"సరోజనిగార్ని కూర్చోమనండి."
"పరవాలేదండీ. నేనూ, అత్తయ్యగారూ తర్వాత తింటాం" అంటూ అన్నం కంచం నిండా వడ్డించింది.
అమూల్యకు ఆ అన్నం చూస్తేనే కళ్ళు తిరిగాయి. వేరే ప్లేటు అడిగి పదోవంతు మాత్రం కంచంలో ఉంచుకొని మొత్తం తీసేసింది.
"అయ్యో అదేమిటమ్మా అంతా తీసేస్తున్నావ్?"
చుట్టూ బోలెడన్ని కూరలున్నాయ్. పంచదార లడ్డూ, మైసూరు పాకు గబుక్కున కంచంలో వేసింది సరోజిని.
"బాబోయ్ అలా పెట్టకండి" అంటూ వాటిని తీసి పక్క ప్లేటులో పెట్టింది.
"మీరు పట్నం వాళ్ళు. మీ నాజూకులు మాకు తెలియవమ్మా? ఏమీ అనుకోకు" అన్నది సరోజిని అత్తగారు.
ఇద్దరూ చెరోవైపూ చూస్తూ నిల్చుంటే అమూల్యకు అసలు తినబుద్ధి కావడం లేదు.
"మొహమాటపడకమ్మా."
అంతలో తను రాగానే చూసిన పిల్లవచ్చి అమూల్య తీసి పక్కన పెట్టిన లడ్డు తీసుకొని తుర్రున పారిపోయింది.
"మరీ అల్లరి ఎక్కువౌతుంది" విసుక్కుంది సరోజిని.
సరోజిని అత్తగారు లోపలకు వెళ్ళి చేత్తో మరో రెండు లడ్లు తెచ్చి అమూల్య కంచంలో ఆప్యాయంగా వెయ్యబోయింది.
అమూల్య చెయ్యి అడ్డం పెట్టి "వద్దండీ నేను తీపి తినను" అని అబద్దం ఆడేసింది. ఆమె అలా గుప్పెట్లో పట్టుకొచ్చిన లడ్లు చూస్తేనే డోకు వచ్చినట్లు అయింది ఆమెకు.
"ఆ అమ్మాయి ఎవరు?"
"నా మనవరాలు నాకు ఒక్కడే కొడుకు - కూతుళ్ళు లేరు. నా కోడలే నాకు కూతురు. రెండు లక్షలు కట్నం తెచ్చింది. బంగారు తల్లి. అయినా కొంచెం కూడా గర్వం లేదు మా కోడలికి" అన్నది సరోజిని అత్తగారు.
అమూల్య ఆశ్చర్యంగా సరోజిని ముఖంలోకి చూసింది. ఈ అమ్మాయికి రెండులక్షల కట్నం ఇచ్చారా? అంటే పుట్టింటివాళ్ళకు ఎన్ని లక్షలు ఉండి ఉండాలి.
"మీ అమ్మా నాన్నకు మీరు ఒక్కరేనా?"
"కాదు ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. నేను పెద్దదాన్ని."
"పెదపాడు వాళ్ళది. ఆ ఊరికంతా పెద్ద ధనవంతులు" అత్తగారు అన్నది.
అమూల్య భోజనం అయిందనిపించి లేచింది.
మళ్ళీ వచ్చి చాపమీద కూర్చుంది.
"మరీ పిట్ట మెతుకులు తిన్నారు" అన్నది సరోజని.
ఆమె చిరునవ్వు నవ్వింది.
"మీరు భోజనం చెయ్యండి" అన్నది.
మరో అరగంటకు భోజనం చేసి సరోజిని వచ్చి అమూల్య పక్కన కూర్చుంది.
"కాసేపు పడుకుంటారా?"
"లేదండీ వెళ్తాం" అంటూ లేచింది.
"అత్తయ్యా వీరు వెళ్తానంటున్నారు" అంటూ సరోజని లోపలకు వెళ్ళింది.
ఐదు నిముషాల్లో వెండి పళ్ళెంతో ఒక రవికెల గుడ్డ, రెండు అరటిపండ్లూ, పసుపూ, కుంకుమ పొట్లాలు తీసుకొని అమూల్య దగ్గరకు వచ్చింది సరోజని. వెండి కుంకుమ భరిణ మూత తెరిచి కుంకుమ బొట్టు పెట్టింది.
అమూల్యకు చిరాకు వేసింది. బొట్టు పెట్టుకోదు. ఎప్పుడైనా కనీకనిపించకుండా తిలకం పెట్టుకుంటుంది. ఇవాళ అలాగే పెట్టుకుంది.
రవికల గుడ్డలతోపాటు పళ్ళు, ఆకులూ వక్కలూ కుంకుమ పసుపు పొట్లాలూ అందించింది.
అమూల్య అందుకోలేదు.
"తీసుకోమ్మా?" అన్నది సరోజని అత్తగారు.
ఆముదం తాగిన ముఖం పెట్టి అందుకుంది.
"పాపా" సరోజని పిల్చింది.
పాప వచ్చింది.
జడ కుచ్చులు, చెవులకు జూకాలు, పట్టు పరికిణీ, పరికిణీ నిండా మరకలు.
సరోజని కూడా ఒకే చేతికి అరడజను బంగారు గాజులు వేసుకుంది. మెడ తిరక్కుండా చంద్రహారం, ముత్యాల గొలుసూ, కాని కాయపూసలూ వేసుకుంది. ఎడంచేతికి నాలుగేళ్ళకు ఉంగరాలు ఉన్నాయ్. ఉంగరాలనిండా మట్టి, అత్తగారి మెడలో కూడా కాసులదండ ఉన్నది.
"ఏమిటే" పాప తల్లిని అడిగింది.
"నాన్నగారితో చెప్పు పిన్ని వెళ్ళిపోతానంటుందని" అన్నది తలుపుచాటుగా నిల్చుని.
చెప్పడం పాపతోనే గాని చెప్పింది వరండాలో ఉన్న భర్తకు వినిపించాలనే గట్టిగా చెప్పింది.
శ్రీధర్ లేచి నిల్చున్నాడు.
"వస్తామోయ్. మళ్ళీ కలుసుకుందాం."
"అమూల్యా."
"మీవారు మిమ్మల్ని పేరుపెట్టి పిలుస్తారా?" చిన్నగా అత్తకు విన్పించకుండా ఆశ్చర్యంగా అడిగింది సరోజని.
"ఆయనే కాదు నేనూ మావారిని పేరుతోనే పిలుస్తాను" అని బయటికి (అంత పెద్ద గడపడాటి) వచ్చింది.
రఘు ఓ పక్కగా మరోవైపుకు చూస్తూ నిల్చున్నాడు.
సరోజిని తనతోపాటు వరండాలోకి వస్తుందని ఆశించి వెనక్కు చూసింది అమూల్య.
తలుపు చాటుగా ఆమె చీర కనిపించింది.


