"మన సోదరీమణులు చెప్పినదంతా విన్నాక గృహంలో స్త్రీ స్థానం యెంత మాత్రం మారలేదని, మగాళ్ళు గొప్పగా చెప్పుకునే వన్నీ వట్టి ప్రగల్భాలేనని రుజువవుతుంది. అయితే వాళ్ళు చెప్పిన వాటిలో కోన్నైనా మనం నిజంగా సాధించాలన్న విషయం మీద మనలో ఏకాభిప్రాయం కుదిరిందనుకుంటాను. ఇహ వాటిని సాధించడం యెలాగ అన్న సంగతి ఇప్పుడు పరిశీలిద్దాం!...."
"మనమూ "ఘోరావ్" 'నిరాహారదీక్ష' 'సహాయ నిరాకరనోధ్యమం" లాంటివి లేవదీద్దాం!" ప్రియంవద నవ్వుతూ అంది.
"గుడ్ ఐడియా!..... బాగుంది ఆలోచన . ఘోరావ్ అన్నది మన విషయంలో కుదరదు. ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాల్సిన మగాడిని ఇంట్లో కట్టెయ్యలేం. తిండి మానేసి నిరాహారదీక్ష వున్నా నష్టపోయేది మనమే గాని వాళ్ళు దానికి అంత త్వరలో కరుగుతారనుకొను. కాబట్టి మానం "సహాయనిరాకరణోద్యమం ' సాగిద్దాం."
"అంటే!"
"అంటే మగవాళ్ళు మనమీద రోజూ చలాయించే జుల్ముకి స్వస్తి చెప్పిస్తామన్నమాట. తెల్లారి లేచింది మొదలు నీళ్ళు అందించడం, షేవింగ్ సెట్లు కడగడం, బనీన్లు, సాక్సు షర్టులు వగైరా ఉతకడం ఈ చాకీరి అంతా మానాలి. పురుషుడు వుద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే మనం ఇంట్లో వంట వండి, పిల్లల్ని చూసుకుని ఇల్లు చక్కదిద్దుతాం. అంతే అంతకు మించి ఒక్కడుగు ముందుకు వెయ్యకూడదు. వాళ్ళ ఉద్యోగాలకి టైములున్నట్టే ఇంట్లో మన కార్యాక్రమాలకి కాల పరిమితులుండాలి.
"ప్రొద్దున్న యెనిమిది గంటలకు లేచిన శ్రీవారి కోసం మళ్ళీ ప్రత్యేకంగా కాఫీ కలిపి ఈయడం జరగదు. వాళ్ళ పనులు మనం చెయ్యడం, వాళ్ళ బట్టలుతకం, తువ్వాళ్ళు అందించడం, బొత్తాలు కుట్టం , భోజనాలకీ ఓ టైము వుండాలి. రాత్రి ఎనిమిది తర్వాత భోజనం బంద్. రాత్రి పదిగంటలు దాటాక వచ్చి తలుపులు బాదితే తెరిచేది లేదు. మనం ఇవన్నీ అమలు పరిచిన నాడు గాని స్త్రీ సహాయసహకారాలు వాళ్ళకెంత అవసరమో, స్త్రీ విలువ యెంతో వాళ్ళకి తెలిసిరాదు. మనం వాళ్ళకి చాకిరి చెయ్యనినాడు వాళ్ళకి కలిగే లోటుపాట్లు, మన సహకారం లేనిదే వాళ్ళెం చెయ్యలేరన్న సంగతి వాళ్ళకి తెలియ చెప్పాలి. పాఠం నేర్పాలి.
మన విలువ తెలిసిననాడు స్త్రీని గౌరవించడం వారే నేర్చుకుంటారని ఆశిద్దాం.
"తర్వాత సమానంగా చూస్తున్నామన్న యీ మగవాళ్ళకి మల్లె మనమూ ప్రవర్తిస్తే , మనలో సహస్రాంశమైనా సహనం ఓర్పు చూపెట్టి వూరుకోగలరేమో పరీక్షించాలి. అందుకని మనం మన యిష్టం వచ్చినట్టు, మనమూ చెప్పా చెయ్యకుండా తిరిగి తెరిగి ఏ రాత్రికో యింటికి చేరాలి. మన ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చిన రీతుల్లో ముస్తాబయి, వీలయినంత ఎక్కువ ఖర్చు పెడ్తూ నలుగురిని పోగేసుకుని సినిమాలకి, షికార్లకీ తిరుగుతూ రాత్రి పదకొండుగంటలకి ఇంటి కొచ్చి, నిద్రపోతున్న వాళ్ళని లేపి తలుపులు తీయించాలి. ఇన్నాళ్ళు మనం చూపిన సహనం, ఓర్పు ఎంతటిదో వాళ్ళకి తెలిసిరావాలి! ఏమంటారు? మీ ఉద్దేశం ఏమిటి?"
"చాలా బాగుంది ఇలా చేస్తే ఒక్క వారం రోజుల్లో దారికి వస్తారు. మనం పడ్తున్న కష్టాలు , బాధలు అప్పటికి గాని అర్ధం కావు వాళ్ళకి!' అందరి మొహాలు ఉత్సాహంగా వికసించాయి. ఘన విజయం సాధించబోతున్నమన్న గర్వం వాళ్ళ కళ్ళలో అప్పుడే తొంగి చూడసాగింది.
"మనం అంతా ఇలా ఏకాభిప్రాయానికి రావడమే ఈ ఉద్యమం విజయవంతం కాగలదని సూచిస్తుంది! ఇంక కార్యాచరణలో పెట్టడమే తరువాయి . ఎల్లుండి 1 వ తారీఖు శుభ ముహూర్తంగా నిశ్చయించుకుని ఆరోజు మొదలు మన కార్యక్రమం కొనసాగిద్దాం"
"ఒకే ! ...... అలాగే! ......" ముక్తకంఠంతో జవాబిచ్చింది.
"ఈ ఉద్యమం ఎంతవరకు ఆశయాలు సాధించిందీ పర్యవలోకించెందుకు వారానికోసారి సమావేశం అయి చర్చిద్దాం. కనీసం ఒక నెల అయినా యిది కొనాగించాలి. తర్వాత ఇంకో సంగతి. పురుషుల తీపి మాటలకి, ప్రేమ కబుర్లకి లొంగి మన నియమాలు మరచిపోకూడదు? జాలి పడి, మన కఠిన నిబంధనలని ఎంత మాత్రం సడలించకూడదు! ఈ సంగతి మీరు మరువకండి!"
"సరే ఇంతటితో ఈ సమావేశం ముగిద్దాం. మళ్ళీ వారం సరిగా ఇలాగే సమావేశం అవుదాం!" మూడు గంటల సుదీర్ఘ సమావేశాన్ని ముగించి లేచింది శారదాదేవి.
* * *
"శుభోదయం ! ఏమిటీ వింత! దొరవారు ఇవాళ ఆరు గంటలకే లేచారు!" ఎనిమిది గంటలకి ఎనిమిది సార్లు లేపితేనే కాని లేవని కృష్ణమూర్తి లేపకుండానే ఆరు గంటలకి లేచి పోవడం కాస్త వింతే ననిపించింది ప్రియంవదకి.
"అవును ప్రియా! పాపం నా నుంచి నీవు మళ్ళీ మళ్ళీ కాఫీలపడం, అదీ శ్రమ అని నీతో పాటే ఇహ మీదట ఆరు గంటలకే లేచిపోవాలని నిర్ణయించుకున్నాను. టిఫిన్ చల్లారిపోతుందని అలా నాకోసం కాచుకు కూర్చోవడం , పనులన్నీ అలా వుండిపోవడం, ఎందు కొచ్చిన అవస్థ నానుంచి నీకు!"