"పోనీ రాకపోతేపోనీ......అసలు అది యేనాడయితే యీ దేశం వదలి వెళ్ళిందో ఆనాడే దాని ఆశ వదులుకున్నాను......కన్నవాళ్ళం మనం ఊరికే కొట్టుకు పోవడం తప్ప, పిల్లలకి మనమీద ఎందుకుంటుంది? వట్టి భ్రమ. ఉంటే, తల్లి, తండ్రి ఉన్నారన్న సంగతి మరిచిపోయి, చెప్పకుండా చెయ్యకుండా పెళ్ళి చేసుకుంటుందా?" ఎదుతలేని కూతుర్ని నిష్టూరా లాడుతూ, చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది పార్వతమ్మ.
పార్వతమ్మ అటు వెళ్ళగానే అంతవరకు నిగ్రహించుకున్న జగన్నాథంగారి ఆవేదన కన్నీళ్ళుగా పైకి చిమ్మింది. విజయ రాసిన ఉత్తరం మళ్ళీతీసి, చదువుకుని, తన ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకున్నారాయన.
10
పందొమ్మిది వందల అరవై అయిదవ సంవత్సరం సెప్టెంబరు నెల పాకిస్థాన్ ఇండియామీద దురాక్రమణ యుద్ధం ప్రారంభించింది. సరిహద్దుల సంరక్షణకు సాయుధ సంఘర్షణ అనివార్యమైంది. యుద్ద వార్త వినగానే జగన్నాథంగారు విపరీతంగా ఆందోళనపడ్డారు. శంకర్ కూడా యుద్దంలో పాల్గొనవలసి వస్తుందేమో! చైనీయులు యెత్తివచ్చినప్పుడు శంకర్ యేదో ట్రైనింగ్ కోసం ఇంగ్లాండులో ఉండిపోవడం చేత భయపడవలసిన అవసరం లేక పోయింది.
ఇప్పుడు భయపడుతున్నట్టుగానే శంకర్ దగ్గిరనుంచి ఉత్తరం వచ్చింది, తను ఫ్రంట్ కి వెడుతున్నట్లు, తండ్రికి భయపడవద్దని రాశాడు.
ఈ సంగతి జగన్నాథంగారు పార్వతమ్మకి తెలియకుండా దాచాడు. చెపితే భయపడి-బెంగపెట్టుకుంటుందని. కాని దేశం అంత గగ్గోలు ఎత్తించిన యుద్దవార్త తెలియకుండా ఎన్నాళ్ళు దాచగలడు? పక్కయింటి సుందరమ్మ దగ్గిర యుద్ధం సంగతి విని, హడావిడిగా యింటికి వచ్చి ఆదుర్దాగా అడిగింది పార్వతమ్మ. అప్పుడు యింక చెప్పక తప్పలేదు ఆయనకీ-శంకర్ సమాచారంతో సహా. వింటూనే కళ్ళనీళ్ళు పెట్టుకుంది పార్వతమ్మ. విజయ తనింక చూడ్డం పడదని మథనపడుతూంటే, పులిమీద పుట్ర వీడిరాత ఎలా ఉంటుందో అని ఆమె శోకాలు పెట్టింది.
"ఏం జరిగిందని యేడుస్తావు?.......మరేం ఫరవాలేదు......యుద్దానికి వెళ్ళిన అందరూ చచ్చిపోతారా?......ఊరుకో......తప్పు, అలా యేడవకు!" పార్వతమ్మకి ధైర్యం చెపుతున్నారేగాని, మనసులో ఆయనకీ జంకుగానే ఉంది.
రోజల్లా రేడియోముందే కూర్చునేవారు జగన్నాథంగారు. యుద్దవార్తలు వినడానికి. తను తెప్పించే పేపరు కాక, మరో రెండు పేపర్లు కొని యుద్దవిశేషాలు ఆదుర్దాగా చదివేవారు. ఏ క్షణాన ఎలాంటి వర్త వినవలసి వస్తుందో అన్న చింతతో కంటికి కునుకే పట్టేదికాదు ఆయనకీ, పార్వతమ్మకీ ఏనాడూ రేడియో వినని పార్వతమ్మ కూడా. ఆ చెప్పేది తన కర్ధం కాకపోయినా, రేడియోదగ్గిర కూర్చుని ఆయన్ని గుచ్చిగుచ్చి వివరాలు అడిగేది.
పార్వతమ్మ కొడుకు క్షేమంగా తిరిగివస్తే వెంకటేశ్వరునికి కళ్యాణం చేయిస్తానని మొక్కుకుంది. ఆ ఊళ్ళో ఉన్న అన్ని దేవాలయాలలోను అభిషేకం చేయించింది. యుద్ధం ఆరంభమయి ఏడురోజులయింది! వేలమంది రక్తం ప్రవహించింది! తల్లిదండ్రుల కడుపులో చిచ్చుపెట్టి ఎంతోమంది దేశంకోసం తమ ప్రాణాలు బలిపెట్టారు. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నారు. ఈ యుద్ధం ఆగి, తిరిగి శాంతి ఎప్పుడు నెలకొంటుందా అని ప్రతి ఒక్కరూ ఆదుర్దాగా ఎదురుచూసేవారు. శంకర్ ఫ్రంట్ కి వెళ్ళిన నాలుగోరోజు తను క్షేమంగా ఉన్నానని ఒక ఉత్తరం రాశాడు. అది చూశాక ఆ వృద్ధదంపతుల మనసులు కాస్త కుదుటబడ్డాయి.
కాని చివరికి భయపడినంతా జరిగింది. ఆరోజు టెలిగ్రాం అందుకుంటూనే జగన్నాథంగారికి ఒళ్ళు వశం తప్పింది. వణుకుతున్న చేతితో సంతకం చేసి తీసుకున్నాక, చించి చదవడానికి ధైర్యం చాలక అలాగే పట్టుకుని ఉండిపోయారు, కీడు శంకిస్తూనే ఆఖరికి చించి చూశారు. టెలిగ్రాం చదువుతూనే పొలికేక వేసి కుర్చీలో కూలబడి పోయారు.
లోపల పనిచేసుకుంటున్న పార్వతమ్మ ఆ కేకకి గాభరా పడుతూ పరిగెత్తుకు వచ్చింది. జగన్నాథంగారి స్థితిని, పక్కనే పడిఉన్న టెలిగ్రామును చూడగానే ఆమెగుండె దడదడలాడిపోయింది. కంపించిపోతూ "ఏం జరిగిందండీ, ఏం టెలిగ్రాము అండీ!-" అని ఆయనమీదకు వాలి అడిగింది.
"శంకర్!......మన శంకర్......ఇంక లేడు పార్వతీ! దేశ మాతకి తన ప్రాణాలర్పించాడు. విజయ ఇంకా ఎక్కడో ఉందనుకోవచ్చు. వీడికి, మనకి ఋణం చెల్లిపోయింది......అయ్యో, నాయనా!" అంటూ గొల్లుమన్నారు జగన్నాథంగారు, గుండెధైర్యం చెడి.
పార్వతమ్మ ఒక్కక్షణం మ్రాన్పడి నిలబడిపోయింది. తరవాత పెద్ద కేకపెట్టి తెలివితప్పి పడిపోయింది.
ఇంతలో ఇరుగుపొరుగు అక్కడ చేరారు! తమ సానుభూతి, సంతాపం తెలిపారు. మగవాళ్ళు జగన్నాథంగారిని పట్టుకు ఓదార్చారు. ఆడవాళ్ళు పార్వతమ్మని లోపలికి తీసుకువెళ్ళి సాంత్వన వచనాలు చెప్పారు. ఆ వయస్సులో వారికివచ్చిన కష్టం చూసి అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎడ్రసులు తీసుకుని వారి పిల్ల లందరికి టెలిగ్రాంలు పంపారు. ఆ రోజంతా వాళ్ళే ఆదుకుని ఓదార్చారు. ఎవరెంత ఊరడించినా తీరేదా ఆ శోకం? జగన్నాథంగారిచేత ఇంత కాఫీ అయినా తాగించగలిగారుకాని పార్వతమ్మచేత పచ్చి మంచినీళ్ళయినా తాగించలేకపోయారు. ఏడ్చి ఏడ్చి శోష వచ్చినట్లు ఆ కటిక నేలమీద పడుకుండిపోయిన పార్వతమ్మని లేవదీసి తలకింద తలగడ పెట్టింది వంటామె వెంకమ్మ.