిచ్చివాడినైపోయాననీ మీరు రుజువు చేసి లోకం కళ్ళు మూసే ప్రయత్నంలో ఉన్నారనికూడా నాకు తెలుసు."
"మిస్టర్ కృష్ణా!"
"యూ స్టుపిడ్ గరల్ మాట్లాడకుండా కూర్చో! ఎయిర్ హోస్టస్ కు ఆకారమేగాని బుర్ర ఉండదు" కృష్ణ ఉద్రేకంతో కంపించిపోతున్నాడు. ఆ ఉద్రేకంలోనే విమల్ని కసురుకున్నాడు.
"కృష్ణా...."
ఏదో చెప్పబోతున్న ఆయనకేసి చూసి, మధ్యలోనే అందుకొని అన్నాడు__
"మిస్టర్ చౌదరీ! ఐ డోన్ టు వాన్ టు లిజన్ ఎనీ మోర్ నాన్సెన్స్ ఫ్రం యూ!"
అప్పుడే బోనులోంచి బయటపడ్డ పులిలా కన్పించాడతను వాళ్ళకు.
"మిస్టర్ చౌదరీ! మీరింత దుర్మార్గంగా ఆలోచిస్తారనుకుంటే అసలు ఈ విషయం మీతో చెప్పేవాడినేకాదు. అడుగో ఆయన దుర్యోధనుడైతే నువ్వు శకునివి."
కోపంతో కృష్ణ నిలువెల్లా కంపించిపోతున్నాడు.
ఆయన నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. అతని ముఖం వెలవెలా పోయింది.
అల్లుడికి పిచ్చి ఇంతగా ముదిరిపోయిందా అని ఆలోచిస్తూ నేల చూపులు చూస్తున్నాడు మూర్తి.
విమలకైతే ఒళ్ళంతా చెమట్లు పోసేశాయి.
"ఎందుకలా తేలుకుట్టిన దొంగల్లా కూర్చున్నారు? మీరేం చెయ్యదల్చుకొన్నారో తేల్చి చెప్పండి. నన్ను సైకియాట్రిస్టు దగ్గిరకు తీసుకెళ్ళడమేగా మీకు కావాల్సింది. అందుకు నేను అంగీకరించకపోతే బలవంతంగా నైనా తీసుకెళ్ళడానికి సిద్దమయ్యారు. అవునా?" మామగారి ముఖంలోకి సూటిగా, చురుగ్గా చూశాడు కృష్ణ.
"అదేంకాదు, ఒకసారి డాక్టర్ ను కన్సల్టు చేస్తే మంచిదని...." పులికడుపులోని మేకపిల్ల మాట్లాడినట్టుంది యస్.పి.రమణమూర్తి ధోరణి.
"అయితే ఈ డొంకతిరుగుడంతా ఎందుకూ? పొద్దుటినుంచీ ఆచెట్టు కింద జవాను లెందుకూ?"
రమణమూర్తి ఉంగిడిపడ్డ గొడ్డులా చౌదరి ముఖంలోకి చూశాడు నిస్సహాయంగా.
ఆయనకు ఏం మాట్లాడాలో బొత్తిగా తోచడంలేదు. సాలెగూడు ఈగ, బొమ్మ, ఆయన కళ్ళముందు కదిలింది. ఆ సైకియాట్రిస్టు అవసరమేదో తనకే కావాల్సినట్టుగా అన్పిస్తున్నది. కృష్ణకేసి వెర్రిచూపులు చూశాడు.
విమలకు మండుతున్న విమానం క్రాష్ లాండ్ అయినట్టుగా అన్పిస్తోంది.
"మరోసారి చెబుతున్నా వినండి!" మామనూ చౌదరినీ సూటిగా ఎదుర్కోడానికి సిద్దమయ్యాడు.
"నీ కూతురికి డైవర్సు, నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. మర్యాదగా చెబితే మీకు అర్ధమౌతుందనుకున్నాను, వాస్తవ పరిస్థితులను అర్ధంచేసుకొని చేసిన పొరపాటును దిద్దుకుంటారనుకున్నాను. మీ అంతస్థులూ, అభిజాత్యాలు అందుకు అడ్డొస్తున్నాయి. పగిలిపోయిన అద్దాన్ని అతికించాలని చూస్తున్నారు, ఆ ప్రయత్నం ఫలించి అందులో కనిపించే ప్రతిబింబం బహురూపాలుగా కన్పిస్తుంది. ఆ రూపాలు వికృతంగ వుంటాయి. ఏ దృష్టితో చూసినా మీరు చేస్తున్నది అన్యాయం! అక్రమం! మానవతా దృక్పధంతో చూస్తే క్షమించరాని నేరమే అవుతుంది. సుధ తను ప్రేమించినవాడికి బిడ్డని కనడం నేరంకాదు-"
"కృష్ణా!"
"మాట్లాడకండి! వినండి! అవును సుధ బిడ్డని కనడం నేరంకాదు. ఆ బిడ్డని తల్లికి దూరం చెయ్యడం నేరం. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడం నేరం. వాళ్ళకు పుట్టిన బిడ్డ మోనోను అనాధగా గాలికి వదిలెయ్యడం నేరం. విషయం తెలిసీ నేను సుధతో కాపురం చెయ్యడం నీచాతినీచం. నా మిత్రుడు జగన్మోహన్ రావూ, సుధా, మోనోల జీవితాలను, వారి భవిషత్తునూ దృష్టిలో పెట్టుకొనే నేను ఈ నిర్ణయానికొచ్చాను - ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికే మీ సహాయ సహకారాలను కోరాను. ఆమాత్రం అర్ధంచేసుకోగల జ్ఞానం, పుదార్యం, సంస్కారం మీలో లేవని తేలిపోయింది. నన్ను పిచ్చివాడిగా ప్రపంచానికి చాటాలనే ప్రయత్నంలో వున్నారు. మీ దృష్టిలోనే కాదు, లోకం దృష్టిలోకూడా నేను పిచ్చివాడినేమో? ఎందుకంటే__తన పెళ్ళాం పెళ్ళికిముందే మరొకడికి బిడ్డని కన్నదని తెలిస్తే ఏ భర్తా సహించి ఊరుకోడు. గొంతుపిసికి ఏ నూతిలోనే పారేస్తాడు. లేకపోతే ఓ లీటరు కిరసనాయిలు చల్లి నిప్పంటిస్తాడు. స్టౌ వెలిగిస్తూ కొంగుకు నిప్పంటుకొని కాలిపోయిందని పోలీసులకు రిపోర్టిస్తాడు. ఆ పోలీసువాడు నమ్మకపోతే ఓ వెయ్యి పారేసి కేసు మాఫీ చేయిస్తాడు. ఇవేవీ రమణమూర్తిగార్కి తెలియని విషయాలుకావు. కాని నేను ఆ పని చెయ్యలేదు. అందుకే మీకళ్ళకు పిచ్చివాడిగా కన్పిస్తున్నాను. ప్రేమించుకున్నవాళ్ళను కలపాలనుకోవడం నేరం, తల్లి బిడ్డను కలపాలనుకోవడం పిచ్చి, ఇవే నేను చేసిన నేరాలు" ఎదురుగా వస్తున్న సుధను చూసి ఆగిపోయాడు మురళీకృష్ణ.
"ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నారు టైమ్ అవడంలా? మనందరం బయలుదేరేసరికి ఏడవదూ?"
ఎవరూ మాట్లాడలేదు.
సుధా కలవరపడింది.
వీళ్ళంతా ఎందుకంత మౌనంగా కూర్చున్నారు? మళ్ళీ ఏదో జరిగి వుంటుంది. కృష్ణ రానని మొండికేస్తున్నాడేమో!
"విమ్మీ! ఏమిటయిందే?" విమలను ఆదుర్దాగా అడిగింది సుధ.
"బావగారు ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు__"
"విమలా నువ్వాగు!" రమణమూర్తి లేచి నిలబడ్డాడు. వేపచెట్టుకింద కూర్చొన్న పోలీసు జవాన్లకేసి చూశాడు.
సుధ ముఖం వివర్ణమైంది.
గుండె చెరువైంది.
ముఖం చేతుల్తో కప్పుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ నిలబడింది.
"సుధా! ఆపు ఇక నీ దొంగ ఏడుపులు! పిచ్చివాడి పెళ్ళాంగా ఏం సుఖపడ్తావ్? జగన్మోహన్ దగ్గిరకు ఇప్పుడయినా పంపిస్తాడేమో మీ నాన్ననడుగు."
రమణమూర్తి పెద్దగా చప్పట్లు కొట్టి జవాన్లను పిల్చాడు.
"మీకెందుకంత శ్రమ మామగారూ! వెళదాం పదండి" అంటూ కృష్ణ లేచినిలబడ్డాడు.
ఈతరానివాడు లోతుతెలియని నీళ్ళల్లోకి దూకడానికి సిద్దపడినట్టుగా ఉంది కృష్ణ ధోరణి.
ఆయుధం లేకుండా యుద్దరంగంల్లోకి దూకడానికి సిద్దమైన సిపాయిలా వున్నాడు సుధ భర్త కృష్ణ.