Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 32


    "ఫాల్తు గాళ్ళందరూ జమవుతున్రు ఈడ. ఈడకెళ్ళి స్పెషల్ వార్డులోకయినా మార్చమనాలె."
    చిరంజీవి మళ్ళీ ఆటో ఎక్కాడు.
    ఓల్డ్ సిటీలో ఓ పాత భవనం ముందాగింది ఆటో.
    అతనిని చూడగానే ఓ వ్యక్తి బయటికొచ్చాడు.
    "ఏం కావాలి?" అడిగాడతను.
    "బాంబ్!"
    "ఎన్ని?"
    "ఒకటి."
    "ఏ టైప్?"
    "ఎక్కువ పవర్ ఫుల్ అక్కర్లేదు. కొంచెం డామేజ్ జరిగితే చాలు. మనుషులమీద పడితే కాలో, చెయ్యో పనికిరాకుండా పోవాలి కొన్నాళ్ళు. అంతే!"
    "రెండువేల అయిదొందలు అవుతుంది."
    "రెండు వేలిస్తాను. నేను పాత వాడినే. జమాల్ భాయిని గుర్తుపడతాను. కిందట ఎలక్షన్లో పాతిక బాంబులు తీసుకెళ్ళా."
    అతను ఓ క్షణం ఆలోచించాడు.
    "నీ పేరేంటి?"
    "చిరంజీవి!"
    అతను లోపలికెళ్ళి అయిదు నిమిషాల తర్వాత తిరిగివచ్చాడు.
    అతని చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్ ఉంది.
    "డబ్బివ్వు"
    చిరంజీవి రెండువేలు అతనికిచ్చాడు.
    అతను ప్లాస్టిక్ సంచిలోనుంచి గుండ్రని బాంబ్ బయటకు తీశాడు.
    ఇదిగో ఈ చిన్న స్విచ్ ఉంది చూశావా? అది పక్కకు జరిపిన అయిదు నిమిషాల్లో ఎక్స్ ఫ్లోజ్ అవుతుంది."
    "తప్పకుండా అవుతుందా?"
    "ఇదిగో మనం చేసినవేమీ ఇంతవరకూ ఫెయిలవలేదు."
    చిరంజీవి థియేటర్ కి చేరుకున్నాడు మళ్ళీ.
    అతనూహించినట్లే సాయంత్రం ఆరుగంటలకల్లా అంబాసిడర్ కారు వచ్చి థియేటర్ ముందాగింది. లోపల్నుంచి గాంధీ చెంచా ఒకడు కారు దిగి ఛాతీ విరుచుకుని నడుస్తూ లాన్స్ లో కొచ్చాడు.
    "గాంధన్న పిలుస్తుండు భయ్" అన్నాడతను.
    చిరంజీవి లేచి బయటకు నడిచాడు.
    బాక్ సీట్లో కూర్చుని ఉన్నాడు గాంధీ.  
    "ఏమ్ తంబీ! ఎట్లున్నది. అంతా మంచిగ నడుస్తుందా?"
    "ఏం ప్రాబ్లమ్ లేదు"
    "ఈడ మంచిగ నామ్ జమాయించినావులే! గౌడ్ సాబ్ చానా తారీఫ్ జేస్తుండు నిన్ను"
    "మన పని మనం ఖచ్చితంగా చేసుకుపోతాం" అన్నాడు చిరంజీవి.
    "అట్లనే ఉండాల మళ్ళా! నేనెప్పుడూ జెప్తుంట మనోండ్లకు! చిరంజీవిని చూసి నేర్చుకోండ్రా అని."
    "ఏమయినా పని మీదొచ్చావా?" అడిగాడు చిరంజీవి.
    "గౌడ్ సాబ్ పైసలిచ్చిండట గదా?"
    "అవును ఇచ్చాడు."
    "సప్పుడు జేయవ్ మళ్ళా!"
    "ఏముంది చెప్పటానికి?"
    "నా రెండువేలు ఏమాయే మరి?"
    "నువ్వు నాకెగొట్టిన బాకీ తీరాక అప్పుడు వస్తయ్."
    గాంధీ మొఖంలో కోపం నిండింది.
    "నేనేం బాకీ వున్నాన్నీకు?"
    "గుర్తులేదా?"
    "నేనేం బాకీ లేను."
    "ఉన్నావ్! ఎలక్షన్ల పని జేయించుకుని సగం పైసలు ఎగ్గొట్టలే?"
    "అదెన్నటి ముచ్చట"
    "ఎన్ని సంవత్సరాలయినా సరే-నా బాకీ నేను వసూలు జేసుకుంటానని నీకు ఆ దినమే జెప్పేనా!"
    గాంధీ కళ్ళు ఎర్రబడినయ్.
    "ఇగో సూడు చిరంజీవి! మంచిగ జెప్తున్నా నా పైసలు నాకివ్వు! లేకుంటే జబర్దస్త్ వసూల్జేసుకుంటా"
    చిరంజీవి తన జేబులోని బాంబ్ తీసి స్విచ్ జరిపి కారు కింద పడేశాడు వారికి కనిపించకుండా.
    "దమ్ముంటే వసూల్జేసుకోమళ్ళా" అనేసి కొద్దిక్షణాలు నిలబడి వెనక్కు తిరిగి నడవసాగాడతను.
    "ఏయ్ చిరంజీవి! ఇజ్జత్ తోటి పైసలివ్వు." అరుస్తున్నాడు గాంధీ.
    చిరంజీవి వినిపించుకోకుండా థియేటర్ గేటు లోపలకు చేరుకున్నాడు.
    ఇప్పుడింక ఆ బాంబ్ ప్రభావం తనమీద ఉండదు.
    గాంధీతోపటు మరో ఇద్దరు కారు దిగి నిలబడి తమలో తాము కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
    సరిగ్గా అదే సమయంలో పేలింది బాంబ్.
    శబ్దం ఎక్కువ రాలేదుగానీ కారు టైర్లు పేలిపోయాయ్. కారంతా మంటలు అలుముకున్నాయ్.
    గాంధీ అతని అనుచరులిద్దరూ అక్కడే కూర్చుండిపోయారు.
    వాళ్ళ కాళ్ళు రక్తవలయం అయిపోయినాయ్.
    పెద్దగా కేకలు పెడుతున్నారు డ్రైవరూ, మరో వ్యక్తి కారు దూకి పరుగెత్తసాగారు.
    చిరంజీవి నెమ్మదిగా నడిచి వారిముందు నిలబడ్డాడు.
    కారు చుట్టూ జనం పోగయిపోయారు. కానీ ఎవరూ వారికి సహాయం చేసేందుకు ధైర్యం చేయటం లేదు.
    "అరేయ్! ఎవళ్ళతో కిరికిరి పెట్టుకోవాలో జర సొంచాయించి పెట్టుకో! ఇంకోసారి నా జోలికి వస్తే మొత్తానికే ఎగిరిపోతావ్! పోలీస్ కి కూడా నా గురించి కంప్లైంట్ ఇచ్చావో నీ పెళ్ళాం బిడ్డలు ఛస్తారు. జాగ్రత్త" పక్కనే వున్న ఆటోరిక్షాలను పిలిచాడు చిరంజీవి.
    "వీళ్ళందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్ లో చేర్చండి."
    "అలాగే అన్నా!"
    జనం సాయంతో వాళ్ళను ఆటోలో పంపించివేశాడతను.
    తిరిగి లాన్లోకొచ్చేసరికి కుర్చీలో గౌడ్ కూర్చుని కనిపించాడు.

 Previous Page Next Page