"మొత్తానికి రచయితననిపించుకున్నారు......" మనసు అదోలాంటి అశాంతికి లోనవుతుంటే "సమాధానం దాటేయటంలో చాలా సమర్థతని చూపించగలిగారు" అంది అసహనంగా.
"ఇప్పటికి అర్థమైంది."
"ఏమిటి?"
"మొన్న మీ పరిచయంలో కొంచెమే బోధపడిన మీ వ్యక్తిత్వం."
ఆర్తి స్థాణువైంది. "వివరంగా చెప్పండి."
"మీరేమీ అనుకోనంటేనే."
"ఇందులో అనుకోవటానికేముంది?"
"కొన్ని వాస్తవాల్ని మనం జీర్ణించుకోలేం ఆర్తీ! అందుకే మిమ్మల్నిలా ప్రిపేర్ చేస్తున్నది."
"ఉపోద్ఘాతం వదిలి పాయింటుకి రండి మాస్టారూ!"
"మీరు తెలివైన భార్యే. కానీ ఫ్రస్టేషన్ లో వున్నారు."
ఉలిక్కిపడింది ఆర్తి.
"అది మీ ప్రతి ప్రశ్న నాకు అర్థమయ్యేట్లు చేసింది. కోపం తెచ్చుకోకండి. ఇది నేను స్టడీ చేసిన విషయం."
'నిజమేనా...... నిజమే కావచ్చు.' కానీ ఆమె అంగీకరించలేకపోయింది. "మీ అంచనా తప్పని చెప్పటానికి చింతిస్తున్నాను."
"అవసరం లేదు ఆర్తీ! నా అంచనా పొరపాటు కావాలనే నేను కోరుకుంటున్నాను."
"మీకు తెలీదు....... నేను సోషల్ గా, ఫైనాన్షియల్ గా ఏ లోటూ లేని ఆడదాన్ని."
"దొరికిపోయారు" నవ్వేశాడు తేజ. "అంతేగా ఆర్తీ! భార్య స్థానములో వున్న ఆడది కోరుకునేదేమిటో ప్రతి పదంలోనూ ఖచ్చితంగా తెలియచెప్పిన మీరు ఇప్పుడు సోషల్ గా, ఫైనాన్షియల్ గా అంటూ మానసికమైన ఆనందానికి కారణం కానివి అర్హతలుగా తెలియచేశారూ అంటే......"
"ఇక ఆ టాపిక్ ని వదిలేద్దాం"
"ఒకె!" క్షణమాగి "నేను అనవసరమైన చనువు తీసుకుని వుంటే క్షమించేయండి" అన్నాడతడు.
"భలేవారే...... ఇక వుంటాను."
ఫోన్ క్రెడిల్ చేసింది ఆందోళనగా.
అది ఆందోళన కూడా కాదు.
ప్రపంచం చూడకుండా దాచుకుంటున్న ఏ మనసు పొరల్నో అతడు స్పృశించి, పరామర్సించగలిగినందుకు ఫలానా అని చెప్పలేని తత్తరపాటు.
ఎలా..... ఎలా ఇది తేజాకి సాధ్యమైంది?
మనిషిని చూడకుండా, మొహంలోని భావాల్ని గమనించకుండా కేవలము గొంతు విని ఇంతగా ఎలా స్టడీ చేయగలిగాడు?
అది అతనిలోని? ప్రత్యేకతా?
లేక తను అవివేకంగా మాట్లాడి అతనికి దొరికిపోయిందా?
తన గుండె గోడలపై ప్రతిధ్వనించే ఆలోచనల నినాదాలు అతని చెవులదాకా ఎలా సోకాయి?
ఒక ఒంటరి సంక్షోభిత సాగరపు సుడిగుండాల హోరుని గుర్తించి రాలిపడుతున్న కన్నీటి బిందువుల్ని గమనించకుండానే గుండె లోతులదాకా ఎలా చొచ్చుకుపోయాడు?
అందుకే అతడు అంత గొప్ప రచయిత కాగలిగాడా?
అతని గొంతులో ఎంతటి మార్దవం మాటల్లో ఎంతటి ఆత్మీయత.
చెక్కిళ్ళదాకా చేతులందనంత దూరంలో వుండీ అణువంత ఆప్యాయతతో ఓదార్చాలని ప్రయత్నించాడు.
అయినా ముక్తసరిగా ఖండించిందే తప్ప ఆవేశంగా అరవలేదేం?
అతనిలో ఏం చూసింది?
భాస్వంత్ లో కనిపించని ఏ మైత్రీభావమో, అవ్యక్తంగా వ్యక్తం చేసే ఏ మహాకావ్యపు విశ్లేషణో తేజాలో చూసి తనను తాను మరిచిపోయిందా?
లేదు.......
తను ధీర కాదు..... కాకూడదు.
బజర్ మోగిన చప్పుడు.
గబగబా కళ్ళు తుడుచుకుంది.
ఉద్విగ్నంగా ద్వారం తెరిచింది.
ఎదురుగా నిలబడి వున్నాడు శ్యాం..... ధీర భర్త.
"మీరా?" అంది తడబడుతూ.
* * * *
శ్యాంని ధీర పూర్వమే పరిచయంచేసి వుండటంతో సునాయాసంగానే ఆర్తి గుర్తించగలిగింది.
అయితే.....
అతనిలో యిప్పటికీ మార్పులేదు.
అదే అమాయకత్వం...... ఆడపిల్లముందు అప్పుడు తత్తరపడినట్టే ఇప్పుడూ నీళ్ళు నముల్తూ నిలబడ్డాడు.
"కూర్చోండి" అంది.
"ఫర్వాలేదు."
"మీరు వైజాగ్ నుండి వచ్చారు...... ప్రయాణంలో స్ట్రెయిన్ అయి వుంటారు. కాఫీ తీసుకున్నాక మాట్లాడుకుందాం. ముందు కూర్చోండి."
అప్పటి మానసిక స్థితిలో ఆర్తి ఎవరితోనూ మాట్లాడే మూడ్ లో లేదు.
కానీ శ్యాంని చూస్తుంటే జాలేసింది.
అంతకుమించి ధీర అతని గురించి చెప్పిన మాటలు జ్ఞప్తికి వస్తుంటే జాలిగా అనిపించి అయిదు నిమిషాలలో కాఫీ తీసుకొచ్చింది.
సోఫాలో కూర్చున్న శ్యాం మరోసారి పైకి లేవబోతుంటే "అరె- ఎందుకలా కంగారుపడతారు?" అంటూ నవ్వేసింది.