Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 32


    లక్కతో బొట్లు పెట్టివున్న పెద్ద మండిగం దాటి మెల్లాలో అడుగు పెట్టింది. మెల్లా ఇంట్లో ఉయ్యాల బల్ల వున్నది. దాని మీద ఒక ఆరేళ్ళ పిల్ల కూర్చుని వున్నది. ఆమెను చూస్తూనే బల్లమీద నుంచి దూకి లోపలకు పరిగెత్తింది. అమూల్య దిక్కులు చూస్తూ నిల్చుంది.


    అంతలో నడివయసులో వున్న ఒక స్త్రీ బయటికి వచ్చింది. గుంటూరు నేత చీర అక్కడక్కడ రంగు పోయింది. ఆమెను చూసి ఆ ఇంటి పనిమనిషి అనుకుంది.


    "కూర్చోమ్మా" అన్నది అమూల్యను ఎగాదిగా చూస్తూ.


    అమూల్యకు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. అక్కడ ఉయ్యాల బల్ల తప్ప కూర్చోవడానికి ఇంకేమీ లేదు.


    "లక్ష్మీ ఆ చాప ఇలా తీసుకురా" లోపలికి కేక పెట్టింది.


    లోపల నుంచి ఓ ఇరవై సంవత్సరాల యువతి బయటికి వచ్చింది. వెంకటగిరి జరీ చీర కట్టింది. ఖరీదైందే- కాని బాగా నలిగి వున్నది. ఎన్నోసార్లు కట్టుకొని మళ్ళీ మళ్ళీ మడతలు పెట్టి దాచుకొని కట్టుకున్న చీర అది.


    ఆ యువతీ చాప పర్చింది.


    అమూల్య చాప మీద కూర్చుంది.


    పని అయిపోయిందిగా? నువ్వు అమ్మాయి దగ్గర కూర్చో. మిగతా పని నేను చూసుకుంటాను." అంటూ నడి వయస్సు స్త్రీ లోపలకు వెళ్ళిపోయింది.


    ఆ యువతికి అమూల్యతో ఏం మాట్లాడాలో బోధపడటం లేదు. తనలోకి తను ముడుచుకుపోతున్నట్టు కూర్చుంది. అమూల్యకు ఆమె మీద జాలి వేసింది. కోపం కూడా వచ్చింది.


    "మీ పేరు?" అమూల్య చొరవతీసుకొని అడిగింది.


    "సరోజిని" కొంచెం బిడియ పడుతూ చెప్పింది.


    అమూల్య ఆ హాలు కలియజూసింది. ఒక మూల భోషాణం వున్నది. దానిపైన కొన్ని గోతాలూ, ఇంకా ఏవేవో పాత సామాను వేసి వుంది. మరోవైపు కంది బస్తాలు ఉన్నాయ్. ఆ బస్తాల చుట్టూ అక్కడక్కడ కంది గింజలు ఉన్నాయ్.


    సరోజని గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది. అమూల్య ఆ చేతులకేసి చూసింది. ఎంతో మొరటుగా అక్కడక్కడ పగుళ్ళు వున్నాయి.


    తమ ఇంటి పనిమనిషి పోచమ్మ చేతులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఎత్తుకుంటే చేతులు గుచ్చుకుంటున్నాయ్ అని ఏడ్చేది. పెద్దయ్యాక ఒకసారి ఆ చేతులు అరచేతులు తాకి చూసింది. గరుగ్గా మొరటుగా తగిలాయి.


    "పనిచేసుకొనేటోళ్ళం. మీ చేతుల్లా ఎట్టా మెత్తగా ఉంటాయ్" అంటూ నవ్వింది పోచమ్మ.


    అంటే ఇంటి పనులన్నీ సరోజ, వాళ్ళ అత్తగారే చేసుకుంటారన్నమాట.


    తన ఆడబిడ్డల చేతులు అలా ఉండవ్. వంటలో తల్లికి సహాయం చేసినా వాళ్ళు అంట్లు తోమరు. పిండి రుబ్బరు.


    వీళ్ళు చాలా ధనవంతులట. మరి వంటమనిషినీ, పనిమనిషినీ పెట్టుకోరా? ఇల్లు చాలా పెద్దదిగానే వున్నది. కాని ఒక తీరూ తెన్నూ లేకుండా వున్నది. గోడలనిండా పాతకాలపు నాయకుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, కాలెండర్లూ.


    "మీ పేరు" సరోజిని అడిగింది జంకుగా.


    "అమూల్య."   


    "చాలా బాగుంది. మీ చీర కూడా బాగుంది. మీరూ బాగున్నారు."


    అమూల్య నవ్వింది చిన్నగా.


    "మీరు బాగున్నారు."


    "పల్లెటూరివాళ్ళం."


    "ఏం చదువుకున్నారు."


    "ఎనిమిది వరకు"


    అమూల్య ఆశ్చర్యంగా చూసింది.


    "మీరూ."


    "ఏం.ఏ."


    సరోజిని కళ్ళు పెద్దవి చేసి చూసింది.


    "మీరు పుస్తకాలు చదువుతారా."


    "తెలుగు నవలలు చదువుతుంటాను."


    "ఒసే పిల్లా ఇలారా!"


    "ఇప్పుడే వస్తాను" అంటూ సరోజని లోపలకు వెళ్ళింది.


    అలా వెళ్ళిన సరోజిని అర్థగంట దాకా బయటికి రాలేదు.


    "పక్కగదిలో మగవారు భోజనం చేస్తున్నారు. పదినిమిషాల్లో అయిపోతుంది. మీకు బాగా ఆలస్యం అయింది. వాళ్ళు తినగానే మీకు వడ్డిస్తాను" అన్నది సరోజిని.


    అమూల్య సరోజినిని చిత్రంగా చూసింది. అంటే తనకు శ్రీధర్ తో రఘుతో భోజనం పెట్టలేదన్న మాట. ఇదేం లంచ్.


    "వస్తాను వాళ్ళకు ఏం కావాలో...."


    "మీరు వడ్డిస్తున్నారా?"


    "కాదు అత్తయ్య వడ్డిస్తున్నది. నేను వంటింట్లో అన్నీ తయారుగా ఉంచి ఆమెకు అందిస్తున్నాను" అంటూ లోపలకు వెళ్ళింది.


    మరో పదిహేను నిమిషాలకు సరోజిని అత్తగారు వచ్చింది.


    "లే తల్లీ. చాలా ఆలస్యం అయింది. కాళ్ళు కడుక్కో"


    దొడ్డి వాకిలి గడప మీద సబ్బు. చెంబుతో నీళ్ళు అందించింది. అమూల్య చెయ్యి మాత్రం కడుక్కుంది. సబ్బు అందివబోతే వద్దు అంది.


    గదిలోకి తీసుకెళ్ళారు. డైనింగ్ టేబుల్ పర్వాలేదు. బాగానే వుంది అనుకుంది.


    ఆమె ముందు వెండి పళ్ళెం పెట్టారు.


    "మరి మీరు కూర్చోరూ?"


    "మేం తర్వాత తింటాం"

 Previous Page Next Page