Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 31


                                 దొందూ దొందే.....

   
సుశీలా, కాంతారావు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. దాదాపు సంవత్సరం నుండీ కిందా పడిపోతూ చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు.
    ఆరోజు...
    వాళ్లిద్దరూ పార్కులో ఓ మూల ఓ పొదవెనకాల కూర్చున్నారు.
    "సుశీ..." ప్రేమనంతా గొంతులో పలికిస్తూ అన్నాడు కాంతారావు.
    "ఏంటి కాంతా..." అంతకు రెట్టింపు ప్రేమను గొంతులో పలికిస్తూ అంది సుశీల.
    "నువ్వెంత హందంగా ఉన్నవో?!..." మిడిగుడ్లేస్కుని సుశీల వంక చూస్తూ అన్నాడు కాంతారావు.
    "గిలి... గిలిగిలిగిలి.. గిహ్హిలి గిలిగిలి" ఊగిపోతూ నవ్వింది సుశీల.
    "హమ్మో... హమ్మో... హమ్మో..." కాంతారావు పార్కు పచ్చికమీద అటూ ఇటూ పాకుతూ వెతకసాగాడు.
    "ఏంటి కాంతా... ఏంటలా పాకుతున్నావ్?"
    "వెతుకుతున్నా... హి... హిహి..."
    "ఏంటి?... ఏమన్నా పోయిందా?"
    "ఉహు... నువ్ నవ్వుతున్నావ్ గా... నీ నోట్లోంచి ముత్యాలు రాలి కింద పడ్తున్నాయేమోనని చూస్తున్నా... హి..."
    "గిలి గిలి గిలిగిలి... గిహ్హిలిగిలి...గిలి!" మెలికలు తిరిగిపోతూ నవ్వింది సుశీల.
    "నిజ్జంగా... నువ్వట్టా నవ్వుతుంటే ఎంత బాగుంటుందో తెల్సా?..." కళ్ళు తిప్పుతూ అన్నాడు కాంతారావు.
    "థాంక్యూ..." నవ్వీ నవ్వీ నోట్లోంచి కార్తున్న చొంగని తుడ్చుకుంటూ అంది సుశీల.
    కాంతారావు ఓసారి "హిహి..." అని మళ్ళీ మోకాలి మీద పాకుతూ గడ్డిలోకి చూడసాగాడు.
    "హబ్బ!... పొగిడింది చాల్లెద్దూ... నేనెళ్ళిన తర్వాత ముత్యాలేర్కుందువు గానిలే... ప్రస్తుతం నాతో మాట్లాడు..." బుంగమూతి పెట్టింది సుశీల.
    "ముత్యాలేరటం కాదూ నా బొందా కాదు... ఇక్కడ ఎర్ర చీమలున్నట్టున్నాయ్...మంటెక్కిపోతూంది" పాదాలు బరబరా గోక్కుంటూ అన్నాడు కాంతారావు.
    "గిలి... గిలిగిలిగిలి... గిహ్హిలి" నవ్వింది సుశీల.
    "నువ్విహ నవ్వమకు బాబూ... మోకాలి మీద పాకే ఓపిక నాకింక లేదు..."
    "చాల్లే సరసాలు..." అంటూ చెంప మీద "చెళ్ళు" మని కొట్టింది సుశీల.
    "హబ్బా!... ఏందబ్బా అట్టాకొట్టావ్?" దెబ్బకి కళ్ళు బైర్లుకమ్మి, డంగైపోతూ అడిగాడు కాంతారావు.
    "నేనేం కొట్టలా గిలి... ఊర్కేసరదాకి చెంపమీద అలా తట్టా... గిలిగిలి..."
    "అది తట్టడమా?... కొట్టడం లాగుంటేనూ..."
    కాంతారావు ఆమెకి ఆ పక్కనుండి ఈ పక్కకు వచ్చి కూర్చున్నాడు.
    ఇద్దరూ కాస్సేపు ఏ సంతలోనే తప్పిపోయి కొన్ని సంవత్సరాలపాటు ఒకరికొకరు కనిపించకుండా పోయి తర్వాత కల్సుకున్నట్టు ఒకరి మొహంలోకి మరొకరు దేభ్యంగాళ్ళలా చూస్కున్నారు.
    తర్వాత గొంతు పెగల్చుకుని అంది సుశీల "కాంతా... నేనంటే నీకు నిజ్జంగా ప్రేముందా?..."
    "నిజ్జంగా... సరస్వత్తోడు... కావాలంటే మీ నాయనమ్మ మీదొట్టు..." సీరియస్ గా అన్నాడు కాంతారావ్.
    సుశీల తృప్తిగా నిట్టూర్చింది.
    "సుశ్శీ..." పది క్షణాల నిశ్శబ్దం అనంతరం గొంతులో ప్రేమను అతికష్టంమీద పలికిస్తూ అన్నాడు కాంతరావు.
    "ఊ... ఏంటి?" గోముగా అడిగింది సుశీల.
    "నువ్వు దూకమంటే నిప్పులో దూకుతూ... మునగమంటే నీళ్లలో మునుగుతా... నువ్వంటే అంత ప్రేమ"
    "నిజంగానా కాంతా?" దూరంగా కనపిస్తున్న చెరువు వంక చూస్తూ సీరియస్ గా అడిగింది సుశీల.
    కాంతారావు గుండెల్లో రాయి పడింది.
    కొంపదీసి ఆ చెరువులో దూకి మునగమనదు కదా?...
    "అంటే నువ్వు దూకమంటే చర్లో దూకుతాననుకో... హి... కానీ నాకు ఈతరాదుగా! హిహి... నీళ్లలో దూకగానే మునిగిపోయి చచ్చూరుకుంటా... హిహిహి..." వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు కాంతారావు.
    "చాల్లే... నిన్ను చెర్లో దూకమని నేనెందుకు చెప్తాను?... నాకు నువ్వంటే ప్రేమలేదా ఏంటి?" అంది సుశీల.
    "నిజంగానా...?" ఆనందంగా అడిగాడు కాంతారావు.
    "నిజంగానే... నువ్వంటే నాకు ప్రాణం"
    "అయితే నేను నిప్పుల్లో దూకమన్నా దూకుతావా?".
    "దూకను..." అంది సుశీల.
    కాంతారావ్ చిన్నబుచ్చుకుని బుంగమూతి పెట్టాడు.
    సుశీల నవ్వింది."గిలి గిలిగిలి... నువ్వట్టా బుంగమూతి పెడ్తే నీ మొహం అచ్చు చుంచెలక మొహంలా ఉంది... గిలి...గిలిగిలి... సర్లే... నువ్ దూకమంటే నిప్పుల్లో కూడా దూకుతా..."
    "చాల్లే... నిన్ను నిప్పుల్లో దూకమని నేనెందుకు చెప్తానూ?..." అన్నాడు కాంతారావ్.
    "ఇద్దరం ఎందులోనూ దూకొద్దుగానీ ప్రస్తుతానికి ఏదైనా రెస్టారెంట్ కి పోదాం..." అంది సుశీల.
    "కానీ... హి... హిహి..." బుర్ర గోక్కున్నాడు కాంతారావ్."రెస్టారెంట్ కి వెళ్ళే ముందు ఓసారి పొదలోకి దూర్దాం... ఏం...?హిహి"
    "నువ్వు మహా చిలిపి సుమా..." అంటూ ఫెడీల్మని టెంకిమీద సరసంగా కొట్టి పొదలోకి దూరింది సుశీల.
    కాంతారావ్ టెంకి రుద్దుకుంటూ తను కూడా పొదలోకి దూరాడు.
    అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ పోదలోంచి బయటకు వచ్చారు. కాంతారావు చొక్కా ఎత్తి, సుశీల కొంగుతోనూ మూతులు తుడ్చుకుంటూ.
    తర్వాత ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్ళారు. ఇద్దరూ పక్కపక్కగా అతుక్కుపోయి కూర్చున్నారు.
    బేరార్ వచ్చాడు.
    "ఏం కావాలి సార్?"
    కాంతారావు సుశీల వంక చూశాడు. సుశీల కాంతారావు వంక చూసి కళ్లెగరేసింది.
    "నీకేది ఇష్టమైతే నాకూ అదే ఇష్టం... నువ్వే ఆర్డర్ చెయ్యి"అన్నాడు కాంతారావు.
    సుశీల చెప్పింది"ఒక ప్లేట్ చికెన్ పకోడి... ఒక ప్లేట్ చికెన్ మంచూరియా... రెండు థమ్స్ అప్ లు..."
    బేరర్ ఆమె ఆర్డర్ చేసినవి తీస్కోచ్చాడు.
    ఇద్దరూ వాటిని ఒకరికొకరు తినిపించుకుంటూ తిన్నారు.
    చివరగా ఐస్క్రీం తెప్పించుకున్నారు.
    సుశీల సగం తిన్న ఐస్ర్కీం వంక చొంగ కార్చుకుని చూస్తూ అన్నాడు కాంతారావ్. "నేనా ఐస్ర్కీం కొంచెం తిననా?... ఆ! హి!..."
    "నీకు ఎంగిలంటే అంతిష్టమా?" కళ్ళు తిప్పుతూ అంది సుశీల.
    "ఊ... మరేం!..." తీగెలు తీగెలుగా చొంగకారుస్తూ సుశీల ప్లేట్ లోని ఐస్ర్కీం వంక చూశాడు కాంతారావ్.
    "పోనీ! మీ ప్లేట్ లోని ఐస్ర్కీం నేను ఎంగిలి చేసి పెట్నా సార్?" గబగబా కాంతారావ్ పక్కకి వచ్చి వినయంగా అడిగాడు బేరర్.
    "నాకు ఆమె ఎంగిలంటే ఇష్టం... అందరి ఎంగిళ్ళూ కాదు..." పళ్ళు కొరుకుతూ బేరర్ తో అన్నాడు కాంతారావ్.
    బేరర్ బుర్ర గోక్కుంటూ ఓ పక్కకి వెళ్ళి నిల్చున్నాడు.
    కాంతారావు సుశీల ఐస్ర్కీం, సుశీల కాంతారావు ఐస్ర్కీం తిన్నాక బిల్ పే చేసి రెస్టారెంట్ బయటపడ్డారు.
    "నేనిక వస్తా కాంతా... చాలా టైమైపోయింది..." అంది సుశీల వాచ్ వంక చూస్తూ.
    "అప్పుడేనా?" గుడ్లనీరు కక్కుకుంటూ అడిగాడు కాంతారావ్.
    "రేపు మళ్ళీ వస్తాగా..." సుశీల కూడా గుడ్లనీరు కక్కుకుంది.
    "రేపటిదాకా ఆగాలా?... ఉహు...ఉహు..ఉహు" కుమిలి కుమిలి ఏడుస్తూ అన్నాడు కాంతారావ్.
    "తప్పదుగా... మరేం చేస్తాం?..." సుశీల కూడా భయకరంగా కుమిలింది.
    తర్వాత ఇద్దరూ కాస్సేపు క్యార్ బ్యార్ అని ఏడ్చి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
    ఇది వాళ్లిద్దరి దినచర్య.
    కానీ... ఒకరోజు... పార్కులో...
    "సుశ్శీ... మనం విడిపోక తప్పదు సుశ్శీ... మీ వాళ్ళూ మా వాళ్ళూ మన పెళ్ళికి ఒప్పుకోరు. నీకు మీ వాళ్ళని ఎదిరించి రాగల శక్తి లేదు. పోనీ నేనే నీకు నచ్చజెప్పి ఎక్కడినైనా తీస్కెళ్ళి పెళ్ళి చేస్కుందామంటే అలా లేచిపోవడం నాకు ఇష్టం లేదు... అలా పిరికివాళ్ళు పారిపోతారు..." బాధగా చొక్కా కాలర్ నలిపేస్కుంటూ అన్నాడు కాంతారావ్.

 Previous Page Next Page