Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 31


    అరగంటలో పోలీసు ఇనస్పెక్టరు వచ్చాడు. చిన్నపరెడ్డి ముందుకు వెళ్ళి సంగతంతా విశదీకరించి తన అనుమానం వివరించాడు. యీ కేసుని ఆషామాషీగా తీసుకుని వదిలేయకూడదని, తన స్వంత కేసనుకుని ప్రయత్నించి హంతకులని పట్టుకోవాలని చెప్పాడు. ఇనస్పెక్టరు అంతా విన్నాడు. చుట్టూ వున్న మనుష్యులనీ ప్రశ్నించాడు. పోలీసు ఫోటోగ్రాఫరు ఫోటోలు తీసుకుంటున్నాడు. అసలు అంత ఉదయాన్నే చెరువు గట్టుకి ఎందుకు వెళ్ళాడని ప్రశ్నించాడు.
    "రోజూ సీకట్నే ఆడు సెరువుగట్టుకాడకి బయలు కెడతాడు బాబూ! అట్నించొచ్చి గంజి త్రాగి బాబుగారింటికి పనికెల్తాడు. యీ పొద్దు సెరువు గట్టు కాడ కెళ్ళినాడు ఎంతకీ రాకపోతే అట్నించటే బాబుగారింటికెళ్ళి పోనాడనుకున్నాను.... గానీ యింత ఘోరం జరిగిపోనాదనుకోలేదు" లచ్చి మళ్ళీ గొల్లుమంది.
    ఇనస్పెక్టరు వివరాలన్నీ రాసుకుని బాపయ్యనాయుడిని కలవడానికి బయలుదేరాడు.
    శవ పరీక్ష ముగిశాక పోలీసులు శవం అప్పగించాక చిన్నపరెడ్డి పెద్ద ఎత్తున ఆర్బాటంగా కోటిగాడి శవాన్ని దహనం చేయడానికి దగ్గిరుండి అన్ని ఏర్పాట్లు చేశాడు. లారీ తెప్పించి పూలదండలు కట్టించాడు. కోటిగాడి శవంమీద పూలు జల్లాడు. ఊరంతా ఊరేగించి దగ్గిరుండి మరీ దహనం చేయించి కోటిగాడి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

                                              *    *    *    *

    పోలీసు ఇనస్పెక్టరు బాపయ్యనాయుడి దగ్గిరికి వచ్చేలోపలే అయన అనుచరులు కోటిగాడి హత్య వార్త అందించేశారు. చిన్నపరెడ్డి అన్నమాటలన్నీ పొల్లుపోకుండా చెప్పారు. ఆ మాటలు విన్న నాయుడు మొహం చిట్లించాడు.
    "ఏటి, మనం సంపింసినాం అంటున్నాడా? ఏడిశాడు ఎదవ! కూసుకోనీ మనకేటి నట్టం? మనం సంపడం ఆడు సూశాడా? సాచ్చికం ఏదన్నా సూపమను లంజి కొడుకుని.... ఆడే మాటంటే అదే రైటా ఏటి? ఆడిమాటే సెల్లిపోతా దనుకుంటున్నాడుగామోసు.... ఆడు, నేను మాటంటే సెల్లిపోదు కోర్టులో.... సాచ్చికం వుండాలి సాచ్యం" అంటూ కోపంగా కొంతసేపు, నిర్లక్ష్యంగా కొంతసేపు మాట్లాడాడు.     
    ఇనస్పెక్టరు వచ్చి అడిగినా అదే చెప్పాడు. ఆడి మాట లట్టుకుని అనవసరంగా నామీద నేరం ఎట్టారంటే నేనసలే మంచోడ్నిగాను.... జాగ్రత్త, మీపని సెపుతాను; పరువునట్టం దావా ఏస్తాను. ఆ ఎదవ ఏదో కూసినంత మాత్రాన ఆడి మాటలట్టుకుని నాకాడకి వస్తారా.... నేనే సేసాననడానికి సాచ్చ్యం వుంటే సూపండి ఆడు మీరు! అంటూ దులిపి వెళ్ళాడు.
    ఇనస్పెక్టరు ఏం చెయ్యాలో తెలియక బుర్ర గీక్కున్నాడు. ఆఖరికి ఆలోచించి బాపయ్యనాయుడి పార్టీలో జమా జెట్టీలలాంటి ఇద్దర్ని అనుమానితులుగా అరెస్ట్ చేసి తీసికెళ్ళాడు.

                                             *    *    *    *

    కోటిగాడు చనిపోయిన పదకొండో రోజున ఊర్లో కోటిగాడి ఆత్మశాంతికి సంతాప సభ జరిపించాడు రెడ్డి. అతని ఆత్మశాంతికి ప్రార్థనలు చేశాడు. అన్నమాట ప్రకారం కోటిగాడి పెళ్ళానికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు. గుడిసె వేసుకోడానికి డబ్బిచ్చాడు. కోటిగాడి కొడుక్కి ఎవరితోనో చెప్పి బంట్రోతు పని వేయిస్తానన్నాడు.
    చెప్పినవన్నీ చేసి మాట నిలబెట్టుకుని కోటిగాడి మీద తనకున్న అభిమానంతోపాటు అతని దయార్ద్ర హృదయాన్ని కూడా చాతుకుని నలుగురిచేత ఔననిపించుకున్నాడు రెడ్డి.

                                            *    *    *    *

    ఎలక్షన్లు వచ్చాయి.... వెళ్ళాయి!
    పాతికవేలు ఖర్చుపెట్టిన బాపయ్యనాయుడు చిత్తుగా ఓడిపోయాడు. మూడువేలు మాత్రం ఖర్చు పెట్టిన చిన్నపరెడ్డి ఘనవిజయం సాధించాడు.
    కోటిగాడి హత్యకేసు కాలగర్భంలో కలిసిపో సాగింది.

                                               *    *    *    *

    విజయోత్సాహంతో మెడలో పూలదండలతో అభిమానుల, ఆప్తుల అభినందనలు అందుకుని, ఆనందంగా గర్వంగా యింట్లోకి అడుగుపెట్టిన చిన్నపరెడ్డి లోపల వరండాలో కూర్చున్న వీరిగాడ్ని చూడగానే ఆయన మొహం అంతవరకు పెట్రోమాక్సు లైటులా వెలుగుతున్నదల్లా ఆముదం దీపంలా మారిపోయింది. నుదురు చిట్లించి తీక్షణంగా చూశాడు.
    వీరిగాడు ముసిముసి నవ్వు నవ్వుతూ దండం పెట్టాడు.
    "ఏరా ఇలా వచ్చావు?" అన్నాడు పళ్ళబిగువున రెడ్డి.
    "ఓసారి తమ దర్శనం సేసుకుందామని, తవరు ఎలచ్చన్లో నెగ్గారు గందా అని...." అంటూ వెకిలి నవ్వు నవ్వాడు.
    "ఊ.... చూశావుగా.... యింక వెళ్ళు" కఠినంగా అన్నాడు.
    "దొరా!" నసుగుతూ బుర్ర గోక్కున్నాడు వీరిగాడు.
    "ఊ....ఏమిటి?" తీక్షణంగా చూశాడాయన.
    "దొరా! యింట్లో చాలా కష్టంగా వుంది. జరుగుబాటు ....ఏదన్నా ఇప్పించాలి దొరా" అన్నాడు.
    "ఇచ్చాగా, యింకా ఏమిటి?"
    "అది సరే దొరా, కష్టం చాలదు దొరా.... ప్రాణాలకి తెగించి, మూడో కంటివాడికి తెలియకుండా...."
    "వీరిగా!" మధ్యలోనే గర్జించాడాయన. "నోర్మూయ్ చంపేస్తాను నోరెత్తావంటే" మధ్యలోనే అరిచాడు. కాసేపు తీక్షణంగా వీరిగాడ్ని చూస్తూ ఆలోచించి లోపలికి వెళ్ళి, అంతలోనే తిరిగి వచ్చాడు రెడ్డి. చేతిలో వున్న ఐదు పచ్చనోట్లు వీరిగాడి చేతిలో పెడుతూ మింగేసేట్టు చూశాడు.
    "ఒరేయ్ వీరిగా, నోరెత్తి మరోమాట మాట్లాడావంటే చంపేస్తాను.... యీ సంగతి మూడో మనిషికి తెలిసిందన్న సంగతి నాకు తెలిస్తే ఆ రోజుతో నీ చావు మూడిందన్న సంగతి గుర్తుంచుకో!.... ఈ వంకతో మళ్ళీ యీ ఇంటి గుమ్మం తొక్కితే నీకు భూమ్మీద నూకలు నిండుకున్నాయన్న విషయం తెలుసుకో! పిచ్చి పిచ్చి వేషాలు వేద్దామనుకుంటున్నట్టున్నావుగాబోలు యీ సాకు అడ్డం పెట్టుకుని నేనెవరో తెల్సుగా! జాగ్రత్త. వెళ్ళిక్కడ నించి.... మళ్ళీ నాకంటికి కనిపించకుండా.... ఫో.... ముందు_!" కోపంతో వణికిపోతూ వేలుపెట్టి గుమ్మం చూపించాడు రెడ్డి.
    వీరిగాడు ఆ కోపానికి బెదరకుండా, నక్క వినయం చూపిస్తూ, వంగి దండం పెడ్తూ.... 'నాకు తెల్దా దొరా తమ సంగతి' అంటూ ఓ నవ్వు విసిరి వెళ్ళిపోయాడు బయటికి.

                                                      *  *  *  *

 Previous Page Next Page