"ఆ పని చేసింది నువ్వే కదూ?"
"అవును!"
"ఎందుకలా చేశావ్?"
"వాళ్ళకూ నాకూ పాత బాకీలున్నాయి."
"ఇప్పుడేం జరుగుతుంది?"
"ఏం జరగదు. వాళ్ళు నెలరోజులు హాస్పిటల్లో వుంటారు."
"తర్వాత?"
"దమ్ముంటే మళ్ళీ నా మీద ఎటాక్ చేస్తారు. లేకుంటే జన్మలో నా జోలికిరారు."
"అంటే నీ మీద కోపంతో నా హోటల్, నా థియేటర్ మీద ఎటాక్ చేయవచ్చు అవునా?"
"చేయవచ్చు.
"అది నాకిష్టం లేదు చిరంజీవి! ఇవి రెండూ చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి కట్టాను. ఇప్పుడే డామేజ్ జరిగితే నా బిజినెస్ దెబ్బతింటుంది."
"అవును!"
"అందుకని..."
"తెలుసు! నేను రేపట్నుంచి ఇక్కడికి రాను."
"నామీద కోపమేమీ లేదుకదా?"
"కోపమెందుకు? ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదుకదా?"
"కొన్ని దినాలు పోయినాక మళ్ళీ కబురు చేస్తాన్నీకు."
"అప్పటి సంగతి చూద్దాం."
అతను వెళ్ళిపోయాడు.
చిరంజీవి బయటకు నడిచాడు.
నెలరోజుల ఉద్యోగం పూర్తయిపోయింది.
మళ్ళీ రోడ్డున నిలబడ్డాడతను.
మళ్ళీ బ్రతుకు తెరువు కోసం పాట్లు మొదలు.
అయినా తనకు సంతృప్తిగా వుంది.
ఎంతోకాలంనాటి ప్రతీకారం ఈ ఉద్యోగం వల్ల తీర్చుకోగలిగాడు.
బస్ లో ఎక్కుతుండగా పోలీస్ వ్యాన్ వచ్చి బాంబ్ పేలిన చోట ఆగటం కనిపించింది.
కండక్టర్ నమస్కారం పెట్టాడతనికి.
"ఏమన్నా గడబడయిందట థియేటర్ దగ్గర!"
"అవును. ఎవళ్ళో బాంబ్ లేశారు అంబాసిడర్ మీద."
"అందులో ఎవరున్నారు?"
"గాంధీ!"
"అరే-ఆ కవాడీగూడా దాదానా?"
"అవును!"
చిరంజీవి మనసుని ఆలోచనలు తొలచి వేస్తున్నాయి.
ఆ దీప ఉన్న పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఆమెమీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలని వుంది.
కానీ అదెలాగో తెలీటం లేదు.
అయితే ఆమె మీద ప్రతీకారం తీర్చుకోడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని కూడా తనకు తెలుసు.
బస్ దిగి ఇంటివేపు నడువసాగాడతను.
పిల్లలు ఇంటి దగ్గర కనిపించలేదు.
ఆశ్చర్యంతో వాళ్ళకోసం చుట్టుపక్క ఇళ్ళవాళ్ళను వాకబు చేశాడు.
"శీను స్కూలు పుస్తకాలు ఎవరో కొట్టేశారట మొత్తం బ్యాగ్ అంతా పోయింది. అందుకని భయపడి కృష్ణయ్య వాళ్ళింట్లో దాక్కున్నారు."
చిరంజీవి కృష్ణయ్య ఇంట్లోకి నడిచాడు.
"పిల్లలిక్కడే ఉంటారు ఇవాళ" అన్నాడు కృష్ణయ్య.
"అవసరం లేదు. ఇంటికి వచ్చేస్తారు."
"రారు అని చెపుతున్నాను. నువ్వెళ్ళు."
చిరంజీవి కోపంగా అరిచాడు.
"ఒరే రాజూ, రజనీ! వెంటనే ఇంటికి రాకపోతే బెల్టు తీసుకొచ్చి కొడతాను" అనేసి ఇంటికి చేరుకుని కుర్చీలో కూలబడ్డాడు.
ఒక్కొక్కరే నెమ్మదిగా భయంగా ఇంట్లో అడుగుపెట్టాడు.
"ఏం చేశారు స్కూల్లో?"
"నా పుస్తకాల బ్యాగ్ ఎవరో కొట్టేశారు మావయ్యా?"
"ఎక్కడ?"
"ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటుంటే?"
"ఎప్పుడు?"
"సాయంత్రం."
పుస్తకాల బ్యాగ్ పోయినంత మాత్రాన పిరికివాళ్ళలా భయపడి కృష్ణయ్య ఇంట్లో దాక్కోవలసిన పనిలేదని తనకు తెలుసు.
మరింకేదో కారణం వుంది.
లేచి హాంగర్ కి తగిలించి వున్న బెల్టు చేతిలోకి తీసుకున్నాడతను. అందరి మొఖాల్లోనూ భయం కనిపించింది.
"రాజూ?"
"ఏమిటి మావయ్యా?"
"నిజం చెప్పరా! ఏం జరిగింది?"
"మేమందరం ప్లే గ్రౌండ్ లో ఆడుకుని వచ్చేసరికి శీను బ్యాగ్ కనిపించలేదు మావయ్యా."
బెల్టు దెబ్బ వాడి వీపుమీద పడింది.
బిగ్గరగా ఏడ్చేశాడు వాడు.
శీనుకి కూడా కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
"మావయ్యా! మరే...అందరం సినిమా కెళ్దామని రజని అక్క అంటేనూ టిక్కెట్లకు డబ్బు లేదని రాజు నా పుస్తకాలు అమ్మేశాడు షాపులో."
రాజుకి మరింత భయం పెరిగిపోయింది.