"సేఠ్ పిలుస్తుండు."
"ఎక్కడున్నాడు?"
"ఆఫీస్ రూమ్ లో."
చిరంజీవి చేతిలోని న్యూస్ పేపర్ పక్కన పడేసి గౌడ్ ఆఫీస్ కి చేరుకున్నాడు.
"కూర్చో" అన్నాడు గౌడ్.
చిరంజీవి కూర్చున్నాడు.
అతను టేబుల్ సొరుగులో నుంచి యాభయ్ రూపాయల బ్యాంక్ బండిల్ ఒకటి తీసి చిరంజీవి ముందుకి నెట్టాడు.
"అడ్వాన్స్ వెయ్యి రూపాయలిచ్చాను, ఇది అయిదువేలు. ఇక గాంధీకి నాకూ సంబంధం లేదు. అతనివ్వాల్సిన రెండు వేలకు నీదే పూచీ!"
"అవును. ఆ పూచీ నాకొదిలేయండి!"
చిరంజీవి నోట్ల కట్ట తీసుకుని బయటకు నడిచాడు.
బహుశా సాయంత్రానికల్లా గాంధీ డబ్బు వసూలు చేసుకోటానికొస్తాడు.
అప్పుడు మొదలవుతుంది గొడవ.
తిరిగి లాన్ లో కొచ్చాడతను.
న్యూస్ పేపర్ లో దీప ఫోటో కనబడుతోంది.
ఆమెకెలాగూ మతి స్థిమితం లేదు. ఒక్కసారి తను వెళ్ళి ఆమెను మనసుతీరా తిట్టివస్తే?
అతను కొద్దిక్షణాలు ఆలోచిస్తూండిపోయాడు.
ఆమె పోలీస్ కి చెప్పదు కదా తిట్టినట్లు?
కానీ ఎవరని చెపుతుంది?
జ్ఞాపకశక్తి పోయింది కాబట్టి తన పేరూ ఉద్యోగం ఇవేమీ గుర్తుండవు.
న్యూస్ పేపర్ లోని ఆమె ఫోటో వేపు మరోసారి చూశాడతను.
అవును. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.
లేచి థియేటర్ బయట ఉన్న ఆటోలో కూర్చున్నాడతను.
"ఎక్కడికన్నా?"
"పోలీస్ స్టేషన్ పోనీ."
ఆటో పోలీస్ స్టేషన్ చేరుకుంది.
హెడ్ కానిస్టేబుల్ రజాక్ అతనిని చూసి ఆప్యాయంగా పలుకరించాడు.
"ఏమిటిలా వచ్చావ్?"
పేపర్లో మీ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఆ అమ్మాయి ఫోటో వేశారు కదా! ఆ పోరిని ఎక్కడో చూసినట్లుంది."
"అలా లాభంలేదు. ఎక్కడ చూశావో ఖచ్చితంగా గుర్తుతెచ్చుకుంటే మాకు ఉపయోగం ఉంటుంది."
చిరంజీవి ఆలోచనలో పడినట్లు నటించాడు.
"ఆ ఫోటోలో సరిగ్గా తెలీటం లేదు. ఇంకేమయినా ఫోటోలున్నాయా?"
"ఫోటోలెందుకు? గాంధీ హాస్పిటల్ కెళితే ఫిమేల్ వార్డులో డైరక్ట్ గానే చూడవచ్చు కదా!"
చిరంజీవి జేబులోనుంచి వందనోట్లు రెండు తీసి రజాక్ కిచ్చాడు.
"మీ మామూలు"
"అదేమిటి మూడొందలు ఇమ్మన్నాను కదా!"
"ఇన్ కమ్ పెరగనీ. ఇంకెవరయినా కూడా ప్రొటెక్షన్ కి పిలుస్తే అయిదొందలిస్తాను."
"సరే కానీ."
చిరంజీవి ఆటో గాంధీ హాస్పిటల్ చేరుకుంది.
గేటు దగ్గరున్నవాడు చేయి అడ్డం పెట్టాడు.
"వెళ్ళటానికి వీల్లేదు."
"లోపల ఆ మతిపోయిన అమ్మాయిని చూడాలి."
"సాయంత్రం నాలుగ్గంటలకు రా."
చిరంజీవి అతని చేయి అలాగే పట్టుకుని సడెన్ గా మెలి తిప్పాడు.
బాధతో విలవిలలాడుతూ కిందకు పడిపోయాడతను.
చిరంజీవి లోపలకు నడిచాడు.
అతనేమీ మాట్లాడలేదు.
దీప ఉన్న వార్డు కనుక్కోవడం కష్టమేమీ కాలేదు.
ఆమెకు కాపలాగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది.
అయిదారుగురు ఆడాళ్ళు ఆమెవేపు విచిత్రంగా చూస్తున్నారు.
"వెళ్ళండిక. ఈ న్యూస్ పేపర్ లో ఫోటో వేయటం చూసి మంది ఎక్కువయిపోయిన్రీడ. పోండ్రి" అరుస్తోంది కానిస్టేబుల్.
దీప తనను చూడడానికి వస్తోన్నవారిని బెదిరిపోతూ చూస్తోంది.
చిరంజీవి ముందుకి నడిచి దీపకి సమీపంగా నిలబడి ఆమెవేపు చూశాడు. దీప కూడా అతనివేపు చూసింది. అతనిని ఎక్కడో చూసింది తను. బాగా గుర్తుంది. ఎవరై ఉంటారు?
వెంటనే చూపులు మరల్చుకుని కళ్ళు మూసుకుంది. గుర్తురావటం లేదు. చిరంజీవి నవ్వుకున్నాడు... అంటే తనను గుర్తుపట్టలేదన్నమాట.
నిజంగానే ఆమె జ్ఞాపకశక్తి పోయి వుంటుంది. లేకపోతే తనను గుర్తుపట్టకుండా వుండటం అసంభవం.
"ఛలో భాయ్! నికల్ జావ్ యహాసే" అరుస్తోంది లేడీ కానిస్టేబుల్.
చిరంజీవి బెడ్ కి అవతలివేపుకి తిరిగివచ్చి ఆమెకు కనిపించేటట్లు నిలబడ్డాడు ఈసారి.
దీప అతనివేపు చూసింది మళ్ళీ.
చిరునవ్వు నవ్వాడు చిరంజీవి.
ఆమె ఆశ్చర్యంగా అతనివేపు చూసింది. బాగా గుర్తున్న మొఖమే. ఎక్కడో, ఎప్పుడో చూసింది. అంతవరకూ నిజం.
చిరంజీవికి ఆమెను కసితీరా తిట్టేయాలన్నంత కసి ఏర్పడింది.
కానీ అతను నోరు తెరవకముందే కానిస్టేబుల్ అతనిదగ్గరకొచ్చింది.
"ఏయ్! పొమ్మని చెప్తుంటే నీక్కాదూ?
"పోతున్నాలే. అలా గొంతు చించుకోకు. కుట్లు పడతయ్" అనేసి వెనక్కు తిరిగాడు.
కానిస్టేబుల్ అతనిని తిట్టటం వినిపిస్తూనే వుంది.