అమూల్యను తట్టిలేపాడు.
"ఏమిటి?" బద్దకంగా కళ్ళు తెరుస్తూ అన్నది.
"ఇవాళంతా అన్నం తినలేదటగా?"
అమూల్య మాట్లాడలేదు.
"పొద్దుటి నుంచి ఎంతో పనిచేసి అలిసిపోయి వచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది."
"నువ్వు వెళ్ళి తిను."
"నువ్వు తినకుండా నేను తినను"
"అబ్బో ఎంత ప్రేమో" వ్యంగ్యంగా అన్నది.
"అవును పరీక్ష పెట్టు" అంటూ తనూ మంచంమీద పడుకున్నాడు.
శ్రీధర్ ముఖంలోకి ఎంతో అలసట కన్పించింది.
అమూల్యకు జాలివేసింది.
అంతవరకూ వున్న కోపం అగ్గిముందు పెట్టిన వెన్నలా ఇట్టే కరిగిపోయింది.
"లే. అన్నం తిను."
"ఊహు అక్కర్లేదు."
"నాకూ ఆకలిగా వుంది. త్వరగా లే" చెయ్యి పట్టుకు లాగుతూ అన్నది.
శ్రీధర్ ఉత్సాహంగా లేచాడు.
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు.
బంగారమ్మ మనసు తేలికపడింది.
ఆరాత్రి అడగాలనుకున్న మాటలు శ్రీధర్ ను అడగలేక పోయింది అమూల్య.
రెండురోజులు అమూల్య అందరితో ముభావంగా వున్నది.
"వదినా వదినా అంటూ చుట్టూ తిరిగే ఆడబిడ్డలతో ఎక్కువ రోజులు మాట్లాడకుండా ఉండలేకపోయింది.
బంగారమ్మ కోడలికి మరీ ఎదురెదురుగా వుండసాగింది.
రఘు శ్రీధర్ చిన్ననాటి స్నేహితుడు. బి.ఏ. చదివాడు. కాని పల్లెటూర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
శ్రీధర్ నూ అమూల్యనూ భోజనానికి పిల్చాడు.
అమూల్య ఉత్సాహంగా ఒప్పుకుంది.
ఆమెకు డిన్నర్లకూ, లంచ్ లకూ వెళ్ళడం అలవాటే.
ఆరోజు ఆదివారం.
లంచ్ కి వెళ్ళాలి. ఆమె మనసులో ఆమాట మాత్రమే వుంది.
జీన్స్ వేసుకుంది.
గదిలోనుంచి బయటికి వచ్చిన కోడల్ని కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది బంగారమ్మ.
కమల, విమల కూడా చిత్రంగా చూస్తున్నారు.
ఆమెకోసమే ఎదురు చూస్తున్న శ్రీధర్ "యస్. ఐ యామ్ రెడీ" అన్నది.
శ్రీధర్ కూడా చూస్తూ వుండిపోయాడు.
"ఏమిటలా చూస్తావ్?"
శ్రీధర్ పకపక నవ్వుతూ ఈ వేషంతోనా?"
"ఏం?"
"ఇది మీ ఊళ్ళో ముఖ్యంగా మీ సొసైటీ లంచ్ అనుకున్నావా? ఇది పల్లెటూరు."
"వాళ్ళు లక్షాధికారులు అన్నావు?"
"అయితే?"
"అతని భార్య."
"చూస్తావుగా? లోపలకు వెళ్ళి చీరకట్టుకుని వచ్చెయ్"
అమూల్య విసుగ్గా లోపలకు వెళ్ళింది.
మైసూర్ జార్జెట్ కట్టుకొని వచ్చింది. అదే రంగు బ్లౌజూ, చెప్పులూ వేసుకుంది. పగడాల నగలు పెట్టుకుంది.
శ్రీధర్ చుట్టూ పెద్ద ప్రహరీవున్న గేటు ముందు ఆగాడు.
గేటు తెరిచి లోపలకు నడుస్తున్న అమూల్య ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ నడుస్తున్నది.
మేడ ముందు చాలా ఖాళీ స్థలం ఉన్నది. ఒక ప్రక్కగా గొడ్ల సావిడి ఉన్నది. ఒక వృద్ధుడు ఎద్దుల గంగిడోలు నిమురుతున్నాడు. పేడ కంపు వస్తోంది. ఎక్కడా ఒకప్రక్క మొక్క కూడా లేదు.
గొడ్లపాకకు అల్లంత దూరంలో గోడ పక్కగా గడ్డివాము వున్నది.
"రండి రండి" అంటూ రఘు ఎదురొచ్చాడు.
రఘు గూడకట్టులో వున్నాడు. సాదా షర్టు వేసుకున్నాడు. అతని వేషంలో గానీ, ముఖంలో గానీ నాజూకుతనం ఎక్కడా కన్పించలేదు.
ఆ మేడ పాతకాలపు తరహాలో వుంది.
వరండాలో పేనుతోటో అల్లిన ఈజీ చైర్ ఒక వారగా వున్నది. అదీకాక నాలుగైదు చెక్క కుర్చీలు వున్నాయి.
"కూర్చోరా" అన్నాడు రఘు శ్రీధర్ తో.
అమూల్యకు ఏం చెయ్యాలో తోచలేదు.
"లోపలకు వెళ్ళమ్మా" ఆమె వైపు సరిగా చూడకుండానే అన్నాడు రఘు.
"లోపలకు వెళ్ళు అమూల్యా" శ్రీధర్ ఒక చెక్క కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
ఆమెకు చిరాకు వేసింది.