ఆరాధన వేదనల సొబగుల
శోధనల పళని
శృంగారానికి శ్రీమంతమైన శ్రీకారం చుట్టింది. రాధా మాధవ శృంగారం కవుల కల్పనలో కమనీయ శిల్పంలో బంగారంగా తయారయ్యాయి. ఆ రాధా కృష్ణుల రాసలీలలు. అలాటి వాటిలో మిన్నగా ఎన్నతగింది. "ముద్దు పళని" రాధికా స్వాంతనం.
ఇళ యశోద మేనకోడలు వయసొచ్చి ఈడేరిన ఇళ కు తొలి సమర్త సింగారాలన్ని చేసి వేడుక మీద వేడుకలు జరిపి చెప్పాల్సిన హెచ్చరికలన్నీ చెప్పి ఆపై ఇద్దర్నీ ఇళను క్రుష్ణుడినీ - పడకింటికి పంపుతుంది రాధ. అప్పుడు స్త్రీ సహజమైన ఈర్ష్యాసూయలు ఆమెలో తలెత్తుతాయి. తానయి సింగారించి రంగారు బంగారు బొమ్మను నయగారాల గారాల రెమ్మను సింహ విక్రముడి చేతికి అందించి - ఆ మీదట.
సొమ్ములియ్య వచ్చు సొమ్మంద మియవచ్చు
ఇయ్యరాని ప్రాణమియ్య వచ్చు.
తనదు విభుని వేరు తరుణి చేతికి నిచ్చి
తాలవశమె ఎట్టి దానికైన ---
అనుకుని తలపోస్తుంది, ఆవలవంతలో తెల్లవారు జాము అవుతుంది. వెళ్ళి పిలిచి తలుపు తీయించి రాధ ఇళను బయటికి తెస్తుంది. రాధ లోపల ప్రవేశిస్తుంది. రాధ కోరిక నెరవేర్తుంది. ఆ మీదట రాధాకృష్ణుల మధ్య చాలా సరసమైన సంభాషణ సాగుతుంది. సవతిలాగా ఇళను భావించి ఇళా కృష్ణుల శృంగారానుభవాన్ని రాధ ప్రశ్నిస్తే-ఇళను ఒక పూమొగ్గగా చెప్పి రాధా రమణీయకతను రాధ ఫ్రౌఢత్వాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తాడు. ఇళకు సేద దీరేలా స్నానాలు చందన చర్చలు చేయిస్తారు. మనిషి కాటుకు ఎక్కడా మందులేదని కమ్మని కస్తూరి పూస్తారు. నఖక్షతాలకు పునుగు కుంకుమ పైపూత వేస్తారు. ఇదంతా అయ్యాక యశోద సోదరుడు కుంభకుడు - ఇళ తండ్రి వచ్చి కూతుర్ని అల్లుడ్ని తన ఇంటికి పిలుచుకొని వెళతాడు.
రాధ సార విచారంలో పడ్తుంది. అతడి అంగాంగాన్ని వర్ణిస్తూ తలపోసుకుంటుంది. అతని పాదాలు, నడక, పెదాలు మితిమీరి పొగడ్తుంది. విష్ణువు అవతారం ఎత్తి కిష్టయ్య అయితే-శంఖం ఇప్పుడు కంఠమైందట. చక్రం నిడుమైందట - మోకాళ్ళు చేరేలా చేతులు సాగితే ఆ విషయం కళ్ళకు చెవులకు చెప్పాలని భుజాలు ఎగు భుజాలయ్యాయట. ఆది చూడలేక నడుము దిగులులో చిక్కి పోయిందట ---
జానులను చేరు బాహులు సరవి చూచి
కనులు చెవులకు వివరింప గదియు, వింత
పొలుపు వినగోరి తలలెత్తి భుజము లటుల
గానలే నైతి నడుమంత కౌను చిక్కె
ఎంత మధుర కల్పనలో ఎంత మధురంగా వర్ణిస్తుందో ఆ రాధ శ్రీకృష్ణుని మాటల తీరుని పొగిడిన మాటల్నే చూద్దాం.
తేటలుగా జిగి ముత్యవు
పేటలుగా పంచదార పేటలుగా పూ
తోటలుగా రా చిలుకల
మాటలుగా కంసవైరి మాటలు తనరున్.
నిజంగా ముద్దు పళని కవిత్వం ఇలాగే ఉంటుంది. అతని కెమ్మో విని వర్ణించే తీరు చూడండి. తానుగా ఆ మాధుర్యాన్ని గోలినంత మధురంగా చెప్పింది.
కావి కాదది విడికెంపు దీవికాని
దీవి కాదది అమృతంపు బావి కాని
బావి కాదది కపురంపు తావికాని
తావి కాదది శౌరి కెమ్మోవి కాని ---
భళా అన్పిస్తుందీ కల్పన! శౌరి ముక్కట! మన్మధ వనంలో మొలిచిన వెదురట! నాసిక స్మరవన వంశంబు ---
అలా ఆయన అణువణువునూ మనోహరంగా (మనసుని దోచుకునే విధంగా) తలపోసి తలపోసి చిలుకలతో తన వెత చెప్పుకుంటుంది. రాయబారం వెళ్ళమంటుంది. ఆ చిలుక కూడా రాధ చేతిలో మాటలు నేర్చిన రాచిలక కాబట్టి తొడ కొట్టి బయలుదేరుతుంది.
ఇలా ఇక్కడ రాధ మితిమీరిన వియోగంతో చంద్రుడ్ని మలయానిలాన్ని మదనుడ్ని శుక పికాలసు పేరు పేరునా తిడ్తుంది.
గురుసతిని బట్టి విప్రయోగులను కొట్టి
తమ్ముల నడించి పక్షపాతము ఘటించి
కాలగతి నుండి ఇదె రాజగట్టు నుండి
పడెదధోగతి గౌరవ ప్రాప్తి చెంది---
ఇది చంద్రుడ్ని తిట్టే తియ్యని పద్యం
గురుసతిని ... గురువైన బృహస్పతి భార్యను --- పెద్ద స్త్రీని.... తనకంటే వయసులో పెద్దదైన పెళ్ళయిన స్త్రీని చేపట్టాడు. వియోగుల విరహాగ్నిలో పడగొట్టాడు. తమ్ముల ఆడించి తమ్ములు.... పద్మములు ముడిచేట్టుచేసి... నాడు కాలగతి...ఎంత సమయమైందో చంద్రుడి నడకని బట్టీ రాత్రిపూట నిర్ణయిస్తారు. ఇదేభావాన్ని చేపకూర వెంకట కవి తన విజయ విలాసంలో 'వేళకొలదుల్ గదనీ నడకల్' అని చమత్కరించాడు.... రాజు... శివుడి శిరస్సు నుండి అధోగతి పొందాడు. కాలగతికి లోనై కృష్ణపక్ష, శుక్లపక్షస్థితి అనుభవించాడు.
ఇలా పేరు పేరునా నిందించాక ఇంకా దూతగా వెళ్ళిన చిలక తిరిగి రాదేమో అని చింతిస్తుంది రాధ.... వెర్రెక్కిన దానిలా ప్రలాపిస్తున్న సమయంలో చిలక తిరిగొస్తుంది. అక్కడ శ్రీకృష్ణదేవుడి "శృంగారాన్ని" బట్ట బయలుచేస్తుంది. తనవశుడై పరవశుడైవున్న అతన్ని తనకు వదలి పెట్టమని రాధను అడిగిందంటూ చెబ్తుంది చిలక.
దాంతో రాధ భగ్గుమంటుంది. ఇళను రకరకాలుగా హీనపరచి నిందిస్తుంది. తొలితొలినాళ్ల సుఖంతో తోయజాక్షుడ్ని లొంగదీసుకుని ఇంత చేస్తుందా?
తనదు మట్టెంత తానెంత? తానె ఇంత
చేయిచాచిన నేనెంత సేయరాదు
వేలు వాచిన రోలంత విరివి అయిన
రోలు వాచిన నది ఎంత బోలుగాదు.
అంటూ వెక్కిరిస్తుంది వింతగా
అలా ఇలా తిరిగిన కధ తిరిగి ఆయన చెంత చేర్తుంది. కడుపు నిండిన బేరమైనా సరసుడు కాబట్టి రాధికా సాంగత్యాన్ని వలవంతతో తలుస్తాడు.
మునుపు నిద్దుర లేదయ్యె ముదిత నెనసి
వెనుక నిద్దురలేదయ్యె వెలది బాసి
ఏమి చెప్పుదు మన్మధ స్వామి మాయ
ముంచకయె ముంచె నొంచకయె నొంచె
వియోగానంతరం కలుసుకుని ఒకరి నొకరు ఎత్తి పొడుచుకుంటారు.
నలువ శిరంబు ముట్టినను నల్లని వానిని నమ్మవచ్చునే అంటుంది రాధ.
వలచి పాయుట పగవారికైనను కాదు అంటాడు. అతడు నువ్వు విషకంధరు (శివుడు) నెచ్చెలివి - విషకుచ చనుబాలు (పూతన) తాగావు. విషనిధిలో (సముద్రంలో) విషధరునిపై (పాముపై) శయనించే విషరుహ (జలజము) నయనుడైన నీకు విషమ (విషయ( గుణము ఎక్కడికి పోతుంది అని నిలదీస్తే దాసరి తప్పు దండంతో సరి అని, ఆయన పాదాలమీద పడ్తాడు. దాంతో కధ కంచికి.... కాదు కాదు కంచుకము విడిచే పడకింటికి వెళ్తుంది. అడుగడుగునా శృంగారాన్ని బంగారంలా పద్యంలో పలికించిన ముద్దుపళని భళీ అనదగ్గ కవయిత్రి.
---*---