"విజయా! నువ్వెప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుంటావ్ ఎందుకని? ఆరోజు నా ప్లాట్ లో గడిపిన రాత్రి యెంతో ఉత్సాహంగా ఉన్నావే! మర్చిపోయావా?" ఓ రోజు అడిగాడతను.
జయ బలవంతంగా నవ్వింది. "ఏమో! నేనేమీ ఆలోచించడం లేదు! వంట్లో కొంచెం నలతగా వుంది. అందుకని..."
"అబద్ధాలు చెప్తున్నావు కదూ?"
"ఊహు! కాదు!"
"మరి నీలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? అసలు అదివరకు నాకు ఉత్తరాలు రాసే విజయవు నువ్వా కాదా అని అనుమానం వస్తోంది నాకు."
జయ ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ "పోనీ మళ్ళీ ఉత్తరాలు రాయడం ప్రారంభించమంటారా?" అంది నవ్వుతూ.
చంద్రకాంత్ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు.
"నా దేవతా! ఆనాటికీ, ఇప్పటికీ ఎందుకో చాలా మారిపోయావు నువ్వు. ఏం జరిగిందో, ఎందుకిలా మారిపోయావో నాకు తెలీదు. అంత చొరవగా, సరదాగా, అందంగా వుత్తరాలు రాసే నువ్వు ఇంత డల్ గా వుండగలవంటే ఎవరు నమ్ముతారు? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ కదూ?"
అతనలా మాట్లాడుతుంటే జయ గుండెలు వేగంగా కొట్టుకునేవి.
తన విషయం ఎక్కడ బైటపడుతుందోనని విపరీతమైన భయంగా వుండేది.
ఆమెకంటే ఎక్కువగా పార్వతి, విజయ ఆందోళన పడుతూండేవాళ్ళు. పార్వతి పెద్ద జబ్బు పడ్డదానిలా క్షీణించిపోతుంది రోజురోజుకీ. విజయకు ఆమె పరిస్థితి మరింత బాధ కలిగిస్తోంది. ఇద్దరూ ఇంట్లో వున్నా ఇల్లంతా నిశ్శబ్దంగా ఎవరూ లేనట్లే వుండేది.
విజయకు జీవితం మీద ఉత్సాహం లేదు. యాంత్రికంగా ఆఫీస్ కెళ్ళడం, ఇంటికి రావడం, నాలుగు మెతుకులు తినడం, లైట్లన్నీ ఆర్పివేసి చీకట్లో గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చోవడం. అర్థరాత్రి దాటాక యెప్పుడో నిద్రపోవడం. ఇదీ ఆమె కార్యక్రమం.
ఆరోజు జయ ఆఫీస్ కెళ్ళడానికి సంసిద్ధమవబోతూంటే కళ్ళు తిరిగినట్లనిపించింది. పక్కనే వున్న చంద్రకాంత్ ఆమెను తూలి పడకుండా చటుక్కున రెండు చేతుల్తో పట్టుకున్నాడు.
"ఏమైంది విజయా?" ఆదుర్దాగా అడిగాడు.
"మరేంలేదు. కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించింది."
"అరె! ఎందుకని? డాక్టర్ కి చూపించుకోవడం మంచిది. పద! నేను తీసుకెళతాను డాక్టర్ దగ్గరకు."
"ఇప్పుడా! ఇప్పుడు వద్దులెండి, రేపాదివారం వెళ్దాం."
అతనిని వారిస్తూ అంది జయ.
"ఊహు! ఆరోగ్యం ఉపేక్షించడం నాకిష్టంలేదు."
"మీరేమీ ఖంగారుపడనక్కరలేదు. పెళ్ళయిన తర్వాత ఇలా ఆడాళ్ళందరికీ అవుతుంది" బలవంతంగా చిరునవ్వు పెదాల మీదకు తెచ్చుకుంటూ అందామె.
చంద్రకాంత్ కి అర్థమైపోయింది.
"విజయా! నువ్వనేదేమిటి? గర్భవతి వయ్యావా?"
మౌనంగా తలూపింది.
అతను ఆమెను అమాంతం కౌగిలించుకున్నాడు.
"ఈ మాట చెప్పడానికి సిగ్గెందుకు?" ఆనందంగా అడిగాడు.
"ఏమో! ఇంత త్వరగా...ఇలా అయితే..."
"నువ్వు చాలా ఫాస్ట్ విజయా! అందుకే ఇంత త్వరగా తల్లివి కాబోతున్నావు."
జయ బలవంతంగా అతని కౌగిలి నుంచి బయటపడింది. అతని కౌగిట్లో వున్నంతసేపూ అశాంతిగానే వుంటుంది తనకి.
అతనితో ప్రణయం జరిపే ప్రతిక్షణమూ ఏదో తప్పు చేస్తున్నట్లు భావన! అతనిని మోసగిస్తోందన్న బాధ. అతను రోజురోజుకీ ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడో తను అతనికంత దూరంగా పారిపోవాలని వుంది. అనుక్షణం కిషోర్ గుర్తుకొస్తూనే వుంటాడు. అతను గుర్తుకొచ్చినప్పుడల్లా అతనిమీద అసహ్యం పెరిగిపోతూంటుంది. అతను హృదయం లేని మనిషని తను గుర్తించనేలేదు.
స్త్రీని ఆట వస్తువుగా భావించే మనస్తత్వం గలవాడని ముందే తెలిస్తే తన పరిస్థితి ఈరోజు ఇలా వుండేదికాదు. అతను తనను మోసం చేసినందుకు తను అంతగా బాధపడటం లేదు. కానీ తను చంద్రకాంత్ లాంటి సహృదయుడిని మోసం చేస్తున్నందుకు చిత్రవధ అనుభవిస్తోంది.
అసలు ఉద్యోగం కూడా చేయాలనిపించడంలేదు. కానీ ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు తనను పూర్తిగా వశం చేసుకుని హింసిస్తాయని భయం.
"విజయా! నువ్వు మరీ అంత డల్ గా తయారవుతున్నావేమిటి? ఎప్పుడూ ఏదొకటి ఆలోచిస్తున్నట్లు, అలసిపోయినట్లూ...ఆల్ రైట్ నువ్వు ఉద్యోగం మానేసెయ్! రేపట్నుంచీ వెళ్ళొద్దు!" ఓరోజు ఆమెతో అన్నాడు చంద్రకాంత్.
"ఎందుకని?"
"ఎందుకొచ్చిన శ్రమ నీకది? ఆఫీస్ పనీ, యింటి పనీ_ఈ రెండింటితో నీకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? అయినా నా జీతం మనకు చాలకపోతే కదా! అంతగా నీకు ఉద్యోగం చేయాలనుంటే, తరువాత అవసరమయినప్పుడు మరో ఉద్యోగం చేద్దువుగానిలే! ఈపాటి ఉద్యోగం సంపాదించడం అంత కష్టమేం కాదు!"